Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 16


                                                   ముగింపు ఇంతే

    ఇందిర గడపలో నించుంది రోడ్డుమీదకు చూస్తూ.

    సాయంత్రం అయిదు దాటింది. ఏ క్షణంలోనైనా అనంతం రావచ్చు. అతని స్కూటర్ తను ఇంటి ముందుకు రాగానే నెమ్మదవుతుంది. అతను తన వంక చూసి చిన్నగా నవ్వుతాడు. తను కూడా నవ్వుతుంది. పక్కనే ఉన్న వాళ్ళింటి ముందాపి హారన్ మోగిస్తాడు. అతని భార్య ప్రతిమ జిడ్డుకారే ముఖంతో వచ్చి గేటు తీస్తుంది. ఆ తరువాత అతను మరోసారి...

    "ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుంది?" అంది ప్రతిమ తనతో.

    "అబ్బే! ఎవరికోసమో కాదు! ఏమీ తోచక..." తడబడుతూ జవాబిచ్చింది ఇందిర.

    "చాలా సేపట్నుంచీ అక్కడే నిల్చుంటే... అలా అనుకొన్నాను" నవ్వుతూ అందామె. అనేసి లోపలి కెళ్ళిపోయింది.

    'వట్టి బద్దకస్తురాలు' అనుకొంది ఇందిర. భర్త ఇంటికొచ్చే వేళకి నీట్ గా తయారయి ఎదురొస్తే ఎంత బాగుంటుంది? అదేమీ గ్రహించుకోదు. ఏదో నవల పట్టుకొని సాయంత్రం నాలుగున్నరవరకూ చదువుతూ కూర్చుంటుంది. అప్పుడు ఇల్లు తుడవడం, తను తయారవడం- మొదలవుతుంది. అలిసిపోయి ఇంటికొచ్చే మగాడికి అడదలా కనబడితే ఎంత చిరాగ్గా ఉంటుంది?   

    అనంత్ చాలా నీట్ గా ఉంటాడు. ఆకర్షణీయంగా ఉంటాడు. ఎప్పుడూ పెదాలమీద చిరునవ్వు కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ప్రతిమ మీద విసుక్కోవడం గానీ, చిరాకు పడినట్లుగానీ కనిపించడు. అప్పుడప్పుడూ ప్రతిమే అతనితో చిన్న పోట్లాటలు లేవదీయటం, మాట్లాడకుండా ఉండటం చేస్తుంటుంది. మళ్ళీ మాటలెలా కలిసిపోతాయో తనకు తెలియదుకాని తన ఉద్దేశ్యం- ఖచ్చితంగా ఆదంతా కేవలం అనంతం మంచితనం మూలంగానే జరుగుతూంది. అతనికి కూడా అంత కోపం ఉన్నట్లయితే ఇద్దరూ ఏనాడో విడిపోయేవాళ్ళు.

    వాళ్ళు తమ పక్కింట్లో దిగి రెండు నెలలవుతూంది. దిగిన వారం రోజుల్లోనే తనతో బాగా పరిచయమయిపోయింది. ఇద్దరూ మధ్యాహ్నం సమయాల్లో కారమ్స్ ఆడుకోవడం, అప్పుడప్పుడు మూవీల కెళ్ళడం మొదలయింది. అయితే, అనంత్ తో మాట్లాడే అవకాశం తన కెప్పుడూ కలగలేదు. రాన్రాను అతనితో కూడా పరిచయం సంపాదించాలన్న అభిలాష తనలో చోటు చేసుకోసాగింది. ఎందుకలా అనిపిస్తూందో తనకే తెలియదు. మరికొద్ది రోజులకు ఆ అవకాశం కూడా రానే వచ్చింది. వాళ్ళ పెద్దమ్మగారి ఇంటికి వెళుతూ, ఇంటి తాళం చెవి తన కిచ్చింది ప్రతిమ. ఆ సాయంత్రం అయిదయేసరికల్లా తనకు తెలీకుండానే ముస్తాబయి అతని కోసం ఎదురుచూస్తూ నిలబడింది. అనంతం మామూలుగానే స్కూటర్ వాళ్ళింటి ముందాపి హారన్ మోగించాడు.

    తను వడివడిగా అతని దగ్గరకు నడిచింది.

    "మీ మిసెస్ వాళ్ళ పెద్దమ్మగారింటి కెళ్ళింది! తాళం చెవి మీ కిమ్మని చెప్పింది" అంది తాళం చెవి అతని కందిస్తూ.

    "థాంక్యూ!" అని చిన్నగా నవ్వుతూ అందుకొని లోపలికి నడిచాడతను. ఆ తరువాత అతను ఉండగానే తను వాళ్ళింటి కెళ్ళడం, అక్కడ ప్రతిమతో పాటు ఏదో ఒక సందర్భంలో ఇద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. దసరా పండుగకు ముగ్గురూ కలిసి కారమ్స్ ఆడారు. అప్పుడు తనకు తెలియకుండానే అతనితో చనువు పెరిగింది.

    ష్కూటర్ హారన్ వినబడి ఇందిర ఛటుక్కున ఆలోచనల్లోంచి తేరుకొంది. అనంతం తన వంకే చూస్తున్నాడు. తనూ అతని కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వింది ఇందిర.

    ప్రతిమ వచ్చి గేటు తీసింది. ఇంకా రెడీ అయినట్లు లేదామె. స్కూటర్ లోపల పెట్టి మరోసారి తన వంక చూసి ఇంట్లోకి నడిచాడతను. పెరట్లో బావి దగ్గర అతను ముఖం కడుక్కుంటున్న విషయం తనకు తెలుసు. అందుకని తనూ పెరట్లోకి పోయి సన్నజాజులు కోస్తూ కొద్దిసేపు గడిపింది. అతను బావి దగ్గరికొచ్చి ముఖం కడుక్కొని, తన వంక మరోసారి నవ్వుతూ చూసి వెళ్ళిపోయాడు. ఇందిర చాలాసేపు అక్కడే తచ్చట్లాడిందిగాని, అతను మళ్ళీ కనిపించలేదు. ప్రతిమే ఒకటి రెండుసార్లు బయటికొచ్చింది. ఆమె ముఖం వాడిపోయి ఉంది. బహుశా ఇద్దరకూ ఏదో వాగ్వివాదం జరిగి ఉండవచ్చు! కాస్సేపటి తరువాత "ఇందిరా!" అంటూ పిలిచింది ప్రతిమ, పెరటిగోడ మీదనుంచి.

    "పిలిచారా?" అడిగింది ఇందిర దగ్గరకు నడుస్తూ.

    "అవును! అలా గుడికి వస్తారేమోనని...."

    అయిష్టంగానే బయలుదేరింది ఇందిర. ప్రతిరోజూ ఆ సమయానికి అనంతం, ప్రతిమ ఇద్దరూ షికారు పోతుండేవాళ్ళు.

    ఇద్దరూ మౌనంగా గుడివేపు నడువసాగారు. అనంతం తన గురించి ఏమనుకొంటాడో? తనూ, ప్రతిమా ఇద్దరూ ఒకటే రకం అనుకొంటాడేమో? వాళ్ళ గొడవల్లో తను ప్రతిమను సమర్థిస్తున్నట్లు భావిస్తాడేమో?

    "ఈవేళ నాతో బయల్దేరారేంటి?" నవ్వుతూ అడిగింది ఇందిర.

    "మరేం లేదు! ఆయన రాలేనన్నారు!"

    "అబద్ధమాడుతోంది!" అనుకొంది ఇందిర. అనంతం అలాంటి మనిషికాదు. ఎప్పుడూ భార్య మనసును నొప్పించడు.

    "ఈ మగవాళ్ళ సంగతి నీకు తెలియదిందిరా! వట్టి తిక్క మనుషులనుకో! ఎంతసేపూ వాళ్ళ ఇష్టాలూ, అయిష్టాలేగాని- మన మాట వినరు, నెగ్గనీరు!"

    ఇందిరకామాటలు నచ్చలేదు. అందుచేత మౌనంగా వూరుకుండిపోయింది.

    ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంట్లో శాంతమ్మ తన తల్లితో మాట్లాడుతూ కనిపించింది. "ఏమే కోడలా - మాకు పప్పన్నం ఎప్పుడే?" అంది నవ్వుతూ.

    ఆమెను చూడగానే ఇందిరకు ఎందుకో కోపం ముంచుకొచ్చింది. జవాబివ్వకుండా అక్కడినుంచి వెళ్ళిపోయింది.

    రాత్రి భోజనం చేస్తూ తల్లి చెబుతూంటే వింది ఇందిర. మర్నాడు తనని చూడ్డానికెవరో పెళ్ళివారు వస్తున్నారట.

    అదివరకయితే ఆ వార్త తనలో ఉత్సాహాన్నీ, ఊహల్నీ కలిగించేది కాని, రాన్రాను నిరుత్సాహాన్నీ, అయిష్టాన్నీ కలుగజేస్తోంది.

    ఏముందీ? అంతా మామూలే! పెళ్ళిచూపులు - కొంచెం తలెత్తమ్మా! రెండు ప్రశ్నలూ సంగీతమేమైనా వచ్చా?... అన్నీ అయిన తరువాత కట్నం దగ్గర పేచీలు రావడం - ఇంతే సంగతులు.

    తెల్లవారింది. పెళ్ళిచూపులు కూడా ముగిశాయ్! "తరువాత చెప్తాం!" అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు.

    "బెనారస్ పట్టుచీర, పూలజడ, కళ్ళకు కాటుక - నిజానికి అందంగానే ఉంటుంది తను-" అనుకొంది ఇందిర అద్దంముందు నించుని. ప్రతిమ కంటె చాలా అందంగానే ఉంటుంది. ఆ అలంకరణలో ఓసారి అనంతంకి కనబడితే? గుండె ఝల్లుమన్నది ఇందిరకే!

    ఎందుకలాంటి కోరిక కలిగింది తనకు? అనంతం తనని చూసి వరిస్తాడా, ఏమన్నానా? ఒకవేళ వరించినా మాత్రం ఏమి లాభం గనక? అతను వివాహితుడు. అతని గురించి అసలలాంటి ఆలోచనలు రావడమే తప్పు! కాని ఎందుకనో- అతన్ని గురించి ఆలోచించకుండా, అతన్ని చూడకుండా ఉండలేకపోతోంది తను ఈఅలంకరణలో అతనికి కనబడినంత మాత్రాన మునిగిపోయిందేముందీ? తను అందగత్తె అన్న విషయం అతను గ్రహిస్తే చాలు! అంతే! అంతకంటే ఇంకేమీ ఆశించటం లేదు.

    సాయంత్రం అయిదు దాటింది. వాకిట్లో నించుంది ఇందిర. దారినిపోయే వాళ్ళంతా ఆమెని తినేసేలా చూస్తున్నట్లనిపించింది ఆమెకి. ఆ భావం ఆమెకు కించిత్ గర్వాన్ని కలగజేసింది.

 Previous Page Next Page