"నేనో మెస్మరిస్టుని అని మీరందరూ అనుకుంటున్నారు. మెస్మరిస్టు అంటే అర్థం ఏమిటి మాడమ్?"
"కనికట్టు చేసి అవతలివారిని వశపర్చుకునేవాడు."
"నాకలాంటి శక్తులు ఏమీలేవు మాడమ్. నేను కావాలనుకున్నప్పుడల్లా భగవంతుని ప్రార్థించి 'దేవా! ఈ విద్యాధరి పట్ల నా ప్రేమ నిజమైన పక్షంలో నాకీ పని చేసిపెట్టు' అనుకుంటాను. ఆ పని జరిగిపోతూ వుంటుంది" అన్నాడు.
ఆమె వెటకారంగా "అందరూ శివుడు, విష్ణువుకోసం తపస్సు చేసివుంటే మీరు ఎవరికోసం తపస్సుచేసి వుంటారో చెప్పనా?" అంది.
"ఎవరికోసం?"
"మన్మధుడి కోసం" కసిగా అంది.
"ఏం, అతడు మాత్రం దేవుడు కాదా? క్రొవ్వొత్తి ప్రపంచానికి వెలుగునిస్తూ తను జ్వలించిపోయినట్టు, శివుని కంటిచూపుకి అతడు 'మసి' అయిపోయి, ఆ బూడిదలోంచి ద్వందార్థ పాటల కవులు, తెలుగు పత్రికా సంపాదకులు, సినిమా నృత్య దర్శకులు, నవలా రచయితలు ఉద్భవించటానికి కారణ భూతుడయ్యాడు. కాదంటారా?"
దూరంగా పోలీసులు ఇంకా రాలేదేమిటా అని కిళ్ళీ కొట్టు వైపు చూస్తూ ఆమె అన్యమనస్కంగా "సరే, మీ మన్మథ దేవుడిని అడిగి, కనికట్టు కన్నా అతీతమైన విషయం ఏదైనా చెప్పండి చూద్దాం" అంది.
"కావాలంటే మీ 'బ్రా' ఏ కంపెనీదో చెప్పగలను మాడమ్" అన్నాడు.
"వ్వాట్" అంది కెవ్వున అరిచినట్టు. ఆమె అరుపుని పట్టించుకోకుండా "మీరు వాడే బ్రా ఆటోక్రసీ" అన్నాడు క్లుప్తంగా. అతడు ఓడిపోయాడన్న ఆనందంలో తన కోపాన్ని, ఉక్రోషాన్ని మర్చిపోయి ఆమె సంతోషంగా "ఏం కాదు" అంది చిన్నపిల్లలా.
"మీరు వాడేది న్యూ - లుక్కే మాడమ్. అందులో నేను చెప్పేది ఆటోక్రసీ విభాగం గురించి."
"అలాంటి విభాగాలు, బ్రాండ్లు ఏమీలేవు."
"ఎందుకు లేవు? ఏ కంపెనీ అయినా, ఆటోక్రసీ, డెమోక్రసీ, అపోజిషన్ - ఈ మూడు రకాల్లోనే తయారు చెయ్యాలి కదా." అని నవ్వేడు.
Autocracy means suppression of masses ;
Democracy aims at upliftment of masses ;
Opposition tries to make mountain out of mole.
తెలుగులో చెప్పాలంటే పెల్లుబికే జనాన్ని అణిచివేసేది నిరంకుశత్వం, బడుగు వర్గాన్ని పైకి లేపేది ప్రజాస్వామ్యం, గోరంతల్ని కొండంతలు చేసేది ప్రతిపక్షం...
అతడు చెప్పటం పూర్తికాకుండానే ఆమె విసిరినా పౌడరు డబ్బా అతడికి వెంట్రుకవాసి దూరంనుంచి బాణంలా దూసుకువెళ్ళి గోడకి తగిలి పెద్ద శబ్దం చేసింది.
"ప్రేమలో అవతలివారిని పొగడటం మొదటిమెట్టు అనుకున్నాను. అది తప్పని తేలింది" అన్నాడు క్షమాపణలు కోరుతున్నట్టు.
ఆ తరువాత ఆమెని మామూలు మనిషిని చేయటానికి అతడికి పది నిమిషాలు పట్టింది. అంత "ఖరీదయిన జోకు" వేయటం ఆమె సహించలేకపోయింది. మొత్తానికి - పదినిముషాల అనునయం, క్షమాపణ తరువాత ఆమె కొద్దిగా శాంతించింది.
అతడు టాపిక్ మారుస్తూ "ఇంతకీ ఏమంటున్నాడు ఆ ధర్మారావు?" అని అడిగాడు.
ఆమె అనునయంగా "ఆయన మీకెలా తెలుసు?" అంది. అతడు నవ్వి "విశ్వనాథం చెప్పాడు" అన్నాడు. ఆమెకి సడన్ గా, చక్రధర్ విషయంలో తనకి సహాయం చేసింది ఇతడే అన్న విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు తను చక్రధర్ ఆట కట్టించబోతూంది. ఆ థ్రిల్ ని ఇతడితో పంచుకోవాలనుకుంది. చక్రధర్ చేస్తున్న మోసాల విషయంలో పోలీసులకు సాయపడుతూ తను పరిశోధనలు జరపటం రహస్యమైన చర్యగా ఆమె భావించలేదు. తనతోపాటు అతడు కూడా సంతోషిస్తాడనుకుంది.
అక్కడే ఆమె పొరబడింది.
స్కూల్లో ఫస్టుమార్క్ వస్తే తల్లి తండ్రులకి పిల్లలు దాన్ని ఎంత ఉత్సాహంతో చెపుతారో అంత ఉత్సాహంగా, అతడిపై వున్న అలకని తాత్కాలికంగా పక్కకినెట్టి ధర్మారావు తనకి అప్పగించిన పని గురించి చెప్పసాగింది.
అతడు తల వంచుకొని వింటున్నాడు.
గదిలో వున్న చీకటివల్ల అతడి మోహంలో మారే భావాల్ని ఆమె గమనించలేదు.
ఆమె చెప్పుకుపోతూంది.
* * *
ప్రపంచంలో ఎన్ని రకాలయిన మనుష్యులున్నారో అన్ని రకాల వాళ్ళూ పోలీస్ డిపార్టుమెంట్ లోనే కనబడతారు. మంచివారు, రక్తం తాగేవారు, పట్టుదల వున్నవారు, కర్కోటకులు, తెలివైనవారు, లంచగొండులు.
ఇన్ స్పెక్టర్ రావిశాస్త్రి గొప్ప వ్యక్తిత్వం, పట్టుదల వున్న వ్యక్తి. ఏ పనిని సగంలో ఆపడు. నిక్కచ్చి మనిషి. అనవసరంగా హడావుడి చేయడు. అతడి క్రిందే యస్సై విశ్వనాథం 'సబ్'గా పనిచేస్తున్నాడు. అయితే పెద్దవారితో పరిచయం అవసరమైన హంగామాలతో విశ్వనాథం అక్కడ 'డామినేట్' చేస్తూ వుంటాడు. అయితే రావిశాస్త్రి దీనికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. తన పనేదో తను చేసుకుపోతూ వుంటాడు.
అనుదీప్ ని విశ్వనాథం పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి ప్రశ్నించినప్పుడు రావిశాస్త్రి అక్కడలేడు. వచ్చాక విషయం తెలిసింది. రావిశాస్త్రి మానవాతీత శక్తుల్నీ కనికట్టుల్నీ నమ్మడు. ఇదంతా ఒక అభూతకల్పనలా తోచింది. కానీ అంతమంది పోలీసులూ, యస్సై చెపుతూంటే ఎలా ఖండించగలడు.
ఈ వార్త పేపర్లలో రాకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకున్నాడు.
కమీషనర్ ధర్మారావు దగ్గిర మంచిపేరు సంపాదించుకోవడం కోసం విశ్వనాథం ఎలాగూ ఈ కేసులో అవసరమయిన దానికన్నా ఎక్కువ ఇంటరెస్టు తీసుకుంటాడని తెలుసు. అనుదీప్ ని ఎలాగైనా ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుంటాడు.
కానీ అతడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని రవిశాస్త్రికి అనిపించింది. ఆమె కోసం తపస్సు చేశానని అతడు చెప్పాడు. బహుశా అది సరదాగా వేసిన జోకు అయివుండవచ్చు. కానీ అతడికి నిజంగా అంత గొప్ప కనికట్టు విద్య తెలిసిన పక్షంలో, ఇంతకాలం ఆ విద్య ప్రదర్శించలేదా? డబ్బు సంపాదించలేదా? పేరు సంపాదించుకునే ప్రయత్నం ఏమీ చెయ్యకపోతే....
మరింతకాలం ఏం చేశాడు?
అనుదీప్....
ఎక్కడో విన్నాడా పేరుని.
సాధారణంగా ఎవరికీ వుండదు. పూర్తిగా అపరిచితమైనది కాదు.
ఎక్కడ విన్నాడు?
అతడికి గుర్తొచ్చింది.
కాలేజీలో చదువుకునే రోజుల్లో తన జూనియరు.
ఈ ఊర్లోనే....!!!
రావిశాస్త్రి ఆలస్యం చేయలేదు. కాలేజీకి వెళ్ళి పాత రికార్డులు పరిశీలించాడు. అతడి అనుమానం కరెక్టయింది. అనుదీప్ అనే కుర్రవాడు 1973 ప్రాంతాల్లో తన కాలేజీలోనే చదివాడు.
ఆ రికార్డులోనే ఇంటి అడ్రసు దొరికింది. కానీ అది పాత అడ్రసు. బహుశా అది మారిపోయి వుండవచ్చు. కానీ అతడు ప్రయత్నం వదల్లేదు. అడ్రసు పట్టుకుని ఆ ఇంటికి వెళ్ళాడు.
ముసలి దంపతులు వున్నారు.
వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం అనుదీప్ ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మొన్నే నెలరోజుల క్రితం వచ్చాడు. ఇంతకాలం ఎక్కడున్నాడో ఎంత అడిగినా చెప్పలేదు. ఇంటికి ఎప్పుడొస్తాడో, ఎప్పుడు వెళతాడో తెలీదు. ఏం చేస్తున్నాడో తెలీదు.
రవిశాస్త్రికి ఇంటరెస్టు పెరిగింది.
వాళ్ళ అనుమతి తీసుకుని అనుదీప్ పెట్టె పరిశీలించాడు. అందులో మరొకచిన్న పెట్టెకూడా వున్నది. దానికి తాళం వేసి వున్నది.
అదిగాక నాలుగయిదు జతల బట్టలున్నాయి అంతే. అందులో ఒక రైల్వే టిక్కెట్ కూడా దొరికింది, అది దాదాపు నెలరోజుల క్రితంది.
చిరుగాఁవ్ నుంచి విజయవాడకి!
చిరుగాఁవ్....
వింధ్య పర్వతాల్ని ఆనుకుని వున్న రైల్వేస్టేషన్.
చాలాసేపు ఆ టిక్కెట్టువైపే సాలోచనగా చూస్తూ వుండిపోయాడు ఇన్ స్పెక్టర్.
వృద్ధదంపతులు అతడికేసి ఆందోళనగా చూస్తున్నారు. "మా అబ్బాయి ఏదయినా నేరం చేశాడా బాబూ" అని అడిగాడు తండ్రి.
"లేదు" అన్నాడు శాస్త్రి. "మీవాడు ఈ ఏడెనిమిది సంవత్సరాలు ఎక్కడున్నాడో తెలీదన్నారు కదూ?"
అవునన్నట్లు తలూపాడు.
"చదువుకునే రోజుల్లో బావుండేవాడా?"
"ఎప్పుడూ ఫస్ట్ క్లాసే వచ్చేది బాబూ. కానీ" ఆ ముసలాయన ఏదో చెప్పబోయి ఆగిపోవటం చూసి, ప్రోత్సహిస్తున్నట్లు "భయపడకండి - పూర్తిగా చెప్పండి" అన్నాడు.
"ఒకరోజు ఇంటికొచ్చేటప్పటికి అదోలా వున్నాడు. ఎవరో స్నేహితుడిని, 'ప్రేమంటే ఏమిట్రా' అని అడగటం కూడా నేను విన్నాను. వాడి తల్లితో ఆ రోజు రాత్రి అన్నాను కూడా, 'వీడిక్కూడా పెళ్ళీడు వచ్చేసిందే' - అని. ఆ ఆనందం నిలవకుండానే వీడు వెళ్ళిపోయాడు. వృద్ధాప్యంలో మమ్మల్ని పట్టించుకునేవాడు లేడనుకుంటూ వుండగా ఇన్నేళ్ళకి తిరిగొచ్చాడు. ఆ సంతోషం కూడా వుండకుండా ఇప్పుడు ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు."
ఇన్ స్పెక్టర్ ఆలోచన్లు మొదటి రెండు వాక్యాల దగ్గరే ఆగిపోయాయి. "అలా అడిగిన ఎన్నాళ్ళకి వెళ్ళిపోయాడు?"
తల్లి కల్పించుకొని "వాడు వెళ్ళిపోయింది అందుకోసం కాదు బాబూ" అంది.
"మరి?"
"వాడు వెళ్ళిపోవటానికి నెలరోజుల ముందు వాడి చెల్లి చచ్చిపోయింది. అప్పటినుంచీ వాడు అదోలా వుండేవాడు. తరువాత ఒకరోజు ఇంటినుంచి వెళ్ళిపోయాడు.'
"చెల్లి చచ్చిపోయిందా?"
"అవును, వాళ్ళిద్దరూ చాలా దగ్గిర. ప్రాణంలో ప్రాణంగా వుండేవారు. దానికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళే రోజయితే వీడు భోజనమే చేయలేదు. అది చచ్చిపోయిందని తెలిసిన రోజయితే వీడికి పిచ్చెక్కుతుందనే అనుకున్నాం. వాడి మనసు ఎంతో సున్నితం. బాగా కదిలిపోయాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ వుండేవాడు. సరిగ్గా మాట్లాడటమే మానేశాడు. ఆ తరువాత నాలుగయిదు రోజులకి వాడికేదో ఉత్తరం వచ్చింది. బహుశా వాడి చెల్లెలు చనిపోయేముందు వ్రాసిందనుకుంటాను. ఎంత అడిగినా చూపించలేదు. ఆ తరువాత ఇంటినుంచి వెళ్ళిపోయాడు" అంది.
ఇన్ స్పెక్టర్ కి ఏదో అనుమానం వచ్చింది.
"మీ అమ్మాయి ఎలా చనిపోయింది" అని అడిగాడు. ఆ ప్రశ్న వాళ్ళకి అర్థంకాలేదు. "విషజ్వరం వచ్చింది బాబూ. నెలరోజుల తీవ్రమైన జ్వరంతో బాధపడి మరణించింది."
"ఇప్పుడామె భర్త, అత్తమామలు బావున్నారా?"
అతడీ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడో అర్థంకాక, "బాగానే వున్నారే" అంది.
తను రాంగ్ ట్రాక్ లో వెళుతున్నానని ఇన్ స్పెక్టర్ కి అర్థమయింది.
అనుదీప్ చెల్లి చచ్చిపోయింది వరకట్నం చావులు వగైరా కారణంగా కాదు. అనుదీప్ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది పగతో కాదు.