ఆమె కొంత సేపటికి తేరుకుని "ఐయామ్ సారీ" అంది.
"సారీ దేనికి?"
"నీ మూడ్ పాడుచేసినందుకు."
"మన దగ్గరవాళ్ళు ఏడిస్తేనే మనకి మూడ్ పాడవుతుంది అనుకుంటే ఇక మనం వాళ్ళకేం దగ్గిర!" అన్నాడు.
"ఈ ప్రేమరాహిత్యం నన్ను చంపుతోంది" వెక్కుతూ అంది.
"ప్రేమ రాహిత్యమంటే నిన్నెవరూ ప్రేమించకపోవటమా? నువ్వెవర్నీ ప్రేమించలేక పోవటమా?"
"నన్నెవరూ ప్రేమించరు. నన్నెవరయినా ప్రేమిస్తే అది వాళ్ళు తమ స్వార్థంకోసమే ప్రేమిస్తారు. అందుకని నేనెవర్నీ ప్రేమించలేదు."
"నేను వెళ్ళొస్తాను" అతడు సానుభూతిగా అన్నాడు. అది ఆమెమీదో తనమీదో అతడికే తెలీదు.
ఆమె చప్పున అతడి చెయ్యి పట్టుకుని "అప్పుడేనా?" అంది.
అతడు నవ్వి "నాకూ ఉండాలనే వున్నది- కానీ వుండాలనిపించటం స్వార్థం. నీ మాటల్లో నువ్వే చెప్పినట్టు స్వార్థంతో కూడిన ప్రేమ ఎలా ప్రేమ అవుతుంది."
"నన్ను కన్ ఫ్యూజ్ చేస్తున్నావు"
"కాదు. నన్ను నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నీ ఇంటి యజమాని కొడుకు నీ వళ్ళో తలపెట్టుకొని ఏడ్వాలనుకుంటే అది స్వార్థం. నువ్వు ఈ పర్వత శిఖరాలమధ్య మనసుపొరలు కరిగి నా దగ్గిర దుఃఖిస్తే అది ప్రేమ. స్వార్థమూ, ప్రేమా ఏ పాయింట్ దగ్గిర విడిపోతాయీ అన్న విషయం ఆలోచిస్తున్నాను. అర్థమయ్యాక వస్తాను. వెళ్లొస్తాను".
............
"విద్యా - విద్యా".
విద్యాధరి ఉలికిపడి కనులు విప్పింది. ధర్మారావు కూతురు తట్టి లేపుతోంది.
ఆ అమ్మాయి మొహమంతా ఎగ్జయింట్ మెంట్ తో నిండి వుంది. తనకి ఇప్పటివరకూ వచ్చింది కలే అన్న వాస్తవం అర్థమవటానికి విద్యాధరికి రెండు నిముషాలు పట్టింది.
"యస్సై వచ్చాడు. అతడు చెప్పేది నువ్వే స్వయంగా వినాలి. అర్జెంటుగా రా" అని హడావుడిగా తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళేసరికి ధర్మారావు, విశ్వనాథం మాట్లాడుకుంటున్నారు.
"నిజం సార. నేను స్వయంగా చూశాను. అతడి చెయ్యిలోపల్నుంచి పొడుచుకువచ్చింది" ఉద్వేగంతో చెప్పుకుపోతున్నాడు విశ్వనాథం.
విద్యాధరికి ఉద్వేగం కన్నా ఎక్కువ సంతోషం కలిగింది. అనుదీప్ కి చెయ్యి వచ్చేసింది. అంతలో మళ్ళీ తన ఆలోచనకి తనకే కోపం వచ్చింది. అతడి చెయ్యి మొలుస్తే తనకేం- రెండోతల మొలుస్తే తనకేం?
ధర్మారావు అంటున్నాడు - "అతనో మెస్మరిస్టు. ఆ విషయం రాత్రే విద్య చెపుతూ వుండగా తెలిసింది. అతడిని వదిలేసావా?"
ఆ మాత్రం హింట్ దొరగ్గానే విశ్వనాథం అబద్ధం ఆదేశాడు. "మా అందరిమీదా మత్తుజల్లేడు సార్, మేమేమీ చెయ్యలేకపోయాం."
ధర్మారావు ఎవరికో ఫోన్ చేశాడు. "ఓ అయిదు నిముషాలు ఆగు. జార్జ్ వస్తాడు."
విద్య లోపలికి వెళ్ళి మొహం కడుక్కుని కాఫీతాగి వచ్చేసరికి జార్జ్ వచ్చివున్నాడు. అతడో మానసిక శాస్త్ర నిపుణుడు. పోలీసు డిపార్టుమెంట్ లో కేసులు పరిశీలిస్తూ వుంటాడు. ధర్మారావుకి విష్ చేసి కూర్చున్నాడు. ధర్మారావు విద్యని పరిచయంచేసి, "నిన్న రాత్రి నాకు చెప్పినదంతా చెప్పమ్మా" అన్నాడు.
విద్య అక్షరం పొల్లుపోకుండా జార్జికి చెప్పింది.
విశ్వనాథం విద్యాధరినే చూస్తున్నాడు. అందం సరే, ఆమె చెప్పింది కూడా అతడికి బలాన్ని ఇచ్చింది. రాత్రంతా అతడు తెగ మధనపడ్డాడు. చెయ్యి మొలవటం, తన ఉద్యోగం పోతుందని అతననటం అందరి పోలీసుల మధ్య నుంచీ వెళ్ళిపోవటం - ఇదంతా చెప్తే కమీషనర్ నమ్ముతాడో నమ్మడో... తనకి చెడ్డపేరు వస్తుందేమో అని భయపడ్డాడు. కానీ ఇప్పుడు వాళ్ల బంధువుల అమ్మాయి తనని బలపరుస్తోంది.
విద్య చెప్పిందంతా విని జార్జి, "అతడు నిజంగా మెస్మరిస్టేసార్" అన్నాడు. "అతడు చెయ్యి తెగ్గోసుకోలేదు. ఆ భావం ఆమెలో కలిగించాడు. అలాగే పోలీస్ స్టేషన్ లో అందర్నీ మెస్మరైజ్ చేశాడు" అన్నాడు.
"మెస్మరిస్టులకి అంత శక్తి వుంటుందా?" ధర్మారావు కూతురు అడిగింది. "మెజీషియన్లు తమ చేతల్తో ప్రజల్ని భ్రమింపచేస్తారు. హిప్నటిస్టులు తమ స్వరంతో అవతలివాళ్ళని భ్రమలోకి తీసుకువెళ్తారు. కానీ మెస్మరిస్టులు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు. మాస్ ని కూడా కట్టగట్టి భ్రాంతికి లోనుచెయ్యగలరు. వారు దీనికోసం చేతుల్ని కంఠాన్ని కూడా వుపయోగించనవసరంలేదు."
ధర్మారావు కూతురు విద్యకేసి తిరిగి సన్నటి స్వరంతో "ఈ మెస్మరిజం నాకొస్తే బావుణ్ణు. మొత్తం మన బాడీగార్డ్స్ నందర్నీ కుక్కలుగా మార్చేసి మున్సిపాలిటీ వ్యాన్ ఎక్కించ్చేద్దును" అంది.
"...ష్" అన్నాడు ధర్మారావు కూతుర్ని చూసి.
జార్జి కొనసాగించాడు. "... కానీ ఈ మధ్యకాలంలో మెస్మరిస్టులు ఎవరూ పుట్టలేదు సార్. హేతువాదుల లెఖ్ఖప్రకారం బాబాలే మెస్మరిస్టులు. థర్డ్ డైమెన్షన్ లోనుంచి వస్తువుల్ని సృష్టించగలగటం మెస్మరిస్టుల చాతుర్యం. అలాగే వస్తువుల్ని మాయంచేయటం కూడా."
అర్థమైనట్టు ధర్మారావు తలూపి "పోలీస్ స్టేషన్ లో అంతమంది ముందు అతడు చేతిని సృష్టించాడు అన్నమాట" అన్నాడు.
"మెస్మరిస్టు ఒక గ్రూపు మొత్తాన్ని తన పరిధిలోకి తీసుకోగలడు. కనికట్టు వేసి ఖాళీ సీసాలోంచి నలుగురి ముందూ నీళ్ళు తెప్పించగలడు. ఇందులో పెద్ద చిత్రమేమీ లేదు."
ధర్మారావు విశ్వనాథంవైపు తిరిగి, "వాడిని ఎలాగైనా పట్టుకో" అన్నాడు.
జార్జి కల్పించుకుని, "అతడిమీద ఏం చర్య తీసుకోగలం?" అన్నాడు.
"ఒక అమ్మాయిని బెదిరించి, భయపెట్టి తన వశం చేసుకోవాలని చూసేవాడు, వాడికెన్ని మానవాతీత శక్తులున్నాసరే- చట్టం నుంచి తప్పుకోలేడు."
విద్యాధరి ధర్మారావువైపు భయంగా చూసింది. ఆయన యస్సైతో "ఈ రోజునుంచీ యిద్దరు కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని ఫాలో అవ్వమను, అతడు మళ్ళీ కలుసుకోవటానికి ప్రయత్నిస్తే వెంటనే అరెస్ట్ చెయ్యి!"
"యస్సర్" సెల్యూట్ చేశాడు విశ్వనాథం.
* * *
మే, 14
సిగ్మా ఇన్వెస్ట్ మెంట్స్,
11 - 50 ఎ.ఎమ్.
విద్యాధరి పనిచేస్తూందన్న మాటేగానీ మనసు మనసులో లేదు. దూరంగా మఫ్టీలో వున్న పోలీసులనే చూస్తూంది. ఈ రోజెందుకో అనుదీప్ రావటంగానీ ఫోన్ చేయటంగానీ చేస్తాడని ఆమెకి అనిపిస్తూంది. ఆమెకొచ్చిన ఫోన్ కాల్స్ ని కూడా పట్టుకుని -వల బిగించేలా ఏర్పాటు చేశాడు విశ్వనాథం. ఈ కేసు సరిగ్గా టేకప్ చేస్తే కమీషనర్ మెచ్చుకోలు లభిస్తుందని తెలుసు. అతడు కూడా ఆఫీసుకు వచ్చాడు.
సరిగ్గా పన్నెండింటికి ఫోన్ మ్రోగింది. ఆమె ఫోన్ అందుకుంది.
విశ్వనాథం పరుగెత్తుకెళ్ళి ఎక్స్ టెన్షన్ ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు.
కానీ అట్నుంచి మాట్లాడింది ధర్మారావు.
"అమ్మాయ్! నీతో కొంచెం పనుంది. అర్జెంటుగా సాయంత్రం ఇంటికి రాగలవా?"
ఆమె కంగారుగా "ఎందుకు అంకుల్" అంది.
"ఫోన్ లో ఎందుకు? వచ్చాక చెపుతాగా" అని ఆగి, మళ్ళీ "ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు-" అని ఫోన్ పెట్టేశాడు.
ఆమె సాయంత్రం వరకూ ఆందోళనగా గడిపింది. అనుదీప్ గురించి ఏదైనా బ్యాడ్ న్యూస్ తెలిసిందేమో అనుకుంది. ఆ రోజంతా ఆఫీసులో సరిగ్గా పనిచేయలేకపోయింది. భుజానికి కలకత్తాసంచి, నిర్లక్ష్యంగా పెరిగిన నాల్రోజుల వయసున్న గెడ్డం, పెదాలమీద క్లోజప్ చిరునవ్వు - అనుదీప్ లక్షణాలన్నీ ఆమెకి మాటిమాటికీ గుర్తు రాసాగాయి. ఏమైందో సరిగ్గా చెప్పని ధర్మారావుమీద విసుక్కుంది. విశ్వనాథం ఇంకా అక్కడే వున్నాడు కాబట్టి అనుదీప్ కి ఏమీ అయివుండదని ఒకవైపు ఆశగా వుంది. అయినా అతడికేమయితే తనకేంటి అని కూడా సర్దిచెప్పుకుంది.
ఈ సంభాషణ ఫోన్ ఎక్స్ టెన్షన్ లో విన్న విశ్వనాథం ఆమె దగ్గిరకొచ్చి "ఏమిటి - ఆయన ఎందుకు పిలిచారు?" అని అడిగాడు.
"మొత్తం అంతా మీరు విన్నారుగా. నాకు తెలియదు" అంది విసుగ్గా. ఆమెకి విశ్వనాథాన్ని చూస్తుంటే వంటిమీద తేళ్ళుపాకినట్టు వుంది. అనుదీప్ బారినుంచి తనను రక్షించే ప్రయత్నంలో engage కావలసిన అతను, తన young-age ని నిరూపించుకునే తాపత్రయంలో తెగ బోరుకొడుతున్నాడు. అందులోనూ చేస్తున్నది పోలీసు ఉద్యోగమేమో, ఆడపిల్లల్ని అట్రాక్టు చెయ్యగలిగే సున్నితమైన పద్ధతులేమీ తెలియక తన లాకప్ రూమ్ ల అధికారం గురించీ, తన సారాబట్టీల పట్టివేతల గురించీ మాట్లాడి ఆమెకి పార్టీ మధ్యలో తెగిపోయిన పెటికోట్ బొందులాంటి ఇబ్బందిని కలుగచేస్తున్నాడు. ఇతడి బోరు భరించడంకన్నా ఆ అనుదీప్ మీద కేసు ఉపసంహరించుకోవటమే మంచిదిగా భావించే స్టేజికి ఆమెని ఒక్కరోజులో తీసుకొచ్చాడు.
ఆ సాయంత్రం ఆమె ధర్మారావు దగ్గిరకి వెళ్ళింది.
ఆయన కొద్దిసేపు ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడి - "మీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ కదూ" అన్నాడు.
అవునంది.
"అతడికీ నీకూ ఏదో గొడవయినట్టుంది?"
ఊహించని ప్రశ్నకు బిత్తరపోయి, ఆమె "అవును, మీకెలా తెలుసు?" అంది.
ఆయన నవ్వి, "పోలీసు కంప్లెయింట ఏదో యిచ్చినట్టు నటించాడుగా-" అన్నాడు. "మీ కంపెనీ వాళ్ళెవరో చెప్పారు నిన్ను చాలా ఇబ్బందిలో పెట్టాడని. అనుదీప్ నీకు మొదటిసారి కలిసింది అప్పుడే కదూ..."
ఆమె జవాబు చెప్పలేదు. ఆయన ఏదో పెద్దపనిమీదే పిలిపించాడని అర్థమైంది. కానీ అదో పెద్ద విషయంగా కనిపించకుండా వుండటానికి చాలా మామూలుగా వున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ముందుకు వంగి చెప్పటం ప్రారంభించాడు.
"సిగ్మా ఇన్వెస్టిమెంట్స్ మానేజింగ్ డైరెక్టర్ చక్రధర్ నాలుగైదు సంవత్సరాల క్రితం దాదాపు బికారి. అతడూ సంపత్ కలిసి ఈ కంపెనీ పెట్టారు. ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజల్నుంచి లక్షలకు లక్షలు డబ్బు వసూలు చేశారు. ఇప్పుడు దాదాపు వాళ్ళిద్దరూ కోటీశ్వరులు-" ఆమె తెలుసన్నట్టు తలూపింది.
"తమ కంపెనీలో పొడుపు చేసిన డబ్బుకి ఆ రోజుల్లో బ్యాంకు గ్యారంటీ ఇస్తుందని కూడా వాళ్ళు ప్రకటనలు చేశారు. కానీ ఆ ప్రకటనలో వాక్యాలు చాలా పకడ్బందీగా ప్రజల్ని తప్పుదారి పట్టించి, తమమీద చట్టరూపేణా ఏ విధమైన చర్యాతీసుకునే వీలులేకుండా నిర్మింపబడి ఉన్నాయి. ఎంతోమంది అమాయకులు, రిటైరయినవాళ్ళు, కూతుళ్ళకు కట్నం కోసం దాచుకున్నవాళ్ళు, ఈకంపెనీలో తమ డబ్బు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అయిదు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు తిరిగి ఇవ్వాలి ఈ కంపెనీ. కానీ ఎలా ఇవ్వగలదు? బంగారం గనుల మీద ఇన్వెస్ట్ చేస్తే తప్ప సాలుకి 35 శాతం వడ్డీ ఇవ్వటం కుదరదు."
ఆయన ఇదంతా తనకి ఎందుకు చెపుతున్నాడో ఆమెకి అర్థంకాలేదు.