కాబట్టి అరుంధతీ! చివరికి నేను ఒప్పుకున్నాను. ఈ ఆపరేషన్ కి నేను ఒప్పుకున్నాను. ఈ ఆపరేషన్ కి నేను ఒప్పుకున్నాను. అపత్నుంచీ ఇదంతా నీకు చెప్పాలని ప్రయత్నం . కానీ చెప్పలేకపోయాను. అదిగో ఆపరేషన్ కి టైము అయినట్లుంది. ......అందరూ నేను వీలునామా వ్రాస్తున్నాననుకొంటున్నారు. ఈ కాగితాలు నా ఆపరేషన్ జరిగిన వారంరోజుల తరువాత నీకు అందజేయబడ్తాయి. నేను అప్పటికి బతికి వుండొచ్చు. లేదా ఆపరేషన్ ఫెయిలయి మరణించవచ్చు. ఒక్కసారి డాక్టర్ విలియమ్ కి ఫోన్ చెయ్యి. వారంరోజుల తరువాత నువ్వు ఫోన్ చేస్తావని ఆయనకి చెప్పాను. ఆయన సాధించిన విజయాన్ని ప్రపంచానికి పది రోజుల అబ్జర్వేషన్ తరువాత తెలియబరుస్తానని ఆయన అన్నారు.
అరుంధతీ! భార్యగా కన్నా విధవగా బ్రతకటం ఈ ప్రపంచంలో కష్టం. నేను బ్రతికే వున్న పక్షంలో బొట్టు పెట్టుకోవటం మానెయ్యకు. నేను లేనుకదా అని మరీ బయట ఎక్కువగా తిరక్కు.
ఇట్లు,
నీ ప్రియమైన భర్త,
-రంగారావు."
* * *
చదవటం పూర్తిచేసి అరుంధతి కుర్చీలో చాలాసేపు అలానే కూర్చుండి పోయింది. ఆమె భావాల్ని వర్ణించటం కష్టం. భర్త ఉత్తరం ఆమెని అనూహ్యమైన పరిస్తితుల్లోకి తీసుకుని వెళ్ళింది. కదిలింది వేసింది. అసలు యిదంతా నిజమేననీ కల కాదనీ నమ్మతానికే చాలాసేపు పట్టింది.
ఇంకా వూగుతున్న ఈ కుర్చీలో తన భర్త కూర్చొని, ఉత్తరం చదివిన తరువాతి తన భావాల కోసం చూస్తున్నాడన్న భావం ఆమెలో కలిగింది. ఆమె లేచి వంటింటిలోకి వెళ్ళి ఒక వక్కపలుకు నోటిలో వేసుకుంది. ఆమెకు వక్కపొడి అలవాటు. అతడికి అది ఇష్టంలేదు. బతికున్న రోజుల్లో కనీసం చూసీ చూడనట్టు కూడా వూరుకునేవాడు కాదు. వెచ్చాల లిస్టులోంచి వక్కపోడిని నిర్ధాక్షిణ్యంగా తొలగించేవాడు.
"మీరిలా స్నేహితుల్తో తిరుగుతూ, పేకాడుతూ, సిగరెట్లు కాలిస్తే తప్పులేదుకానీ నేను కాస్త వక్కపలుకు నోటిలో వేసుకుంటే తప్పొచ్చిందా" అని ఒకసారి అంది.ఉక్రోషంతో. ఫలితంగా చెంప పగలగొట్టలేదు కానీ, పదిరోజులు మాట్లాడటం మానేశాడు. తనే రాజీకి వెళ్ళి క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది.
రంగారావులో వున్న గొప్పతనమే అది. పైకి ఎవరు చూసినా అతడే మంచివాడిలా కనబడేలా పరిస్థితిని చిత్రీకరించేవాడు. అందులో గొప్ప ఆర్టు వుంది. సున్నితమైన రంపంతో, చిరుహాస్యంతో నాజుగ్గా కోయటం అతనికి బాగా తెలుసు. వ్యంగ్యంగా మాట్లాడటం, హేళన చేయటం- బయటవారికి మాత్రం గొప్ప మాటకారిగా కనిపించటం!!!
భర్త తాలూకు ఆలోచన్ల నుంచి తెప్పరిల్లి, ఉత్తరాన్ని జాగ్రత్తగా దాచి, తలుపు తాళం వేసి ఆమె పోస్టాఫీసుకు వచ్చింది. అక్కణ్ణుంచి డాక్టరు విలియమ్స్ కి ఫోన్ చేసింది.
* * *
ఇంకా మూడు రోజుల్లో ప్రిలిమినరీ అబ్జర్వేషన్ పూర్తయిపోతూంది. ఈ వార్తని బయటికి చెయ్యవచ్చు. అందరూ రంగారావు చచ్చిపోయాడని అనుకుంటున్నారు. అతడి మెదడు బ్రతికే వుందని తెలిస్తే ప్రపంచ సైన్సు చరిత్రలోనే అది అపూర్వ ప్రయోగం అవుతుంది. గొప్ప గొప్ప వాళ్ళ మెదళ్ళు అన్నీ ఇక ఇలా బీకర్లలో భద్రపరచవచ్చు.
విలియమ్స్ సంతోషంగా వున్నాడు. అంతలో నర్సు వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పింది. వెళ్లి అందుకున్నాడు.
"నేనూ అరుంధతిని......మిసెస్ రంగారావు......"
"తెలుసు-తెలుసు- మిసెస్ రంగారావు! మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా వుంది."
"ఆపరేషనూ?"
"అంతా చాలా గొప్పగా వచ్చింది మిసెస్ రంగారావు! మేము అనుకున్న దానికన్నా బాగా విజయవంతమైంది"
ఆమె మాట్లాడలేదు.
"మీ రొకసారి వస్తారా? వస్తే చూడొచ్చు" డాక్టర్ విలియమ్స్ కంఠంలో చిన్నపిల్లాడు విజయం సాధించిణ ఎక్సైట్ మెంటు వుంది. "అంతేకాదు అరుంధతిగారూ! మేం అనుకున్నదానికన్నా తొందరగా మత్తులోంచి ఆ మెదడు బయటకొచ్చి ఆలోచనా తరంగాల్ని వెదజల్లటాన్ని ఎలక్ట్రో ఎన్ సిఫలో గ్రాఫ్ పట్టుకుంది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, కన్ను చూస్తూంది. నిజం అరుంధతిగారూ! కన్ను చూస్తూంది. ఈ రోజు 'ఆంధ్రప్రభ' డైలీ దానిముందు పెడ్తే వెంటనే ఎన్ సిఫలో గ్రాఫ్ లో తరంగాలు ఉధృత మయ్యాయి."
"ఆయనకి న్యూస్ కన్నా కథలు ఇష్టం డాక్టరుగారూ! ఆ డైలీవద్దు. 'ఈనాడు' పెట్టండి."
"'దాన్ని' కాదు- డాక్టరుగారూ. 'ఆయన్ని' అనండి, ఆయన్ని!"
"అవును, ఆయన్ని. ఐయామ్ సారీ. మీరు రండి, అచ్చు ఆయన్ని చూసినట్టే ఉంది. కొంచెంసేపు సంభాషణ జరపవచ్చుకూడా. నేను చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే- మీరు పక్కనుంచేనే ఆయనకి కొండంత తృప్తి."
"నేను వస్తున్నాను" అని ఫోన్ పెట్టేసింది ఆమె.
డాక్టర్ విలియమ్స్ ఆస్పత్రి పార్క్ అవెన్యూలో వుంది. ఆమె అక్కడికి చేరుకునేసరికి అరగంట పట్టింది. ఆస్పత్రి నిర్మానుష్యంగా వుంది. విలియమ్స్ ఒక్కడే వున్నాడు. ఆమెను సాదరంగా ఆహ్వానిస్తూ "రండి, రండి అరుంధథి గారూ" అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.
"లోపలి దృశ్యం చూసి మీరు కంగారు పడకండి. ఇందులో భయపడవలసిన అవసరం ఏమీలేదు. చూడగానే షాక్ తగిలినట్టు వుంటుంది కానీ తమాయించుకోండి."
'బతికున్నప్పటి ఆయన చూపుకన్నా భయంగా ఉండదు లెండి' మనసులో అనుకుంది. ఇద్దరూ వరండాలోంచి ఒక ఎయిర్ కండీషన్డ్ రూమ్ లోకి ప్రవేశించారు. అక్కడ కాంతి తక్కువగా ఉంది. అయినా లోపల వస్తువులన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఆమె అడుగు ముందుకేసి అక్కడే ఆగిపోయింది.
గది మధ్య తెల్లటి పెయింట్ వేసిన పెద్ద ఆరు అడుగుల టేబిల్ మీద బేసిన్ వుంది. ఆ బేసిన్ నుండి కొన్నివైర్లు కిందికి వచ్చి, ఒక మిషన్ కి అమర్చబడి వున్నాయి. చిన్న చప్పుడుతో మిషను తన పని తాను చేసుకుంటూ పోతూంది. బేసిన్ కి అడుగు ఎత్తులో ఒక స్టీల్ స్టాండ్ వుంది. సెలైన్ ఎక్కించే స్టాండులా వుందది. దానికో క్లిప్పు వుంది. టేబిల్ పక్కనే డైలీ న్యూస్ పేపరు పడివుంది. గదిలో ఏదో కెమికల్ వాసన వస్తూంది.
"మీరు వచ్చారని ఆయనకి ఇంకా తెలీదు" అన్నాడు డాక్టరు ముందుకు నడుస్తూ. "మీరు ఆ బేసిన్ దగ్గరకి వెళ్లి దానిపైన తల నిటారుగా పెట్టి కిందికి చూస్తే కానీ మీరు వచ్చారని తెలీదు. ఆయనకి వినిపించదు. కనుగుడ్డు కూడా కదలదు. ఆ కన్నుకి కనబడే ప్రదేశానికి మనమే వెళ్ళాలి. కన్ను మాత్రం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. జాగ్రత్తగా ముందుకురండి. ఆఁ అలా. అదీ. ఇదిగో - ఈ స్టూలు ఎక్కండి అరుంధతి గారూ!"
అరుంధతి అడుగు స్టూలు పైకివేసి, మెడవంచి నిటారుగా క్రిందికి చూసింది.
బేసిన్ లో వున్న ద్రవం మధ్యలో చిన్న భరణిలో భర్త నీళ్ళలో వెల్లకిలా పడుకుని అదొక్కటే బయట పెట్టినటు ఆ కన్ను! కోడిగుడ్డు ఆకారంలో ద్రవంలో తేలుతూ వుంది.
"కనబడుతూందా అరుంధతిగారూ?"
ఆమె మాట్లాడకుండా, తలూపింది.
డాక్టరు చెప్పసాగాడు. "చాలా పెర్ ఫెక్టు కండిషన్ లో వుంది అది .ఆ కన్నుకి చిన్న కాంటాక్టు లెన్సు అమర్చాం. ఆయన బ్రతికున్నప్పుడు వాడే కళ్ళజోడు పవర్ ఎంతో, అంతే పవరున్నది. లేకపోతే చదివేటప్పుడు తలనొప్పి.....ఐమీన్ మెదడు నొప్పి..... వస్తే కష్టం కదా! ఇప్పుడు ఆయన ఏ విధమైన కష్టమా లేకుండా చూడగలుగుతున్నాడు."
"కానీ ఇంటి కప్పులో చూడటానికి ఏముంటుంది, డాక్టర్ గారూ?" సాలోచనగా అన్నది.
డాక్టరు ఖంగు తిన్నాడు. ఆ మెదళ్ళ డాక్టరుకి ఈ స్త్రీ హృదయంలో ఏముందో అంతుపట్టలేదు. "అరుంధతిగారూ, ఆయన్ని సంతోషంగా ఉంచటం కోసం మేము చెయ్యవలసిన పనంతా చేస్తున్నాం. ఇంటి కప్పుకి కలర్ టీ.వి. స్క్రీను కూడా అమర్చే ఏర్పాటు జరుగుతూంది, ఇదిగో....మీ తల ఇలా పెట్టండి.....ఆ కన్నుకి ఎదరుగా ఆ.... అదీ, ఆయన ఇప్పుడు మిమ్మల్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు."
"ఏమండీ! నేనూ..... అరుంధతిని" అంది ఆమె.
కన్నార్పకుండా చూస్తూంది రంగారావు కన్ను. ఎన్ సిఫలో గ్రాఫ్ లో తరంగాల కదలికని బట్టి భార్యని గుర్తుపట్టాడని అర్థమావుతూంది. ఏమనుకుంటున్నాడు ఈయన? 'బాగున్నావా, అరుంధతీ' అని అడుగుతున్నాడా?
"బాగున్నానండీ" అంది. "మీరు బాగున్నారా?"
"మీరు మాట్లాడక్కర్లేదు, అరంధతిగారూ! ఆయనకి వినబడదు. కేవలం సైగ చెయ్యాలంతే."
ఆమె పరిశీలనగా చూసింది. కనుగుడ్డు వెనుకనుంచి ఆప్టిక్ నర్వ్ కిందికి దిగి, నల్లటి పదార్ధంలోకి, తనని రాచి రంపాన పెట్టిందీ అయిన ఆ మెదడు ద్రవంలో నిబిడీకృతమై వుంది. పంచదార పాకంలో గులాబ్ జామ్ లా వుంది. ఆమె తన హండ్ బాగ్ లోంచి ఉత్తరం తీసి, అతడు వ్రాసిందంతా తాను చదివినట్లు సైగ చేసింది. అతడి కన్నుల్లో ఆనందం కనబడింది. ఇప్పుడు ఆమెకి ఆ వాతావరణం బాగా అలవాటయింది. ఎన్ సి ఫలో గ్రాఫ్ లేకుండానే భర్త కన్నుల్లో భావాన్ని అర్థం చేసుకోగలుగుతూంది. స్నేహితులతో పేకాడుతున్నప్పుడు తలుపు చాటున నిలబడితే అతడి కళ్ళలో కనబడే కోపాన్ని కేవలం తను మాత్రమె అర్థం చేసుకోగలదు.
"డాక్టర్" అందామె. "ఆయన్ని చూస్తుంటే నాలో ఒక్క సారిగా ఆప్యాయతా ప్రేమా పుట్టుకొస్తున్నాయి.
"నేను అర్థం చేసుకోగలను".
"నిస్సహాయంగా అలా నీళ్ల మధ్యలో-"
"అవును. ఆ కోణంలో ఆలోచిస్తే చాలా దయనీయమైన స్థితి"
"ఒక చిన్నపిల్లాడిలా అగుపిస్తున్నాడు."
"అవును. చిన్నపిల్లాడిలా."
"భార్యగా ఆయన్ని సాకటం నా విధి. అనుక్షణమూ ఆయన్ని కనిపెట్టుకుని వుండటం నా కర్తవ్యం. ఆయనకి కావల్సినవన్నీ ఎప్పటికప్పుడు అమర్చటం నా బాధ్యత."
"చాలా బాగా అన్నారు అరుంధతిగారూ!"
"మరి నేను ఆయన్ని ఎప్పుడు ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చు డాక్టరు గారూ?"
డాక్టరు ఉలిక్కిపడి, "ఏమిటి మీరుఅంటున్నది?" అని అడిగాడు. తను వింటున్నది అబద్దమేమో అనుకొని.