Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 15

                                 


                                        సినిమా గ్లామర్ కధ

                                    

                
    పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ నిర్మాత అవస్త చూసి జాలిపడి ఇలా అంది.
    "నిర్మాతా! ఈ సినీ ఫీల్డ్ మీద నీకున్న గ్లామర్ చూస్తుంటే నవ్వొస్తుంది. నీలాగానే సినిమా ఫీల్డ్ మీద గ్లామర్ మోజుతో తన గ్రామాన్ని వదిలి మద్రాసు చేరుకున్న బిజిలి అనే అమ్మాయి కధ చెప్తాను జాగ్రత్తగా విను. చివర్లో కోశ్చన్స్ ఉంటాయన్న సంగతి గుర్తుంచుకుని మరీ విను!
    మచిలీ అనే ఊళ్ళో బిజిలీ అనే అమ్మాయి ఉండేది. పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్లు ఆ పిల్ల పుట్టడమే సినిమా హల్లో పుట్టింది. జరిగిందేమిటంటే వాళ్ళమ్మ నెలలు నిండాకా కూడా తన అభిమాన నటుడి సినిమా చూడాలన్న కోరికతో సెకండ్ షో కెళ్ళింది. అక్కడ తన అభిమాన హీరోను విలన్ దొంగచాటుగా చావుదెబ్బలు కొట్టేసరికి హీరో కంటే ఎక్కువగా బాధపడి అలా ఆ బాధలో నుంచి పురిటి బాధలో కెళ్ళి పోయింది. మొత్తానికి ప్రేక్షకులు, హాలు వాళ్ళు కలిసి సినిమా ఆపి తెల్లారేసరికల్లా డెలివరీ గొడవ పూర్తి చేయించి అప్పుడు అందరూ కలిసి మిగతా సినిమా చూసి ఇళ్ళకు వెళ్ళారు. అంచేత బిజిలి పుడుతూనే సినిమా చూసి ఆనందంగా బోసినవ్వులు చిందించింది. అప్పటి నుంచి ప్రతిరోజూ సినిమా పాటలు వినిపించడమో, సినిమా పత్రికల్లోని రంగు రంగుల సినిమా బొమ్మలు చూపిస్తేనో చాలు ఎంత ఏడుపులో ఉన్నా టకీ మని నవ్వేది. అయిదో ఎడోచ్చేసరికి తెలుగు సినిమా పాటలన్నీటికీ డాన్స్ చేయడం నేర్చేసుకుంది. టీచర్ లేకుండానే.
    ఇది చూసి ఆమె తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
    "మా అమ్మాయి పెద్ద తారయిపోతుంది. అబ్బో అబ్బో ఎంత అదృష్టం!" అని మురిసిపోయి ఆ పిల్ల సినిమాల్లో నటించడానికి కావలసిన హంగులన్నీ నేర్పించడం ప్రారంభించారు. భరతనాట్యం, కూచిపూడి, మరి పాతిక రకాల డాన్సులు, సంగీతం, వీణ, జనం ఈల వేసే కదలికలూ ....
    ఈలోగా మరో పక్క సినీతారల జీవితాలేలా ఉంటాయో , ఎలా మాజిక్కులు చేసి అనేక సినిమాల్లో బుక్కయిపోతారో, గాసిప్ కాలమ్స్ ని ప్రోత్సహించి ఎలా తమ పేరు , ఫోటోలు ఎప్పుడు పత్రికల్లో , జనంలోనూ నిలబెట్టారో అన్నీ నేర్చేసుకుంది బిజిలీ.
    ఆ పిల్లకు పదహారేళ్ళు వచ్చేసరికి 'పదహారేళ్ళు' సినిమా కూడా అప్పుడే రిలీజయింది. 'అయితే సిన్మాలో చేరడానికి ఇదే సరయిన వయసన్న మాట!" అనుకుని తల్లిదండ్రుల తో సహా మద్రాస్ చేరుకొని పాండీ బజార్లో ఓ పెద్ద ఇళ్ళు, ఫోన్ తో సహా అద్దెకు తీసుకుంది. ఇంటి చుట్టూ చిన్న తోటా, గడపలో ఓ బొచ్చు కుక్కా, గేటు బయట ప్రముఖ సినీతార బిజిలీ' అన్న నేమ్ బోర్డు, డానికి ఇన్ , అవుట్ సూచికా ..... ఇలా తమ పుస్తకాల్లో చదివినవన్నీ అమలులో పెట్టేసింది.
    హిందీ, అరవం నేర్చుకోడానికి ప్రఖ్యాత సినీ తారలకు నేర్పిన టీచర్లనే తనూ నియమించుకుంది.
    వారం రోజులు, నెలరోజులు గడిచినా ఎవ్వరూ రాకపోగా, ఫోన్ కూడా చేయకపోయే సరికి ఇలా లాభం లేదని తను సినిమా పత్రికల్లో చదివిన విధంగా బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసేంది. ఆ పార్టీకి ప్రముఖులూ, సినీ జర్నలిస్టులూ ఇంకా తనకు ఉపయోగపడతారనుకున్న చాలామందిని ఆహ్వానించింది.
    కొంతమంది జర్నలిస్టులు బాగా మందు కొట్టేసి ఫోటోలు తీసుకుని వివరాలు ఆవిడ చెప్పిన వాటికి రెట్టింపు రాసుకుని తమ తమ పత్రికలకు పంపించేశారు.
    'కొత్తనటి బిజిలీ జైత్రయాత్ర. తుఫాన్ లా సినీరంగంలో జొరబడి ఒక్క చిత్రం కూడా రిలీజవక ముందే అనేక చిత్రాల్లో బుక్ అయిపోయి అద్వితీయ నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్న నూతన నటి బిజిలి! ఈమె తెలుగు రంగంలోనే కాక, హిందీ, మళయాళ చిత్రాల్లో కూడా తీరిక లేని నటి అయిపొయింది. అందుకే రోజూ ఆయా బాషలు నేర్చుకోడానికి టీచర్లను నియమించింది. అంటూ మద్రాస్ లో తప్ప మరెక్కడా కనిపించని ప్రముఖ సినీ పత్రికల్లో రాసేశారు. అయినా గానీ ఏ ప్రోడ్యూసరూ , డైరక్టరూ ఆమె వంక చూసిన పాపాన్న పోలేదు.  మరో నెల రోజులలా గడిచేసరికి ఆమెకు విసుగు పుట్టుకొచ్చింది.
    ఇక లాభం లేదని తనకు బర్త్ డే పార్టీలో స్నేహితురాలయిన మరో నూతన నటిని కలుసుకొని "సినిమాల్లో అవకాశాలు సంపాదించడం ఎలాగో  చెప్పవూ?' అనడిగింది దీనంగా.
    "అదేమంత కష్టమనీ! నువ్వు ప్రొడ్యూసర్ దగ్గరకూ, డైరక్టర్ దగ్గరకూ వెళ్ళి బ్రతిమాలాడమే!'
    "అదేమిటి? వాళ్ళే సినీ తారల ఇంటి ముందు క్యూలో నిలబడతారని ఓ సినిమా పత్రికలో చదివాను కదా!"
    "అది ఆ తార స్వంత పత్రికయి ఉంటుంది."
    బిజిలీ మర్నాటి నుంచీ కారు ఒకటి అద్దెకు తీసుకుని పేరున్న ప్రొడ్యూసర్లు, డైరక్టర్ల చుట్టూ తిరిగింది. కొందరు "పార్కలాం" అన్నారు. ఇంకొందరు "ఇవాళ రాత్రికి మాట్లాడుకుందాం రండి" అన్నారు.
    "షటప్ ఇడియట్స్" అని తిట్టి తిరిగి ఇంటికొచ్చేసింది బిజిలి.
    వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసి "చూశారా! మీరు చెప్పినట్లు వాళ్ళ దగ్గరకు నేను వెళ్తే రాత్రి మాట్లాడదాం అన్నారు" అంది రోషంగా.
    "వాళ్ళతో గడపకపోతే ఎవరికి మాత్రం ఇలా హీరోయిన్ చాన్స్ వస్తుంది?"
    "ఛీ పాడు . శీలం పోగొట్టుకుని వేషాలు సంపాదించాలా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదది" అందామె ఓ సినిమాలోని డైలాగ్ గుర్తు తెచ్చుకుని.
    ఆమె స్నేహితురాలు మళ్ళీ నవ్వింది. "నేనూ ఇదే డైలాగ్ వాడాను కొత్తలో!" అనేసి ఫోన్ పెట్టేసింది. బిజిలి కేం చేయాలో తెలీలేదు. కొన్ని రోజులు పిచ్చిదానిలా ఆలోచిస్తూండిపోయింది. రాన్రాను తన స్నేహితురాలు చెప్పిన మాట నిజమే నని తేలిపోయింది. సినీతారగా వెలగాలంటే గొప్ప ప్రొడ్యూసర్ కొ, డైరక్టర్ కో కూతురిగా నయినా పుట్టాలి లేదా శీలం అనే పదాన్ని డిక్షనరీ నుంచి చెరిపేయాలి అనుకుందామే.
    రోజులు గడుస్తున్న కొద్దీ బిజిలీకి దిగులు ఎక్కువయిపోయింది. తన వయసేమో పెరిగి పోతోంది. ఒక్కొక్కరోజు చొప్పున! తన పేరేమో పత్రికల్లో అసలు రాయడం లేదు విలేఖర్లు.
    అదేమని అడిగితె మళ్ళీ మందు పార్టీ ఇమ్మంటున్నారు.
    చివరకు బిజిలీకి విరక్తి కలిగింది.
    ఈ శరీరం ఎట్లాగూ చివరకు మట్టి పాలయేదే! అలాంటి శరీరం కోసం తన సినిమా వేషం తాలుకూ సరదాల నెందుకు చంపుకోవాలి అని ఆరోజు నుంచీ ప్రొడ్యూసర్లు, డైరక్టర్ల ఎవరు అడిగినా కాదనకుండా కోరికలు తీర్చసాగింది.
    ఇంతవరకూ కధ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది
    "నిర్మాతా! మనసు మార్చుకున్న బిజిలీ తారాపధం లోకి చేరగలుగుతుందా? ఆమె స్నేహితురాలు ఆమె కిచ్చిన సలహా సరయినదా? ఆడదానికి సినిమాల్లో అవకాశాలు రావాలంటే శీలం పోగొట్టుకోవలసిందేనా? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోతే మర్యాదగా వుండదు. నేను నీ తల పగలగోట్టాల్సి వస్తుంది! అందుకని మంచి బాలుడిలాగా జవాబు చెప్పు."
    నిర్మాత ఓ క్షణం కూడా ఆలోచించకుండా ఇలా అన్నాడు....
    "బిజిలీ స్నేహితురాలు చెప్పిన మాట నిజమే. కాని బిజిలీ 'శీలం' పూర్తిగా వదిలేయడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనమూ లేదు. సినిమా లోకంలో అందీ అందనట్లు ఉన్నవారే పైకి రాగలుగుతారు. బిజిలీ అలా కాక మొదట్లో అసలు అందకుండానూ , తరువాత కోరిన వారందరి కోరికలూ తీర్చడం వల్లనూ ఆమె తారగా వెలుగొందే అవకాశమే లేదు."
    ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.

                                             ***

 Previous Page Next Page