Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 14

                                 

 

సమ సమాజ నిర్మాణానికి ప్రగతి పథం

 

    "జననీ జన్మ భూమిశ్చ
    స్వర్గా దపీ గరీయసీ"_
    తెలుగు తల్లీ! నీకు నా అంజలీ !
    ఈ స్వాతంత్ర్య శుభదిన
    వినమ్రాంజలి !

    ఆరుకోట్ల తెలుగన్నలకు, తమ్ములకు, ఆడపడచులకు, చిరుపాపలకు, పండిన పెద్దలకు, తలపండిన పూజ్యులకు నా హృదయ పూర్వక నమస్సుమాంజలి !
    ఆగస్టు 15_అందరికీ పండుగ, అసేతు హిమాచలానికి అసమాన పర్వదినం. ఎన్నో త్యాగాలతో, మరెంతో దీక్షతో, రక్తతర్పణం చేసి సాధించుకున్నది భరత జాతి స్వాతంత్ర్యం.
    కాలపుటలపై చెరగిన రక్తాక్షరాలతో లిఖించబడే మహత్తర స్వాతంత్ర్య సమర చరితకు చరితార్థత ప్రసాదించిన యీ శుభదినాన గుర్తుకు తెచ్చుకుందాం.  ఆనాటి మేటి స్వాతంత్ర్య సమర వీరులను కృతజ్ఞతాంజలి ఘటించి - ఒకసారి.
    సత్యాగ్రహ సమరాన్ని నడిపాడు పూజ్యబాపూజి-సత్యం, అహింసలే ఆయుధాలుగా, రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్య సింహాన్ని జూలు పట్టి అదలించి, పిదలించి మాతృభారతి దాస్య శృంఖలాలను భళ్లున తెగనరకిన ఆ జాతిపితకు అర్పిద్దాం నేడు మన శ్రద్ధాంజలి.
    రౌద్రం తొలికించి రక్తం చిందించి అమ్మపాదాలకు రుధిరాభిషేకం చేసిన అలనాటి ఉగ్రవీరుల గదర్ ఉద్యమ నేతలకు సమర్పిద్దాం భాష్పాంజలి.
    తలకు ముసుగు తగిలించి, మెడకు ఉరిత్రాడు బిగించి - నీ తుది కోరిక ఏమని అడిగితే "ఇంక్విలాబు జిందాబాద్"- అని దిగ్దిగంతాలు మార్మోగేలా నినదించిన విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ ను స్మరిద్దాం పుష్పాంజలి ఘటించి.
    మధ్యందిన భానుడిలా మన్యంలో మెరసి, అడవులలో యిడుములలో అలమటించే ఆటవికులను సంఘటితపరచి ఒక్కొక్కని ఒక్కొక్క కొదమసింగంలా తీర్చిదిద్ది తెల్లదొరల గుండెల్లో నిదురించిన తెలుగుతల్లి అనుగు బిడ్డడు అల్లూరి సీతారామరాజుకు అర్పిద్దాం గుండెలనిండుగా స్మృత్యంజలి.
    'స్వాతంత్ర్యం నా జన్మహక్కు'- అని గర్జించిన లోకమాన్య తిలక్, శాంతిదూత, నవభారత నిర్మాత, జవహర్ లాల్-, ఆజాద్ హింద్ పౌజును నిర్మించి ఢిల్లీ ఛలో అని నినదించి, ఎఱ్ఱకోటను కైవసం చేసుకొనటానికి ఎంతో సాహసంతో సాయుధ పోరాటం సల్పిన నేతాజీ శుభాష్ చంద్రబోస్, ఉక్కుమనిషిని సంస్థానాల విలీనకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్, సాధుశీలి మౌలానా ఆజాద్, జై జవాన్, జై కిసాన్ అన్న నినాదమిచ్చిన లాల్ బహదూర్, ఆగస్టు విప్లవానికి ఆలంబన లోకనాయక్ జయప్రకాశ్, గుండెలను తుపాకీ గుండ్ల కెదులొడ్డిన ఆంధ్రకేసరి ప్రకాశం, చీరాల-పేరాల సత్యాగ్రహసారథి ఆంధ్రరత్న దుగ్గిరాల, దేశభక్త కొండా వెంకటప్పయ్య, దేశోద్ధారక నాగేశ్వరరావు, రైతు బాంధవుడు ఆచార్యరంగా, వారు వీరని ఏమిటి, ప్రతివారు ఒకరోజు స్వాతంత్ర్య సమరంలో అగ్రగాములై నిలచారు మనందరిముందు. వారందరకూ నమోవాకాలు.
    1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య భానుడుదయించినా, ఆ లేత కిరణాలు సోకిన చీకటి గూడుల్లా వుండిపోయాయి నిజాం వంటి సంస్థానాలు. అందుకే ఆపైన గూడా సాగింది. తెలంగాణాలో స్వాతంత్ర్య సమరం! పార్టీ సిద్ధాంతాలు ప్రక్కకు నెట్టి-రాజకీయాలు ఆవల బెట్టి- అందరూ ఒక్కటై నిలచారు. నియంతృత్వ సంస్థానాధిపత్యాన్ని తుడిచిపెట్టటానికి_ 
    రెచ్చిన రజాకార్ దురంత దారుణ హింసాకాండతో రేగిన ప్రచండ తెలంగాణా సమరంలో పెడబొబ్బ పెట్టింది తెలుగు జాతి 'స్వతంత్రం మా జన్మహక్క'ని-జాతీయతా భావ ప్రబోధినికై, సంస్థాన విమోచనకై నడుంకట్టిన నాయకులు-
    స్వామి రామానంద తీర్థ, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, రావి నారాయణరెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, షోయబుల్లాఖాన్ వంటి యోధానుయోధులెందరో_ వారందరకూ మన మనస్సుమాంజలులు_
    వారందరి మహత్తర త్యాగాల ఫలితం-మన స్వాతంత్ర్యం. అయితే జనం ఆశించిందేమిటి? అందుకొన్నది ఏమిటి?
    గుండెలనిండా గుబులు నింపుకొని, కన్నులనిండా కన్నీరు తొణకిస లాడుతూ కష్టాలలోనే కాలం వెళ్ళబుచ్చే కష్టజీవులు అడుగుతున్నారు__ ఇదేనా స్వాతంత్ర్యం అని.
    కండలు కరిగించి, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రక్తాన్ని చెమరిస్తూ కూడా నోటికి గుక్కెడు గంజికి నోచుకోని లక్షలాది కార్మిక సోదరులు అడుగుతున్నారు 'ఇదేనా స్వాతంత్ర్యం' అని. తినటానికి తిండిలేక కట్టుకున్న పాత-పాపం, ఏ పాతకాలం నాటిదో-ఆ పాతలోనే రోతగా బ్రతుకీడుస్తూ సామాజిక న్యాయానికి వెలియై, సాంఘిక దురాచారాలకు బలియై అక్రందించే ఆడపడచులు అడుగుతున్నారు-'ఇదేనా స్వాతంత్ర్యం' అని.
    ఆలనా పాలనా లేక, అధోగతిలో అంధకారంలో అజ్ఞానంలో రొంపిలో రోతలో బిక్కుబిక్కుమంటూ బిత్తరపోతూ అలమటించే చిరుబిడ్డలను, చిన్నారులను చూసి సిగ్గుపడుతోంది స్వాతంత్ర్యం-'నా ప్రభావం యింతేనా' అని.
    ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం ?

స్వార్థం పేరుకొని పోయిన లంచగొండితనానికా? ప్రజా సంపదను, శ్రమజీవుల శక్తిని కాకుల్లా, గద్దల్లా, రాబందుల్లా తన్నుకపోయే మధ్య దళారీలకా? మిలమిలలాడే రొక్కానికి అమ్ముడుబోయిన మానవత్వానికా? ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం? ఏమంటారు?
    మీరే చెప్పాలి దీనికి జవాబు.
    అర్థం కాని అంధకారంలో వెలుతురుకోసం వెతుక్కుంటున్న మీ ప్రతినిధిని నేను. మోడువారిన పేదల బ్రతుకుల్లో పన్నీరు చల్లాలని, కష్టజీవుల గాయాలను కన్నీళ్లతోనైనా కడగాలనీ, రైతన్నల సంక్షేమం, కార్మిక సోదరుల అభ్యున్నతి, ఆడపడచుల అభ్యుదయం నా చేతిమీదుగా జరగాలని, స్వాతంత్ర్యానికి సరైన నిర్వచనం ఏనాటికైనా నా తెలుగు నాటికి నేను ఇవ్వాలని నా ప్రయత్నం. ఆనాడే నా శ్రమకు అర్థం. అప్పుడే అన్నగా నా పెద్దరికం నిలబెట్టుకోగలిగేది. అందుకే యీ తాపత్రయం. అందుకే ఈ ప్రస్థానం.
    ఈ అనుచరణలో భాగమే-తలదాచుకోడానికి నీడైనా లేని నిర్భాగ్యులకు శాశ్వత గృహనిర్మాణ పథకం. ఈ ఆచరణలో భాగమే రేపవలు రెక్కలు ముక్కలు చేసుకున్నా కన్నపట్టికి పట్టెడన్నం పెట్టుకొనోచుకోని పేద పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం.
    ఆ కార్యక్రమంలో మరో భాగమే-ఆకలి డొక్కలతో పూటకు టికాణా లేక దారిద్ర్యరేఖకు దిగువన భారంగా బ్రతుకులీడ్చే బడుగు వర్గాలకు కిలో బియ్యం రెండు రూపాయలకు అందించాలన్న తాపత్రయం. ఈ ఉత్కర్షలో భాగమే కన్నవారి ఆస్తిలో కొడుకులతోపాటు ఆడపడచులకు కూడ సమాన హక్కులు కల్పించాలన్న ధ్యేయం. నిరుద్యోగ రక్కసిని నిర్మూలించడానికి, యువతలో పేరుకుపోయిన నిరాశా, నిస్పృహలను తొలగించటానికి, ఉత్పత్తులకు సరయిన కిమ్మత్తును రైతన్నలకు లభింపజేయటానికి, మేథస్సు కొడిగట్టిపోతున్న ఈనాడు అర్హతకు ఆదరణ కల్పించటంకోసం చదువులను సంతలో తాకట్టుపెట్టే దౌర్భాగ్య విధానానికి స్వస్తి చెప్పటానికి ముందంజ వేస్తున్నది యీ ప్రజా ప్రభుత్వం.

          


    కర్నూలుజిల్లా పాణ్యంలోని ఇందిరా కాలనీలో 1983 జూలై 6వ తేదీన కిలో 2 రూ.ల బియ్యం పంపిణీ పథకానికి ప్రారంభోత్సవం.

 

         


            ఖమ్మంజిల్లా మధిరలో 1984 ఏప్రిల్ 25న బలహీనవర్గాలకు రుణాలు పంపిణీ.

 

          


        ఆదిలాబాదు జిల్లా గిరిజనులకు 1983 మే 11న వస్త్రాల పంపిణీ.

    పసపోయిన డిగ్రీలను పంచే పసివాడిన విద్యావిధానానికి నూతన జీవితం పోసిన వృత్తి విద్యలకు ప్రాధాన్యం కలిగించాలనీ, ఆధారంలేని ఆడపడుచులకు ఇంత ఆదరువు కల్పించాలనీ, జీవితం గౌరవంగా నడుపుకొనే అవకాశం అక్కచెల్లెళ్లకు ఏర్పరచాలనీ నేను కన్న ఎన్నో కలలకు ప్రతి రూపమే నేటి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం. అధికార వికేంద్రీకరణతో పరిపాలన వ్యవస్థను ప్రజలకు దగ్గరగా, మరింత దగ్గరగా చేసి గ్రామాభ్యుదయ కార్యక్రమాలకు నూతన స్ఫూర్తిని కల్గించాలన్న ప్రయత్నమే నా మస్తిష్కంలో మథింపబడుతున్న మాండలిక నూతన వ్యవస్థీకరణ విధానం.
    ఇరుగు పొరుగును మరవకుండానే మనవారికింత మేలు చేయడం మన ధర్మం. అందుకే అలనాటి భగీరథ ప్రయత్నాన్ని తలపిస్తూ, మరపిస్తూ నింగి కెగిసిన వరవడిలో శ్రీశైల మల్లిఖార్జునస్వామి శిరోవేష్టంలో చిందులాడుతున్న తెలుగుగంగను రాయలసీమ మాగాణంలో మధించి, మదరాసు వాసుల దప్పితీర్చే ప్రయత్నం మన మానవతా దృక్పథానికి ప్రతిబింబం.
    లక్ష్మీ సరస్వతుల కేరింతల్లో శ్రీశైలం కుడి, ఎడమల స్రవంతుల్లో బీటలు వారిన ఎండు భూములు నిండగా పండగా పచ్చటి పైరులతో కళకళలాడే, అరవిచ్చిన ఆనందంలో తొణికిసలాడే మన తెలుగుతల్లిని చూడాలన్న ఆశలు ఎన్నో, ఎన్నెన్నో వున్నాయి ప్రభుత్వానికి.
    ఎప్పుడో, గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో, పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా ఒక మహదానంద సాగరంగా రూపొందే శుభదినం ఎప్పుడో, పండిన ఆశలతో గుండెల నిండుగా కన్నుల పండువగా తెలుగుజాతి హసించి పరవసించేది ఎప్పుడో, దానికే నా ప్రయత్నం. అందుకే యీ పయనం.
    ఆరుకోట్ల తెలుగువారం. 12 కోట్ల చేతులు కలసిన కృషితో దింసగలం, ఆ దివినే భువికి. అందరం అందుకే కలిసి ముందుకు నడుద్దాం. భుజం, భుజం కలిపి సాగుదాం. ఈ ప్రయత్నంలో విజయం తథ్యం!
    ఈ స్వాతంత్ర్యదినం అందరికీ పండుగై, ఆనందదాయకమై, భావి మానవ కళ్యాణ సంధాయకమై, సమసమాజ నిర్మాణానికి ప్రజాహితానికి, ప్రగతిపథం చూపాలి వెలుగుదివ్వె పట్టాలి-అని కోరుకుంటున్నాను.
    గుండెల నిండుగా, మీ వాడిగా తెలుగువాడిగా మీ ముందు వినమ్రతతో, చిత్తశుద్ధితో మరోసారి ప్రమాణం చేస్తున్నాను-ఈ నా శేష జీవితం తెలుగు జాతికే, తెలుగువారికే, తెలుగువారి సేవకే అంకితమని.

    1983 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెరేడు గ్రౌండ్స్ లో.

 

 Previous Page Next Page