ఇప్పుడీ చినసామి పాడుతున్న పాటలో సగం తీసిన సినిమా కధేమిటో తెలుసుకోవాలనిపించిందామెకి. వెంటనే తోటకు అడ్డం పడి పరుగెత్తింది అతని దగ్గరకు.
"ఏమండీ! మీరు పాడిన పాటలో కోయిలేవరు? దయచేసి ఆ కోయిల అడ్రస్ ఇస్తారా?" అనడిగింది దీనంగా.
"నేనే ఆ కోయిలను! అడ్రస్ కేరాఫ్ కొబ్బరి తోట, కోనసీమ " అన్నాడతను.
"అమ్మో! మీరు సగం సినిమా తీయగలిగినంత గోప్పవారా! అయితే ఎప్పటికయినా ఆ మిగతా సగం తీస్తే అందులో నాకు హీరోయిన్ వేషం ఇవ్వరూ!" అంటూ హీరోయిన్ లా గోముగా బుంగమూతి పెట్టి అడిగింది.
ఆ పిల్ల అందం అంత గొప్పదేం కాదు గానీ ఆ వెన్నెల్లో అదే అద్భుతంగా కనబడింది. "ఇస్తాను గానీ - మరి నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అనడిగాడు చినసామి.
ఆ పిల్ల అచ్చం సినిమాల్లో లాగా సిగ్గుబడి "ఫో బావా నాకు సిగ్గేస్తోంది" అంది రెండు చేతుల్తో మొఖం కప్పుకుని.
ఇద్దరికీ మర్నాడే పెళ్ళయిపోయింది.
అచ్చం సినిమాల్లోలా ప్రేమ పాటలు పాడుతూ కొబ్బరి తోటలన్నీ తిరగాలని చినసామి ముచ్చట పడితే "ముందు నాకు యాక్షన్ నేర్పించు బావా! ఆ తరువాతే ప్రేమ" అంటూ మనసు పడిందా పిల్ల.
అదెలా నేర్పించాలో తెలీక వెంటనే అనుభవజ్ఞుడయిన తన మిత్రుడికి మళ్ళీ ట్రంక్ కాల్ చేసి సలహా అడిగాడు.
"అదేమిటి! నువ్వు సగం సినిమా డైరెక్ట్ చేశావ్ కదా! యాక్షన్ ఎలా నేర్పించాలో తెలీదా?" ఆశ్చర్యంగా అడిగాడు మిత్రుడు.
"సరేలే! నేను డైరక్ట్ చేసి చచ్చిందే ముందీ? నన్ను ఎవరయినా దగ్గరకు రానిస్తేనా? అంతా ఆ కెమెరామాన్, అసిస్తేంటూ చూసుకునేవారు" విచారంగా అన్నాడు చినసామి.
'అయితే ఓ పని చెయ్! "యాక్షన్" అని అరవగానే హీరోయిన్ పరుగుతో వచ్చి నిన్ను కౌగలించుకోవాలని చెప్పు! ఇరవై నాలుగ్గంటలూ అదే ప్రాక్టీసు చేయించు! అటు ఆమె సరదా తీరుతుంది. ఇటు నీ ప్రణయ కలాపాలూ సాగిపోతాయ్!" అన్నాడు మిత్రుడు.
చినసామి మర్నాటి నుంచే మిత్రుని సలహా ఆచరణలో పెట్టి ఆనందంగా కాలం గడపసాగాడు.
అలా గడిపి గడిపి ఓ రోజు గడపకుండా ఓ చేత్తో కత్తి, మరో చేత్తో న్యూస్ పేపరు తీసుకుని మిత్రుని ఇంటికి చేరుకున్నాడు.
'అరె! అలా ఉన్నావేమిటి? చేతిలో ఆ కత్తేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు మిత్రుడు.
"నీ మూలాన్న నా కాపురం కూలిపోయిందిరా దుర్మార్గుడా! ఈ కత్తితో నిన్ను పొడవబోయే ముందు ఓసారి దేవుడిని ప్రార్ధించుకొ" అన్నాడు చినసామి కత్తి పైకెత్తుతూ.
"అదేమిటి నన్నెందుకు చంపడం? నీ కాపురం ఎలా కూలిందసలు? పౌండేషన్ సరిగ్గా వేయలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు మిత్రుడు అతని చేతిలోని కత్తి లాక్కుని.
"ఎలా కూలిపోయిందా? ఇదిగో ఈ న్యూస్ చదువ్! ఎలా కూలిపోయిందో తెలుసుతుంది!" అంటూ తన చేతిలోని న్యూస్ పేపర్ మిత్రుడికిచ్చాడు చినసామి.
మిత్రుడు ఆ పేపర్ చేతిలోకి తీసుకుని చూశాడు.
'ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన చిత్రాలకు లక్ష రూపాయల సబ్సీడి" అన్న వార్త కనిపించిందతనికి.
ఇంతవరకూ కధ చెప్పాక సెన్సార్ ఇలా అడిగింది.
"నిర్మాతా! కోనసీమ చినసామి కాపురం ఎలా కూలిపోయింది? 'ఆంధ్రప్రదేశ్ నిర్మించిన చిత్రాలకు లక్ష రూపాయల సబ్సీడీ !' అన్న వార్తకూ , అతని కాపురం కూలి పోవడానికి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ తల రెండు ముక్కలు చేస్తాను."
"అదేమిటి? వెయ్యి ముక్కలు చేస్తాను అనాలిగా నువ్వు" ఆశ్చర్యంగా అన్నాడు నిర్మాత.
"ఇవాళ అన్ని ముక్కలు చేసేంత టైం లేదు. వేరే ఎంగేజ్ మెంట్ ఉంది. త్వరగా చెప్పు" అంది సెన్సార్ చిరాగ్గా.
నిర్మాత కొద్ది క్షణాలు అలోచించి ఇలా అన్నాడు-
"చినసామి "యాక్షన్" అనగానే ఆ వ్యక్తిని పరుగుతో వెళ్ళి కౌగలించుకోవడమే యాక్షన్ అని అతని భార్యకు అలవాటు చేసి నూరి పోశాడు. కానీ ఈలోగా "ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన చిత్రాలకు లక్ష రూపాయల సబ్సీడీ " అన్న వార్త చూడగానే ప్రోడ్యూసర్లందరూ కోనసీమ చేరుకొని షూటింగు లు ప్రారంభించారు. ఎటు చూసినా కెమేరాలూ, "యాక్షన్" అన్న కేకలు విని చినసామి భార్య అలవాటు ప్రకారం "యాక్షన్" అంటూ అరచినవారిని కౌగలించుకుంటూ అలా వెళ్ళిపోయింది . అంతే! మళ్ళీ రాలేదు. అందుకే అలాంటి చెత్త ఉపాయం చెప్పిన మిత్రుడిని మర్డర్ చేయాలనుకున్నాడు చినసామి..."
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
***