"నువ్వు చెప్పింది బాగానే వుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం మార్చిపోతున్నావు. వారికి టెలీపతి తెలుసు....మన ఆలోచన్లని మనకన్నా ముందు పసిగడ్తారు వాళ్ళు. అదీగాక సాంకేతికంగా మనకన్నా ఎన్నోరెట్లు ముందున్నారు వాళ్లు. వాళ్ళని లొంగదీసుకోవడం కష్టం! ఇకపోతే వాళ్ళకు నచ్చచెప్పడమంటావా - అది కుదరని పని. వాళ్ళకి మన ఉనికి సంగతి తెలుసన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. సూర్యుడు లేకపోతే మన కొచ్చే ప్రమాదం గురించి తెలిసీ, మళ్ళీ ఈ పన్లకి పూనుకున్నారంటే మనని వాళ్ళు లక్ష్యపెట్టడంలేదు. మనం నాశనమైపోయినా వాళ్ళకి ఫర్వాలేదు అన్న ఉద్దేశ్యంలో వున్నారు. మన గురించి వాళ్ళకి అన్నీ తెలుస్తున్న పక్షంలో యిలా శూన్యంలోకి చేయబోయే సాహసయాత్ర గురించి కూడా తెలిసే వుంటుంది. మనం పంపే తరంగాలు ఇంటర్ ప్లానెటరీ సొసైటీ వరకూ వెళ్ళకుండా ఎలా అడ్డుకున్నారో అదేవిధంగా భూమ్మీద లేచిన వాహనాన్ని కూడా అలాగే అడ్డుకుంటారు."
"వాళ్ళింకా అక్కడే వుంటే...." పూర్తిచేశాడు యశ్వంత్. "కానీ వారుండరని నా ఉద్దేశ్యం. రాయ్ ని తీసుకెళ్ళి వుంటారు. తమతో....ఇక నువ్వు చెప్పిన రెండో విషయం - వాళ్ళు భూలోకపు అంతరిక్ష నౌకని వశపర్చుకుంటే ఏమవుతుంది అన్నది. వశపర్చుకోనీ, కనీసం వాళ్ళతో మనం కమ్యూనికేషన్ ఏర్పరచుకునే వీలు కలుగుతుంది కదా-"
"ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోతే?"
యశ్వంత్ ఆ ప్రశ్నలకి నవ్వేడు. "సకల మానవాళి కోసం ఆ మాత్రం ప్రాణాలు పోగొట్టుకోడానికి సిద్ధపడే వాళ్ళు మనలో కనీసం యాభైశాతం పైగా వుంటారని నేననుకుంటున్నాను. ఆ దేశభక్తులు-సారీ! వారిని ఏమనాలి? దేశానికి కూడా అతీతంగా ప్రపంచం కోసం త్యాగం చేసేవాళ్ళని ఈ ప్రయోగం కోసం పంపితే తప్పేముంది?"
వాళ్ళ సంభాషణ పూర్తికాకుండానే తెల్లదుస్తుల్లో వున్న ఒక నౌఖరు యశ్వంత్ దగ్గరికి వచ్చి "మిమ్మల్ని డైరెక్టరుగారు రమ్మంటున్నారు" అన్నాడు.
యశ్వంత్ గదిలోకి వెళ్ళేసరికి డైరెక్టరు ఒక్కడే వున్నాడు. అతడి మొహంలో అలసట కన్పిస్తూంది. దాన్ని కన్పించకుండా నవ్వి, "ఎలా వున్నావ్ యశ్వంత్" అని అడిగాడు.
"బానే వున్నాను సర్-"
"మీటింగ్ లో చెప్పిన దానిపట్ల నీ అభిప్రాయం ఏమిటి?"
"ఏ విషయం?"
"విశ్వంలోకి టీమ్ ని పంపటం."
"ఈ పరిస్థితుల్లో అంతకన్నా వేరే మార్గం వుంటుందని నేననుకోవటంలేదు సర్! కానీ నాతో చాలామంది ఏకీభవించకపోవచ్చు."
"అలా ఏకీభవించని వాళ్ళల్లో నేను ఒకణ్ణి. కానీ మెజారిటీ నిర్ణయం అది."
యశ్వంత్ మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని చీలుస్తూ డైరెక్టర్ అన్నాడు- "ఇంటర్ ప్లానెటరీ సొసైటీ ఎక్కడుందో శూన్యంలో వెతుక్కుంటూ వెళ్ళే టీమ్ లో నువ్వూ ఒకడివి యశ్వంత్. అంతేకాదు, ఆ టీమ్ కి కమాండర్ వి నువ్వే."
మామూలుగా సంభాషణ కొనసాగిస్తున్న యశ్వంత్ అదిరిపడ్డాడు. డైరెక్టర్ చెబుతున్నది ఒక క్షణం అర్థంకాలేదు. పది......ఇరవై ముప్ఫయ్ సంవత్సరాలపాటు విశ్వంలోకి.....ఒక టీమ్ ని తీసుకుని....డానికి తను కమాండర్....ఇది కలా? నిజమా?
ఎంతకాలం అలా శూన్యంలోకి ప్రయాణం చేస్తూ వెళ్ళాలో తెలీదు ఎక్కడికి చేరుకుంటామో తెలీదు. తిరిగి రావటం ప్రసక్తే లేదు.
అసలు 'తిరిగి రావటం' అన్న ఆలోచనకే నవ్వొచ్చింది. శూన్యంలో ప్రయాణిస్తూ, ఎంత పవర్ పుల్ పరికరాల్తో సంకేతాన్ని పంపినా ఎవరో ఒకరు దాన్ని అందుకుని, తమకి దారి చూపించి, ఆ ఇంటర్ ప్లానెటరీ సొసైటీకి తీసుకువెళ్ళటానికి పదినుంచి ముప్ఫై సంవత్సరాలపైగా ఎంతయినా పట్టవచ్చు తిరిగి రావటానికి ముప్ఫై......
అయినా "ముప్ఫై' అన్నది చాలా ఆశాజనకమైన కాలం. అదృష్టం ఏమాత్రం కలిసి రాకపోయినా- అలా శూన్యంలో ప్రయాణం చేస్తూ నక్షత్రాల మధ్య చీకటి నీరవంలో కలసి పోవల్సిందే. యుద్దాల్లో మరణించినా, పర్వత శిఖరాగ్రాల మీద ఏకాకిగా ప్రాణాలు వదిలినా - శరీరం భూమిలోనే కలిసిపోతుంది. ఇక్కడ పరిస్థితి అలాక్కాదు. ఎక్కడో తెలియని శూన్యంలో శరీరం శిథిలమై కృశించాల్సిందే.....వీటన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి వుంది.
....ప్రయాణం ప్రారంభమైన మరుక్షణం నుంచి, చివరి వరకూ-ఒకే చిన్న హాలులాటి గదిలో- ఎన్నో సంవత్సరాలు గడపాలి. కేవలం ప్రయాణం-ప్రయాణం-ప్రయాణం.....అంతే. ఇవేమీ వుండదు.
యశ్వంత్ తల విదిలించాడు. అతడికి ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి తనిలా ఆలోచిస్తున్నాడు? పరలోకవాసులు ప్రమాదం నుంచి రక్షించుకోవటం కోసం భూమినుంచి రోదసీలోకి ఒక బృందం వెళ్ళటం ఎంతో శ్రేయష్కరం అని ఇప్పటివరకూ వాదించిన తను, ఆ బృందంలో తనూ వున్నానని తెలుసుకోగానే, ఈ విధమైన కష్టాల గురించి ఆలోచిస్తున్నాడు?
అతడి ఆలోచనకి అతడికే సిగ్గు వేసింది. ఇంతలో- అతడి మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న డైరెక్టర్ అన్నాడు- "ఇందులో నిర్భంధం ఏమీలేదు యశ్వంత్. ఆ మాటకొస్తే ఇటువంటి ప్రయాణం కోసం ఎవరూ ఎవర్నీ నిర్భంధించలేరు!"
యశ్వంత్ నొచ్చుకుంటూ, "ఛా.....న ఉద్దేశ్యం అదికాదు. ఊహించనంత గొప్ప విషయాన్ని వినేసరికి ఏం చెప్పాలో తోచలేదంతే. ఇటువంటి అవకాశం నాకు దొరికినందుకు గర్విస్తున్నాను."
"గుడ్" అన్నాడు డైరెక్టర్. "మొత్తం అందరి అనుమతి తీసుకున్నాకే బృందాన్ని ఫైనలైజ్ చేస్తాము."
"ఎవరెవర్ని అడుగుతున్నారు?" అన్నాడు యశ్వంత్- అప్పుడే కమాండర్ పదవిని మానసికంగా స్వీకరిస్తూ.
"డాక్టర్ ఫిలిప్స్....బృందంలో ఒక డాక్టరు వుండటం అవసరం." యశ్వంత్ తలూపాడు.
"ఆస్ట్రోనాట్ గా ఎంతో అనుభవం వున్న వ్యక్తి..... నిఖిల్..... అతడు నీకు కూడా తెలుసు! ఈ ప్రయాణంలో అతడి అనుభవం ఎంతో సహకరిస్తుంది."
యశ్వంత్ కి సంతోషం వేసింది. ఈ అనంతానంత యాత్రలో - తెలిసిన ఒక తోడు! ఆర్కిటికా మంచుకొండల ఒంటరితనంలో పాలుపంచుకున్నవాడు- ఇప్పుడు జీవితం చివరి వరకూ....
"ఇంకా ఎవరు? అసలు ఎంతమంది వున్న బృందాన్ని పంపాలను కుంటున్నారు?" యశ్వంత్ అడిగాడు.
"నీతోబాటూ నలుగురు. ఒక డాక్టరు, ఒక ఆస్ట్రోనాట్, ఒక కంప్యూటరిస్టు-"
"ఎవరు? వాయుపుత్రా?" డైరెక్టరు మాటలకి మధ్యలో అడ్డు తగులుతూ అడిగాడు యశ్వంత్.
"కాదు. ప్రొఫెసర్ నికోలవస్కీ ఈ రంగంలో నిష్ణాతుడు. నీకు తెలిసే వుంటుందే."
"పేరు విన్నాను. ఎప్పుడూ కలుసుకోలేదు. అయిదో వ్యక్తి ఎవరు?"
"అనూహ్య అని ..... బయోకెమిస్ట్."
యశ్వంత్ చప్పున తలెత్తాడు. ఊపిరి పీల్చటం కూడా మర్చిపోయేటంతగా దిగ్భ్రమ అతడిని ఆవరించింది. అచేతనంగా డైరెక్టర్ వైపు చూశాడు. ఆనందానికి అతీతమైన భావం అది. డైరెక్టరు అతడి మోహంలో వచ్చిన మార్పులు గమనించలేదు. ఈ బృందంలో ఒక బయోకెమిస్ట్ అవసరం ఏమిటో.....అందుకు అనూహ్యనే ఎందుకు సెలెక్ట్ చేయవలసి వచ్చిందో చెప్పుకుపోతున్నాడు.
యశ్వంత్ వినటంలేదు.
అనూహ్య!
తమతోపాటు తమ బృందంలో వస్తున్న అయిదోవ్యక్తి అనూహ్య!
కొన్ని సంవత్సరాలపాటు..... కొన్ని లక్షల కోట్ల మైళ్ళు అనంతానంత విశ్వశూన్యంలో మిగతాముగ్గురితోపాటు తామిద్దరు- తామిద్దరే!
అతడి మనసులో ఈ రోదసీ యానంలో తను పాల్గొనటంపట్ల ఏదైనా అనుమానాలు, మనసులో అభ్యంతరాలు వుంటే ఈ క్షణం ఎవరో తీసేసినట్టు ఒక్కసారిగా అవి పోయాయి.
అప్పటికప్పుడే అతడు తన అనుమతి తెలిపాడు. పత్రం మీద సంతకం పెడుతూ, "మిగతావారి కీ విషయం తెలియబర్చేరా?" అని అడిగాడు.
"లేదు యశ్వంత్. ముందు నీతోనే ప్రారంభం. ఎన్నో సుదీర్ఘమైన చర్చల తరువాత ఈ లిస్ట్ తయారయింది. ఇక ఒకరొకర్నే అడగాలి."
"నిఖిల్ బయటే వున్నాడు."
"ఈజిట్."
"నేను వెళ్ళి పంపిస్తాను" అని యశ్వంత్ బయటకొచ్చాడు. నిఖిల్ అతడి కోసం వరండాలో చూస్తున్నాడు.
ఈ వార్త అతడికి చెప్పబోతూ ఆగిపోయాడు యశ్వంత్.
తను చెప్తే అతడు వస్తాడు. అతడికీ యాత్రపట్ల సదభిప్రాయం లేదని అంతకుముందే అతడి మాటలవల్ల తేలిపోయింది. అయినా సరే తను కమాండర్ అంటే అతడు వస్తాడు. తనమీద అతడికెంత గౌరవం వుందో అతడికి తెలుసు.
అదికాదు అసలు విషయం.
ధృవప్రాంతంలో అతడితో గడిపే రోజుల్లో అతడు ఎప్పుడూ అదోలా వుండటం చూపి తను అడిగిన ప్రశ్న..... "నువ్వెవర్నయినా ప్రేమించావా నిఖిల్" అన్నదానికి అతడి చిరుసిగ్గు సమాధానం....సాంకేతిక రంగంలో ఎంత సాధించినా ఇప్పుడిప్పుడే ప్రేమలో అడుగు పెడుతున్న తొలి తడబాటు ఆస్వాదనం.....
వీటిని వదిలేసి మృత్యుముఖం తనతోపాటు అడుగు పెట్టమని అడిగే హక్కు తనకేముంది?
తనంటే అతడికున్న గౌరవాభిమానాన్ని ఈ విధంగా వుపయోగించుకోవటం తనకి భావ్యమేనా? జీవితంలో ఏమీ అనుభవించకుండానే అతడి భవిష్యత్తుని శూన్యాకాశంలోకి మళ్ళించటం తగునా? అతడికి ఉత్సాహం వుంటే అది వేరే సంగతి. కానీ ఈ ప్రాజెక్టుపట్ల తనకేమో ఆశాభావం లేదని అతడు చెప్పాక కూడా తను అడగటం....
నిఖిల్ యశ్వంత్ వైపు చూశాడు. ఏదో చెప్పబోతూ ఆగిపోయినట్టుగా గుర్తించి, "ఏమిటి సార్" అని అడిగాడు.
యశ్వంత్ ముందు తన గురించి చెప్పాడు. అంతరిక్ష యానపు బృందానికి కమాండర్ నని అతడు చెప్పగానే నిఖిల్ "కంగ్రాచ్యులేషన్స్ సర్" అన్నాడు.
"అంతేకాదు నిఖిల్, ఆ బృందంలో చేరటానికి నిన్నూ అడగమన్నారు."
నిఖిల్ ఆ మాటలు అర్థంకానట్టు ఒక క్షణం తెల్లబోయి వెంటనే సర్దుకున్నాడు. అతడి మొహం దివ్వెలాగ వెలిగింది. "నిజమా సర్" అన్నాడు ఆనందంతో. ఈసారి తెల్లబోవటం యశ్వంత్ వంతయింది. అతడింత తొందరగా, ఇంత సంతోషంగా రియాక్ట్ అవుతాడనుకోలేదు.
"అదేమిటి నిఖిల్..... మాతో రావటానికి నువ్వు ఒప్పుకోనంటావనుకున్నాను...."
నిఖిల్ మొహం వాడిపోయింది. "భయపడతాననుకున్నారా సర్?" అన్నాడు.
"ఛా.....ఛా.... అదికాదు. నీకీ ప్రపోజల్ పట్ల అసలు నమ్మకం లేదు కదా."