Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 15


    మొదటిరోజునే "మాష్టారూ! మీరేమేం సినిమాలు చూశారు?" అనడిగింది.

 

    ఫణీ సీరియస్ గా, తనకు చాలాకోపం వస్తున్నట్లు ఫోజు పెట్టాడు.

 

    నాగరాజకుమారి గలగలా నవ్వింది. "మీకు కోపం తెచ్చుకోవటం రాదు మాష్టారూ! ఏక్షన్ చెయ్యకండి" అంది.

 

    రోజూ ట్యూషన్ కి వెళ్ళి వస్తున్నాడు. శైలజ యూనివర్సిటీలో మాత్రం కలుస్తూనే వుంది. కానీ అది సరిపోవటంలేదు. ఏమిటో వెలితి, ఎందుకో బాధ, ఎవరో పొంచి పొంచి చూస్తూ, సానుభూతితో నిట్టూరుస్తున్నట్లు అనుభూతి. ఒంటరితనం మీద భ్రాంతి. మళ్ళీ భీతి. గదిలోవుంటే బయటకు వెళ్ళాలని వుండటం, బయటికెళితే గదికి రావాలని అనిపించటం, నిద్రలో హఠాత్తుగా మెలకువ రావటం, గుండెల్లో ఏదో బరువు. ఆమె కనిపిస్తే మరునాడు ఏమేమో చెప్పాలని అనిపించటం, తీరా కనిపించాక ఒక్కటీ గుర్తురాక ఏమీ చెప్పలేకపోవటం.

 

    "మాష్టారూ! అలా వున్నారేం?" అనడిగింది నాగరాజకుమారి ఒకరోజు.

 

    "ఎలా వున్నాను?"

 

    "చెప్పనా?"

 

    "చెప్పు మరి."

 

    "నిజం చెప్పేస్తాను."

 

    "ఊ!"

 

    "మీరెప్పుడూ ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు."

 

    అతనాశ్చర్యంగా చూశాడు.

 

    "అంతేకాదు. ఆ వ్యక్తి స్త్రీయే. మీ ఆలోచనల్లో చోటు చేసుకుంది కాబట్టి అందమైన అమ్మాయే అయివుంటుంది."

 

    అతను కళ్ళు పెద్దవి చేశాడు.

 

    "దగ్గరకు రావాలని వుంటుంది, రాలేరు."

 

    వింటుంటే ఆనందంగా వుంది.

 

    "బాధగా వుంటుంది, అంతలో సంతోషంగా వుంటుంది."

 

    ఇప్పుడు మాత్రం చిత్రంగా హాయిగా వుంది.

 

    "అకారణంగా దుఃఖం కలుగుతుంది."

 

    ఫణికి ఏడుపొస్తోంది.

 

    "కానీ ఒక్కోసారి గర్వంగా వుంటుంది. ఈ ప్రపంచాన్ని జయించానన్నంత గొప్పగా వుంటుంది."

 

    ఓహ్! భలే.

 

    "ఆమె లాకెట్లో దూరిపోవాలనీ, తల పిన్నుగా మారిపోవాలనీ, ఆమెను రకరకాల పేర్లతో పిలవాలనీ, నువ్వు నా దేవతవు అనాలనీ ఎన్నో ఊహలు వస్తుంటాయి. ఒంటరిగా కూర్చున్నప్పుడు అవన్నీ తలుచుకుని మీలో మీరు నవ్వుకుంటూ వుంటారు."

 

    అతను కళ్ళప్పగించి, చెవులప్పగించి వుండిపోయాడు.

 

    "మాష్టారూ! మీకింకా అర్థంకాలేదా?"

 

    అయోమయంగా చూశాడు.

 

    "మీరామెను ప్రేమిస్తున్నారు."

 

    ఉషారొచ్చింది, ఉత్సాహమొచ్చింది, వెయ్యి ఏనుగుల బలమొచ్చింది.

 

    మరునాడు యూనివర్సిటీలో శైలజను ఒంటరిగా కలుసుకున్నాడు.

 

    "శైలూ! నీకో మాట చెప్పాలి. అసలెప్పట్నుంచో చెబుదామనుకున్నాను. ఇవాళ చెప్పేస్తున్నాను. అదేమిటంటే.....నిన్ను నేను ప్రేమిస్తున్నాను."

 

    శైలజ ముఖంలో గగుర్పాటు. నవ్వు అంతరించింది. అయినా మామూలుగా వుండటానికి ప్రయత్నించింది.

 

    "ఎందుకని.......?"

 

    అతనికి కొద్దిగా కోపంవచ్చింది. కంగారుకూడా పుట్టింది. "ఎందుకంటే ప్రేమిస్తున్నాను కాబట్టి, అంతే!"

 

    "కాని......నేను ప్రేమించటంలేదు!"

 

    ఉలిక్కిపడ్డాడు. తట్టుకోలేకపోయాడు. "ఎందుకని?" అన్నాడు బిగ్గరగా.

 

    "ఎందుకంటే....." ఆమె ముఖం పాలిపోతున్నది.

 

    "నువ్వు నన్ను ప్రేమించటంలేదు కాబట్టి. అంతేనా?"

 

    "కాదు. ఇంకొకరి పెళ్లాంగా రాసిపెట్టి వున్నాను కాబట్టి" పొడిగా అనేసి శైలజ వడివడిగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది.  

 

                                             5

 

    ఒక్కొక్కరి జీవితాన్ని షాక్ నలగగొట్టేస్తుంది. ఒక్కొక్కరి జీవితాన్ని ముందుకు తీసుకెడుతుంది. ఫణి బాధపడ్డాడుగాని, భయపడలేదు.

 

    అతనికెందుకో శైలజ తన మనిషే అనిపించింది. ఆమెను తననుంచి ఎవరూ వేరుచెయ్యలేరనిపించింది. ఎమ్.ఎస్.సి. పూర్తయేదాకా ఆమెను ఎవరూ దూరం లాక్కుపోకుండా ఆపగలిగితే పి.హెచ్.డి. ప్రయత్నాన్ని విరమించి, ఉద్యోగం సంపాదించి, తన కాళ్ళమీద నిలబడి ఈ ప్రపంచాన్ని ఎదిరించయినా సరే ఆమెను తనదాన్ని చేసుకుంటాడు. అప్పటిదాకా ఆమెను కాపాడుకోవాలి.

 

    రాత్రుళ్ళు నిద్రపట్టక శైలజ గురించిన ఊహలతోనే విహరించేవాడు.

 

    "శైలూ! నువ్వెవరివి?"

 

    "నీ కలని."

 

    "శైలూ! నీవెవరివి?"

 

    "నీ ఒడిలో నిద్రపోయే చిన్నారి పాపని."

 

    "శైలూ! దగ్గరకు రావేం?"

 

    "దూరంలోనే తియ్యని బాధ, లేక బాధతోకూడిన ఆనందం వుంది కనుక.

 

    "శైలూ! ఎందుకురావు దగ్గరకు?"

 

    "వస్తే తిరిగిపోలేను గనుక."

 

    "శైలూ నువ్వెవరివి?"

 

    "నీ దేవతను."

 

    "నా...దేవతవి కాదు."

 

    "కానా! మరి?"

 

    "ప్రాణానివి."

 

    "ప్రపంచ చరిత్రలో దగ్గరగా వచ్చిన ఉదంతాలకన్నా ఎడమై, ఎడమెడమైన కథలే ఎక్కువగా వున్నాయి."

 

    "అది చరిత్ర, ఇది జీవితం."

 

    "నేటి జీవితం రేపటి చరిత్రే."

 

    "శైలూ! ఓ విషయం చెప్పనా?"

 Previous Page Next Page