అందులో ఉదయంపూట పని సక్రమంగా గడవటానికి ఒకవిధంగా సిస్టర్స్ సహాయభూతంగా వుండేవాళ్ళుకారు. వాళ్ళెప్పుడూ అతి సీరియస్ గా పేజీలకు పేజీలు రికార్డు రాసేస్తూ వుండేవారు. వాళ్ళేమి రాస్తారో నా కర్దమయేది కాదు. ఆ పుస్తకం తీసి యీ పుస్తకం, యీ పుస్తకం మూసేసి మరో పుస్తకం యిట్లా తెగరాసేవాళ్ళు. పేషెంటుకి నెత్తురు తియ్యటానికి, లంబార్ పంక్చర్ చెయ్యటానికి, యింకా కొన్ని పనులకూ సిస్టర్ తప్పని సరిగా ప్రక్కన వుండాలి. వాళ్ళు సాధారణంగా సహాయం చెయ్యటానికే ప్రయత్నించేవారు. కాని యింతలో ఒకళ్ళు క్లాస్ టైమయిందని పరిగెత్తుకు పోయేవారు. మరొకరు స్పెషల్ క్లాస్ నుంచి బెల్ వచ్చిందని హడావుడిగా వెళ్ళిపోయేవారు. ఇన్వెస్టిగేషన్స్ కు పంపించే స్పెసిమన్స్ అన్నీ పది గంటలలోపుగా తయారుచెయ్యాలి. వాటికి రిక్విజషన్లు రాయాలి సీసామీద పేరు, వివరాలు రాసిన చిన్నచిన్న చీట్లు పేస్టుతో అంటించాలి. ఆ రోజున పంపించకపోతే చీఫ్ రౌండ్స్ లో దులిపేస్తాడు. ఇక్కడ ఆయా "ఎంతసేపు బాబూ ఆలస్యం" అని తొందరపెట్టి గోలచేస్తూ వుంటుంది. ఎన్నోసార్లు ఆయా కనిపించకపోతే స్పెసిమన్స్ అన్నీ చేతపట్టుకుని, అందుకు సంబంధించిన డిపార్టుమెంట్స్ కు స్వయంగా అందజేసి వస్తూండేవాణ్ని.
కొంతమంది సిస్టర్స్ అతి సీరియస్ గా వుండేవాళ్ళు. వాళ్ళకేమైనా పని చెబుతే ఉలకరు, పలకరు. ఊ అనరు, ఆ అనరు, వాళ్ళకు వినిపించిందీ తెలియదు ,వినపడనిదీ తెలియదు, ఎంతకీ చెయ్యటం లేదుకదా అని మరో మారు గట్టిగా చెబుతే "చేస్తున్నాం కదండీ. అలా అరుస్తారేం" అని కసురుకుంటారు.
ఇంతకీ వాళ్ళతో మంచిగా వుండి పనిచేయించుకోవాలేగాని, దబాయించి నెగ్గుకురాలేం. హౌస్ సర్జన్ కూ, నర్సుకూ యీ తగాదా ఎప్పుడూ వస్తూ వుండేది. చీఫ్, అసిస్టెంటులు తమమీద అధికారం చలాయిస్తే లోలోపల బుసలుకొట్టినా, దిగమ్రింగి వూరుకునేవాళ్ళు సిస్టర్లు. అసిస్టెంట్ అదివరకు కొంచెం చనువు యిస్తూ వస్తున్నవాడైతే, అతన్ని కూడా ఒక్కోసారి తీసిపారేసేవాళ్ళు. అలాగే హౌస్ సర్జన్ తొందరపడి, వాళ్ళని ఏదైనా మాట అని తమ హోదా ప్రదర్శించుకోవటానికి ప్రయత్నిస్తే వాళ్ళకు తిక్కరేగి ఎదురు తిరిగేవాళ్ళు.
కాని తరిచి చూస్తే సిస్టర్లంతా ఎంతో మంచివాళ్ళు వారితో మృదువుగా వ్యవహరిస్తూ, తమ మర్యాద కాపాడుకునేటంత గంభీరంగా ప్రవర్తిస్తే వాళ్ళెంతో వినయంగా మసలుకుంటారు.
సాయంత్రాలు రెండవసారి ఇన్ జక్షన్లు చెయ్యటానికీ, కేసులు పర్యవేక్షించటానికీ ఫీమేల్ వార్డుకి వెళ్ళగానే "డాక్టరుగారొచ్చారు, డాక్టరు గారొచ్చారు" అంటూ అంతా లేచి కూర్చునేవారు. అందులో గత నెల నుండి మందు తింటూ, హాస్పిటల్ కు అంటిపెట్టుకు పోయినవారు యిద్దరు ముగ్గురున్నారు. వాళ్ళు "డాక్టరుగారు మంచి మారాజు. అంతకుముందు చేసినాయన ఎప్పుడూ చిర్రుబుర్రు లాడుతూండేవాడు. ఈయన ముఖాన ఎప్పుడూ చిరునవ్వు చిందుతూ వుంటుంది. కోపమంటే ఏమిటో ఎరగడు" అని అనుకోవడం నా చెవిన పడేది.
"ఈ డాక్టరుగారు ఇంజక్షన్ చేస్తే చేసినట్లే వుండదు. చల్లని చెయ్యి బాబుగారిది" అనుకునేవాళ్ళు కొందరు.
"మీరు మరీ అంత మంచిగా వుండకూడదండీ. రోజు రోజుకూ మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఎక్కువయిపోతున్నారు. అంతేగాక మేమెప్పుడైనా వాళ్ళని విసుక్కుంటే మమ్మల్ని మీతో పోలుస్తూ మాట్లాడుతున్నారు. ఈ విధంగా మీరు మామీద చాలా దెబ్బకొడుతున్నారు" అంది ఓసారి, ఆ వార్డులోని సిస్టర్స్ నా మీద నేరం ఆరోపిస్తూ.
దగ్గరకు వెళ్ళగానే రోగులు మళ్ళీ రేపటిదాకా కనబడను కదా అన్న ఆదుర్దాలో అనుకుంటాను _ గడగడమని పాఠం ఒప్పజెప్పేవాళ్ళు. వాళ్ళు అనుభవించే ప్రతి విషయమూ, తరచి తరచి విశదీకరిస్తే యిచ్చే మందుకూ, వాళ్ళు వివరించే ప్రతి అంశానికి సంబంధం వుంటుందని వాళ్ళ విశ్వాసం. ఒక్కొక్కళ్ళు పట్టుకుంటే వదిలి పెట్టేవారు కాదు. "ఇదిగో యిది విను నాయనా" అంటూ మొదలుపెట్టి వాళ్ళకు ఎన్నిసార్లు కడుపు నొప్పి వచ్చిందో, ఎన్ని గంటలూ ఎన్ని నిమిషాలకు వాంతి అయిందో, రాత్రిళ్ళు ఎన్నిసార్లు ఉలిక్కిపడి లేచిందో లెక్కలు కట్టి చెప్పేవాళ్ళు. కొందరు తమ జీవిత చరిత్రలు వినిపించి కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు. కొంతమంది దగ్గర కూర్చో పెట్టుకుని ముఖంవంక చూస్తూ పడుకుని అయిదేసి నిమిషాల కో మాట చొప్పున మాట్లాడేవారు, కొంతమంది కాస్త జబ్బుకే భయపడిపోయి, గోరంతను కొండంతగా చేసేసేవాళ్ళు. కొంతమంది ఎంత జబ్బు చేసినా ధైర్యంగా వుండి మెదలకుండా పడుకునేవారు. కాని సాధారణంగా అందరూ అనేమాట ఒకటి వుండేది, "పుట్టి యిన్నేళ్ళయిందిగాని ఒక్కనాడూ తలనొప్పి అంటే ఎట్లా వుంటుందో కూడా ఎరుగను డాక్టరు గారూ! ఇదిగో యీ మాయదారి జబ్బు వచ్చి నా అంతు కనుక్కుంది" అని, జన్మించాక జబ్బంటే ఏమిటో యింతవరకూ తెలియనట్లూ, శరీరంలో అస్వస్థత ప్రవేశించటం యిదే మొదటిసారి అయినట్లు మాట్లాడేవారు.
ఇంకోరకం చిత్రమైన పేషెంట్లు వుండేవారు. "నిన్న మీరు యింజక్షన్ చేశాక జ్వరం ఎక్కువయిందండీ" అనేవారు.
వాళ్ళకు యిలా సమాధానం చెబుతూవుండేవాణ్ని, "కొంప తగులడు తూన్నప్పుడు నీరు జల్లితే మంట ఎక్కువవుతుందా ? తక్కువవుతుందా ? నీరు సరిపోతే మంట ఆరిపోతుంది చాలకపోతే మంట చల్లారదు. అలాంటప్పుడు నీళ్ళు చల్లటం వల్ల మంట ఎక్కువయిందంటే ఎవరైనా నవ్వుతారా, నవ్వరా ? అలాగే యింజక్షన్ యిచ్చినా వ్యాధి ఉద్రిక్తతవల్ల జ్వరం తగ్గివుండకపోవచ్చు. లేక ఆ వ్యాధి కా మందు పనిచేసి వుండకపోవచ్చు. అంతేకాని మందివ్వటంవల్ల జ్వరం ఎక్కువవుతుందా ఎక్కడైనా ?"
ఆడవాళ్ళను పరీక్షచేసి, హిస్టరీ తీసుకుంటూ కేసుషీటు పూర్తిచేసేటప్పుడు కొంచెం ఉపాయంగా వ్యవహరించాలి. కేసు షీటులో ఉదహరించిన ప్రకారం ప్రతివారినీ అడగవలసిన ప్రశ్నలు కొన్ని వున్నాయి. "నీకేమైనా పొగత్రాగటం అలవాటుందా ? సుఖవ్యాదులేమైనా వున్నాయా ? త్రాగుతావా ?" యిత్యాదులు.
నేను క్లినికల్ క్లాసులలోకి కొత్తగా వచ్చినపుడు మా బ్యాచిలో ఒక విద్యార్ధి ఒక కుటుంబ స్త్రీని పట్టుకుని "నీకు త్రాగుడు అలవాటుందా ?" అని అడిగాడు, హిస్టరీ తీసుకుంటూ, అతి సీరియస్ గా.
"బుద్ధిలేదటయ్యా నీకు ? ఆడకూతుర్ని పట్టుకుని 'తాగుతావా' అంటావా ? కర్మంకాలి ఆసుపత్రిలో అడుగెట్టానని నీ యిష్ట మొచ్చినట్లు ,మాట్లాడుతావా ? నీకు అప్పలూ చెల్లెళ్ళూ లేరూ ?" అంటూ వెంటనే ఆమె తారామండలానికి లేచింది.
పాపం, ఆ విద్యార్ధి హడలిపోయి, మూడు రోజులు హాస్పిటల్ ముఖం చూడలేదు.
ఆ సంఘటన జరిగినప్పట్నుంచీ అలాంటి ప్రశ్న లడిగేటప్పుడు చాలా జాగ్రత్తపడేవాణ్ని. కూలీ నాలి చేసే ఆడవాళ్ళలో చాలా మందికి చుట్టలు కాల్చే అలవాటు వుంటుంది. నోరు వాసనచూస్తే ఆ విషయం తెలిసిపోయేది సుఖవ్యాధుల్ని గురించి అడగాలంటే __ ఎప్పుడైనా గర్భిణీ పోయిందా', 'మీవారికేమైనా చెడు అలవాట్లున్నయా ?' ఇలా ప్రశ్నలు వేసేవాణ్ని. ఒక్కొక్కసారి అవసరమను కొంటే చాదస్తంగా అడగక, ఆ ప్రశ్నలు తప్పించేవాణ్ని.
రాత్రిపూట నిద్రరాని రోగులందరూ ఒకచోట చేరి బాతాఖానీ వేస్తూండేవారు. వారిలో ఒక్కొక్కరు మంచి మాటకారి వారయివుండి, ఛలోక్తులు విసురుతూ ప్రక్కవార్ని నవ్విస్తూ వుండేవారు.
ఒకసారి డ్యూటీరోజున రాత్రివేళ వార్డుకు వెళ్ళేసరికి ఒక పాతికేళ్ళ స్త్రీ మంచంమీద పడుకుని, మెల్లగా భజనగీతాలు పాడుకుంటోంది. ఆవిడ ఉబ్బసరోగి. ఉబ్బసవ్యాధికి పరాకాష్టదశ స్టేటస్ ఆస్తమాటికస్ వచ్చి హాస్పిటల్ లో ఎడ్మిట్ అయింది. ఇప్పుడు తగ్గి, కాస్త కులాసాగానే వుంది. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అయి వెళ్ళిపోతుంది.
ఎంత మధురంగా పాడుతోందని, నేను బండరాయినని చాలామంది అనుకున్నా, ఎవరూ గుర్తించలేని ఆరాధనాభావాలు నాలో చాలా వున్నాయి. ఆ మధురసంగీతం వింటూ అయిదు నిమిషాల సేపు అలా మ్రాన్పడి నిలబడిపోయాను.
తాదాత్మ్యం చెందుతూ కాసేపలా ఆమె పాడుకున్నాక, ఎందుకో తలఎత్తిచూసి ఆ మసక వెల్తురులో నన్ను చూసి గుర్తించి వెంటనే నాలిక కరుచుకుని లేచి కూర్చుంటూ ,"రండి డాక్టరుగారూ ! ఎంత సేపయింది వచ్చి ?" అనడిగింది మర్యాద ఉట్టిపడే కంఠంతో.
నే నామెకు కొంచెం దగ్గరగా వెళ్ళి "ఎక్కువసేపు అవలేదులెండి. మీ ఆనందానికి భంగం కలిగించా ననుకుంటాను" అన్నాడు.
"భలేవారే మీ డ్యూటీ నిర్వహణకు నేనే అంతరాయం కలిగించాననుకుంటాను" అన్నది మృదువుగా.
ఆమె ప్రస్తుతం బక్కచిక్కి శల్యావశిష్టంగా వున్న ఒకనాటి సౌందర్యరేఖ లింకా పూర్తిగా మాసిపోక సంక్షిప్తంగా అక్కడక్కడా దాగివున్నాయి.
"నేను రేపు వెళ్ళిపోతాను డాక్టర్ గారూ !" అన్నదామె తిరిగి.
"నిజమే, స్వస్థత చేకూరాక హాస్పిటల్ లో ఒక్కక్షణం కూడా వుండాలనిపించదుకదూ ! ఎప్పుడు యిక్కణ్నించి పారిపోయి మనవారి దగ్గరకు వెళ్ళిపోదామా అనిపిస్తుంది" అన్నా నప్రయత్నంగా.
ఆమె కళ్ళు నిశ్చలంగా ఒకింతసేపు చూశాయి. "నాకలా అనిపించదు" అంది.
"అదేం ?"
ఆమె నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా "మీరు నన్ను ఇదివరకూ చూడలేదేమోగాని, నాలుగయిదుసార్లు యింత సీరియస్ దశలోనే హాస్పిటల్ లో ఎడ్మిట్ అయ్యాను. కాకపోతే వార్డు వేరుకావచ్చు, బెడ్ వేరుకావచ్చు. కాని యిక్కడి మనుషులూ, యిక్కడి వనస్తత్వాలూ, ఇక్కడి సందడీ, ఇక్కడ వాతావరణమూ నా కెంతో యిష్టం. బయటి నా వంటరి జీవితంకన్న, ఇక్కడి మంచంమీద పడుకుని, ప్రక్కన వుండే నాలాంటి రోగుల్నీ, యూనిఫారమ్ లో అటూ ఇటూ తిరిగే నర్సులనూ, రోజుకు రెండు మూడుసార్లు వచ్చి పలకరించే డాక్టర్లనూ, వారి తెల్లని కోట్లూ, వారి మెడలలో వ్రేలాడే స్టెతస్కోప్ లూ_ ఇవన్నీ చూస్తూంటే నా కెంతో వేడుకలా ముచ్చటగా వుంటుంది" అన్నది.
రెండు నిమిషాలు మా యిద్దరి మధ్యా మౌనంగా గడిచాయి. 'మీరు వంటరి వ్యక్తా? మీకెవరూ లేరా?' అన్న ప్రశ్నలు నోటిదాకా వచ్చాయి. కాని యితరుల స్వంత విషయాలలో కుతూహలం చూపించటం మంచిది కాదని, ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాను.