బాల కవి బుచ్చబ్బాయ్ కధ
"తెలుగు దేశంలోని ఓ పట్నంలో బుచ్చబ్బాయ్ అనే ప్రాణి ఉద్భవించాడు. లేకలేక కలిగిన సంతానం అవడం వల్ల బుచ్చబ్బాయిని అతని తల్లిదండ్రులు అతి గారాబంగా పెంచారు. అతనికి మొట్టమొదటిసరిగా 'ఉగ్గూ ఉంగా' అన్న మాటాలు రాలేదు. దాని బదులు 'సిగ్గూ ఎగ్గూ' అన్న మాటలు వచ్చాయి. ఆ మాటలు విని అందరూ మురిసిపోయారు. ఆ తరువాత అతనికి 'అమ్మ అక్క' అన్న మాటలు నేర్పించడానికి ప్రయత్నిస్తే 'నీయమ్మ, నీయక్క' అన్న మాటలు వచ్చినయ్. "అబ్బ! ఎంత స్పష్టంగా నేర్చుకున్నాడు తిట్లు? ఎంచక్కా పెద్దాడయితే ఇంకా బోలెడు తిట్లు నేర్చుకుని రౌడీ అయి ఆ తరువాత మినిష్టరవుతాడు" అని మరింత ఆనందపడ్డారు అతని తల్లిదండ్రులు.
ఇంత తెలివిగలవాడిని పెందలాడే స్కూల్లో చేర్పించాలని మూడే ఏటే కేజీ క్లాసులో వేశారు. అక్కడ ఆంగ్లో ఇండియన్ టీచర్ పిల్ల "సి- ఎ-టి - క్యాట్ అని నేర్పిస్తే బుచ్చబ్బాయ్ "సి- వో-టి- కాట్" అనడం మొదలుపెట్టాడు. ఆ పిల్ల అదిరిపోయింది. ఎంత ప్రయత్నించినా వాడితో "సిఎటి - క్యాట్' అని మాత్రం చెప్పించలేకపోయింది.
ఇలా లాభం లేదని ఆ మాట వదిలేసి మరో మాట నేర్పించాలనుకుని 'ఎమ్-ఏ-టి - మాట్' అంది. బుచ్చబ్బాయ్ 'వి-ఏ-టి - వాట్ - 69' అనడం మొదలుపెట్టాడు. వాట్-69 అనగానే ఆ పిల్లకు నోరూరింది గానీ ఆ మాట ఇలా మూడేళ్ళ కుర్రాడు అనటం మాత్రం నచ్చలేదు. ఇలా లాభం లేదని మళ్ళీ మాటమార్చి 'బి-ఇ-ఏ-ఆర్-బేర్' అనిపించాలని ప్రయత్నం చేసింది. కానీ బుచ్చబ్బాయ్ దాని బదులు 'బి-ఏ-ఆర్-ఇ-బేర్' అనడం మొదలెట్టాడు. పోనీ 'ఎమ్-ఇ-ఎస్-ఎస్-మెస్' అనమంటే 'ఎమ్-అయ్-ఎస్-ఎస్-మిస్' అనసాగాడు. సరిగ్గా పలకమని డబాయిస్తే 'కె- అయ్- ఎస్- ఎస్- కిస్' అంటున్నాడు. ఆ పిల్లకి పిచ్చెక్కిపోసాగింది. బుచ్చబ్బాయ్ వ్యవహారం చూస్తుంటే! మరో రెండు రోజులు చూసి ఇలా లాభం లేదని వాడి చెవి పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్ళి ప్రిన్సిపాల్ ముందు నిలబెట్టింది.
"ఏమిటి సంగతి?" అనడిగాడు ప్రిన్సిపాల్.
"వీడంతటి హరిబుల్ స్టూడెంటుని నేనెక్కడా చూళ్ళేదు. ఒక మాటనమంటే మరొక మాట అంటున్నాడు. వీడికి చదువు చెప్పడం నా వల్ల కాదు" అంది ఆంగ్లో ఇండియన్ పిల్ల తెలుగులో.
ప్రిన్సిపాల్ బుచ్చబ్బాయిని చూసి జాలిపడ్డాడు.
"ఇంత చిన్నపిల్లలు చెప్పిందే చెప్పమంటే కరెక్టు గా ఎలా చెప్తారు? నేనూ నా చిన్నప్పుడు అన్నీ తప్పులే చెప్పేవాడినని మా అమ్మమ్మ అంటూండేది. నేనే చెప్పిస్తాను చూడు" అంటూ బుచ్చబ్బాయ్ ని దగ్గరకు తీసుకుని భుజం చుట్టి "చూడమ్మా! 'ఎల్- అయ్- వి- ఇ- లివ్ అను" అన్నాడాయన మృదువుగా.
"ఎల్- వో- వి- ఇ- లవ్' అన్నాడు బుచ్చబ్బాయ్.
ప్రిన్సిపాల్ కి ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ రెండు సార్లు కూడా వాడు 'లవ్' అనేసరికి ఇలాక్కాదని మాట మార్చాడు.
"చూడమ్మా బుజ్జీ! 'ఎగ్జాంపుల్, అను!" అన్నాడు బుజ్జగింపుగా.
"సెక్స్ శాంపుల్" అన్నాడు బుజ్జబ్బాయ్ ముద్దు ముద్దుగా.
ప్రిన్సిపాల్ అదిరిపడ్డాడు.
"ఎవరు సెక్స్ శాంపుల్!' అన్నాడు కోపంగా.
"మీలు కాదు - టీచలు" అన్నాడు ఆంగ్లో ఇండియన్ పిల్ల వంక చూపుతూ.
ప్రిన్సిపాల్ కి ఖంగారు పుట్టుకొచ్చింది. ఆ కుర్రాడిని ఇంకొక్క క్షణం కూడా తమ స్కూల్లో ఉంచుకోవటం సాధ్యం కాదనీ, అలా చేస్తే మొత్తం స్కూలంతా పౌండేషన్ తో సహా కూలి పోతుందనీ ఎనిమిది పేజీల ఉత్తరం రాసిచ్చి బుచ్చబ్బాయిని ఇంటికి పంపించేశాడు. వాడిని ఏ స్కూల్లో చేర్పించినా చేరిన రెండు రోజుల్లోనే ఎనిమిది పేజీల ఉత్తరాలు పట్టుకుని ఇంటి కొచ్చేయడం అలవాటయిపోయింది బుచ్చబ్బాయికి.
ఇలాక్కాదని అతి ఖరీదయిన ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్పించారతన్ని. నెల రోజుల్లో బుచ్చబ్బాయి సెక్స్ పదాలు తగ్గకపోగా , అంతవరకూ బూతంటే తెలీని స్కూలు పిల్లలందరూ కూడా. అసహ్యకరమయిన ఆ మాటలు మాటాడసాగారు. దాంతో అందరూ తమ తమ పిల్లల్ని ఆ స్కూలు నుంచి తీసుకెళ్ళి వేరే పనికిమాలిన స్కూల్స్ లో చేర్పించేశారు. దాంతో బుచ్చబ్బాయి చదువుకునే స్కూలు కాస్తా మూత పడింది. ఆ తరువాత బుచ్చాబ్బాయి మళ్ళీ ఇంటి కొచ్చేసి స్కూలు బాధ లేకుండా హాయిగా బూతర్ధం వచ్చే మాటలు, పాటల్తో కాలం గడవసాగాడు. మరో దారి లేక ఉత్తరదేశం నుంచీ హిందీ తప్పితే మరో బాష తెలీని ఓ విద్వంసుడిని తీసుకొచ్చి బోలెడు జీతం లాడ్జింగూ, బోర్దింగూ అన్నీ ఏర్పాటు చేసి ట్యూషన్ చెప్పించసాగాడతని తండ్రి. ఓరోజు బుచ్చబ్బాయి ఎంతవరకు బాగుపడ్డాడో చూద్దామని హటాత్తుగా వచ్చేసరికి హిందీ పండితుడు కళ్ళు మూసుకుని తన్మయత్వంతో 'సూదిలో దారం సందులో బేరం' పాట పాడుకుంటూ కనిపించాడు. బుచ్చబ్బాయ్ టేబిల్ మీద ఆ పాటకు తగ్గట్టుగా దరువు వేస్తున్నాడు.
"ఏమిటయ్యా ! ఏమిటిది? మా వాడిని రిపేర్ చేయమంటే నువ్వే ఇలాంటి పాడు పాటలు పాడుతున్నావా?" అన్నాడతను హిందీ విద్వాంసుడితో కోపంగా.
"ఆహా! తెలుగులో ఇంత చక్కటి సాహిత్యం ఉత్పత్తి అవుతుందని నాకు తెలీదండీ! ఎందరో మహాకవులు పూర్వకాలంలో రాశారు. అనేక అర్ధాలు వచ్చే ఒకే ఒక పద్యం! ఇంత కాలానికి ఆ అద్భుతం తెలుగు కవులు చేయగలుగుతున్నారు. ఆహా! సూదిలో దారం- సందులో బేరం ...."
"గెటౌట్!" అరిచాడు బుచ్చబ్బాయి తండ్రి అతను గెటౌట్ అయిపోయాడు.
బుచ్చబ్బాయ్ ఆ విధంగా చదువూ, సంధ్యా లేకుండా పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే అతనలా ఆకటాయిలా తిరుగుతూ ఊళ్ళోని తన ఈడు కుర్రాళ్ళందరికీ బూతు పాటలు నేర్పిస్తూ వాళ్ళను కూడా నాశనం చేసేస్తున్నాడన్న కోపంతో ఊరి వాళ్ళందరూ అతనిని ఊరు బయటకు గెంటి పారేశారు. అతని తలిదండ్రులు కూడా అతని మీద విరక్తి కలిగి పొతే పోయాడని మాటాడకుండా ఊరుకుండిపోయారు. బుచ్చబ్బాయ్ అనేక ఊళ్ళల్లో అనేక రకాలయిన ఉద్యోగాలు చేశాడు, కూలీగాను, నౌఖరుగానూ! కానీ కుదరలేదు. ఆ తరువాత కొద్ది రోజుల వరకూ బుచ్చబ్బాయ్ వార్తలు ఎవరికీ తెలీలేదు.
ఓరోజు ఉన్నట్టుండి హటాత్తుగా అతని కీర్తీ దేశమంతా కార్చిచ్చులా నిమిషాల్లో వ్యాపించిపోయింది. రెండు కార్లు కొనేశాడు. దేశంలో ఎక్కడా చూసినా అతనికి సన్మానాలూ సభలు జరగసాగాయి. అందరూ అతని ప్రతిభను వేనోళ్ళ కొనియాడసాగారు. అతనిని ఊరు బయటకు గెంటిన ఆ ఊరి వాళ్ళే మళ్ళీ అతనిని తమ ఊరికి ఆహ్వానించి ఊరేగించి సకల మర్యాదలతో సన్మానం చేశారు."
ఇంతవరకూ కధ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది
"రాజా! ఎందుకూ పనికి రాని బుచ్చబ్బాయి అంత హటాత్తుగా ఎలా గొప్పవాడయ్యాడు?అంత కీర్తి ఎలా సంపాదించాడు? అతనిని మెడ బెట్టి బయటకు గెంటిన ఊరే అతనికి ఎందుకు సన్మానం చేసింది? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ తల .....
"అపశకునం పలక్కు.....నేనూ చెప్పగలనులే!
"బుచ్చబ్బాయ్ అనేక చోట్ల బ్రతుకుతెరువు కోసం ప్రయత్నించి , ఎలాంటి అర్హతలూ లేకపోవడం వల్ల విఫలమయి చివరకు మద్రాసు చేరుకొని ఉంటాడు. అక్కడున్న తెలుగు చలనచిత్ర రంగం వెంటనే అతని ప్రతిభను గుర్తించి ఆదరించింది. వాళ్ళకు కావలసింది ప్రజలకు బూతు అర్ధం - సెన్సార్ కి మంచి అర్ధం వచ్చే పాటలు లేదా పూర్తి బూతు పాటలు అవి రాయగల ప్రతిభ బిచ్చిబాబుకి ఉంది. కాబట్టి సినిమా రంగం అతనిని ఆకాశానికి ఎత్తేసింది. అలాంటి పాటలే వినడానికీ, హర్షించడానికీ తెలుగు ప్రజలు అలవాటు పడిపోయారు. కాబట్టి అతనికి సన్మానాలు , సభలూ ఏర్పాటు చేశారు. సినిమాల మీద మోజున్న అతని సొంత ఊరి జనం కూడా బుచ్చిబాబుకి - అంతటి మహత్తరమయిన సాహిత్యాన్ని అందిస్తున్నందుకుగాను సన్మానం చేశారు!"
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
***