ఒక్కసారిగా యిద్దరూ ఫక్కుమని నవ్వేశారు. ఆ మాటల్ని తలుచుకుని మరీ నవ్వారు.
"ఏమీ తెలియని అమాయకుల మనుకున్నాను, గడుసువారే" అన్నది లలిత.
నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ ఫలహారం పూర్తిచేసి కాఫీలు తాగేశాము.
"అన్నట్లు రేపట్నుంచీ మీరు ఏ వార్డులకు మారుతున్నారు ?" అనడిగాను తర్వాత.
నళిని భుజాలు కదిపి "హమ్మయ్య ! యిప్పటికైనా గుర్తు వచ్చిందన్నమాట యీ సంగతి" అంది నిష్ఠూరంగా. "నేను సర్జికల్ కి మారుతున్నాను లలిత స్కిన్ కి పోతున్నది."
అంతలో బయటి నుండి మరో సిస్టర్ వచ్చి లలితను పిలిచింది. ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె బయటకు వెళ్ళిపోయింది.
నళిని బల్లమీది టేబిల్ క్లాత్ మీద తన తెల్లని వ్రేళ్ళతో సున్నాలు చుడుతోంది "ఇక్కణ్నుంచి వెడుతున్నందుకు మీకు కష్టంగా లేదూ ?" అంది వినిపించీ వినిపించనట్లు.
నేను ఆమెవంక ఒకసారి చూసి మళ్ళీ దృష్టి ప్రక్కకి మరల్చి "కష్టంగా వుంటే ఎలా సిస్టర్ ? మన వృత్తి ధర్మంమీద అనేక వార్డులలో పనిచేసి తిరిగి ప్రతిచోటినుంచి వెళ్ళిపోతూ వుండాలి. ఎక్కడ పనిచేసినా మన విధ్యుక్త ధర్మం ముఖ్యంగాని వేటినీ గణనకి తీసుకోకూడదు " అన్నాను.
"అంతేనా ?" అన్నదామె ,నీరసంగా. క్రింద పెదవిని పంటితో నొక్కిపట్టింది, ఒక్కక్షణం. ఆమె చూడకుండా ఆమె వైపు చూశాను.
"పోనీ ,మే మెప్పుడైనా గుర్తువస్తామా, మీకు ?"
"మీ అంత మంచి....మంచి అమ్మాయిని ఎలా మరిచిపోగలను ?"
"పోండి. అన్నీ బడాయిలు. మీకు చీమ కుట్టినట్లుకూడా వుండదని నాకు తెలుసు. ఏదీ_ప్రామిస్ చెయ్యండి ,నేను ఏ వార్డులో వున్నా తరుచు వచ్చి కనిపిస్తుంటానని" అని, కుడిచెయ్యి ముందుకు జాచింది.
"క్రిష్టియన్ పిల్లవు. నీకు ఒట్టు వేయటంలో నమ్మక మున్నదా ?" 'నీవు' అనే ప్రయోగం నా నోటి వెంట అప్రయత్నంగా వెలువడింది.
"ఆఁ" అంది, ఆమె తల వూపుతూ. "నాకు నమ్మకమే, ఏదీ వెయ్యండి."
"నాకైతే నమ్మకం లేదు కాని మీ తృప్తి కోసం" అంటూ ఆమె చేతిలో చెయ్యివేసి, ఆమె చెప్పమన్న మాటలు చెప్పాను.
తర్వాత లలిత వచ్చింది, లోపలకు. నేనామె చెయ్యి వదిలేసి యిద్దరికీ చెప్పి బయటకు వచ్చేశాను. కొంతదూరం పోయి వెనక్కి తిరిగి చూసేసరికి ఆడపిల్ల లిద్దరూ గుమ్మం దగ్గర నిలబడి నా వంక చూస్తున్నారు. నళిని పెదవులు ఏదో చెబుతున్నట్లు కదులుతున్నాయి.
* * *
మర్నాడు వార్డుకు వచ్చేశాను. జగన్నాధం ఫిమేల్ వార్డుకి మారిపోయాడు.
రామదాసుగారిలో ఎదుటివారిలో తప్పులెంచాలనే గుణం వున్నది. డానికి తోడు జగన్నాధం కొంచెం మొండిఘటం. అందుకని ఆయనకూ, అతనికీ ఎప్పుడూ ఏదో తగాదా పడుతూందిట. జగన్నాధ మోసారి ఓ బ్లడ్ ప్రెషర్ పేషెంటుకు సర్ పాసిల్ యింజక్షన్ రెండోసారి యివ్వాల్సి వచ్చి, నేనారోజు డ్యూటీలో వుంటే, ఆ పని నాకు పురమాయించి వెళ్ళిపోయాడు. నేను మిగతాపన్లు చూసుకుని ఆ పేషెంటుకు యింజక్షన్ చేసే సరికి ఏడు దాటిపోయింది. అప్పుడు నైట్ సిస్టర్ డ్యూటీలో వుంది. మరునాడు ఉదయం రామదాసుగారు డే సిస్టర్ని "నిన్న హౌస్ సర్జన్ ఆ పేషెంటుకు యింజక్షన్ యిచ్చాడా ?" అని అడిగాడు. ఆమె యివ్వలేదన్నది. ఆయన జగన్నాధాన్ని పట్టుకు దులిపేస్తున్నాడు. ఆ సమయానికి అక్కడేదో పని వుండి నేను వెళ్ళాను. సందర్భం తెలుసుకుని నేనిచ్చాననీ, అయితే ఏడుగంటల తర్వాత యివ్వటంవల్ల ఆమెకు తెలియదనీ అన్నాను. "నో నో, అలా వీల్లేదు. బి.డి. యింజక్షన్ లు రెగ్యులర్ హౌస్ సర్జన్ వచ్చి యివ్వవలసిందేగాని, డ్యూటీ హౌస్ సర్జన్ యివ్వటానికి వీల్లేదు" అన్నాడు.
నేను వచ్చిన మరునాడే, ఉదయం ఒక డయాబిటిక్ పేషెంటుకు యిన్ స్యులిన్ యివ్వాల్సి వచ్చింది. అతనంతకు ముందు యిరవై రోజుల బట్టీ హాస్పిటల్ లో వుంటున్నాడట ఇంజక్షన్ యిచ్చాక రామదాసుగారు వచ్చి చీఫ్ రౌండ్సుకి వచ్చేలోగా కాఫీలు వెళ్ళివద్దాం రమ్మని తీసుకువెళ్ళాడు.
ఆయనకు రోజూ పదీ పదకొండు గంటల మధ్య ఒకసారి కాఫీకి వెళ్ళటం, వెళ్ళేటప్పుడు హౌస్ సర్జన్ని కూడా తీసుకు వెళ్ళటం అలవాటు. కొన్నికొన్ని సందర్భాలలో చనువుగా వున్నా ఆత్మీయత సృష్టించుకోలేడాయన. మిగతా వార్డుల నుంచి కూడా ఆ సమయానికి అసిస్టెంట్లూ, హౌస్ సర్జన్లూ వస్తారు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుని ఎవరి దార్న వారు విడిపోతారు.
కాఫీ త్రాగటమయాక అలా లైబ్రరీవైపు వెళ్ళి వస్తాననీ, నన్ను వార్డుకి వెళ్ళి వుండమనీ చెప్పి రామదాసుగారు టెన్నిస్ కోర్టు దాటి వెళ్ళిపోయాడు.
నేను వార్డుకి వెళ్ళేసరికి అక్కడి వాతావరణమంతా గగ్గోలుగా వుంది. సిస్టర్సు హడావుడిగా అటూ యిటూ పరుగెడుతున్నారు.
నన్ను చూసి ఒక సిస్టర్ చాటంత ముఖమవగా "డాక్టర్! వచ్చారా? త్వరగా వెళ్ళి బెడ్ నెంబర్ త్రీని చూడండి అతని పరిస్థితి బాగా లేదు" అంది.
నా గుండె గబగబ కొట్టుకుంది. బెడ్ నెంబర్ త్రీ అంటే నేను యిందాకా యింజక్షన్ యిచ్చిన డయాబిటిస్ పేషెంటు నాలుగడుగుల్లో అక్కడికి పరుగెత్తుకు వెళ్ళాను. పేషెంటు కండ్లు తేలవేసి, కొన ఊపిరితో పడివున్నాడు. నాడి అందడంలేదు. సిస్టర్సు గాబరాపాడుతున్నారు తప్ప ఏం చెయ్యాలో వాళ్ళకు తెలియటం లేదు.
ఒకక్షణం పోయాక నాకు మెదడు పనిచేసింది. నేను యిన్ స్యులిన్ యిచ్చి వెళ్ళానుకదా! అతని పక్కనే వున్న చిన్న బీరువా తలుపు తెరిచి చూసేసరికి అతనికి పొద్దుట యిచ్చిన రొట్టె, పాలు అలాగే వున్నాయి. హైపోగ్లైస్ మియా వచ్చింది అతనికి.
"సిస్టర్, ఇతనికి వెంటనే గ్లూకోజ్ ఐ.వి.గా ఇవ్వాలి ,హండ్రెడ్ సి.సి. తీసుకురండి. క్విక్!" అన్నాను.
"అలాగే డాక్టర్" అని ఆమె అక్కణ్నుంచి పరుగెత్తింది.
ట్వెంటీఫైవ్ సి.సి.సిరంజితో, సూది శరీరంలోనే వుంచి నాలుగుసార్లుగా గ్లూకోజ్ ఎక్కించాను. అయిదు నిమిషాల్లో పల్సు అంది పేషెంటు నిమ్మదిగా కళ్ళు తెరిచాడు.
"ఎలా వుంది?" అనడిగాను.
"బాగానే వుంది" అని సౌంజ్ఞ చేశాడు.
"పొద్దుటినుంచీ ఖాళీ కడుపులో వున్నావా ? ఇన్సులిన్ చేసేముందుగాని, చేసిన వెంటనేగాని ఆహారం తీసుకోవాలని చెప్పానా ?" అన్నాను.
అతనికి యాభయిఏళ్ళ వయసుంటుంది. బట్టతల ,అమాయకమైన ముఖం. "తినాలనిపించటంలేదండీ" అన్నాడు నిర్లిప్తంగా.
"ఇతను రోజూ ఇంతే డాక్టర్ ! ఏదీ సరిగ్గా తినడు. తన కిచ్చే యిడ్లీ, రొట్టే, పాలుకూడా వాళ్ళకూ వీళ్ళకూ పందారం వేస్తూ వుంటాడు. ఎప్పుడూ ఏ భగవద్గీతో, భాగవతమో చదువుకుంటూ వుంటాడు. ఏమీ పట్టించుకోడు" అంది సిస్టర్.
"ఏమండీ ! నిజమేనా ?" అనడిగాను.
అతనేం మాట్లాడలేదు.
"డయాబిటిస్ మీకు యివాళ కొత్తకాదుకదా ! అన్నీ తెలిసివుండి కూడా, అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎలా"
అతను జవాబు చెప్పకుండా, చిన్నగా నవ్వి మగతగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
తర్వాత యీ విషయం చీఫ్ కు తెలిసింది. "మీరు షుగర్ టెస్టు చేయకుండానే యిన్ సులిన్
యిచ్చారా ?" అనడిగాడు, కళ్ళు చికిలించి.
"చేశానండి."
"ఎంతిచ్చా రేమిటి ?"
"ఫార్టీ యూనిట్స్. మీరు ప్రిస్క్రైబ్ చేసిందేనండీ."
ఒక నిమిషం వూరుకుని "చూశారా? ఏమరుపాటుగా వుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ! వెయ్యికళ్ళతో కనిపెట్టి వుండాలి వార్డుని" అంటూ వెళ్ళిపోయాడు.
పేషెంట్లలో రకరకాలు చూశాను. జయిల్లో పడేసినట్లుగా పడేసే తిండికోసం కొంతమంది పడిగాపులు పడి కూర్చుంటే, కొంతమంది హాస్పిటల్ ని నరకూపంతో పోల్చుకుని, ఎప్పుడు అక్కడి నుండి బయట పడదామా అని చూస్తుంటే, మరికొంతమంది హాస్పిటల్ మంచాలకు అంటుకుపోయి బ్రతుకుదామని ప్రయత్నించేవాళ్ళు. వాళ్ళచేత 'నాకు కులాసాగానే వుంది' అనేమాట అనిపించలేం. వారు ఏకరువు పెట్టే శరీర రుగ్మతలకు, అంతులేదు. లేని జబ్బులు, వల్లమాలిన బాధ నటించి హాస్పిటల్ లో ఎడ్మిట్ అయినవాళ్ళని నే నెరుగుదును. ఒకరికి యింజక్షన్ పిచ్చి, ఒకరికి అరకు మందు పిచ్చి, ఇంకొకరికి ఆపరేషన్ పిచ్చి, "నా జబ్బేమిటో కని పెట్టకుండా మెడికల్ వార్డులో చేర్పించారు. నాది ఆపరేషన్ కేసండీ బాబూ ! కత్తితో తెగకొయ్యందే నా బాధకు విముక్తి లేదు" అంటారు యీ తెగవారు.
ఒకసారి కడుపులో నొప్పికని ఎడ్మిట్ అయిన ఒక పేషెంటు అరగంటకోసారి గట్టిగా కేకలు పెట్టటం మొదలు పెట్టాడు. ఎట్రాపిన్ ఇంజక్షన్ యిస్తే కాసేపు గప్ చిప్ గా పడుకునేవాడు, కొంచెమాగి మళ్ళీ మొదలు. అక్కడికేదో పనిమీద వచ్చిన నాయుడుగారు అదిచూసి నన్ను ప్రక్కకి పిలిచి "అతని ఎత్తులన్నీ ఇంజక్షన్ కోసమే డాక్టరుగారూ! సైకలాజికల్ గా సూది పొడిస్తేనేగాని బాధ తగ్గదని అతని నమ్మకం. కావాలంటే ఈసారి టూ సి.సి.డిస్టిల్ వాటర్ యిచ్చి చూడండి, నామాట అబద్దమవుతుందేమో" అన్నాడు.
నేను సంకోచిస్తున్నాను.
"ఫర్వాలేదు డాక్టరుగారూ ! నేనున్నాను ప్రక్కన, ఇచ్చెయ్యండి" అని బలవంతం చేశాడు.
ఇహ బాగుండదని, డిస్టల్ వాటర్ సిరంజిలోకి తీసుకువచ్చి ఇంజక్ట్ చేశాను.
ఒక నిమిషమన్నా గడవక ముందే పేషెంటు మూలగటం మాని మెదలకుండా పడుకున్నాడు.