Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 15


    యూనివర్శిటీ పరీక్షలుదెయ్యంలా సమీపిస్తున్నాయి. అసలే మెడికల్ కాలేజి విద్యార్థులు మిగతా వ్యాపకాలన్నీ పెట్టుకోకుండా ఎడ్లలా పనిచేస్తారు. ఈ పరీక్షల సమయంలో వాళ్లు పడే శ్రమ, చెందే కంగారూ హృదయ విదారకంగా వుంటుంది. అటు ప్రొఫెసర్లు గుక్కతిప్పుకొనియ్యకుండా పని చేయిస్తూ కావలసినన్ని అక్షింతలు వేస్తూ వుంటారు. ఓ మాదిరి స్వతంత్ర భావాలున్నవాడు ఈ వాతావరణం భరించటం కష్టం. "ఇందులోకి ఎందుకు వచ్చానురా భగవంతుడా" అని మధుబాబు విచారించని క్షణాలు లేకపోలేదు. అతనేమిటి? ఇలా ప్రతి మెడికల్ స్టూడెంటూ ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటూనే వుంటాడు.
   
    ఈసారి ఏకాగ్రత కుదరటం కష్టంగా వుంది. కథల సంపుటి వెలువడటం, నవల, ఆ ప్రచారం, పేరు, ఉత్తరాలు అనుభూతి మనసుని చక్కలిగింతలు పెట్టగా తరచు వాటిని గురించిన తియ్యని తలంపులే రాసాగినై. ఒకవైపునుంచి పరీక్షల భయం అధికమైపోతోంది. ఎట్లాగయినా ప్యాసయితీరాలన్న పట్టుదల హెచ్చసాగింది. ప్రక్క విద్యార్థుల్ని చూస్తుంటే ఎక్కడలేని ఉద్రేకం వస్తోంది. రాత్రింబవళ్ళు బల్లముందునుంచి లేవకుండా చదివేయసాగాడు. అసలే మనిషి దుర్భలుడు, ఈ మనసికాందోళన,శ్రమ అతడ్ని మరింత బలహీనుడ్ని చేయసాగినై. ఆరోగ్యం పాడుకాసాగింది. వేళకు భోజనం వుండేదికాదు. అసలు ఏమన్నా తిందామన్నా సహించేదికాదు. కాఫీలు తెగ త్రాగుతూండే వాడు. రాత్రిళ్ళు నిద్రవస్తోంటే అరికట్టటానికి టాబ్లెట్స్ తెచ్చి వేసుకునేవాడు. ముఖంలో కాంతి  హరించిపోసాగింది. కర్తవ్యపాలనలో మనసుమటుకు ఉజ్వలంగా ప్రకాశిస్తూ వుండేది.

    చివరకు పరీక్షరోజు రానేవచ్చింది. ఆ వేళ ఎనాటమీ పేపర్. అంతకు ముందు రెండురోజులు కన్ను మూయకుండా చదివాడు. ఆ రోజు కూడా చేతిలో పుస్తకం పెట్టుకుని గదిలో అటూయిటూ తిరుగుతూ తెల్లవార్లూ చదువుతూనే వున్నాడు. ఏడుగంటలకల్లా  కాఫీత్రాగి, స్నానంచేసి కాలేజీకి వెళ్ళాడు.

    పేపర్లు ఇచ్చారు. గబగబ కొట్టుకుంటూన్న గుండెతో మధుబాబు అందుకున్నాడు. అతనికళ్ళు ఆనందంతో మిలమిల మెరిశాయి. అన్నీ  తెలిసిన ప్రశ్నలే. అతను తలవంచుకుని రాయటానికి ఉపక్రమించాడు.

    అయిదు నిమిషాలు గడిచాయి.

    ఎందుకో చేతులు వణుకుతున్నాయి. తన అక్షరాలు తనకే కనబడటంలేదు. అతనికర్థంకాలేదు. అయోమయంగా వుంది. ఓ నిముషం వూరుకుని నిర్లక్ష్యంగా వుండటానికి మళ్ళీ ప్రయత్నించాడు. కాని వణుకు ఇంకా ఎక్కువవు తోంది. కడుపులో, గుండెల్లో ఏదో మంట. కళ్ళు చీకట్లు క్రమ్ముతున్నాయి. తల్లో ఏమిటో గిర్రున తిరుగుతున్నట్లుగా వుంది. కళ్ళుమూసుకుని "ఏమిటిది భగవాన్" అనుకున్నాడు. ఇలా ఎప్పుడూ లేదు. ఎన్నడూ లేదు. కళ్ళు తెరిచాడు. లాభంలేదు. బలవంతంగా మూసుకుపోతున్నాయి. వాచర్ ని పిలిచి పరిస్థితి చెబుదామనుకున్నాడు. శక్తినంతా కూడదీసుకుని లేచి నిల్చోబోయాడు. అంతే, స్పృహతప్పి క్రిందపడిపోయాడు.

    తెలివి వచ్చేసరికి తనగదిలో వున్నాడు. ప్రక్కన కాలేజీలో పనిచేసే డాక్టరు ఒకరూ, ఇద్దరు ఎటెండర్ లూ వున్నాడు.

    "నాకేం జరిగింది?" అన్నాడు మధుబాబు నీరసంగా.

    "ఏమీలేదు. అంత యెక్కువగా యెందుకు చదవాలి? ఎగ్జామినేషన్ హాల్లో ఫెయింట్ అయి పడిపోయావు" అన్నాడు డాక్టర్.

    "అరె ఆఁ! నా ఎగ్జామినేషన్. ఇప్పుడు వెళ్లి రాస్తాను."

    డాక్టర్ "ఇంకేమిటి? ఓ అరగంటలో టైం అయిపోతుంది. బాగా రెస్టుతీసుకో. జరిగిపోయినదానికి విచారించకు. అయిందేదో అయిపోయింది. ఎట్లా వుంటుంది వంట్లో?" అన్నాడు.

    మధుబాబు హతాశుడై "నెలల తరబడి పడిన శ్రమంతా బూడిదపాలై పోయింది" అని గొణుక్కున్నాడు. అతనికి ఏడుపు వచ్చింది.

    "ఎట్లా వుంది?"

    "చాలా బాగుంది..... చాలా బాగుంది."

    ఎటెండర్ తో కాఫీ తెప్పించుకుని తాగమనీ, సాయంత్రం వస్తానని చెప్పి డాక్టర్ వెళ్లిపోయాడు. మధుబాబు మంచానికి అంటుకుని వుండిపోయాడు యెంత శ్రమ, యంత శ్రమ!! అతని గుండె పగిలిపోతోంది.  

    కొంతసేపటికి పరీక్ష రాయటం ముగించిన మిగతా విద్యార్థులు వచ్చి అతన్ని ఓదార్చసాగారు. అతనెవరికీ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఊరుకున్నాడు ఆలోచిస్తూ.

    కాని ఈ సంఘటన అంతటితో సమసిపోలేదు. సాయంత్రానికల్లా అతనికి జ్వరం వచ్చింది. మరునాటికి కూడా తగ్గకపోయేసరికి హాస్పిటల్ లో  జాయిన్ చేశారు. మిగతా విద్యార్థులు వాళ్ళ ఇంటికి ఉత్తరం రాస్తానంటే మధుబాబు వద్దని వారించాడు. హాస్పిటల్ కి వచ్చి పదిరోజులయింది. టెంపరేచర్ తగ్గటం లేదు. రోజూ నూరు, నూట ఒకటీ అలా వుంటూనే వుంది. చివరకు డాక్టర్లకు అనుమానం వచ్చి ఎక్సరే తీయించి "టి.బి" అన్నారు.

    మధుబాబుకు గుండెలవిసిపోయాయి.

    "తక్షణం ఇంటికి వెళ్ళిపోవాలి. ఏడాదిదాకా చదువు డిస్ కంటిన్యూ చేసి ఆరోగ్యాన్ని పొందాలి" ఇదీ డాక్టర్లిచ్చిన తీర్పు.

    ఇంటికి ఉత్తరం రాయలేదు. ఆ రాత్రి సామానంతా తీసుకుని మిత్రుల సహాయంతో రైలు యెక్కాడు. ట్రెయిన్ మెల్లిగా కదిలి, వేగంగా విజయవాడ వైపు పరిగెత్తసాగింది.

    పైన బెర్తుమీద పడుకుని మధుబాబు శూన్యంలోకి చూస్తూ ఆలోచించసాగాడు. "టి.బి." ఇతరులకి వచ్చినప్పుడు "అయ్యో" అని నిట్టూర్చే "టి.బి.." తనకథల్లో పాత్రకు వచ్చిన "టి.బి..

    అతని కళ్ళనుండి నీళ్ళు కారసాగాయి.

                                                                  16

    సుందరమ్మగారు కొయ్యబారిపోయినారు. విశ్వనాథంగారి గుండెలో ముల్లు విరిగినట్లయింది.

    సామానుతోసహా ఇంటిముందు బండిదిగిన కొడుకుని చూసి.....ఆయన పరీక్షలయిపోయినై కాబట్టి వచ్చాడని భావించాడు మొదట. కాని లోపలకు ప్రవేశించిన కుమారుడి చిక్కిశల్యమైన అవతారం చూడగానే కంపితుడై "ఇదేమిటి?" అని గొణిగాడు.

    "నాకు టి.బి. నాన్నగారూ"


                               *    *    *


    విశ్వనాథంగారు ఊళ్ళోని టి.బి. స్పెషలిస్టుని తీసుకొచ్చి మధుబాబుకి పరీక్షచేయించాడు. శానిటోరియంకి పోవాలని వుంది మధుబాబుకు. డాక్టర్ అలా సలహా ఇస్తే బాగుండునని ఆశించసాగాడు. కాని ఆయన "ఇంకా ప్రిలిమినరీ స్టేజెస్ లోనే వుంది. అనవసరంగా ఇంజెక్షన్లూ అవీ ఇవ్వటం ఇష్టంలేదు. ఆరునెలలు కంప్లీట్ గా  బెడ్ రెస్టు ఇవ్వండి. మంచి ప్రోటీన్ పుడ్ ఇవ్వండి. టానిక్స్ రాసి ఇస్తాను" అని మధుబాబు భుజంతట్టి "ఏమీ బెంగపడకోయి. అసలు దీన్నిగురించి ఆలోచించకు. జీవితాన్ని గురించి ఆప్ టిమిస్టిక్ తీసుకో. అన్నట్టు నీకేమైనా హాబీస్ వున్నాయా?"

    "కథలూ అవీ రాస్తూ వుంటాడండి" అన్నారు విశ్వనాథరావుగారు.

    "భేష్! ఇంకేం? సాహిత్యప్రియుడివన్నమాట. మనసుని యెక్కువ అలసట చెందనియ్యకుండా నీకిష్టంవచ్చిన పుస్తకాలు చదువుకో. పరిమితంగా రాసుకో. చికాకు కలిగించే ఏ విషయాన్ని గురింఛీ ఆలోచించక, స్టడీస్ ఓ ఏడాది పోతేపోనియ్. దాన్నిగురించి దిగులుపడక. ఆరునెలల్లో, ఎలా తయారౌతావో చూడు."

ఆయన వెళ్ళిపోయాడు. కొడుకు దిగులుపడుతున్నాడని తండ్రి స్వాంతన వచనాలు పలకసాగాడు. మధుబాబుకు ఇంతకాలం ఇంట్లో ఈ దారుణ జీవితం గడటపం యెట్లాగా అన్న చింత ఎక్కువయింది. ఏ మదనపల్లో పోయి శానిటోరియమ్ లో జాయిన్ అయితే అక్కడి ప్రశాంత వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా వుంటుంది! కాని..... ఇది జరగదు. అతను నిట్టూర్చాడు.

    ప్రపంచంలో బాగా మేపవలసిన వాడెవరయ్యా అంటే టి.బి. పేషెంటు! ఉదయం నిద్ర లేచినప్పటినుంచీ కార్యక్రమమంతా తిండిగురించే.

    రెండు కోడిగ్రుడ్లూ పావుశేరు పాలతో కార్యక్రమం ఆరంభమౌతుంది. తరువాత మంచంమీద పడుకోవటం, పదకొండు గంటలకు భోజనం, వంటకాలలో ఏ మాత్రం కారం వుండకూడదు. అన్నం  తడిసి ముద్దయేటట్లు నెయ్యి గుమ్మరించుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం రెండుగంటలకల్లా గ్లాసుడు పళ్ళరసం, నాలుగింటికల్లా పావుశేరు పాలూ, దాంతోపాటు బలమైన ఆహారం, ఏడుగంటలకు భోజనం, పడుకోబోయేముందు పాలు.

    ఇవిగాక ఇంకా టానిక్కులూ, అవీ వీలయినప్పుడల్లా తీసుకుంటూ వుండటమే పని.

    మధుబాబు విసిగిపోతున్నాడు. తిండికోసం బ్రతుకుతున్నట్లుగా  వుంది. విశాఖపట్నంలో చేరాక కాఫీ ఒకటి బాగా అలవాటయిపోయింది. అది లేకపోతే ఇప్పుడు ప్రాణసంకటంగా వుంది. తండ్రి చూడకుండా తల్లిని బ్రతిమాలి రోజుకి ఒకటి రెండుసార్లు కాఫీ తాగేస్తూ వుండేవాడు.

    జబ్బయితే అనుకున్నంత భయంకరంగా లేదు. కాని రోజులు గడవటం దుస్సహంగా వుంది. తల అంతా వివిధ ఆలోచనలతో గజిబిజిగా వుండేది. కాబట్టి ఏమైనా పుస్తకాలు చదువుదామన్నా బుద్ధిపుట్టేది కాదు. వ్రాయటానికి అసలు మనసు పోయేదికాదు. సాయంత్రాలు తరచు ఉమాపతి వస్తూండేవాడు. ఇంకా ఒకరిద్దరు స్నేహితులు వస్తూండేవాళ్ళు. సాధారణంగా రేడియో పెట్టుకుని సినిమాపాటలు వింటూ వుండేవాడు. లేకపోతే పిల్లలతో కలిసి కేరంబోర్డు ఆడుతూండేవాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడుకాదు.విశ్వనాథరావుగారికి కొడుకుదీనస్థితి చూస్తే బాధగా వుండేది. కథలు రాసుకో కూడదట్రా. ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటే మనసు పాడౌతుంది. హాయిగా రాసుకో అనేవాడు. రాత్రిళ్ళు ఓ గంటసేపు ఆయనా, సుందరమ్మగారూ. మధుబాబూ కలసి పేకాట ఆడేవాళ్ళు. మధుబాబు స్నేహితుడి ఒకడిదగ్గర బుల్ బుల్ తరంగ్ ఒకటివుంది. వీలయితే అదివాయించటం నేర్చుకోవాలని చాలాకాలంనుంచీ అతడి కోరిక. కాని తండ్రి కోప్పడతాడని అణుచుకునేవాడు. ఇప్పుడు తండ్రి ఏమీ అనలేడాయె. అందుకని స్నేహితుడితో అది తెప్పించుకుని టింగ్ టింగ్ మని తిప్పలు పడుతూండేవాడు.

 Previous Page Next Page