ఎందుకు... ఎందుకు సంజాయిషీ ఇవ్వాలి...? పెదనాన్న తనను అర్ధంచేసుకుంటే మాత్రం తనకు జరిగేదేమిటి? కాలిపోయిన కలల గాయాల మీద ఓదార్పుల అమృతాన్ని ఇంజక్ట్ చేసుకుని గతం గోరీ నుంచి నిద్రలేవాలా?
విషాదాన్ని వాంతి చేసుకోవాలని ఎన్ని కన్నీళ్ళనో తాగిన తను మొన్న శరీరాన్ని మైలపర్చుకుని ఇప్పుడు మనసుని తాకట్టు పెట్టుకుని ముందుకు సాగిపోవాలని ఉవ్విళ్ళూరుతుంటే నాకు సెంటిమెంట్సేమిటి....
అలసటగా కళ్ళు మూసుకుంది ఏకాంత.
కృష్ణా... నేను చెడిపోయినదాన్ని కాదురా... సవ్యసాచి అనబడే ఓ కిరాతకుడు సంధించిన బాణానికి నేలకూలి ఆ శోకాన్ని తొలి శ్లోకంగా మార్చుకుని ఓ కావ్యసృష్టికి అంకితం కావాలనుకున్న బాటసారిని. అవున్రా... నేను చేసిన పొరపాటంటూ వుంటే ఒక్కటే... చదువుకని భాగ్యనగరంలో అడుగుపెట్టినదాన్ని ఓ ప్రేమ వలయంలో చిక్కుకోవటం... ఆ వశిష్ట కూడా నన్ను మనసారా ప్రేమించాడు.... నన్ను తన మనిషే అన్నాడు. నా కథలో అనూహ్యమైన మలుపులే లేకపోతే ఈ పాటికి వశిష్టకి భార్యనయ్యేదాన్నిగాని ఏం జరిగిందో తెలుసా... వశిష్ట నాకు దూరంగా ఐ.పి.ఎస్. ట్రైనింగ్ కు వెళ్ళాడు. అక్కడనుంచి నాకు ఉత్తరాలు రాసేవాడు. ఎంత అపురూపమైన రోజులవి. అతడు తిరిగివస్తే నావాడయ్యేవాడు కాని ఈలోగా నా నుదుటిరాతే మారిపోయింది. కాదు సవ్యసాచి మార్చేసాడు... ఏ ప్రేమ కథకైనా ఏదో ఓ అవాంతరం తప్పనిసరి అని తెలుసుగాని నా కథకి నేనే ఓ అవాంతరాన్నయ్యాను. కాదు అలా నా పాత్రని మలిచాడు సవ్యసాచి.
ఓ రాత్రి...
వశిష్ట వెళ్ళిన మూడు నెలలకి హాస్టల్లో వున్న నాకు ఓ కబురు వచ్చింది. రాత్రంతా నక్షత్రం నుంచి మరో నక్ష్యత్రానికి చూపు మరల్చుకుంటూ ఆర్తిగా నా ప్రేమని నెమరువేసుకుంటున్న క్షణాన ఆ కబురు పంపింది నా ప్రియసఖుడే అని వెళ్ళాన్రా... వెళ్ళాకగాని తెలీలేదు నేను వంచించబడ్డానని. అంతే... అక్కడ నేను కొందరు వ్యక్తులకి ఆహుతయ్యాను. పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకుంటుండగానే సవ్యసాచి పంపిన పోలీసులు వచ్చారు. వస్తూనే నన్ను వ్యభిచారినన్నారు. కోర్టులో ఏడ్చాను. మొత్తుకున్నాను కాని ఫలితం లేకపోయింది. ఒక బలవంతుడైన వేటగాడి గాలానికి ఎరనై రాలిన నేను ఆ తర్వాత ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాను. అయినా ఏదో ఆశ... వశిష్ట నన్ను అర్ధం చేసుకుంటాడని... అందుకే హాస్టల్ నుంచి డిబార్ చేయబడ్డ నేను ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నేను నిర్దోషినని నిరూపించుకోటానికి చాలా చాలా శ్రమపడ్డాను.
సవ్యసాచి వూరుకోలేదు తమ్ముడూ... కనీసం నేను చచ్చే అవకాశాన్నయినా ఇవ్వకుండా నా అస్థిత్వాన్ని మరింత నీచంగా చిత్రించే ప్రయత్నంలో ఓ అర్దరాత్రి నా గదిలోకి ఓ శవాన్ని చేర్చాడు. నేనే నా విటుడ్ని చంపినట్టు మరోమారు కోర్టుకి లాగాడు. ఎంత దారుణమో నీకెలా చెప్పనురా... శవంగా మారిన ఆ వ్యక్తెవరో తెలీదు. ఎందుకు హత్యా చేయబడ్డాడో, ఎవరు చేశారో తెలీదు. కానీ అంతదాకా పతితనే అయిన నేను ఆ తర్వాత హంతకురాలినీ అయ్యాను.
తమ్ముడూ... ఇంకేం మిగిలింది నాకు... నా గురించి తెలిసిన అమ్మ కన్నుమూసింది. నేనేమిటి అన్నది తెలిసి కూడా వశిష్ట నన్ను దోషిని అనుకుని నాకు దూరమైపోయాడు. ఇంతకుమించి చావంటే నిర్వచనమేముందిరా...
అందుకే బ్రతకాలనుకున్నాను తమ్ముడూ! ఓ పల్లెలో ఏటి ఒడ్డున పెరిగిన గరికను నేను. నాకు తెలీని పశువుల మేతకి ఆహుతయ్యాను. మూడేళ్ళపాటు జైలు గోడలమధ్య చేసిన తపస్సుతో రాటుదేలిన నేను బ్రతుకు చాలించాల్సిన బ్రతుకునుంచి మళ్ళీ ఎదగటానికి మిగిలిన ఈ బ్రతుకుని పణంగా పెట్టాలనుకున్నాను. నిటారుగా పెరిగిన అశోకంలాంటి ఓ దుర్మార్గపు వ్యవస్థకీ బలైన ఈ గడ్డిపరక అల్పమైనదే కాని తల నరికినా మళ్ళీ మొలకెత్తగలదని నిరూపించాలన్నదే నా జీవితాశయం.
పెద్ద చేపని చిన్న చేప మింగేయడమన్నది ఎక్స్ పలాయిటేషనో, ఎకలాజికల్ బేలెన్సో నాకు తెలీదు కానీ లేడి కూడా పులినెత్తురు రుచి చూసే క్షణాలు అరుదైనా అసహజం కాదని రుజువు చేయాలనుకుంటున్నాను.
తెల్లవారని కాళరాత్రిలాంటి ఈ జీవితాన్ని భరిస్తూ నా గుండెల్ని అంటించిన చితిని నా శత్రువుకి కాష్టంగా మార్చి ఎన్ని రోజులు పస్తులుంటేనేం గెలిచిన రోజే చివరి విందుభోజనం ఆరగించి నా కథని కంచిదాకా నడిపించాలనుకుంటున్నాను.
"అక్కా!'.
ఆలోచనలనుంచి తేరుకున్న ఏకాంత చూసింది. కృష్ణ తను కూడబెట్టుకున్న డబ్బులేమో! కొన్ని నోట్లని ఆమె చేతికి అందించాడు. బిడియంగా తలవంచుకుని "ఇవి నీ దగ్గరుంచు" అన్నాడు.
అప్పుడు రాలిపడింది ఏకాంత కళ్ళనుంచి ఓ నీటిబొట్టు.
తన అభిమానాన్ని వ్యక్తం చేయటానికి ఇంతకన్నా మరో దారి దొరకని కృష్ణ డబ్బులందించబోతుంటే మృదువుగా వారించింది. "వద్దు కృష్ణా... ఎవరి రుణాన్ని భరించే స్థితిలో లేని ఆడదాన్ని నేను... బ్రతుకుగానీ, చావుగానీ నాకు నేనుగా పేర్చుకోవాలి నిర్ణయించుకోవాలి"
"అక్కా" డబ్బులు తిరస్కరించిన దానికన్నా ఆ క్షణంలో మరేదో అడగాలన్న తొందరపాటు కనిపించింది కృష్ణ కళ్ళలో.
"నువ్వు ఎలాంటి అఘాయిత్యమూ చేసుకోవు కదూ!"
ఎంత ఆర్తి ఈ పిచ్చిపిల్లాడిలో..."అలాగే"
"కానీ నువ్విప్పుడు ఎక్కడికెళ్తావ్" మళ్ళీ ఇందాకటి ప్రశ్నే... "పోనీ ఓ పని చేయకూడదూ..."
"చెప్పు" చేసినా చేయకపోయినా వినడానికి ఆసక్తిని ప్రదర్శించింది.
"ఈరోజు ఇక్కడికి హోం మినిస్టర్ సూర్నారాయణగారొచ్చారు... రాజుగారి గెస్ట్ హౌస్ లో వున్నారు. జరిగిందంతా ఆయనకి చెబితే మంచిదేమో కదూ!"
అమాయకంగా అనేశాడు కృష్ణ దానివలన ఒరిగేదేమిటి అన్న ప్రశ్నకి అతడి దగ్గర జవాబు లేదు.
ఏకాంత సాలోచనగా చీకటిలోకి చూస్తూ వుండిపోయింది చాలాసేపటి దాకా... నిజమే... కృష్ణ అవివేకంగా అన్నట్టనిపించినా ఆలోచిస్తూంటే బ్రతుకు కురుక్షేత్రాన కర్తవ్యాన్ని గీతలా చెప్పిన కృష్ణుడిలా మంచి దిక్కునే సూచించా డనిపించింది.
అంతే...
మరో పది నిమిషాలలో ఏకాంత ఊరి పొలిమేరల్లో వున్న రాజుగారి గెస్ట్ హౌస్ ని చేరుకుంది.
* * *
నిశీధిలో ఆ భవంతి ఉరితీయబడ్డ న్యాయానికి కట్టిన సమాధిలా వుంది. అయినా అక్కడ సందడిగా వుంది.
పహరా కాస్తున్న పోలీసులు నాయకుడు తినగా మిగిలిన కళేబరాల్ని భోంచేసే రాబందుల్లా కనిపించారు.
అయినా ఏకాంత నిబ్బరంగా గెస్టు హౌస్ లో అడుగుపెట్టింది. లోనికి కబురు పెట్టించింది.