Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 16


    అనూహ్య లేచి నిలబడి "మీరు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నిస్తాను డాక్టర్ గారూ! ఒకవేళ కలుసుకుని చెప్పడం సాధ్యం కాకపోతే ఉత్తరం ద్వారా చెప్పటానికి ప్రయత్నిస్తాను."

    డాక్టర్ సంతృప్తిగా "గుడ్" అన్నాడు. "ఇది అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. ఉత్తరం ద్వారా తెలియపరిస్తే అతన్ని మీరూ మరోసారి కలుసుకునే అవసరం కూడా వుండదు. నేను చెప్పేదెప్పుడూ ఒకటే! విద్యుత్  వలయంలో అయస్కాంతం స్పందించినట్లు మీ మాజీభర్త ఆలోచనలు మిమ్మల్ని మానసిక సంఘర్షణకు గురిచేస్తున్నాయి. మీరు వాయుపుత్ర దగ్గరికి వెళ్ళాలంటే యశ్వంత్ ని దూరంగా వుంచడం ఒక్కటే మార్గం".

    అనూహ్య తలూపింది.



                                       10

    అప్పటికి గంట సేపట్నుంచి నిఖిల్ ని ఫోన్ ద్వారా కలుసుకోవాలని శ్రీజ ప్రయత్నం చేస్తోంది. నిఖిల్ దొరకటంలేదు. రెండు రోజుల క్రితం పరిశోధనా సంస్థవారు ఏర్పాటుచేసిన మీటింగ్ లో పాల్గొన్నాడని మాత్రం  తెలిసింది. తర్వాత ఏమయ్యాడో ఎవరూ చెప్పలేదు. అర్జెంటుగా అతనితో మాట్లాడవలసిన  అవసరం ఆమెకు వుంది. అందుకే గంటనుంచి ఫోనుద్వారా ప్రయత్నం చేస్తోంది.

    స్విట్జర్లాండ్ నుంచి భారతదేశానికి డైరెక్టు టెలిఫోన్ కనెక్షన్ వుండటంవల్ల ఒకచోట దొరక్కపోతే ఆ వెంటనే వేరే నెంబర్లు తిప్పుతోంది సైన్స్ సిటీలో ఎక్కడున్నా సరే అతన్ని  పట్టుకుని ఆ వార్త అతనికి చెప్పాలి.

    తను గర్భవతిని అన్న విషయం.......


                               *    *    *

    మీటింగ్ హాల్లో సూదిపడితే నిశ్శబ్దంగా వుంది. ఆ నిశ్శబ్దంలోంచి డైరెక్టర్ కంఠం గంభీరంగా వినపడుతూంది ".........అంతరిక్షవాసులు మనకి పంపిన శాంతి సంకేతం ఏ కోడ్ లో వున్నదో, అదే  కోడ్ లో భూమినుంచి మనంకూడా సంకేతాలు పంపాలి. మనం చెయ్యవలసిన పనుల్లో అది మొదటిది. అయితే ఈ పద్ధతిలో పూర్తిగా మనం అనుకున్నది సాధిస్తామని మేము భావించటంలేదు. కారణాలు మీకు తెలుసు......."

     అవును అది నిజమే- అనుకున్నాడు వింటూన్న యశ్వంత్! అంత బలంగా శూన్యాంతరాల్లోకి పంపటానికి వీలయ్యే తరంగాల్ని ఇంతవరకూ మనిషి కనుక్కోలేదు. ఇంకోలా చెప్పాలంటే బహుశా ఆ అవసరం ఇంతవరకూ రాకే  కనుక్కోలేదేమో......

    డైరెక్టర్ కొనసాగించాడు".......విరామం లేకుండా భూమి యొక్క వేర్వేరు ప్రదేశాల్నుంచి ఈ తరంగాల్ని పంపటం జరుగుతుంది. దాదాపు సంవత్సరం పాటు ఈ ప్రసారాలు  ఆగకుండా జరుగుతాయి. ఇది మనం  తీసుకున్న  మొదటి  చర్య. ఇక  రెండో చర్య గురించి చెపుతాను. ఇదే ముఖ్యమైంది......నిన్న రాత్రి వరకూ చర్చించి, ఎన్నో విభేదాలతో ఒక నిర్ణయానికి వచ్చింది......"

    అతడేం చెపుతాడా అని అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు.

    "డియర్ సర్స్...... 'భూమి' అనేది  ఒకటి వుందని, దాని  మీద  ప్రాణికోటి వుందని, సూర్యుడు లేకపోతే ఆ ప్రాణికోటికి మనుగడ లేదని - Inter planetary societyకి మనం  తెలియబర్చాలి. అందుకోసం ఒక టీమ్ ని అంతరిక్షంలోకి పంపటం- నిన్న రాత్రి మేము తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది."

    అతడు చెప్పటం పూర్తికాకుండానే మీటింగ్ హాలులో  ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడున్న వారంతా మేధావులు. వారికి అర్థమవటం కోసం సుదీర్ఘమైన వివరణలు అవసరం లేదు. ఆ హాల్లో డైరెక్టర్ మాట్లాడిన చివరి వాక్యం సంచలనాన్ని రేకెత్తించింది.

    అంతరిక్షంలోకి ఒక టీమ్ ని పంపించటం.....!!

    ఎంతదూరం?

    ఎన్ని కాంతి సంవత్సారాలు?

    ఎంతమంది?

    ఎంతకాలం ప్రాణాలకి తెగించి ఇలా ప్రయాణిస్తూ వెళ్తారు? ఏ గాలక్సీలో వున్నారో తెలియని ఆ గ్రహాంతరవాసుల్ని కలుసుకుని, వారితో కమ్యూనికేషన్ ఏర్పరచుకుని.... మన సమస్య వారికీ చెప్పి - ఎప్పుడు తిరిగి వస్తారు?

    తి...రి...గి...రా...వ..టం!

    వీలయ్యే పనేనా అది?

    అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న.....

    ఆత్మార్పణం కావించుకునే ఆ టీమ్ (సూయిసైడల్ స్క్వాడ్)లో సభ్యులెవరు?  తిరిగిరాని తీరాలకు వెళ్ళబోయే ఆ మెంబర్లెవరు?

    మీటింగ్ హాల్లో ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే వున్నారు. వాళ్ళకి టైమ్ ఇవ్వటానికి అన్నట్టు డైరెక్టర్ కూడా కొంచెంసేపు నిశ్శబ్దంగా వుండి, తరువాత ప్రారంభించాడు.

    "ఈ విషయంపట్ల ఏకగ్రీవంగా అందరూ ఒక అభిప్రాయానికి రాలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధమైన ప్రయత్నం కనీసం ఒకటయినా చెయ్యకపోతే..... అలా  చెయ్యనందుకు మొత్తం మానవజాతే విచారించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని భావించి, చివరికి వప్పుకున్నాను......."

    అతడి ఆఖరి వాక్యంతో హాల్లో నిశ్శబ్దం పేరుకుంది. ఆ తరువాత డైరెక్టర్ మిగతా అంశాలని చర్చించాడు. అతడి అంచనా ప్రకారం ఈ ప్రయాణం పది సంవత్సరాల పైగా జరగవలసి రావచ్చు. అంతరిక్షనౌకలో అలా ఒక గమ్యం లేకుండా ప్రయాణం చేస్తూ శూన్యంలోకి తరంగాల్ని పంపుతూ వుండాలి. దాన్ని ఇంటర్  ప్లానెటరీ  సొసైటీ వాళ్ళు పట్టుకుని ప్రతిస్పందిస్తే సరేసరి.....లేకపోతే మరికొంతకాలం ప్రయాణం సాగించాలి.

    ఆ హాల్లో వున్న  వారందరికి.... 'మరి కొంతకాలం' అంటే  ఎంతో  తెలుసు. రాకెట్ లో  ప్రయాణం చేస్తున్నవాళ్ళు మరణించేటంత వరకూ ఆ ప్రయాణం సాగుతూనే  వుంటుంది. తిరిగి రావటం అన్న ప్రశ్నేలేదు. ఆ మాటకొస్తే డైరెక్టర్ మాటల్లోనే పెద్దగా ఆశావాదం కనపడలేదు. బహుశా అతడు కూడా ఈ  నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటువేసివుంటాడు అనుకున్నాడు యశ్వంత్! అతడికి మాత్రం, అంతరిక్ష నౌకలో మనుష్యుల్ని పంపటం అన్న నిర్ణయం సరి అయినదే  అనిపించింది. ఏమీ  చెయ్యకుండా వుండటంకన్నా ఏదో  ఒకటి చెయ్యటం మంచిది. లక్షలు ఖర్చయినా సరే పదిమంది ప్రాణాలు పోయినా సరే.....ఆ మాటకొస్తే ఎన్ని ప్రాణాలు నిరర్ధకంగా పోవటం లేదు? ఎంత డబ్బు అనసరంగా ఖర్చవటం లేదు?

    అయితే ఈ ప్రయాణం ఊహించినంత సులువుగా జరగదు అని అతడికి తెలుసు. అతడు ఆస్ట్రోఫిజిసిస్టు!! పైకి కనపడే సమస్యలకన్నా లోపల చాలా సమస్యలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా 'వాహనానికి కావల్సిన ఇంధనం-' ఎలా సమకూరుతుంది అన్నది ప్రధాన సమస్య అవుతుంది. పది సంవత్సరాల పైగా వాహనాన్ని నడపగలిగేటంత ఇంధనం-

    భూమి ఆకర్షణశక్తి నుంచి బయట పడటానికి శక్తి కావాలి. ఆ తరువాత శూన్యంలో ప్రవేశించాక ఇక శక్తి అవసరంలేదు. న్యూటన్ రెండో చలన సూత్రం ప్రకారం అలా వాహనం సాగిపోతూనే వుంటుంది. కానీ చంద్రుడు, కుజుడు, ఆ  తరువాత పదిలక్షల ఆస్ట్రాయిడ్స్ బంతులు, గురుడు, శని ఇలా  అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. నేటి ఆకర్షణ శక్తికి లోబడినా దానినుంచి బయటపడటానికి శక్తికావాలి. ఇంత శక్తి ఎక్కుణ్ణుంచి వస్తుంది? అంత ఇంధనాన్ని మోసుకుంటూ వాహనం ఎలా వెళ్తుంది?

    ఇది ఆలోచిస్తూ వుండగానే డైరెక్టర్ ఉపన్యాసం పూర్తయింది. విలేఖర్లు హాలులోంచి బయటకు పరుగెత్తారు. అక్కడున్న వారు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. దూరం నుంచే నిఖిల్ ని చూసి యశ్వంత్ అతడి దగ్గిరగా వెళ్ళాడు.

    "నువ్వెప్పుడొచ్చావ్?"

    "మీటింగు ప్రారంభం అవటానికి ముందు అర్జంటుగా రమ్మని కబురొచ్చింది."

    "నువ్వేమనుకుంటున్నావ్ నిఖిల్?"

    "దేని గురించి?"

    "ఇలా ఒక టీమ్ ని శూన్యంలోకి రాయబారమంపటానికి-" నవ్వేడు యశ్వంత్.

    "ఇంతకన్నా నిరర్థకమైన, స్టుపిడ్ ఆలోచన ఇంకొకటి వుండదనుకుంటున్నాను."

    యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. నిఖిల్ ఇంత వ్యతిరేకతతో వుంటాడనుకోలేదు. తన విస్మయాన్ని కనిపించకుండా- "ఎందుకలా అనుకుంటున్నావు?" అని అడిగాడు.

    వాళ్ళిద్దరూ మీటింగ్ హాలు వరండాలో నడుస్తున్నారు...... వరండాలో విజిటర్స్ కోసం గోడలకి ఫోటోలు వున్నాయి. నిఖిల్ ఒక ఫోటో దగ్గిర ఆగాడు. విశ్వం గురించి, అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన విజయాల గురించి, విజిటర్స్ కి వివరించే ఫోటోలు అవి.

    నిఖిల్ ఆగిన ఫోటో చూడండి. సూర్యుడు సెకనుకి 250కి.మీ. వేగంతో ఈ గాలక్సీ చుట్టూ తిరుగుతుంటేనే, మొత్తం ఒకసారి చుట్టి రావటానికి 250 మిలియను సంవత్సరాలు పడుతుందే-అటువంటిది-మనం ఈ కేంద్రంలో ఏ  నక్షత్రాన్నని వెతుకుతాం? ఎంత లోపలికి చొచ్చుకు వెళ్ళగలం?"

    యశ్వంత్ నవ్వేడు. "నువ్వు ఈ ఒక్క గాలక్సీ గురించే ఆలోచిస్తున్నావు. ఆ గ్రహాంతరవాసులు వేరొక గాలక్సీ వాళ్ళైతే- మన  పరిస్థితి  మరింత క్లిష్టమవుతుంది. అది ఆలోచించు-" అన్నాడు.

    నిఖిల్ సర్దుకుంటున్నట్టు "మైగాడ్! ఆ విషయమే ఆలోచించలేదు సుమా" అన్నాడు. "ఒకవేళ ఆ వచ్చినవాళ్ళు మన గాలక్సీ వాళ్ళు కాకుండా వేరే ఇతర గాలక్సీల వాళ్ళయితే, పాపం, ఇలా  కేంద్రంవైపు వెళ్ళే మన అంతరిక్ష నౌక ఎంతదూరం ప్రయాణించినా ఏమీ  కన్పించదు. మరో  విధంగా చెప్పాలంటే- రాకెట్ లోనే ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుంది."

    "ఎవరయినా వేరే ఇతర గాలక్సీలనుంచి వచ్చి మన  సూర్యుడిని కొల్లగొట్టేటంత కష్టపడతారని నేను అనుకోవటంలేదు. అంత దూరం ప్రయాణం చేసి ఎందుకు వస్తారు?......వాళ్ళు మన గాలక్సీవాళ్ళే అయివుండి వుంటారు. చివరగా వున్నాడు.

    "అటువంటప్పుడు మనం ఒకపని చెయ్యాలి."

    "ఏమిటది?"

    "గాలక్సీ లక్షల మిలియన్ల మైళ్ళ దూరం విస్తరించుకుని వుంది. ఒక రాకెట్ కాకుండా, దరిదాపు వంద లేక వెయ్యి రాకెట్లు విశ్వంలోకి పంపి ఆ ఇంటర్ ప్లానెటరీ సొసైటీ ఎక్కడుందో పట్టుకోవాలి." కసిగా అన్నాడు.

    యశ్వంత్ నవ్వి, "నువ్వీ పథకానికి చాలా వ్యతిరేకిలా వున్నావే" అన్నాడు.

    "చాలా టు ది పవరాఫ్ చాలా- "

    "చుట్టూ వున్న చీకటిని తిడుతూ కూర్చోటం కంటే చిన్న దీపం వెలిగించడానికి ప్రయత్నించటం మంచిదని చిన్నప్పుడు చదువుకున్నాం. మర్చిపోయావా నిఖిల్?"

    నిఖిల్ మాట్లాడలేదు. యశ్వంత్ కూడా, పైకి వాదిస్తున్నాడే తప్ప తన వాదనలో అంతగా బలం లేదని తెలుసు. "కానీ ఏదో ఒకటి చెయ్యాలిగా! పోనీ నువ్వయితే ఏం చేస్తావు చెప్పు?" అడిగాడు. నిఖిల్ కొంచెంసేపు ఆలోచించి "ఆ  గ్రహాంతరవాసులు మళ్ళీ సూర్యుడి సామీప్యంలోకి వస్తారు. భూమ్మీద జీవకోటి వుందని వారికి తెలుసు. మన  ఫీలింగ్స్ కనుక్కునే ప్రయత్నం ఎలాగూ చేస్తారు. వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం రాడార్ ద్వారా ఆ ప్లయింగ్ సాసర్ ని పట్టుకోవడం మంచిదని నా ఉద్దేశ్యం. కనీసం వారు ఏ గాలక్సీ నుండి వచ్చారో తెలుస్తుంది. సూర్యుడు మనకెంత అవసరమో వారికి నచ్చజెప్పవచ్చు. వారు వినకపోతే ఇంటర్ ప్లానెటరీ సొసైటీకి మనం ఫిర్యాదు చెయ్యవచ్చు. కాని ఆ ఇంటర్ ప్లానెటరీ సొసైటీ ఎక్కడుందో తెలుసుకోవాలన్నా దానికి ఆ గ్రహాంతరవాసుల మీద  ఆధారపడటం మంచిది. ముందు నయానా అడిగి చూస్తాం. వినకపోతే భయాన లొంగతీసుకుంటాం. ఆ ప్లయింగ్ సాసర్ మహా అయితే నలుగురైదుగురు వుండవచ్చు. వారిని లొంగదీసుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు" ఆవేశంగా అన్నాడు.

 Previous Page Next Page