దేవపుత్రుడు గ్రహించినాడు. సత్యవతి విషయమున తండ్రి కుములుచున్నాడు. అది తెలుసుకున్నాడు. మంత్రిసామంతులను, సైన్యమును వెంట తీసుకొన్నాడు. దాశరాజు వద్దకు వెళ్ళినాడు. తాను వచ్చిన పని వెల్లడించినాడు. సత్యవతిని తన తండ్రికి ఇవ్వవలసిందని కోరినాడు.
"కుమారా! దేవపుత్రా! నీవు ఉత్తముడవు. ధర్మజ్ఞుడవు. నీవు నీతండ్రీ కొఱకు నా కూతురును అడిగినావు. సంతోషము. కాని నా కూతురు పట్టమహిషి కావలెను. శంతనుని అనంతరము సత్యవతీపుత్రుడే రాజు కావలెను. అందుకు అంగీకరించిన సత్యవతిని ఇత్తును."
దేవపుత్రుడు విన్నాడు. ఆలోచించినాడు. నిర్ణయించినాడు. సకల రాజన్యుల ఎదుట ప్రకటించినాడు.
"నేను రాజ్యము వదులుకొనుచున్నాను. నా తండ్రికి సత్యవతి వలన కలిగిన పుత్రుడే రాజగును."
రాజులందరు విన్నారు. హర్షించినారు.
దాశరాజు హర్షించలేదు. తన సంశయమును వ్యక్త పరచినాడు.
"కుమారా! దేవపుత్రా! నీవు చేసిన నిర్ణయము గొప్పది. నీవు ధర్మస్వరూపుడవు. అది నాకు తెలియును. కాని నీ బిడ్డలు ధర్మ స్వరూపులు కాలేరు. నీవలె రాజ్యము వదులుకొందురను నమ్మకము లేదు. అది నా సంశయము మాత్రమూ ; వాత్సల్యము కీడును శంకించుట సహజము కదా!"
భీష్ముడు ఆలోచించినాడు. మానవ జాతి అంతకుముందు ఎరుగని మహాత్యాగమునకు సిద్దపడినాడు. నిర్ణయించినాడు.
"ధృతి బూని ధర్మ చర్య
వ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగ ననప
త్యత యైనను లోకములా
యతి బెక్కులు గలవు నాకు ననుభావ్యములై."
అని యిట్లు సత్యవతిని తన తండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్య పరిత్యాగంబును బ్రహ్మచర్య వ్రత పరిగ్రహంబునుం జేసిన దేవవ్రతు సత్యవ్రతంబునకు గురుకార్య దురంధరత్వంబునకు మెచ్చి దేవర్షి గణంబులు నాతనిపయిం ఋష్పవృష్టి గురిసి భీష్ముండని పొగిడిరి.
భీష్మమయిన దీక్షపూనినాడు దేవపుత్రుడు. అతడు పెండ్లాడనన్నాడు. సంతానము పొందనన్నాడు. ఇతర మార్గములున్నవి. వానిని అనుసరింతునన్నాడు. అట్లు పుణ్యమును అర్జింతునన్నాడు. దేవపుత్రుడు ఆజన్మ బ్రహ్మ చర్యము అవలంబించినాడు.
అక్కడ కూడినవారు అది విన్నారు. ఆశ్చర్యచకితులు అయినారు. అతనిని శ్లాఘించినారు. కీర్తించినారు. పొగడినారు. అతనిని "భీష్ముడు" అన్నారు.
ఆకసము నుండి దేవతలు విన్నారు.
పూల వాన కురిపించినారు.
దాశరాజు మేచ్చినాడు. తన పంతము నెగ్గించుకొన్నాడు. సత్యవతిని ఇచ్చినాడు. సంతోషించినాడు.
భీష్ముడు సత్యవతిని- కానున్న తల్లిని - రధమెక్కించుకున్నాడు. సకల రాజన్యులతో హస్తినకు చేరినాడు. శంతనుడు చూచినాడు. ఎంతో సంతసించినాడు. పుత్రుని కౌగలించుకున్నాడు. పులకాంకితుడు అయినాడు. ఆనంద బాష్పములు రాల్చినాడు. "నాయనా! భీష్మ కుమారా! నీవు అనితర సాధ్యమయిన త్యాగము చేసినావు నన్ను మెప్పించినావు. నీకు స్వచ్చంధ మరణము ప్రసాదించుచున్నాను" అన్న ాడు. కౌగిలి వీదినాడు. కనులతో ఆశీర్వదించినాడు.
సత్యవతీ శంతనుల వివాహము జరిగినది. వారికీ ఇద్దరు పుత్రులు కలిగినారు. చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు, వారు బాలురుగానే ఉన్నారు. శంతనుడు మరణించినాడు. భీష్ముడు తండ్రికి పరలోకక్రియలు నిర్వర్తించినాడు. చిత్రంగదునకు పట్టము కట్టినాడు.
ఆలోచనామృతము
1. భరతమున ఒక్కొక్క కధ ఒక ఆణిముత్యము. ప్రతి చరిత్ర మనవ ప్రగతికి మచ్చుతునక. భారతము రతనాల గని. త్రవ్వి తీయుట, సాన పట్టుట చేత కావలెను. అది సకల మానవాళి కి వెలుగు పరచగలదు.
భీష్ముని త్యాగము నిరుపమానము.అంతటి త్యాగము చేసిన వారు మరొకరు కనిపించరు.
కన్న తండ్రి కొఱకు సర్వస్వము ధారపోయావలేననుట ఆనాటి ధర్మము. ఇరువదవ శతాబ్దమున ఉండి ఆ అచారమును నిందించుట - విమర్శించుట సహృదయుల పనికాదు. ఏ అచారమును గాలి నుంచి ఊడి పడదు. అది ఆనాటి పరిస్థితుల నుండి ఉద్భవించును.
ఆనాడు నేటి వలె భద్రతకు ఏర్పాట్లు లేవు. తండ్రికి సర్వస్వము పుత్రుడే. పుత్రుడు విధేయుడు కాకున్న జీవితము దుర్భరము. అందు కొఱకు అట్టి ఆచారము ఏర్పడి ఉండును.
శాస్త్రము ఆదర్శము బోధించును. భారతము ఆదర్శ పురుషులను గురించి చెప్పును. అంతమాత్రమున అందఱును అట్టివారే అనుకోనరాడు.
భీష్ముడు త్యాగమునకు పరాకాష్ట. అతనిది స్వచ్చంద త్యాగము అతడు వచ్చిన రాజ్యమును వదులుకున్నాడు. రావలసిన జీవిత భోగములను వదులుకొన్నాడు.
రాముడు తండ్రి మాట విన్నాడు. రాజ్యమును వదులుకున్నాడు. అతనికి భార్య ఉన్నది. అనంతరము రాజ్యము వచ్చినది.
పూరుపు యయాతికి యౌవనము ఇచ్చి రాజ్యము పొందినాడు. ఇది ఒక రకమయిన వస్తువినిమయము. కొంత కాలమునకు యౌవనము ఇచ్చినాడు. జీవితాంతము రాజ్యము అనుభావించినాడు.
భీష్మునకు అనుభవించుటకు మిగిలినదేమి? అతని బ్రతుకునకు ఆశ ఏమి? అతడు అన్నింటిని వదులుకొన్నాడు? ఎందుకు? దశరధుని వలె శంతనుడు చిక్కులలో లేడు. పూరునివలె శంతనునకు శాపము లేదు. అయినను తండ్రి కొఱకు సర్వస్వము త్యజించిన మహా మహా త్యాగి భీష్ముడు.
పుత్రుని కొఱకు కన్యను అడుగుటకు తండ్రి వెళ్ళుట లోకాచారము. తండ్రి పెండ్లి కొఱకు కన్యను అడుగుటకు వెళ్ళినాడు భీష్ముడు.
2. సత్యవతి కన్యకాదు. పరాశరునితో రామించినది. బిడ్డను కన్నది. నట్టేట పరాశరుడు సత్యవతిని వదిలినాడు. ఆమె దాశరాజు అనుమతి కోరలేదు. శంతనుని వరకు రాగా దశరాజు అనేక కోరికలు కోరినాడు.
"సంగమము" "పెండ్లి" ఈ రెండు వేరు వేరుగా గుర్తించబడినట్లున్నది. పెండ్లికి ముందరి సంగమము దోషము కానట్లున్నది. అట్టి అచారమేదో పాశ్చాత్య దేశాములందు ఉన్నది అనుచున్నారు. అది నిజమయినచో నేటి వారి ఆచారము నాటి భారతీయుల ఆచారము వంటిదని చెప్పవచ్చును.