"దొంగ రసీదు పుస్తకాల ఆధారంగా ఈ కంపెనీ, కొంతమంది డిపాజిటర్లు అసలు తమ దగ్గిర ఈ డబ్బు దాచుకోలేదని, అందువల్ల దాన్ని తిరిగి ఇవ్వనవసరం లేదని వాదించబోతూంది."
విద్యాధరి స్థాణువైంది.
తన డ్రాయరులో దొరికిన దొంగ రసీదు పుస్తకాలు ఆమెకి గుర్తొచ్చాయి. వాటి కారణంగా తనని అరెస్టు కూడా చేయించబోయాడు చక్రధర్....
ఈ లోపులో ఆయన అన్నాడు. "డిపాజిటర్లు కోర్టుకి వెళతారు. కానీ కోర్టులో ఈ విషయాలన్నీ తేలేసరికి పది సంవత్సరాలు పడుతుంది. చక్రధర్ కోర్టులో ఈ దొంగ రసీదుల సంగతి తనకేమీ తెలియదని వాదిస్తాడు. తన వెనుక, తనకి తెలియకుండా ఇదంతా ఎవరో చేశారనీ, దానికి తన కంపెనీ బాధ్యత వహించదని అంటాడు. ఏమో, కోర్టు అతని వాదనని నమ్మినా నమ్మవచ్చు. అలాకాకుండా చక్రధర్ కీ ఆ దొంగ రసీదుల పుస్తకాలకీ సంబంధం వుందని నిరూపించగలిగితే అతడికి పది సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్షపడేలా చూడవచ్చు. ప్రజలకి అతడు చేసిన ద్రోహానికి అది తక్కువ శిక్షే అయినా, ఏమీలేని దానికన్నా అది మంచిది విద్యాధరీ! ఈ విషయంలో నువ్వు నాకు సాయం చెయ్యాలి'. విద్యాధరి ఉలిక్కిపడి, తడబడుతూ, "ఎలా" అని అడిగింది.
"చక్రధర్ దగ్గర కొన్ని రహస్యపత్రాలున్నాయి. ఈ దొంగ రసీదు పుస్తకాలు ఎక్కడ ప్రింటు చేయించాడో, ఎవరికి ఇచ్చాడో, ఎంత డబ్బు ఆ విధంగా జమ అయిందో అతడు 'నోట్' చేసుకుని వుంటాడు. దాన్ని నువ్వు సంపాదించాలి."
ఆమె గొంతు తడారిపోయింది.
ఇంత పెద్ద బాధ్యత తనమీద వుంచబడుతుంది అని ఆమె వూహించలేదు. ఒక ఫైనాన్స్ కంపెనీలో చిన్న ఉద్యోగి తను, ఎక్కడో అంధకారపు రహస్య స్థావరాల్లో వున్న ఆ కాగితం వెతికి పట్టుకుని పోలీసు అధికారులకు అందజెయ్యడం అంటే - అది తనకు సాధ్యమయ్యే పనేనా? తనేమీ డిటెక్టివ్ కాదు. గూఢచారిణి అసలే కాదు.
ఆమె మనసులో భావాలు గ్రహించినట్టు ఆయన అన్నాడు - "ఇది చాలా ఇష్టమైన పనే. కానీ ఎవరో ఒకరు దీన్ని ఛేదించటానికి పూనుకోవాలి. మేమే అతని ఆఫీసుని, ఇంటినీ రెయిడ్ చేసి శోధించవచ్చు. కానీ అందువల్ల అంత లాభం వుంటుందనుకోను. చక్రధర్ అంత తెలివితక్కువగా ప్రవర్తించడు. వందలూ వేలూ జనాల్ని మోసం చేసినవాడు - తన మోసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరొక అమాయక ప్రాణాల్ని బలిపెట్టటానికి కూడా సిద్ధపడతాడు... అటువంటి వాడిని చట్టానికి అప్పగించడం కోసం ఆమాత్రం ధైర్యం చెయ్యలేవూ...?"
విద్యాధరి ఉత్తేజితురాలై - "చేస్తాను" అంది.
"గుడ్" అని ఆయన, ఆమె చెయ్యవలసిన పని వివరించసాగాడు.
* * *
ఆమె మనసంతా ఎగ్జయిటింగ్ గా వుంది.
మాటిమాటికీ సీన్ కానరీ గుర్తొస్తున్నాడు. తనని ఇరుకున పెట్టేసి, కళ్ళవెంట నీళ్ళు తెప్పించిన చక్రధర్ మీద స్వీట్ గా పగ తీర్చుకోబోతూంది. అదీ ఎగ్జయిట్ మెంట్.
దానికన్నా ముఖ్యంగా...
అమాయకుల్ని మొసం చేసిన ఒక దుర్మార్గుడి ఆట కట్టించటానికి తను సాయపడబోతూంది.
పోలీసుకొచ్చిన ఇన్ఫర్మషన్ చాలావరకూ కరక్టే అని ఆమెకి తెలుసు. ఆఫీసులో ఇటువంటి రూమర్లు చాలా వున్నాయి. సిగ్మా ఇన్వెస్టుమెంట్స్ లో డబ్బు దాచుకున్న డిపాజిటర్లు చాలా మంది అప్పుడే కలత చెందటం ప్రారంభించారు. చక్రధర్ విదేశాలకి వెళ్ళిపోతాడని కూడా అనుకుంటున్నారు ఆఫీసు వాళ్ళు.
కానీ ఇదంతా ఇంత తొందరగా జరుగుతుందనీ, దీన్ని వెతికి తీయటంలో తను ప్రముఖపాత్ర వహించబోతోందనీ ఆమె కలలోకూడా అనుకోలేదు.
ధర్మారావు చెప్పింది కూడా ఆమెకు కష్టసాధ్యమైన పనేమీ కాదు. చక్రధర్ తాలూకు 'రహస్యపు టర' ఎక్కడుందో ఆమెకు తెలుసు. ఒకరోజు చక్రధర్ ఆమెని ఇంటికి పిలిచాడు. ఉద్యోగంలో చేరిన కొత్త. మామూలుగానే వెళ్ళింది.
టీ కప్పు ఇస్తూ చేతులు తగిలించటం - వగైరా మామూలు పద్ధతులు అయిన తరువాత అతడు లోపల్నుంచి ఒక అందమైన పర్సు తీసుకొచ్చి ఆమెకు ఇచ్చి - "జకర్తానుంచి తెచ్చాను. నా జ్ఞాపకంగా తీసుకోండి" అన్నాడు. అప్పటికే అతడి 'మోటివ్' తెలిసిన విద్యాధరి మర్యాదగా దాన్ని తిరస్కరించింది.
అంతలో ఫోన్ మ్రోగింది.
ఫోన్ లో మాట్లాడి, పెట్టేస్తూ "ఒక్క నిముషం, ఇప్పుడే వస్తాను" అని అతడు పక్కగదిలోకి వెళ్ళాడు. అయితే వెళ్తూవెళ్తూ అతడు ముందుగది తలుపులెయ్యటంతో ఆమె బిత్తరపోయింది. ఒక క్షణం కాళ్ళూ చేతులూ ఆడలేదు. అతడంత ధైర్యంగా అంత తొందరగా అలా ప్రొసీడ్ అవగలడని ఆమె వూహించలేదు. అతను బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
ఆమె బయటపడదామని వెళ్ళి ముందుగది తలుపు లాగి చూసింది.
ఆమెకు భయం ఎక్కువైంది.
అతడు పక్కగదిలోకి ఎందుకు వెళ్ళాడో అర్థంకాలేదు. అందులోనూ తనని వదిలేసి...
పక్కబట్టలు సర్దటానికా?
ఆమె స్వతహాగా భయస్తురాలు కాదు కానీ ఈ పరిస్థితి విచిత్రంగా వుంది. బహుశా ఆ రూంలోంచి బయటకు దారి వుందేమో - అట్నుంచి తనని వెళ్ళనివ్వకుండా చేయటం కోసం అ తలుపు కూడా వేస్తున్నాడేమో అనుకుంది. మరింకేమీ ఆలోచించకుండా ఆ గదిలోకి ప్రవేశించింది.
ఆ గదిని చూసి ఆమె కన్ ఫ్యూజ్ అయింది. నాలుగువైపులా గోడలు ఒకే రకం పానెలింగ్ వల్ల ఒకేలా వున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళ బెడ్ రూమ్ చూడటం ఆమెకదే ప్రథమం. ఆ పానెల్స్ మధ్య అతను ఎక్కడున్నాడో ఎలా మాయమయ్యాడో తెలియలేదు. ఈ లోపులో ఆ చెక్కల మధ్య నుంచి వెలుతురు కనిపించింది. ఆమె ఉత్సుకతతో లోపలికి తొంగిచూసింది.
లోపలి గది టాయిలెట్. అతను లోపలున్నాడు.
సిగ్గుతో ఆమె మొహం ఎర్రబడింది. వెనుదిరగబోయింది. అప్పుడు కనపడింది అతడు వాష్ టబ్ వెనుకనుంచి ఏవో కాగితాలు తీయటం.
క్షణంలో ఆమెకి మొత్తం అర్థమైంది.
ఎక్కణ్ణుంచో ఫోన్ వచ్చింది. అతడు రహస్యపు టరలోంచి కాగితాలు తీసుకోవటం కోసం బయట తలుపు వేశాడు. తను లోపలికి వస్తుందని వూహించలేదు. అనవసరమైన భయంతో తను లోపలికి వచ్చేసి దీన్నంతా చూసింది.
ఆమె చప్పుడు చేయకుండా అక్కడినుంచి ముందుగదిలోకి వచ్చేసింది. గుడ్ బై చెప్పి ఆ తరువాత బయటక్కూడా వచ్చేసింది. అతడు ఆపే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు.
ఆ విధంగా చక్రధర్ ఇంట్లో రహస్యపుటర ఎక్కడుందో ఆమెకి తెలిసింది.
కొన్ని కాగితాలు ఆఫీసులో పర్సనల్ డ్రాయర్ లో ఉంటాయి. అవికూడా తనకి తెలుసు.
ధర్మారావు ఇంటినుంచి తన ఇంటికొస్తూ ఆమె ఇదంతా ఆలోచించింది. పోలీసు కారులో దింపిరమ్మని ఆమెని పంపించాడు. ఆ కారు మధ్యలో ట్రబులిస్తే దిగి రిక్షా ఎక్కింది.
ఆమె మనసు నుంచి ఉద్వేగం అంతా పూర్తిగా పోలేదు. ఆయన చెప్పిన పని సరీగ్గా పూర్తిచేసినప్పుడే అది పోతుంది. ఆమె రిక్షా దిగి ఇంట్లోకి ప్రవేశిస్తూంటే "హలో" అని వినిపించింది.
అనుదీప్!
ఆమె వెంటనే చేసిన పని - పోలీస్ ఎస్ కార్డ్ గురించి చూడటం.... అయితే దూరంగా ఎవరూ కనిపించలేదు.
పోలీస్ కమీషనర్ కారులో వస్తూవుండగా కలిసే సాహాసం చేయడనుకుని వుంటారు. సరియైన టైమ్ లో తనని వదిలేశారు వాళ్ళు. ఆమె కోపం దిగమింగుకుని నవ్వేసి "లోపలికి రండి" అంది. అతన్ని ఎలాగైనా అయిదు నిముషాలు ఆపగలిగితే పోలీసులు ఎలాగో వచ్చేస్తారు. అంతవరకూ ఎలాగో ఆపాలి.
లోపలికి ప్రవేశించి కూర్చున్నాక, "మీ చెయ్యి మామూలుగానే ఉన్నట్టుందే-" అంది ఏమీ ఎరగనట్టు.
"అవును. నా ప్రేమ నిజమైనదైతే చెయ్యి తిరిగి మొలవాలి అనుకున్నాను - మొలిచింది" అన్నాడు.
"కంగ్రాచ్యులేషన్స్" అంది వెటకారం ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ.
"నిజమైన కంగ్రాచ్యులేషన్స్ మీరు నా ప్రేమని అంగీకరించినప్పుడే చెప్పాలి."
"అలాగా. కానీ...." అని ఆగి, "మెస్మరిజం అంటే మీకు తెలుసా..." అని అడిగింది అమాయకంగా.
"ఆ పేరు విన్నాను. వివరాలు తెలియవు."
ఆమె కోపం హద్దులు దాటుతోంది. అతికష్టంమీద నిభాయించుకుని "ఎంతమందిని ఇలా మీరు ఫూల్స్ ని చేయదలుచుకున్నారు?" అంది.
"ఫూల్స్ చెయ్యటం ఏమిటి?"
"ఏమీ తెలియనట్టు నటించకండి. మీరు చెప్పినదంతా నమ్మి ఉంటే నేను కాకుండా ఇంకే అమాయకమైన ఆడపిల్ల అయినా అయివుంటే -ఈపాటికి మీ వలలో పడివుండేది. మీ చేతిలో ఉన్న విద్యని ఇంత నీచమైన పనికి ఉపయోగిస్తారని నేను అనుకోలేదు."
"చేతిలో విద్య ఏమిటి?"
"అదే మెస్మరిజం."
"నా చేతిలో అటువంటి విద్యేమీ లేదు. అయినా ఈ కాలంలో అమ్మాయిలు వలలో పడటానికి అటువంటి విద్యేమీ అవసరం లేదు. నిజానికి వాళ్ళే అందమైన వల ఎక్కడుందా ఎప్పుడు పడదామా అని చూస్తూ వుంటారు."
"షటప్-"
"చూడండి, మీరు అనవసరంగా నామీద కోపం తెచ్చుకుంటున్నారు. నేను మీపట్ల ఏమీ అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రేమకి త్యాగం ముఖ్యం అన్నారు. చెయ్యి త్యాగం చేసాను. దేవుడు కూడా నా ప్రేమ నిజాయితీని మెచ్చుకున్నాడు. ఇక మీదే ఆలస్యం." ఆమె వింటూ బయటకు చూస్తోంది. పోలీసు ఇంకా రాలేదు. వస్తే ఇంటిముందు వీధిచివర కిళ్ళీకొట్టు దగ్గర నిలబడి వుంటాడు. తనకి గుర్తే. ఇంకొంచెం సేపు ఇతడిని ఆపాలి.
అనునయంగా "చూడండి, 'ప్రేమంటే' చేతులు కాళ్ళూ తెగ్గోసుకోవటంకాదు. - అవతలివార్ని మెప్పించాలి" అంది.
"చూడండి -" అన్నాడు అతడు కూడా, "...నేను మీ కిష్టమని నీలిరంగు చొక్కా వేసుకున్నాను. పైగా రోజ్ స్ప్రే జల్లుకున్నాను. క్రాఫు నుదుటి మీదకు దువ్వుకోటమనే కొత్త ప్రయోగం చేశాను. మీ కిష్టమని -" అంటూ చెప్పటం కొనసాగించబోయాడు.
"విల్ యు స్టాఫ్ దేర్" అందామె విసుగ్గా. "బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు. అంతర్ సౌందర్యం కావాలి."
అతడు అమాయకంగా, "అంతర్ సౌందర్యం చూపించాలంటే దానికి అవతలివారి సహకారం కూడా కావాలికదా" అన్నాడు. ఆ మాటల్లో డబుల్ మీనింగ్ ఏదైనా వుందేమో చురుగ్గా చూసింది. కానీ అతడి మొహంలో అటువంటి భావాలు ఏవీ కనిపించలేదు. అనవసరంగా తనే విపరీతార్థాలు తీస్తుందేమో అనుకుంది. అంతలో అతనన్నాడు.
"స్త్రీని గుడితో పోల్చాడో కవి. మనసు తలుపులు తెరుచుకుని పై గంటలు మ్రోగిస్తూ లోపలికి ప్రవేశిస్తేనే కదా 'రెడ్ కార్పెట్' స్వాగతం లభించేది."
'రెడ్ కార్పెట్' అని అతడు ఎందుకు నొక్కి పలికాడో ఆమెకి సరిగ్గా అర్థంకాలేదు. అయివుంటే అతడి మొహంలో లీలగా కదలాడిన చిరునవ్వుకి అర్థాలు వెతికి, వాటి అర్థం ఏమాత్రం స్ఫురించినా ప్రేట్రేగిపోయేదే. అంతలో అతనన్నాడు.