చివరికి ఏం మాట్లాడాలో తోచక "మీ సంగీతం ఎంతో హాయిగా వుంది" అన్నాను.
"నిజమే అయివుంటుంది. నా సంగీతం వినే మావారు నన్ను పెళ్ళి చేసుకున్నారు. కాని నా ఆస్థమాను భరించలేక, వొదిలి దూరంగా వెళ్ళిపోయారు."
ఇహ అక్కడ వుండటానికి భయం వేసింది. "వస్తానండి" అని కదిలాను. అంత త్రెంచునున్నట్లు రావటం ఆమెకు కష్టం కలిగిస్తుందనైనా ఊహించలేను.
"డాక్టరుగారూ, ఒక్కమాట!" అని పిలిచింది, వెనుకనుండి ఆగి, ఆమె వైపు రెండడుగులు వేశాను.
"ఇన్నిసార్లు హాస్పిటల్ లో ఎడ్మిట్ అయినా మీ అంత కర్తవ్య పరాయణుడైన డాక్టర్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చట వేస్తోంది నాకంటే చిన్నవారనుకుంటాను, మీకు వున్నతమైన భవిష్యత్తు వుండాలని ఆశీర్వదిస్తున్నాను."
ఆమె వంక కృతజ్ఞతా భరితంగా చూసి, తల వంచుకుని అక్కణ్నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాను.
అలాగే ఫిమేల్ వార్డులో పనిచేసిన నెలరోజుల్లోనూ ఎంతోమంది తాత్కాలికంగా సన్నిహితంగా వచ్చారు. ఒక సిస్టర్ బామ్మ మా వార్డులో ఎడ్మిట్ అయింది. సెరిబ్రల్ త్రాంబోసిస్ కేసు. ఆ సిస్టర్ లీవ్ లో వుంది. చీరె కట్టుకుని వార్డుకు వస్తూ వుండేది ఉదయం, సాయంత్రం వాళ్ళ బామ్మ దగ్గర కూర్చుని వెళ్ళిపోయింది. ఒకసారి ఆ పేషెంటుకు ఇంజక్షన్ చేస్తోంటే నీడిల్ బ్లాక్ అయి మందు ఎక్కలేదు బయటకు తీసేసి మళ్ళీ ప్రయత్నించబోతూంటే "అన్నిసార్లు పొడిస్తే ఎలా డాక్టర్ ?" అంది. నేనేమీ జవాబు చెప్పకుండా లోపలకు వెళ్ళి సూది మార్చి తీసుకువచ్చి ఆమెకు చెప్పబోతూంటే "మీరు కొత్తగా హౌస్ సర్జనయారా ?" అనడిగింది. అవునన్నట్లు తల ఊపాను, "నా కివ్వండి. నేను చేస్తాను" అంది "ఇవ్వను" అన్నాను ఆమె దెబ్బతిని. "నేను తర్దియర్ సిస్టర్ని తెలుసాండి" అంది. "కావచ్చు, కాని ప్రస్తుతం లీవ్ లో వున్నారు. ఒకవేళ లీవ్ లో లేకపోయినా సిస్టర్స్ ఇంజక్షన్ చెయ్యకూడదని నిబంధన వచ్చింది వినలేదా?" అన్నాను. "ఓహో రూల్స్ చెబుతున్నారే అంది ఉక్రోషంగా. "అవును, మనం రూల్స్ ప్రకారమే పోదాం" అని ఇంజక్షన్ చేసేసి అక్కణ్నుంచి వెళ్ళిపోయాను అప్పణ్నుంచీ, ఆమె నేనేది చేస్తున్నా వ్యాఖ్యానిస్తూ వుండేది. "అదిగో సిరంజిలో ఓ డ్రాప్ ఒలికిపోయింది, ఈ పూట బ్లడ్ ప్రెషర్ ఇంకా రికార్డు చెయ్యలేదు" అంటూ ఏదో సాదిస్తూండేది. నాకంటే తనకు ప్రతి విషయమూ తెలుసునన్న భావం ఆమె మాటల్లో కనబడుతూ వుండేది.
ఒకసారి యిలాగే ఆమె ఏదో అంటే నాకు వళ్ళు మండి "మీరేదో తెలుసునని మీరనుకుంటున్నారు. అన్నీ సగం సగం తప్పితే మీ కేపనీ పూర్తిగా చేతకాదు. బ్లడ్ ప్రెషర్ చూడటానికి దాని కఫ్ బిగించటం తప్పితే ఎలా చూడాలో మీకు తెలియదు. ఆఖరికి స్టెతస్కోప్ మెళ్ళో రాంగ్ సైడ్ లేకుండా వేసుకోవటం కూడా మీకు తెలియదు. వేసుకుని చూపించండి చూద్దాం" అన్నాను.
ఆమె ముఖం మాడిపోయింది. ఘాటుగా జవాబు చెబుదామని మాట కోసం తడుముకుందిగాని, ఏమీ దొరకలేదు.
పాపం ఒకరోజు వాళ్ళ బామ్మ చనిపోయింది. చిన్నప్పటి నుంచీ బామ్మే ఆమెను ఎంతో ప్రేమగా పెంచి పెద్దదాన్ని చేసిందట. రెండు చేతుల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, నాకు జాలేసి చివరకు నేనే ఓదార్చాను.
నెల అయ్యాక ,ఫిమేల్ వార్డు నుండి మేల్ వార్డుకు మారిపోయే ముందు, ఆఖరిదినం మా ఓ. పి. రోజు అయింది. నాయుడుగారు పేషెంట్లను ఎగ్జామిన్ చేస్తూ మధ్యలో తల ఎత్తి నావంక చూసి నవ్వి "రేపటి నుంచీ మీకీబాధ తప్పిపోయిందిలెండి" అన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. అంతలో ఓ యిరవై ఏళ్ళ స్త్రీ గుండెనొప్పి అని బాధ చెప్పుకుంటే తెర వెనక్కి తీసుకువెళ్ళి పరీక్షచేయాల్సి వచ్చింది.
స్టెతస్కోప్ ఆమె ఛాతీమీద వుంచి గుండె చప్పుళ్ళు వింటూ వుంటే, నళిని నా ప్రక్కన నిలబడి వుంది. లేడీ పేషెంటును పరీక్ష చేసేటప్పుడు ప్రక్కన విధిగా సిస్టర్ వుండాలి.
"చూడండి. మీ భుజాల వరకే వచ్చాను నేను" అంది నళిని నెమ్మదిగా.
నేనేం జవాబు చెప్పకపోయేసరికి, కాళ్ళు ఎత్తి యింకా ఎత్తుగా వుంటానికి ప్రయత్నిస్తూ "ఇంత అవస్థపడినా మీ చెవుల వరకైనా రాలేదు" అంది మళ్ళీ.
"కాబట్టి నా ప్రక్కన మీరు సరిపోరు" అన్నాను, యిహ ఊరుకోలేక.
ఆమె తల ఎత్తి నాముఖం వంక కోపంగా చూసింది. చక్రాల్లాంటి ఆమె కళ్ళలో రోషం తళుక్కుమంది.
నేనదేమీ గమనించనట్లు, ఆ స్త్రీతో "గుండెలో ఏమీ దోషం కనబడటం లేదమ్మా ! బలానికి టానిక్కులు వ్రాసిస్తాను పుచ్చుకో" అన్నాను.
నా మాటలు ఆమెకు తృప్తికలిగించలేదు. "ఎకసక్కాలాడుకుంటూ పరీక్ష చేస్తే ఎలా తెలుస్తుందండీ, జబ్బు వున్నది లేనిదీ, నాకు గుండెజబ్బు వుంది క్రిందటేడు యిలాగే నొప్పివచ్చి అయిదు నిమిషాలసేపు గుండె ఆగిపోయింది" అంది.
ఎంత ఆపుకుందామానుకున్నా నాకు నవ్వాగలేదు. దానికి తోడు నళిని వంక చూసేసరికి ఆమె కిల కిల నవ్వుతోంది. నేనూ ఫక్కుమని నవ్వేశాను.
ఆ స్త్రీకి కోపం వచ్చి బల్లమీద నుంచి లేచికూర్చుని, జాకెట్టు ముడి వేసుకుంటూ "ఎందుకండీ అలా పళ్ళికిలిస్తారు ? గుండె ఆగిపోయిందంటే అంత వెటకారంగా వుందా ?" అన్నది.
నేను చాలా లజ్జితుణ్నయినాను "అలా నవ్వటం తప్పే" అనేశాను.
"తప్పు కాదూ మరి?" అని బల్లదిగిపోయి, చెప్పులు తొడుక్కుని, గబ గబ వెళ్ళిపోయింది. నేను వెనకనే వెళ్ళి ఆమె కోసం చూశాను కాని, ఎంత వేగంగా అక్కడి నుంచి నిష్క్రమించిందో, ఎక్కడా కనబడలేదు ఆమె. ఓ.పి. చీటీ నా చేతిలో గాలికి రెపరెపలాడుతూ నన్ను వెక్కిరిస్తున్నట్లు తోచింది.
మధ్యాహ్నం రిపీట్ ఓ.పి.కి వచ్చాక కూడా నా మనసు మనసులో లేదు. నళిని కులాసాగా ఏదో చెబుతూనే వుందిగాని స్లిప్స్ మీద సంతకాలు యాంత్రికంగా పెడుతూ ముందుకు పడేస్తున్న నాకు అవేమీ వినిపించటంలేదు. మధ్య 'ఊ, ఆఁ' అంటున్నాను.
"డాక్టరుగారివాళ పరాకు చిత్తగిస్తున్నారు నా మాట ఒక్కటీ వినిపించుకోవటం లేదు" అంది నళిని ఫిర్యాదుగా.
ఉదయం జరిగిన సంఘటనే నా మనసులో యింకా తొలుస్తోంది. "సిస్టర్! ఆమె అమాయకంగా ఏదో అన్నదే అనుకో, మనమలా ఎగతాళిగా నవ్వటం ఏమీ బాగాలేదు."
"మీరు బలేవారండీ, ఆ విషయాన్ని యింకా మనసులో వుంచుకుని మధనపడుతున్నారా ? ఇంత సున్నిత హృదయం కలవారు డాక్టరుగా ఏం పనికి వస్తారు ?"
"తన గుండె బలహీనతను గురించి ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట ఆమె అంటుంది ? కొన్నాళ్ళయ్యాక నిజంగానే గుండెజబ్బుతో ఆమె మన హాస్పిటల్ లో ఎడ్మిట్ అయిందనుకోండి. అప్పుడు మన ముఖాలు మాడిపోవూ ?"
"ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు, మీ మాటలకు."
నేను కదలక మెదలక బొమ్మలా కూర్చోవటం చూసి "ఊరుకోండి, ప్లీజ్! మీరలా దిగాలుపడి వుండవద్దు. మీరలా వుంటే నా మీద ఒట్టేసుమండీ" అంది, మళ్ళీ తనే నా వంక ఆర్ద్ర నేత్రాలతో చూస్తూ.
ఒక నిట్టూర్పు విడిచి, "ఏమీలేదు సిస్టర్" అని మళ్ళీ తల వంచుకుని సంతకాలు పెట్టటంలో మునిగిపోయాను.
అయిదు గంటలకు జనమంతా వెళ్ళిపోయాక నళిని, మేల్ ఓ.పి. నుంచి లలితను కూడా తీసుకువచ్చి, తర్వాత బీరువా తెరిచి అందులోంచి స్వీట్సు, ఓ ప్లాస్క్ తీసుకొచ్చి బల్లమీద పెట్టి ,స్వీట్లు ప్లేట్లలో అమరుస్తోంది.
"ఇవన్నీ ఎందుకు ?" అన్నాను.
"రేపటి నుంచి మనం వార్డులు మారిపోతున్నం కదండీ. అంటే విడిపోతున్నా మనమాట. అందుకని నళిని మనకు పార్టీ యిస్తోంది" అంది లలిత.
"అయితే యిదివరకంతా ప్రతీ నెలా పార్టీ యిస్తూ వుండేదా మీ నళిని ?"
నళిని తల ఎత్తి నా వంక కొంచెం కోపంగా చూసింది.
"అది మనుషుల్ని బట్టి కూడా వుంటుంది కదండీ."
నళిని ప్లేటు ముందుకుతోసి "తీసుకోండి" అంది.
నేను వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర సబ్బుతో చేతులు కడుక్కు వచ్చి కూర్చుని ,"ఇంత విచ్చలవిడిగా మీరు డబ్బు ఖర్చు పెడితే ఎలా? ప్రతి ఓ.పి. రోజునా మీరే ఏమైనా తెప్పించి పెడుతూంటే దర్జాగా తినేస్తున్నాను గాని, నేను దమ్మిడీ ఖర్చు పెట్టిందిలేదు" అన్నాను.
నళిని తల ఎత్తి నా వంక చూసి "మీరంతా ఒకేసారి ఖర్చు పెడుదురుగానీ, తీసుకోండి" అంది.
ఆమె, లలితా ప్రక్క ప్రక్క సీట్లలో కూర్చున్నారు.
"మీకెంత యిస్తారు నెలకి ? నూటయాభయి కదూ' అంది లలిత, నన్ను ఉద్దేశించి.
"అవును. మీకో ?"
"మా కెంతిస్తారండీ ? తొంభయి రూపాయలదాకా ముడుతుంది"
"అంతేనా ?" అన్నాను ఆశ్చర్యంగా.
"అంతే! అందులోనే మా భోజనం, టిఫిన్ వగైరాలు, రూమ్ రెంటూ అందులోనే. మా తిండి ఎలా వుంటుందని అడక్కండి. ఇహ మా యితర ఖర్చులూ, వారం వారం సినిమాలూ అన్నీ అందులోనే సరి పెట్టుకోవాలి, యూనిఫారం ఎలవెన్సులు మాత్రం అప్పుడప్పుడూ యిస్తూ వుంటారు."
ఒక నిముషం మౌనంగా గడిచింది.
"మమ్మల్ని చూస్తే మీ కేమనిపిస్తుంది ?" హఠాత్తుగా అడిగిందీ ప్రశ్న లలిత.
నేనూ అంత హఠాత్తుగానే జవాబిచ్చాను ! "మిమ్మల్నే కాదు, ఏ సిస్టర్ని చూసినా నా కెప్పుడూ ఒకటే అనిపిస్తుంది _ ముఖమంతా బాగానే అద్దుకుని చెవుల దగ్గర మాత్రం కాస్త ఎందుకు వదిలి పెడతారా పౌడర్ అని."