Previous Page Next Page 
శ్రీ మహాభారతము పేజి 15

 

3. గంగ కామవతి అని చెప్పినాను. పెండ్లి సందర్భముగా ఆమె తన సంతాన విషయము గాని, వారికి రాజ్యము ఇచ్చు ప్రసక్తి గాని తేలేదు.
    శకుంతల తాను స్వయంగా వరము కోరుకొన్నది. ఆ పరిస్థితి అట్టిది.
    సత్యవతి తాను కోరలేదు. ఆమె తండ్రి కోరినాడు.
    శంతనుడు దుష్యంతుని వలె వరము ఇవ్వలేదు. వయసులో ఇతడు పెద్దవాడు. అంత ఆరాటము లేదు. పైగా దేవపుత్రుని యువరాజును చేసినాడు.

                                     భీష్మ ప్రతాపము.

    చిత్రాంగదుడు బలగర్వము కలవాడు. అతడు ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు. అందరితో కయ్యమునకు దిగుచుండును. గంధర్వుడు చిత్రాంగదుని యుద్దమునకు పిలిచినాడు. చిత్రాంగదుడు వెళ్ళినాడు. వారిద్దరకు కురుక్షేత్రమున యుద్దము జరిగినది. గంధర్వుడు మాయలు చేసినాడు. చిత్రాంగదుని హతమార్చినాడు.
    చిత్రాంగదుని చరిత్ర ముగిసినది. సత్యవతి వగచినది. భీష్ముడు విచిత్రవీర్యునకు పట్టము కట్టినాడు. విచిత్రవీర్యుడు భీష్ముని అజ్ఞాను అనుసరించినాడు. రాజ్యము చేసినాడు. విచిత్రవీర్యునకు ప్రాయము వచ్చినది. సత్యవతి వివాహము చేయడలచినది. భీష్మునకు చెప్పినది. అపుడు కాశీ రాజు పుత్రికల స్వయంవరం జరుగుచున్నది. కాశీరాజుకు ముగ్గురి పుత్రికలు. వారు అంబ, అంబిక, అంబాలిక. ఆ విషయము భీష్మునకు తెలిసినది.
    భీష్ముడు కాశికి బయలుదేరినాడు. ఒంటరిగా వెళ్ళినాడు. రధము ఎక్కి, విల్లమ్ములు చేతబూని కాశీ రాజ్యమున ప్రవేశించినాడు. కాశీ పట్టణమున అనేక మంది రాజులు కూడినారు. నిండు సభ. రాజులు అనేకులు. స్వయంవరము జరుగుచున్నది. భీష్ముడు సభా మధ్యమున దూకినాడు. పిడుగు వలె కూలినాడు. సకల రాజన్యులు ఆశ్చర్య చకితులు అయినారు. భీష్ముని చూచినారు. అతని ప్రతాపము కన్నారు. ఒక్కరాజు మాట్లాడలేదు. వారికి నోటిమాట రాలేదు.
    భీష్ముడు సభామధ్యమున ఉన్నాడు. అంబ, అంబిక, అంబాలికలను తీసుకొన్నాడు. రధము ఎక్కించుకున్నాడు. తాను ఎక్కినాడు. సభాసదులు వినుచుండగా అన్నాడు :-
    "కాశీరాజా! నా తమ్ముడు విచిత్రవీర్యుడు. అతని కొఱకు నీ పుత్రికలను తీసుకొని వెళ్ళుచున్నాను. వివాహము ఎనిమిది రకములు. వానిలో రాక్షసము, గాంధర్వము, క్షత్రియులకు శ్రేష్టములు. అదికాక రాజులను జయించి కన్యలను హరించుట మిక్కిలి శ్రేష్టము. నన్ను అడ్డుకొనదలచిన అడ్డుకొనవచ్చును. వారిని గెలిచి వీరిని తీసుకొని వెళ్ళుడును."
    కాశీరాజు కిమ్మనలేదు. సమ్మతించినాడు. కాని మిగిలిన రాజులు భీష్మునకు ఎదురు తిరిగినారు. యుద్దము జరిగినది. రాజులు భీష్ముని ప్రతాపాగ్నిముందు శలభములు అయినారు.
    భీష్ముడు రాజులను ఓడించినాడు. అంబ, అంబిక, అంబాలికలను తీసుకొన్నాడు. హస్తినకు బయలుదేరినాడు. మార్గమధ్యమున సాల్యుడు అడ్డగించినాడు. "భీష్మా! ఇతర రాజులను ఓడించినావని విర్రావీగకు. నన్ను ఎదిరించి నిలువలేవు" అని భీష్ముని ఎదిరించినాడు.
    భీష్ముడు ప్రళయ కాలరుద్రుడు అయినాడు. సాల్యుడు ప్రభంజనము వలె విజ్రుంభించినాడు. సాల్యుడు వేల బాణములను గుప్పించినాడు. భీష్ముడు వాటిని నడుమనే నరికినాడు. భీష్ముడు ఒకే బాణమున సాల్వుని సారధిని, గుఱ్ఱములను, రధమును కూల్చినాడు. సాల్వుడు రధహీనుడయినాడు. ఓడినాడు. పారిపొయినాడు.
    భీష్ముడు సకల రాజన్యులను , సాల్వుని ఓడించినాడు. విజయకేతనము ఎగురవేసినాడు. జయజయ ద్వానముల మధ్య హస్తిన ప్రవేశించినాడు. అంబ, అంబిక, అంబాలికలను సత్యవతికి అప్పగించినాడు. సత్యవతి సంతసించినది.
    కాశీరాజు పుత్రికలలో పెద్దది అంబ. ఆమె భీష్ముని వద్దకు వచ్చినది. అభివాదము చేసినది. ఎదుట నిలిచినది. "మహానుభావా! పూర్వము సాల్వుడు నన్ను వరించినాడు. నా తండ్రి కూడ నన్ను సాల్వునకు ఇచ్చుటకు సమ్మతించినాడు. నేను సాల్యుని దానను అయినాను. ధర్మము అలోచించుము. నీకు తోచిన రీతి చేయుము" అన్నది.
    భీష్ముడు ఆలోచించినాడు. శాస్త్రవేత్తలను సంప్రదించినాడు. అంబను సాల్వుని వద్దకు పంపుటకు నిశ్చయించినాడు. పంపినాడు.
    విచిత్రవీర్యుని వివాహము జరిగినది. అంబిక, అంబాలిక అతని భార్యలు అయినారు. వారు సుందరులు. సొగసరులు. విచిత్రవీర్యుడు వారి మోహమున పడిపోయినాడు. కామంధుడు అయినాడు. అన్ని మరచినాడు. కన్ను మిన్ను కానలేదు. కామమే వృత్తిగా జీవించినాడు. వ్యాధి గ్రస్తుడు అయినాడు, మరణించినాడు.

                                                       ఆలోచనామృతము


    భారతమున లేని వ్యక్తిత్వము లేదు. భారతమున కనిపించని పాత్ర అరుదు. పేర్లు మారవచ్చును. వ్యక్తిత్వములు పాత్రలు కనిపించుచునే ఉండును.
    చిత్రాంగద , విచిత్రవీర్యులు చరిత్రహీనులు. వారికి తండ్రి బాల్యమునే పోయినాడు. తల్లికి ఇద్దరే కొడుకులు. అతి గారాబమున పెంచినది. వారికి అన్న భీష్ముడు, సకల కార్యములు నిర్వర్తించినాడు. వారికి బాధ్యతలు లేవు. సౌకర్యములు తప్ప, అట్లు పెరిగిన వారందఱు చరిత్రహీనులు కాక తప్పదు.
    తాను సంపాదించిన , దాని విలువ తెలియును. పరులు సంపాదించినది పలుచన. దాని విలువను ఎరుగరు. అది అట్లే పోగొట్టుకొందురు.
    చిత్రాంగద విచిత్రవీర్యులు అట్టివారే . చిత్రంగదుడు కనిపించినవానితో నెల్ల కయ్యము పెట్టుకున్నాడు చచ్చినాడు. విచిత్రవీర్యునకు భార్యను తెచ్చుకోగల సమర్ధత కూడా లేదు. భీష్ముడు తెచ్చి పెట్టినాడు. లోకమును తెలిసికొనలేదు. కామమునకు లోంగినాడు, చచ్చినాడు.
    వారు తల్లి చాటు పిల్లలు. వ్యక్తిత్వ హీనులు. చరిత్ర హీనులు.

                                       వంశ రక్షణము.

    శంతనుని సంతానము నశించినది. వంశము అంతరించు ప్రమాదము ఏర్పడినది. సత్యవతి చాలా బాధపడినది. భీష్మునితో ఇట్లన్నది :-
    "భీష్మా! ఇప్పుడు ఒక ప్రమాదము వచ్చినది. దానిని నీవే తప్పించవలసి ఉన్నది. వంశము అంతరించుచున్నది. నీవు ఉండగా అట్లు జరుగరాదు. నీవు రాజ్యము పాలించుము. సంతానము కూడ పొందుము."

 Previous Page Next Page