Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 15


    "డియర్ ఫ్రెండ్స్ " యశ్వంత్ తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ అన్నాడు- "ఈ రోజు మనం ఇక్కడ రెండు ముఖ్య విషయాలు చర్చించటానికి సమావేశమయ్యాం. మొదటిది- ఇంటర్ ప్లానెటరీ సొసైటీ వాళ్ళు మనకొక సంకేతం పంపారు. " వివిధ గ్రహాలమీద వుండే జీవరాసుల్లో ఎవరికయినా, సూర్యుడినుంచి శక్తి కొల్లగొట్టబడితే అభ్యంతరం వుందా" అని. మనకి తెలియని భాషనుంచి తర్జుమా చేయబడిన ఈ  విషయంలో అసత్యమేమీ లేదనీ, వాయుపుత్ర సరీగ్గానే తర్జుమా చేశాడనీ ఇప్పుడు మనకు నిరూపించబడింది."

    "ఏ విధంగా" ఎవరో అడిగారు.

    "గ్రహాంతరవాసులు సూర్యుడి దగ్గిరగా కొంతకాలం 'మకాం' వేసి వెళ్ళారు అన్నది వారు వదలి వెళ్ళిన ప్లయింగ్ సాసర్ ద్వారా నిరూపణ అవుతుంది కనుక" జవాబు చెప్పాడు యశ్వంత్. "........అంతకన్నా మరో ముఖ్య ఆధారం....వారు వదలివెళ్ళిన ప్లయింగ్ సాసర్ లో దొరికిన బల్బ్ నిజానికి బల్బ్ కాదనీ, అది ఒక నిక్షిప్తమైన శక్తి  అని మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఈ 'నిక్షిప్తమైన శక్తి' గురించి నేను ణా అభిప్రాయాలు చెప్పబోయే ముందు, సైన్సుకు సంబంధించిన కొన్న మూల విషయాలు మాట్లాడతాను. అందరూ నిష్టాతులా, మేధావులూ వున్న ఈ సభలో నేను ఇంత చిన్న విషయాలు మాట్లాడటం అర్థరహితమే అయినా , ఇక్కడ వున్నవారు వేర్వేరు రంగాలకు సంబంధించిన వారు కాబట్టి ఈ విషయాలు కూడా  చెప్పవలసిన బాధ్యత నామీద  వుందని నేను భావిస్తున్నాను" ఆగి తిరిగి ప్రారంభించాడు-

    "వంద  సంవత్సరాల క్రితమే మానవుడు ఆటంబాంబు తయారుచేశాడు. ఆటంబాంబులో పదార్ధం(వస్తువు) విస్ఫోటనం చెంది 'శక్తి' గా మారుతుందని మీ  అందరికీ తెలుసు. ఒక పూట్ బాల్  సైజు బాంబు శక్తిగా  విసిపోయి, కొన్నివేల మైళ్ళ దూరాన్ని కాల్చిపారేస్తుంది. ఒక వస్తువుని ఇలా శక్తిగా మార్చే పరికరాన్ని మానవుడు దాదాపు వంద సంవత్సరాల క్రితమే కనుక్కొన్నాడు. కానీ  శక్తిని వస్తువుగా మార్చే పరికరాన్ని ఎందుకు కనుక్కోలేదు? వాస్తవానికి అదేం పెద్ద విషయం కాదు. When matter can be converted into energy, energy can also be converted to matter.  కానీ  మానవుడు ఈ విషయంలో అంత శ్రద్ధ చూపలేదు. కారణం ఐన్ స్టీన్ థియరీ ప్రకారం ఒక గ్రాము (మాస్) పదార్థాల్ని తయారు చేయటానికి 900,000,000,000,000,000,000 ఎర్గ్ ల ఎనర్జీ కావాలి. ఇంత కష్టపడటం దేనికని మనిషి ఈ విషయంలో అంత శ్రద్ధ చూపించలేదు. మరొక రకంగా చెప్పాలంటే, శూన్యంనుంచి ఒక గ్రాము పదార్థాన్ని తయారు చేయటానికి కావల్సిన శక్తితో ఒక మనిషి 670,000సంవత్సరాలు బ్రతకవచ్చు. ఒక వంద కాండిల్ బల్బ్ 800,000సంవత్సారాలు వెలిగించి వుండవచ్చు. ఎవరైనా శాస్త్రజ్ఞుడు తన  ప్రయోగశాలలో శూన్యంనుంచి ఒకఔన్సు పదార్థాన్ని సృష్టించాలంటే200మినియన్లు గాలన్ల కిరోసిను తగలబెడితే వచ్చేటంత శక్తిని వినియోగించాలి.

    చిన్నకోడి గుడ్డంత పదార్థాన్ని తయారుచేయటానికే ఇన్ని కోట్ల కోట్ల ఎర్గ్ ల శక్తి కావాలి. మరి అటువంటప్పుడు ఇంత బ్రహ్మాండమైన విశ్వం, ఇన్ని గోళాలు, భూమి,చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇంత పదార్ధం  ఎక్కడ్నుంచి తయారైంది? ఇంత శక్తి శూన్యంలోంచి ఎలా ఉద్భావించింది? శాస్త్రజ్ఞులు అన్వేషిస్తూనే వున్నారు. అన్వేషణలు మీద నమ్మకంలేని వాళ్ళు, ఆ శక్తికి ఒక పేరు పెట్టారు 'దేవుడు' అని. ఇప్పుడు ణా ఉపన్యాసం దేవుడి ఉనికి గురించి కాదు. గ్రహాంతర వాసుల గురించి.....శక్తిద్వారా  పదార్థాన్ని సులభంగా తయారుచేయటం ఎలాగో మనిషి తెలుసుకోలేకపోయాడు. కానీ నా ఉద్దేశ్యంలో ఆ గ్రహాంతర వాసులు ఈ 'టెక్నిక్' కనుక్కున్నారు."

    ఆఖరి వాక్యానికి సమావేశంలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. యశ్వంత్ వాటిని పట్టించుకోలేదు. తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు.

    "మనిషి బ్యాటరీ కనుక్కున్నాడు, టార్చిలైట్లు వెలిగాయి. పెట్రోల్ కనుక్కున్నాడు, కార్లు కదిలాయి. అణుశక్తి కనుక్కున్నాడు. ధర్మల్ స్టేషన్ లు వెలిశాయి. కానీ ఇవన్నీ ఖరీదైన ప్రక్రియలు. కారణం? వస్తువుల్నుంచి శక్తి ఉత్పత్తి చెయ్యటం....!ఇలా కాకుండా , తొమ్మిదికోట్ల ఎర్గ్ ల శక్తినుపయోగించి గోళీకాయంత పదార్థాన్ని తయారుచేయటం, తిరిగి ఆ గోళీకాయను శక్తిగా మార్చుకోగలగటం మనిషి నేర్చుకున్నాడనుకోండి. అప్పుడు భారతదేశం నుంచి అమెరికా వెళ్ళటానికి వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది. పదిమంది నివసించే భవంతి నిర్మించటానికి పదివేల కన్నా ఎక్కువ ఖర్చు అవదు. మనం భూతల స్వర్గంలో నివసిస్తాం. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో మనకి అపారంగా, ఏ మాత్రం ఖర్చు లేకుండా 'శక్తి' దొరుకుతుంది కాబట్టి."

    "ఎక్కణ్ణుంచి లభిస్తుంది?" ఎవరో అడిగారు.

    "గ్రహాలనుంచి, నక్షత్రాలనుంచి" సమాధానం ఇచ్చాడు యశ్వంత్. "ఒక్కసారి ఇంధనం మనకి దొరకటం ప్రాంభించాక ఇంక కష్టం ఏముంది? పక్కింటికి పేరంటానికి వెళ్ళినట్టు ఏ శని దగ్గరకో వెళ్ళి మనకు  కావల్సినంత శక్తి మనతో పాటు తెచ్చుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్! అసలు ఈ ప్రపంచాన్ని మీరొకసారి వూహించండి. పదిహేను రోజుల్లో గంగా, గోదావరీ నదుల్ని కలపవచ్చు. వరదలుండవు. ఆర్నెల్లు తిరిగేసరికల్లా ప్రతి మనిషికీ ఇంట్లో, సంవత్సరం తిరిగేసరికల్లా వద్దన్నా  కావలసినంత తిండి..... ప్రతి ఇంటికీ ఒక ఎయిర్  కండిషనర్. ప్రతి మనిషికీ ఒక కారు......"

    "ఈ లోపులో బుధుడు కాస్త్బా కృశించిపోతాడు" అన్నారెవరో.

    "బుధుడు మాయమైతే ఆ గురుత్వాకర్షణ శక్తిలో వచ్చిన మార్పుకి మిగతా ఎనిమిది గ్రహాల కక్ష్యలూ కదిలిపోయి. ప్రళయం సంభవిస్తుంది" అన్నారు మరొకరు.

    "అభివృద్ధి మాట దేవుడెరుగు" అన్నారు ఇంకొకరు.

    యశ్వంత్ అందరి మాటలూ చివరివరకూ విని, చివర్లో క్లుప్తంగా అన్నాడు.

    "మీరు చెప్పిందంతా నిజమే! మన గాలక్సీలో వున్న ఏ నక్షత్రం గానీ, గ్రహం నుంచిగానీ ఇలా శక్తిని లాగేస్తే, మీరు చెప్పిన ప్రమాదం ఏర్పడుతుంది. అదే మరో గాలక్సీలో నున్న ఏ నక్షత్రం నుంచో  చేస్తే ఫర్వాలేదుకదా."

    "అవును ఫర్వాలేదు."

    "అందుకే గ్రహాంతరవాసులు మన గాలక్సీలోని సూర్యుడిని ఎన్నుకున్నారు" చెప్పదల్చుకున్నది పూర్తిచేశాడు యశ్వంత్.

    ఆ  హాలులో సూదిపడితే వినిపించేటంత నిశ్శబ్దం!

    ఎటో వెళ్తున్న టాపిక్ అకస్మాత్తుగా ఈ వాస్తవం దగ్గర కొచ్చి ఆగేసరికి, అతడు  చెపుతున్నది అర్థమై అందరి శరీరాలు అప్రయత్నంగా జలదరించాయి.

    ఆ నిశ్శబ్దాన్ని మళ్ళీ  యశ్వంత్  భంగపరిచాడు.

    "ఇదంతా నాఊహ మాత్రమే. మనకు దొరికిన సాక్ష్యాలు ఆధారంగా నేను ఆలోచించింది ఇది! నా ఆలోచన మొత్తం తప్పు కావచ్చు. కానీ నా ఆలోచన నిజమైన పక్షంలో, దీనివల్ల జరిగే పరిణామాలను నేనీ విధంగా వూహిస్తున్నాను....."

    యశ్వంత్ కంఠం ఆ హాలులో గంభీరంగా ప్రతిధ్వనించింది-

    "ఆ గ్రహాంతర జీవులు సూర్యశక్తిని ఘనీభవింపజేసే ప్రయత్నంలో సోలార్ జ్వాలాలు పైకి చెలరేగిన పక్షంలో, ఆ కాస్మిక్ కిరణాల తాకిడికి భూమిమీద జీవకోటి యావత్తు నిర్వీర్యం అయిపోతుంది. సుదూర తీరాల్లో మనకు పొంచి వున్న ప్రమాదం ఇదే....ఈ తాకిడికిమన వాతావరణం ఆపలేదు. సకల మానవజాతి యావత్తు ఆందోళన చెందవలసిన విషయం ఇది. మనందరం ఏదో  ఒక చర్య గురించి వెంటనే  ఆలోచించకపోతే, మృత్యువు ఎంతో దూరంలో లేదని నేను భావిస్తున్నాను. అంతే నేను చెప్పదల్చుకున్నది."

    అతడు వేదిక దిగిపోయాడు.

                              *    *    *

    ఇది జరిగిన రెండు రోజులకు అతనికి కబురు వచ్చింది.

    ఈసారి కొద్దిమంది మాత్రమే  సమావేశమయి వున్నారు.

    వారు శాస్త్రజ్ఞులు కాదు దేశాధినేతలు.

    యశ్వంత్ ఆ హాలులో ప్రవేశించగానే గమనించిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, అంతరిక్ష పరిశోధనా సంస్థ డైరెక్టరు ఆ సమావేశానికి అధ్యక్ష స్థానంలో వుండటం! దేశాధినేతలు అతడి పక్కన కూర్చోవటం! ఈ దృశ్యం అతడికి గమ్మత్తుగా అనిపించింది.

    అతడు తన సీటులో కూర్చున్న అయిదు నిముషాలకు మీటింగు ప్రారంభమైంది. డైరెక్టర్ తాన్ ఉపన్యాసాన్ని సుదీర్ఘమైన ఉపన్యాసంతో సాగదీయలేదు. "డియర్ సర్స్....." అంటూ ప్రారంభించి అసలు విషయంలోకి వచ్చేశారు.


                                     9

    "లేదు డాక్టర్ గారూ!" తల విదిలిస్తూ అంది అనూహ్య. "నేను యశ్వంత్ తో తిరిగి పరిచయం పెంచుకొనే ప్రసక్తిలేదు. అతడికి నా మీద ప్రేమలేదు. జీవితపు చివరిక్షణంలో భార్యనైనా నన్ను గుర్తు తెచ్చుకున్నాడు. అంతే."

    సైకియాట్రిస్టు అర్థం చేసుకున్నట్టు తలూపాడు. ఎప్పుడో గతంలో మనకు ఎవరో పరిచయమవుతారు. చాలా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తారు. ఒకటి రెండు చిన్న అనుభవాల్ని, అనుభూతుల్నీ పంచుకోవటం, తరువాత కాలం విడదీస్తుంది. కొన్ని సంవత్సరాలపాటు ఒకరి ఉనికి ఒకరికి తెలియదు. హఠాత్తుగా మళ్ళీ ఎప్పుడో వాళ్ళని కలుసుకోవటమో, వాళ్ళ ఉనికి తెలియటమో జరుగుతుంది. దాంతో పాత జ్ఞాపకాలు పైకి వస్తాయి. ఎప్పుడో జరిగింది ఎంతో అపురూపంగా తోస్తుంది. వాళ్ళని కలుసుకోవాలని మనసు తహతహ లాడుతుంది, అయితే అది తాత్కాలికమే. ఈ వేడి మళ్ళీ తగ్గిపోతుంది.

    ఇప్పుడీ సైకియాట్రిస్టు ఈ మాజీ  దంపతుల గురించి అదే  అనుకున్నాడు. పాత ఉద్వేగాలు పైకి వచ్చాయనుకున్నాడు. చాలాకాలం తరువాత హఠాత్తుగా. కలుసుకోవటంవల్ల వచ్చిన 'ఎమోషన్స్' తో ఈ విధంగా ఈ అమ్మాయి కలవరం చెందుతుంది అన్న  నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఆమెకి సలహా ఇచ్చాడు. "మీరు అనుకుంటున్నది నిజమే అనూహ్యా! ఇదంతా కేవలం అతడిని అనుకోకుండా కలుసుకోవటంవల్ల వచ్చిన ఉద్వేగమే.....నేను ముందే చెప్పాను.....వాయుపుత్రతో కలిసి కొంతకాలం దూరంగా వెళ్ళిపొమ్మని....."

    "నేనూ అదే అనుకున్నాను డాక్టర్ గారూ, కానీ  స్పేన్ సిటీ కాలిపోవటంతో మా ప్రయాణం ఆగిపోయింది."

    "ఇప్పుడు మీ మాజీ భర్త - అదే యశ్వంత్ - ఇక్కడే వున్నారన్నారు కదూ."

    "అవును."

    డాక్టర్ కుర్చీ వెనక్కి వాలుతూ "మీరు వెంటనే చేయవలసిన పని ఒకటుంది మిస్  అనూహ్య" అన్నాడు.

    ఆమె ఏమిటన్నట్లు తలెత్తి చూసింది.

    "యశ్వంత్ ని మీరు కలుసుకోవాలి."

    ఆమె ఆశ్చర్యపోయింది.

    డాక్టర్ కొనసాగించాడు. "ఒకేచోట వుంటూ మీరు, మీ మాజీ భర్త ఎప్పుడో ఒకప్పుడు కలుసుకోకపోరు. క్షణం క్షణం ఆ టైము ఎప్పుడొస్తుందో అని మీరు భయపడుతుంటే వాయపుత్రతో మీ స్నేహం కొనసాగదు. మీరు మిగతా ఆడవాళ్ళ లాంటివారు కాదు. ఇలా  కొట్టుమిట్టులాడుతూ కాలం గడిపెకంటే మీ అంతట మీరే వెళ్ళి యశ్వంత్ ని కలుసుకుంటే మీ భవిష్యత్ పట్ల మీకున్న జబ్బు  తొలగిపోతూంది. అపాయాన్ని ఊహించటం కంటే దానికి ఎదురు వెళ్ళడమే మంచిది. ఒక్కసారి యశ్వంత్ కి అంతా చెప్పేస్తే మీ మనసు తేలిక పడుతుంది. మీరూ, వాయుపుత్ర హాయిగా వుండవచ్చు."

    అనూహ్య తలవంచుకుని కూర్చుంది. "నేను చెప్పగలనా" అని మనస్సులోనే సందిగ్ధంగా అనుకుంది. అర్థం చేసుకోలేనివారికి తన సమస్య చాలా చిన్నది. సున్నితత్వం, సెంటిమెంటు, సందిగ్ధత......లాంటి పదాన్ని 'మెటీరియలిస్టిక్' త్రాసులోవేసి తూచలేం. అదృష్టవశాత్తూ డాక్టర్ మాత్రం ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆమెలో ప్రవహిస్తున్న భారతీయ రక్తానికీ, మారుతున్న ఆధునిక సాంస్కృతికి  మధ్య జరుగుతూన్న పోరాటమే ఆమె  సమస్య. ఆమె మనసులో జరుగుతున్న పోరాటాన్ని ఆమె పరిష్కరించుకోవాలే తప్ప ఎవరూ ఏమీ చెయ్యలేరు.

 Previous Page Next Page