పెళ్ళి అయిపోయింది. సీత భర్తతో మాట్లాడాను. అతను చాలా హుందాగా, ఆకర్షణీయంగా వున్నాడు. నన్ను నేనే పరిచయం చేసుకొన్నాను. సీత నాకు వదినవుతుందనీ, ఇద్దరం చిన్నప్పటినుంచీ కలసి పెరిగామనీనూ!
"సీత క్లోజ్ ఫ్రెండ్ తో కలవడం చాలా సంతోషంగా వుంది!" అన్నాడతను. మర్నాడు సీత హైద్రాబాద్ వెళ్ళిపోతూంటే బస్ స్టాండ్ వరకూ నేనూ వెళ్ళాను.
"నన్ను మర్చిపోవుకదూ! ఉత్తరాలు వ్రాస్తూండు..."
ఎవ్వరూ వినకుండా వీలుచూసుకొని అంది సీత. తల ఊపాను. బస్ కదలింది. సీత కర్చీఫ్ వూపింది. బందరు బస్ స్టాండ్ లో అనేకమందికి వీడ్కోలిచ్చేను. కాని సీత వెళ్ళిపోయింతర్వాత ఆ వూళ్లో మరింక నాకెవ్వరూ లేరనిపించింది. తరువాత కొన్ని రోజుల వరకూ నేను మామూలు మనిషిని కాలేకపోయాను.
ఆ సంవత్సరంలోనే సీత రెండుమూడుసార్లు అతనితో కలసి వచ్చింది కానీ, ఒంటరిగా మాట్లాడ్డానికి నాకు అవకాశం దొరకలేదు. అదివరకటి ఉత్సాహం చురుకుతనం ఆమెలో లోపించినట్లు అనుమానం కలిగింది నాకు. ఆమెకు మొగపిల్లాడు కలిగినట్లు ఓ రోజు అమ్మ చెప్పింది, సంతోషం ప్రకటిస్తూ వాళ్ళకి ఓ కవరు వ్రాశాను. కాని ఎటువంటి జవాబూ రాలేదు. బి.ఏ. అయింతర్వాత వైజాగ్ లో ఏమ్మే చదవటానికి వెళ్లాను. అప్పుడోసారి ఆమె క్షేమ సమాచారాల గురించి ఉత్తరం వ్రాసేను. దానికీ జవాబులేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ రోజంతగా చెప్పిన సీత ఎందుకింత నిర్లక్ష్యం చేసిందో అవగాహన కాలేదు. శెలవుల్లో ఆమెని చూడ్డానికోసారి హైద్రాబాద్ వెళ్దామనిపించి, నేను ఫలానా రోజున వస్తున్నాననీ, బస్ స్టాండ్ కెవరయినా వస్తే బావుంటుందనీ, ఇంటి నుంచి లెటర్ వ్రాసేను. దీనిక్కూడా జవాబు లేదు. వెంటనే ప్రయాణం విరమించుకొన్నాను. బహుశా ఆమె ఇప్పుడు నన్నూ, గడచిన రొజులనూ మర్చిపోయి వుండవచ్చు.
పరీక్షలు వ్రాసింతర్వాత రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో కూర్చున్నాను. ఓరోజు సాయంత్రం బయటికి పోవడానికి తయారవుతూండగా టెలిగ్రాం వచ్చింది. సీత భర్త ఇచ్చాడు.
"సీత సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ..." అకస్మాత్తుగా ఇంత ప్రమాదం ఎందుకయిందో! అత్తయ్యవాళ్ళు సీత దగ్గరకెళ్ళి నాల్రోజులవుతోంది. సీతకి ఓవేళ అప్పటినుంచే ఏదయినా జబ్బుగావుందా? ఏదీ అర్థం కాలేదు. ఆ రాత్రే బస్ కి బయల్దేరాను. బస్ ఎక్కుతోంటే పెళ్ళి అయి సీత, భర్తతో హైదరాబాద్ లో వెళ్ళిన రోజు గుర్తుకొచ్చింది. నాకు తెలీకుండానే కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయి. బస్ పోతూంటే చాలాసేపటి వరకూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపాను. "సీత వెంటనే కోలుకోవాలని"
హైదరాబాద్ చేరేసరికి ఉదయం అయిదున్నర అయింది. ఆటో రిక్షాలో ఓ అరగంట వెదికి సీత ఇల్లు చేరుకున్నాను. ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతోనే వున్నాయి. హాల్లో సీత భర్తా, మామయ్యా కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే అతను లేచి నా దగ్గర కొచ్చేడు.
"మీరు కొంచెం ఆలస్యంగా వచ్చేరు. రండి!" అంటూ లోపలికి దారితీశాడు. నా శరీరమంతా వణుకుతోంది. చెమటలు పడుతున్నాయి. అడుగులు తడబడుతూండగా అతని వెనుక నడిచాను. గదిలో మంచం చుట్టూ నలుగురయిదుగురు ఆడాళ్ళు నుంచుని ఉన్నారు. అత్తయ్య ఓ మూల కూర్చుని రోదిస్తోంది. సీత మీద కప్పిన దుప్పటి తొలగించి చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుందామె ముఖం. నా కళ్ళవెంబడి నీళ్ళు రావటం లేదు. జరుగకూడనిది జరిగిపోయింది. గుండెలు పిండేస్తున్నట్లు బాధ. మనసంతా ఖాళీ అయిపోయింది . బాగ్ తీసుకొని బయటకు నడిచాను. అతను గేటు వరకూ వచ్చాడు నాతో. అక్కడ ఆగి అన్నాడు-
"మీతో కొంచెం మాట్లాడాలి."
ఆగి అతని వేపు తిరిగాను. నాకేమీ వినాలనిపించటం లేదు. నా జవాబు కోసం అతను ఎదురుచూడలేదు.
"సీతకి నేను అన్యాయం చేశాను. ఆమెని చిత్రవధ చేశాను. నాకు తెలుసు. నేనేమీ చేస్తున్నదీ! కానీ నిస్సహాయుణ్ణి! భార్య ఇంకో పురుషుడిని అదివరకే ప్రేమించిందనీ, ఇంకా అతన్నే ఆరాధిస్తోందనీ తెలిస్తే ఏ మొగాడు సహించగలడు? తన సంగతెలా ఉన్నా తన భార్య మాత్రం తననే ప్రేమించాలనీ, మరో పురుషుడిని కన్నెత్తి చూడకూడదనీ ప్రతి మొగాడూ కోరుకొంటాడు. కానీ నన్ను సీత నిర్లక్ష్యం చేసింది. తను నా భార్యలా మెలిగేదికాదు. మనసిచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు. నేను నిలదీస్తే చాలారోజుల తర్వాత చెప్పింది. తను మిమ్మల్ని ప్రేమించినట్లు, తన హృదయంలో మరొకరికి చోటులేనట్లు! ఇక్కడే, అప్పటినుంచే నేను దయాదాక్షిణ్యాలు మిగలని పశువుగా మారిపోయాను. బార్ లో త్రాగివచ్చి, రోజూ రాత్రిళ్ళు ఆమెని చావబాదేవాణ్ణి. చాలాసార్లు స్పృహతప్పేంతగా కొట్టాను. మీ దగ్గర్నుంచీ వచ్చిన ఉత్తరాలన్నీ చింపి అవతల పారేసేవాడిని. అప్పటినుంచీ ఆమె తెగించింది. ఎదురు తిరిగి జవాబులిచ్చేది నాకు. ఆమె అంటే నాలో కసి పేరుకుపోయింది. కొద్దిరోజుల క్రితం ఆమె సూట్ కేస్ లో మీ ఫోటో కనిపించింది నాకు. ఆమెని చాలా తీవ్రంగా హింసించాను. ఆమె గడపకు కొట్టుకొని పడిపోయింది. తలకి పెద్ద గాయమయింది. ఆ తరువాత నాలుగురోజులు సీత మూసిన కన్ను తెరవకుండా పడివుంది. వాళ్ళమ్మా నాన్నా వచ్చి డాక్టరుని పిలిపించారు. నిన్నంతా మీ పేరే కలువరిస్తోంది.డాక్టర్ పెదవి విరిచిం తర్వాత మీ కోసం టెలిగ్రాం ఇచ్చాను. కనీసం ఆఖరి ఘడియల్లో మీరామెను చూడగలరనుకొన్నాను...."
టాక్సీని పిలిచాను. బాగ్ లోపలపెట్టి కూర్చున్నాను. అతని కిటికీ దగ్గరకొచ్చాడు. అతని కళ్ళవెంబడి నీళ్ళు కారుతున్నాయి.
"నేను రాక్షషుణ్ణే! ఒప్పుకొంటాను. కాని నేనిలా మారడానికి కారణం మీరు కూడా! సీత మిమ్మల్ని ప్రేమించింది. మధ్యలో ఏమీ తెలియని నన్ను చేసుకొంది. జీవితం మీద ఎన్నో కోరికలూ కలలూ నింపుకొన్న నా జీవితం నరకం చేసి, నన్నో రాక్షసుడిగా మార్చింది... అందుకు ప్రతిఫలం అనుభవించింది... దీనికంతటికి కారణం... మీరు.... మీరు."
టాక్సీ కదిలింది. హఠాత్తుగా నా దృష్టి గేట్ ప్రక్కనే నుంచుని ఉన్న ఓ మూడేళ్ళ కుర్రాడిమీద పడింది. చిన్న నిక్కరూ చొక్కా వేసుకొని నా వంకే చూస్తున్నాడు. వాడిని చూసి ఉలిక్కిపడ్డాను. వాడు అచ్చం నా పోలికే.
టాక్సీ మలుపు తిరిగింది. ఆఖరుసారిగా వెనక్కు తిరిగి చూశాను. అతను పిచ్చివాడిలా జుట్టు పీక్కొంటున్నాడు. నా చెంపల మీదగా వెచ్చని కన్నీరు జారిపోతోంది.....
రౌడీపిల్ల ఇకలేదు.
]
* * * * *