"చావు నిర్ధారణ కాగానే మెదడు చెడిపోకముందే నీ మెడవెనుక భాగాన్ని అరటి బోదెని చీల్చినట్టు చీల్చి ఆ ఆరు నాళాల్నిబైటికి లాగాలి. వాటిని తెగ్గొట్టి కొసల్లోకి సూదుల్ని గుచ్చి- మిషనుకి జత చెయ్యాలి. తరువాత మిషన్ ని 'ఆన్' చెయ్యాలి. అంతే, మెదడు పనిచెయ్యటం ప్రారంభిస్తుంది."
"అప్పుడు మీరు చెప్పిన ఆ రష్యన్ కుక్కలాగా నాలుక అల్లల్లాడిస్తానన్న మాట!" అన్నాను అతడు నా మాటలు పట్టించుకోకుండా "నీకు మెలకువ రాదు వస్తే మాత్రం శరీరం చచ్చిపోయి నల్లగా వుంటుంది. మెదడు మాత్రం పనిచేస్తూ వుంటుంది. కొంచెం స్థిమిత పడ్డాక మెదడుని జాగ్రత్తగా బైటికి తీసి, శాశ్వతంగా మిషనుని అమర్చాలి."
"పట్టుచీరె అరువిచ్చి పీట పట్టుకెళ్ళినట్టూ నే నెక్కడికి వెళ్ళినా ఆ మిషనుని వెంట తీసికెళ్ళాలి అన్నమాట" అన్నాను కసిగా.
విలియమ్స్ ఇబ్బందిగా చూసి" ఆఁ! అదే అనుకో. ఇంకోలా చెప్పాలంటే నిన్నే ఆ మిషను తీసుకెళ్తుంది. ఎంత అద్భుతంగా వుంటుందో ఆ అనుభవం- చక్రాలమీద హాయిగా ప్రయాణం చెయ్యటం" అంటూ వూరించాడు.
"మీ మెదడు కాదు కాబట్టి హాయిగానే వుంటుంది. ఇక చెప్పకండి" అన్నాను విసుగ్గా.
"అలా విసుక్కోకు రంగారావ్! ఆలోచించు. ఒక్కసారి శరీరం అంటూ లేకపోతే ఎంత హాయిగా వుంటుందో ఆలోచించు. ఆకలుండదు, దాహముండదు. ముఖ్యంగా దురదలుండవు. ఫేస్ పౌడర్ అక్కరలేదు."
నేను కన్నార్పకుండా అతడివైపు చూశాను. అతడు నాలో కొద్దిగా మార్పుని గమనించినట్టున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో చెప్పడం కొనసాగించాడు.
"తరువాతి సమస్య నీ మెదడుని అక్కణ్ణుంచి బైటికి తీయటం చాలా జాగ్రత్తగా, ఏ పార్టూ చెడకుండా తియ్యాలి. మొహమూ, కపాలం చెవులూ- ఇవన్నీ అనవసరం. మనక్కావల్సిందల్లా క్లీన్ గా, అందంగా వుండే మెదడు మాత్రమే. ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా వుండవచ్చు. ఇప్పటికి అలాటివి లక్ష ఆపరేషన్లు చేసేను. అదీ బ్రతికున్న మనుష్యుల మీద. నీకైతే అసలు అనిస్తీషియా (మత్తుమందు) కూడా ఇవ్వక్కరలేదు"
తల అడ్డంగా వూపుతూ, "మత్తు మందు ఇవ్వకపోతే నొప్పి భరించలేను" అన్నాను.
"కానీ నువ్వు అప్పటికే మరనించావన్న విషయాన్ని మర్చిపోతున్నావ్ రంగారావ్!"
"కానీ నా మెదడు బ్రతికే వుంటుంది, డాక్టర్ విలియమ్స్!" అన్నాను కటువుగా. "మీరు కాదుకదా- దేవుడుకూడా మత్తుమందు ఇవ్వకుండా నా కాపాలాన్ని బ్రద్ధలు కొట్టడానికి ఒప్పుకోను నేను."
"ఒకే ఒకే...." అన్నాడు డాక్టర్ తన తప్పుని ఒప్పుకున్నాన్నట్టూ. "నీకు కొద్దిగా ప్రోకైన్ మెడనుంచి పైభాగమంతా, ఇస్తానులే! సరేనా. కానీ నువ్వు అనవసరంగా భయపడుతుంటావ్. మొన్న ఆస్పత్రిలో నేను ఇలాగే మెదడు ఆపరేషన్ చేస్తూ వుండగా అనస్తీష్టు పొరపాటువల్ల రోగికి మధ్యలోనే మెలకువ వచ్చేసింది. 'ఇంకా ఆపరేషను పూర్తికాలేదా, డాక్టరుగారూ' అని అడిగాడు తెలుసా?"
"ఏ ఆస్పత్రి?" అనుమానంగా అడిగాను.
"కె.జి. హెచ్."
"అలా చెప్పండి. ఆ ఆస్పత్రి అనగానే చేరేముందు ప్రాణాలమీద ఆశ వదిలేసుకుని వుంటాడు. అందుకే నొప్పి అంతగా తెలిసివుండదు. నా సంగతి అలాకాదు. నాకు ప్రాణం మీద చాలా ఆశ వుంది. ఐ మీన్- నా మెదడు ప్రాణాలమీద" అన్నాను.
"సర్లే, సర్లే, ఇస్తానన్నానుగా" అని ఆగాడు విలియమ్స్. "తరువాత రంపం పెట్టి పై స్కల్ ని జాగ్రత్తగా కోసేస్తాను. అప్పుడు మెదడు పై భాగం కనబడుతుంది. మొత్తం మూడు కవర్లు వుంటాయి- డ్యూరా తేలుతూ వుంటుందనుకొంటారు. తప్పు- నిజానికి సెరిబ్రోస్పైనల్ ప్లూయిడ్ ఈ రెండు కవర్ల మధ్యా వుంటుంది. మెదడే ఈ ద్రవాన్ని తయారుచేసుకుంటుంది. నా ఆపరేషన్ లో అసలు ఈ మూడు కవర్లనీ ముట్టుకునే ప్రసక్తిలేదు. కాబట్టి సమస్యలేదు. తరువాత స్టేజి అన్నిటికన్నా కష్టమైనది. బత్తాయిపండు పై తొక్క ఒలిచినట్టూ మెడచుట్టూ వున్న అనవసరమైన వాటినన్నీ తొలగించి దాన్ని బయటకు తియ్యాలి. సబర్కనాయిడ్ కి ఏ మాత్రం దెబ్బ తగలకూడదు. నీ స్కల్ కీ, నా స్కిల్ కీ పెద్ద పరీక్ష. స్కల్ నుంచి మెదడు బయటపడ్డ తరువాత ఇంకొకటి మాత్రం డానికి అంటుకుని వుంటుంది. అదేమిటో చెప్పగలవా రంగారావ్!"
"ఊహూఁ....... చెప్పలేను."
"వెన్నెముక రంగారావ్, వెన్నెముక! ఇది వేరుచేయటమే ఇక మిగిలింది. ముందు డ్యూరాని మూసేసి కుట్టేయ్యాలి. తరువాత ఫస్ట్ సెర్వికల్ వెర్టిబ్రా పైన వెన్నెముకని కత్తిరించాలి. దాంతో నీ చచ్చిన శరీరంనుంచి బ్రతికివున్న మెదడు వేరవుతుంది. నీ ఆపరేషన్ ప్రక్కనే ఒక బేసిన్ లాటిది అమర్చి వుంచుతాను. మేము మెదడు ఆపరేషన్ కి వాడే "రింగర్స్ సొల్యూషన్" అనే ద్రవం బేసిన్ లో ముందే పోసి వుంచుతాను. ఆపరేషన్ పూర్తవగానే మీ పురాణాల్లో ఎవరో రాక్షసుడు తన తలని కత్తిరించుకొని హొమంలో పడేసినట్టూ నీ మెదడుని తీసి ఆ ద్రవంలోకి జార్చేస్తాను.
"అంటే, రంగారావ్! ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాలపాటూ..... వందలు ఏమిటి- మిషను అలా పనిచేస్తూనే వుంటే కొన్నివేల సంవత్సరాల పాటూ నీ మెదడు పని చేస్తూనే వుంటుంది. సర్ ఐజాక్ న్యూటన్, యూరీ గగారిన్ ళ లాగే నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. జనం తండోపతండాలుగా నిన్ను చూడటానికి వస్తారు."
"నేను మాత్రం తినలేక, చూడలేక, వినలేక లా టేబుల్ మీద వాష్ బేసిన్ లో షోకేసులో బొమ్మలా వుండిపోతాను" అన్నాను కసిగా.
"సారీ, నా కొచ్చిన ఇంకో ఆలోచన చెప్పటం మరచిపోయాను రంగారావ్" అన్నాడు. "మనం కావాలనుకుంటే ఒక కన్నుని ఉంచెయ్యచ్చు. మెదడునీ కన్నునీ కలిపే ఆస్టిక్ నరాన్ని అలా వుంచేస్తే సరి. నిజానికి అది నరం కాదు చిన్న చీపురు పుల్లలా, మెదడు తానంతటతానే ముందుకు సాగి కన్నుని చేరుకుంటూంది. దాన్ని కత్తిరించటం అనవసరం కూడా. పోతే ప్లాస్టిక్ భరిణలాటిది చేయించి నీ కన్నుని అందులో అమర్చాలి. ఆ భరిణ రింగర్స్ సొల్యూషన్ లో తేలుతూ వుంటుందన్న మాట."
ఇంటి పైకప్పుకేసి తదేకంగా చూస్తూ..... "ఒకలా చెప్పాలంటే అంతే! ఎందుకంటే కనుగుడ్డు కదల్చటానికి కండరాలు వుండవుగా!" అన్నాడు.
"ఒక చెవి కూడా వుంచేస్తే ఎలా వుంటుంది?" అడిగాను.
"సారీ రంగారావ్!మొదటి ప్రయోగంలోనే అన్నీ చెయ్యలేం."
"ఊహుఁ నాకు చేవికూడా కావాలి. మనవాళ్ళు ఈసారి ఎలా ఓడిపోతారో క్రికెట్ కామెంటరీ వినాలి" అన్నాను మొండిగా.
విలియమ్స్ నచ్చచేబుతూన్నట్టూ అన్నాడు. "కన్ను కన్నా చెవిలో పార్టులు సున్నితమైనవి రంగారావ్! చెవిలో ముఖ్యంగా 'కోక్లియా; అని వుంటుంది. దాన్ని అమర్చడం కష్టం. అదీగాక చెవి అనేసరికి ఎముకల ప్రసక్తి వస్తుంది. నీ కంతగా కావాలంటే దూరదర్శన్ ఏర్పాటు చేద్దాం."
"పాలూ చేలూ కార్యక్రమం చూపించననే షరతు మీద....."
వెంటనే దానికీ ఒప్పుకున్నాడు డాక్టర్.
"దూరదర్శన్ అనేసరికి నాకు భయంగా వుంది. అందులో అనౌన్సర్ ని చూస్తూ వుండగా నాకు పిచ్చెక్కే ప్రమాదం కూడా వుంది."
"ఆమ్మో! అది మాత్రం జరక్కూడదు. నీ మెదడు మాకు చాలా విలువైంది".
"కాబట్టి నేను మీకు ఏదైనా చెప్పాలనుకుంటే ఎలా?" అని లీగల్ పాయింటు లేవదీశాను.
"దాని గురించి ఆలోచించే వుంచాను" అన్నాడు డాక్టరు. "నీ మెదడుకి ఎలక్ట్రో ఎన్ సిఫిలో గ్రాఫ్ తగిలించి, నీ మెదడు పనిచేస్తూ వుందా, బతికి వుందా అన్న విషయం తెలుసు కుంటాం. లండన్ లో ఒక ప్రొఫెసర్ 'థాట్ రీడింగ్' రీసెర్చి చేశాడు. ఆలోచనా తరంగాల్ని మెదడు ఎలక్ట్రికల్ గా వెలువరిస్తుందని అతడు కనుకున్నాడు. ఆ థియరీమీద కనుక్కోబడ్డ మరో ఈ.ఈ.జే. నీ మనోభావాన్ని మాకు తెలియపరుస్తుంది. నీ ఆపరేషన్ రోజు నాటికి అతడిని రమ్మంటాను."
"నేను అన్నీ ఒప్పేసుకున్నట్టూ అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి" కటువుగా అన్నాను.
డాక్టరు మాట్లాడలేదు. అతడిని చూస్తే జాలేసింది.
"ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. బేసిన్ లో వున్న నాకు పూర్వపు జ్ఞాపకాలు అన్నీ వుంటాయా?"
"వుంటాయి రంగారావ్! ఆఫ్ట్రాల్ - అది ఒకప్పటి నీ మెదడేగా!"
"మరి ఆ కోర్కెలు తీరటం?"
"కోర్కెలా? కోర్కలు, భయాలు, బాధలూ- అలాంటివి ఏమీ వుండవు. హిమాలయా పర్వతాల్లో తపస్సు చేసుకునే బుశుల్లా ఈ బుద్భుద ప్రాయమైన మనుష్యుల్నీ, వారి చేష్టల్నీ ఒక బేసిన్ లో కూర్చొని నువ్వు వేదాంతిలాగా గమనిస్తూ వుంటావు."
ఆ విషయం నిజమే అయ్యుండవచ్చు. ఒక పత్రికనిర్వహించిన సాహిత్య పోటీలో ఈ తరపు ఉత్తమ రచయిత (త్రి) బహుమతి ఎవరికివ్వాలా అని సమకాలీన సాహిత్యం అంతా చదివీ నా ఐహిక వాంఛలు నశించిన మాట నిజమే!
నేను బతికుండి చేసేదేముంది? ఒక మంచి పనికోసం మరణిస్తాను.
"డాక్టర్! ఆఖరి ప్రశ్న."
నా నిర్ణయం బహుశా అతడికి నా మొహంలో కనబడివుండవచ్చు. ఆనందంగా నావైపు చేసి "ఏమిటి?" అని అడిగాడు.
"నేను ఎంతకాలం అలా వుండవచ్చు - ఐ మీన్ బతికి....."
"చెప్పలేం. కొన్ని వందల సంవత్సరాలు...... లేదా రోజులు. వైరస్, బాక్టీరియా - ఏమీ వుండవు కాబట్టి. శుభ్రమైన రక్తం ప్రవహిస్తూ వుంటుంది కాబట్టి కనీసం రెండు వందల సంవత్సరాలయినా బతికి వుంటావని ఆశిస్తున్నాను."
"రెండు వందల సంవత్సరాలు! నా తరువాత నాలుగు తరాల్ని చూడవచ్చునన్నమాట."
నిశ్శబ్దాన్ని చెదురుస్తూ "నేను వెళ్ళొస్తాను రంగారావ్! ఆలోచించుకో. రేపు మళ్ళీ వస్తాను" అని డాక్టరు వెళ్ళిపోయాడు.
రేపు!
అంటే ఇరవై నాలుగ్గంటలు.
ఆ ఇరవై నాలుగ్గంటలూ నేను తీవ్రంగా ఆలోచించాను. నీటిమధ్య ఫౌంటెన్ లా తేలుతూ ఆ రింగర్స్ ద్రవంలో రెండువందల సంవత్సరాలు వుండాలన్న ఆలోచన నాకు ఇబ్బంది కరంగా వుంది. ఒకవేళ ఆ తరువాత చావాలనుకున్నా ఆ విషయం డాక్టర్ లకి చెప్పటం కష్టం. దురద పెట్టకూడదన్న నమ్మకం ఏమిటి? మెదడు దురద పెట్టకూడదన్న రూలేం లేదే. అంతేగాక నా దగ్గర ఎవరూ లేనప్పుడు ఒక ప్రమాదం జరగొచ్చు. అసలే నేను నాలుగు తరాలపాటూ బతుకుతానాయె! ఈ సంవత్సరపు సాహిత్య అకాడెమీ అవార్డు తనకి ఇవ్వలేదని ఏ రచయి (త) త్రి అయినా వచ్చే జన్మలో దోమగా పుట్టి నా కన్నుమీదవాలటం ప్రారంభించి నన్ను ఏడిపిస్తే ఎలా దాన్ని తోలుకోవటం!
అన్నీ సమస్యలే!
కానీ అంతలోనే ఆలోచన సరళి మారిపోయింది. ఎడాపెడా యవ్వనంలో విప్లవ కవిత్వం వ్రాసేసి, ఒక్కసారి హార్ట్ ఎటాక్ రాగానే దేవుణ్ణి నమ్మటం మొదలు పెట్టినట్టూ, ఈసారి పాజిటివ్ సైడు ఆలోచించటం మొదలుపెట్టాను.
ఒక్కసారిగా ఆలోచించటం మొదలుపెట్టగానే చరిత్ర పుస్తకంలో సువర్ణాక్షరాల్తో నా పేరూ కళ్లకి కట్టినట్లు కదలాడింది.