Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 17


    స్కూటర్ మలుపు తిరిగింది. అనంతం కళ్ళు తన కళ్ళవేపు తిరిగినాయి. అతని కళ్ళలో మెరుపు! ఆ ప్రతిభుడయి అలాగే చూస్తుండిపోయాడు. ఇందిర సిగ్గుపడిపోయింది. హఠాత్తుగా స్కూటర్ ఇంజనాగిపోయింది. ఆమెవంక చూసి నవ్వాడతను.

    ఇందిర సిగ్గుపడుతూనే నవ్వింది.

    "ఇన్ని రోజుల నుంచి ఎక్కడ దాచారు ఇంత అందం?" స్కూటర్ వాళ్ళింటి కాంపౌండ్ లో పార్క్ చేసి నెమ్మదిగా అడిగాడు. 

    ఇందిర లోపలకు పరుగెత్తింది నవ్వాపుకొంటూ. అయితే, ఎంతోసేపు ఇంట్లో కూర్చోలేకపోయింది. చీర మార్చుకొని ఏదో పని కల్పించుకొని వాళ్ళింటికి వెళ్ళింది. అనంతం తన అందాన్ని గుర్తించినట్లు మాట్లాడటం చాలా ఉత్సాహాన్ని కలుగజేసిందామెకు.

    ప్రతిమ పెరట్లో ఉన్నట్లుంది. అనంతం హాల్లో కూర్చుని టీ తాగుతున్నాడు.

    "కొత్తవాడిని చూసినట్లు అలా పారిపోయారేంటి?" నవ్వుతూ అడిగాడతను. అతని కళ్ళలో ఆకర్షణకి తట్టుకోలేక చూపులు మరల్చుకుంది ఇందిర.

    "ఏమిటి? నాతో మాట్లాడ్డం కూడా మానేశారేమిటి కొంపదీసి! అంత శిక్ష విధించకండి! బ్రతిమాలుకుంటాను" ఇంకా నవ్వుతూనే అన్నాడతను.

    "బాగుంది! నేను శిక్షించడం ఏమిటి!" బెదిరిపోతున్న లేడిలా చూస్తూ అంది.  

    "మీకా అధికారం ఉందండీ- అందుకే భయం-"

    "పాపం!" అనేసి అక్కడినుంచి పెరటివేపు నడిచింది. ఆమెకు లోలోపల భయంగానే ఉంది. ఒకవేళ ప్రతిమ తమ ఇద్దరి మాటలు ఎక్కడ వింటుందోనని.

    ప్రతిమతో మాట్లాడుతూండగానే అనంతం కూడా వచ్చాడక్కడికి. తనుకూడా వాళ్ళ సంభాషణలో కల్పించుకొని మాట్లాడసాగాడు. మాట్లాడుతూ మధ్యమధ్యలో తనవంక చూసే దొంగచూపులు గమనిస్తూనే ఉంది ఇందిర. ఆ రోజు అతని ప్రవర్తన ఆమెకు వింతగానూ, భయంగానూ కూడా ఉంది. రాత్రి చాలాసేపటివరకూ అతని గురించి ఆలోచనలతోనే గడిపింది.

    మర్నాడు సాయంత్రం తను మామూలు ప్రకారం కాస్సేపు డాబా మీద కూర్చుందామని పైకి వెళ్ళేసరికి, అతనప్పటికే అక్కడ కూర్చుని కనిపించాడు. తను సంకోచంగా మెట్లదగ్గరే ఆగిపోయింది ఎటూ తోచక.

    "రండి! ఇంట్లో అసలు గాలిలేదని పైకొచ్చాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే - నేనే కిందికి దిగిపోతాను."

    "అబ్బే! ఫరవాలేదు లెండి" అంది మొగమాటంగా, తను పిట్టగోడ అనుకొని నిలబడి.

    "మీకు పెళ్ళిచూపులైనాయటగా నిన్న?" అడిగాడతను. తను సిగ్గుపడింది.

    "భలేవారే! అంత సిగ్గుపడతా రెందుకూ? ఇక్కడేమీ పెళ్ళిచూపులవడం లేదుగా! కాని, మీరో విషయం గుర్తుంచుకోండి! మీ భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు కొంచెం వెనకా ముందూ ఆలోచించి మరీ ఒప్పుకోండి! నాలాగా తొందరపడి ఒప్పుకొన్నారా - మా సంసారం లాగానే ఉంటుంది మీ సంసారం కూడా!" నవ్వుతూ అన్నా, అతనేదో బాధపడుతున్నట్లు అనిపించింది ఇందిరకు. అతని సంసారం గురించి ఆమెకున్న అనుమానాలు నిజమైనాయి.

    "బాగుంది! ఇప్పుడు మీకేం తక్కువైందని?"

    "మీకేమీ తెలియనట్లు! ప్రతిమను మీతో పోలిస్తే- అన్నిటా మీకంటే తక్కువేగదా! అంటే నేనేం సకలగుణ సంపన్నుడనని కాదు. ప్రతిమనిషికీ ఓ వీక్ నెస్ ఉంటుంది. కాని, మా ప్రతిమాదేవికి అన్నీ వీక్ నెస్ లే!"

    "ఏమిటో వీక్ నెస్ లు!" నవ్వుతూ పైకొచ్చింది ప్రతిమ. ఇందిర కంగారుపడిపోయింది. అనంతం ఛటుక్కున నవ్వేస్తూ.

    "అదే! ఒంట్లో వీక్ గా ఉంటోందన్నావుగదా!" అన్నాడు అలా అతనితో ఒంటరిగా డాబామీద నించుని మాట్లాడుతూ ప్రతిమ కంటబడటం చిన్నతనంగా తోచింది ఇందిరకు. తమ ఇద్దరిమీద ఆమెకు అనుమానం కలిగినా కలగవచ్చు!

    "ఎల్లుండి సినిమా ఏక్టర్స్ వస్తున్నారట, ఇందిరగారూ! నాకు ఒక పాస్ దొరికింది! ప్రతిమతోపాటు మీరూ రండి!"

    "ఎక్కడ?" అడిగింది ఇందిర.

    "కనకదుర్గా థియేటర్ లో."

    "ఏమో మా వాళ్ళనడగాలి" అంది ప్రతిమ వంక చూస్తూ. తను రావడానికి ప్రతిమ ఏమంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. లేకపోతే ఆమెకూడా తనని రమ్మని బలవంతం చేసి ఉండేది. లోపల వెళ్ళాలనున్నా పైకేమీ మాట్లాడలేదు ఇందిర.

    ఆ మర్నాడు, ప్రతిమ, అనంతం ఇంట్లో చిన్నగా ఘర్షణ పడటం వినిపించిందామెకు.

    సాయంత్రం తను ఒక్కర్తీ డాబామీద చాలాసేపు కూర్చుంది ఇందిర. కాని ఎంతసేపయినా అనంతం పైకి రాకపోవడంతో కొంచెం నిరుత్సాహపడింది. తనకు తెలియకుండానే తనలో అతన్ని ఒంటరిగా కలుసుకోవాలన్న కోరిక చోటు చేసుకొన్నట్లు తెలుసుకొందామె.

    బహుశా అంతకుముందు రోజు తామిద్దరినీ డాబామీద చూచి ప్రతిమ ఈ రోజు అతనితో ఘర్షణ పడిందేమో అన్న అనుమానం కూడా వచ్చింది.

    మర్నాడు ఉదయం పెరట్లోకి వెళ్ళినప్పుడు ప్రతిమ మాట్లాడింది.

    "ఆ సాయంత్రం వస్తున్నారా శతదినోత్సవం ఫంక్షన్ కి?"

    "ఊహు. వీలుపడదు లెండి!" అంది ఇందిర.

    "సరే" అలా అంటున్నప్పుడు ఆమె ముఖంలో సంతోషం చూసి కోపమొచ్చింది ఇందిరకు.

    "నేనొస్తే తన భర్తనేం తినేస్తానా ఏమిటి?" అనుకొంది నిష్ఠూరంగా.

    ఆ సాయంత్రం నాలుగింటికే ఆఫీస్ నుంచి వచ్చేశాడు అనంతం. ఇందిర తలాకిట్లోనే నించుని జడ అల్లుకుంటూందప్పుడు.

    "రానన్నారట, ఎందుకని?" అన్నాడు ముఖం చిన్నబుచ్చుకుని.

    "నేను రావడం ప్రతిమ కంతగా ఇష్టం ఉన్నట్లు లేదు" అంది ఛటుక్కున.

    అనేసి ఎందుకలా అన్నానా అని మధనపడిపోయింది.

    "నాన్సెన్స్! అదెవరు ఇష్టపడటానికి? దయచేసి రండి! మిమ్మల్ని ఆహ్వానిస్తోంది నేను!"

    ఏమనాలో తెలియలేదు ఇందిరకు.

    "ఈసారికి పోనీండి! మరోసారి వస్తాను"

    "ఉహు. అలా అనకండి! ప్లీజ్... ఈవేళ మీరు రావాలి!"

    మౌనంగా అతని కళ్ళల్లోకి చూస్తూ తల ఊపిందామె. "మరో అరగంటలో బయలుదేరుదాం! రెడీ అవండి!" అనేసి వెళ్ళిపోయాడతను.

    సరిగ్గా అరగంటకు ప్రతిమ వచ్చేసింది తన దగ్గరకు.

    "వస్తారన్నార్టగా ఆయనతో." అంది లేని నవ్వు తెచ్చుకొంటూ.

    "అవును! ఆయన బలవంతం చేసేసరికి ఒప్పుకొన్నాను." తనూ నవ్వుతూనే జవాబిచ్చింది ఇందిర.

    "పదండి, మరి పోదాం."

    ఇద్దరూ బయటికొచ్చారు. రెండు రిక్షాలు మాట్లాడాడు అనంతం.

    "మీ ఇద్దరూ ఓ రిక్షా ఎక్కండి! నేను ఒక రిక్షా ఎక్కుతాను" అన్నాడతను. ప్రతిమా, ఇందిరా ఒక రిక్షాలో ఎక్కారు.

    పావుగంటలో సినిమా హాల్ చేరుకొన్నారందరూ. లోపలికి నడిచి రెండో వరుసలో ముగ్గురూ కూర్చున్నారు. ఇద్దరికీ మధ్యలో ప్రతిమ కూర్చుంది. స్టేజిమీద అందర్నీ చూపించి వాళ్ళ పేర్లు చెబుతున్నాడు అనంతం. మధ్యమధ్యలో ఛలోక్తులకు నవ్వాపుకోలేకపోతూంది ఇందిర. ప్రతిమ బలవంతంగా నవ్వు తెచ్చుకోవడం, ముఖం వాడిపోయి ఉండటం గమనించింది. ఇందిర. ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఆమెకు ప్రతిమ మీద ద్వేషం పుట్టుకొచ్చింది. ఆవిడ భర్తతో కాస్త చనువుగా ఉన్నంతమాత్రాన అంత ఏడుపెందుకు? అనుకొందామె.

 Previous Page Next Page