అమ్మ డబ్బు తీసుకుని లోపల పెట్టింది. తను ఈ మధ్య అదోలా వుండటం గమనిస్తూ వున్నాను. తన ఆరోగ్యం కూడా అంత బావోటంలేదు. నగరంలోని పెద్ద డాక్టర్లందరికీ చూపించినా ఫలితం దక్కలేదు. రోజురోజుకీ కృశించిపోతూంది. నేనేదైనా అంటే నవ్వేసి, "వయస్సు వచ్చేస్తూంది కదరా" అంటుంది.
తనీ మధ్య బాగా మారిపోతోందని తెలుస్తూనే వుంది. ఆ రోజు నాకెందుకో అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చి కళ్ళు విప్పితే, మంచం పక్కనే కుర్చీలో కూర్చుని నావైపే తదేకంగా చూస్తున్న అమ్మ కనిపించింది. నాకు అర్ధంకాలేదు. నేను లేవటం చూసి అక్కన్నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది.
ఆ మరుసటిరోజు యధాలాపంగా అడిగినట్లు అడిగాను - "ఏమిటమ్మా రోజురోజుకీ అలా అయిపోతున్నావు".
నవ్వింది. ఆ నవ్వులో జీవంలేదు. "రేపు అక్టోబర్ కి నీకు పాతిక నిండుతాయి కదరా".
నేను అడిగిన దానికీ, ఆ ప్రశ్నకీ సంబంధంలేదు. తలూపాను.
"నేను లేకపోతే నువ్వు వుండగలవురా?"
చివుక్కున తలెత్తాను. అమ్మ నావైపే చూస్తూంది. కానీ ఆ కళ్ళు నన్ను కాక- నాలోని పసివాడిని చూస్తున్నట్టు అనిపించింది.
"ఏమ్మా? వీడియోలో ఏదైనా కొత్త సినిమా చూస్తావా?" అన్నాను వాతావరణాన్ని తేలిక చేయటానికి ప్రయత్నిస్తూ, నాకెప్పుడో చదివిన పుస్తకంలో ఎవరో మానసిక శాస్త్ర నిపుణుడు వ్రాసినది గుర్తొచ్చింది. కొంత వయసొచ్చాక మనిషికి తాను వృద్దాప్యపు ఒడిలోకి వెళ్లినట్టు, మరణానికి చేరువ అవుతున్నట్టు భావం కలుగుతుందట అమ్మకూడా అలాగే అబ్సెషన్ హో బాధపాడుతుందా? నో, నెవ్వర్.
అమ్మ అలాంటి వాటికీ అతీతురాలు అని నా నమ్మకం. అవును అంత గొప్పది కాకపోతే ఈ డెవిలిష్ ప్రపంచంలో ఒంటరిగా బ్రతుకుతూ, స్వశక్తితో నన్నింత పైకి తీసుకురాగలిగేది కాదు. ఈ సొసైటీ, ఈ మనుష్యులు అమ్మని ఎంత బాధపెట్టి వుంటారో, ఆమె నుదుటిమీద గీతలే చెపుతాయి. అయినా అందర్నీ ఎదిరించి నిలబడింది. నన్నొక మనిషిగా తీర్చిదిద్దింది! అలాటి అమ్మ మరణం గురించి భయపడుతుందా? లేక నేను పాతిక సంవత్సరాలు నిండేసరికి తన ప్రాణం పోతుందని ఎవరైనా జ్యోతిష్యం చెప్పారా?
ఆ మరుసటి రోజు ఆఫీసుకు వెళ్తూ డబ్బు తీసుకోవటానికి బీరువా తీశాను. పదివేలు తక్కువున్నాయి.
ఆశ్చర్యపోయాను. రెండోసారి లెక్కపెట్టాను. ఇరవైవేలే వున్నాయి. "అమ్మా! ఇందులో డబ్బు తక్కువుంది" అని అరిచాను. అమ్మొచ్చింది.
"అవున్రా నేనే తీశాను".
"నువ్వు తీశావా?" అన్నాను ఆశ్చర్యంగా ఆ డబ్బు అర్జెంటుగా కావాలి నాకు. అయినా అమ్మ నాకు చెప్పకుండా అలా తీసుకోవటం అదే మొదటిసారి.
"ఎందుకు?" అని అడిగాను.
"ఎందుకో చెపితేగానీ తీసుకునే హక్కు నాకు లేదా?" అమ్మ అంత కటువుగా మాట్లాడగలుగుతుందని నేను అనుకోలేదు. తలెత్తేసరికి ఆమె మొహం తిప్పుకుని అక్కన్నుంచి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళలో తడి కనపడినట్టు తోచింది. దానికి కారణం నాకు ఆ రోజు సాయంత్రం తెలిసింది.
ఆఫీసులో అంతా దానిగురించే, ఆలోచిస్తున్నాను. అంత అర్జెంటుగా పదివేలు తనకి ఎందుకు కావల్సి వచ్చాయి? తను తల్చుకుంటే పదివేలు తనకి ఒక్క పెద్ద లెక్కకాదు. నేను ఆ విషయం అడగ్గానే తన మొహంలో కనపడిన భావాన్ని "గిల్టీ ఫీలింగ్" గా గుర్తించలేనంత చిన్న వాడిని కాను నేను.
చిన్నతనం నుంచీ అమ్మంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. నేనూ అమ్మా ఇద్దరమే వుండటంవల్ల బహుశా ఈ ఆప్యాయత ఇలా డెవలప్ అయి వుంటుంది. నా తండ్రి జైల్లో వున్నాడు.
అవును. దాదాపు పాతిక సంవత్సరాల్నుంచీ జైల్లోనే వుంటున్నాడు. మధ్యలో నెలా రెండు నెలలు బయటికి రావటం, మళ్ళీ ఇంకో నేరం చేసి జైలుకి వెళ్ళడం అతడికి అలవాటు. బయట ప్రపంచంలో ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చేవాడు. అమ్మని వేధించి డబ్బు పట్టుకువెళ్ళేవాడు. అయితే ఇదంతా నా చిన్నప్పటి సమగతి. నా పన్నెండో ఏట ననుకుంటాను. ఏదో హత్యానేరం మీద నాన్నకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
అంత చిన్న వయస్సులోనే ఆ వార్త తెలిసి నేనెంతో రిలీఫ్ గా ఫీలయ్యాను. నాన్న యింటికి వచ్చి వేధించినప్పుడల్లా అమ్మ నాల్గయిదు రోజులపాటు మామూలు మనిషి కాలేకపోయేది. నాకు ఏదో- ఎవరిమీదో అర్ధంలేని కసి కానీ ఏం చెయ్యటానికి వీల్లేనంత చిన్నతనం. అందుకే నాన్న మరో పది పన్నెండు సంవత్సరాల దాకా బైటకి రాడు అనగానే ఆ వయాసులో అంత సంతోషించాను.
నాన్న గురించిన ప్రసక్తి ఇంట్లో ఎప్పుడూ వచ్చేదికాదు. అమ్మకి అది రావటం ఇష్టంలేదని తెలిసి నేనూ దాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడేవాడిని కాను. ఒకటి మాత్రం అనుకునేవాడిని. 'ఈసారి రానీ చెపుతాను' అని. ఈ సారి నాన్న వచ్చి డబ్బు అడిగితే, అతడు తన జీవితం మొత్తంలో ఎన్నడూ అనుభవించనంత నరకం అనుభవించబోతున్నాడు!! ఆ పాఠం నేనే చెపుతాను.
అమ్మకూడా నాన్నని చూడటానికి జైలుకి వెళ్ళటం గానీ, ఉత్తరం వ్రాయటం గానీ చేసేది కాదు. అసలు అమ్మలాంటి ఉత్తమురాలికి నాన్న ఎలా భర్త అయ్యాడో నా కిప్పటికీ అర్ధంకాలేదు.
నాన్న పేరు భైరవమూర్తి.
నాకు వూహ తెలిసిన తరువాత అతడు రెండు మూడుసార్లు జైలునుంచి వచ్చాడు. అప్పుడు ఏదో పని వున్నట్టు అమ్మ నన్ను అక్కన్నుంచి పంపించేసింది. నాన్న కూడా నన్ను దగ్గరికి తీసుకోవటం అలాంటివి చేసేవాడు కాదు. డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడు.
ఒక్కొక్క రూపాయి సంపాదించటానికి అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలా సంపాదించైనా దాన్ని నాన్న వచ్చి తీసుకుపోతూంటే నాకు బాధగా వుండేది. అయినా ఇక చిన్న డబ్బాలో దాచేది.
నాకు ఎనిమిదేళ్ళు వచ్చేవరకూ నాల్గయిదు ఇళ్ళల్లో పాచిపనిచేసింది. మధ్యాహ్నంపూట బట్టలు కుట్టేది. రాత్రిళ్ళు నాకు చదువు చెప్పేది. నేను ఆరోక్లాసు చదువుతుండగా ననుకుంటా తనకి ఏదో ఆఫీసులో చిన్న ఉద్యోగం వచ్చింది. అప్పట్నుంచీ డబ్బుకి అంత కష్టం వుండేది కాదు. కానీ అంతకుముందు రోజులు తల్చుకుంటే మాత్రం..మైగాడ్. వద్దు.. కానీ అమ్మ మాత్రం చిరునవ్వు వెనకే కష్టాన్ని దాచిపెట్టింది. అసలు బయట పడేది కాదు. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. అమ్మ గ్రాడ్యుయేటు. ఒక గ్రాడ్యుయేట్ కి ఉద్యోగం రావటానికి పది సంవత్సరాలు పట్టింది. కానీ ఈ పది సంవత్సరాలూ ఏదో ఒక అప్నిచేసి నన్ను చదివించింది. తాను జీవించింది.
ఆ తరువాత నేను చాలా పుస్తకాలు చదివాను. చాలా మంది స్త్రీ సమస్యలు వర్ణిస్తూ వరకట్న చావుల గురించి, కట్నాల సమస్యగురించి, వృద్దకన్యల వివాహ సమస్య గురించీ వ్రాశారు. ఆడవాళ్ళ కష్టాల గురించి రకరకాలుగా వర్ణించారు. అమ్మని చూస్తే నాకనిపించింది. వ్యక్తిత్వం వుంటే ఏ సమస్యనైనా ఎదురొచ్చినవచ్చునని; అన్ని సమస్యలకీ మూలకారణం ధైర్యం లేకపొవటమేనని! భర్తలు అత్తలు కలిసి బాధపెడుతున్నా, కట్నంలేక పెళ్ళిళ్ళు కాకపోయినా అంతా తమ 'గ్రహపాటు' అని కుమిలిపోయే వాళ్ళందరూ ఆ వయసులో కొడుకుతో కలిసి ఒంటరిగా ఈ ప్రపంచంలో నిలబడిన అమ్మని చూసి చాలా నేర్చుకోవాలి.