Previous Page Next Page 
తపస్వి పేజి 15


    "పోనిస్తూ! వీడు మామూలు మధ్యతరగతి మనిషి. ఇంకా అంతకంటే తక్కువ వాడులా ఉన్నాడు. మనం అంత ప్రయాసపడినా ఫలితం ఉండక పోవచ్చును!"
    "ఫలితం...అంటే?"
    "అంటే...."
    వామనమూర్తి నవ్వేశాడు. విక్రం నవ్వలేదు.
    "నాకు ఫలితం ఉంటుంది. నేను ప్రయత్నిస్తాను."
    "ఛీఫ్ గా నేను అబ్జక్టు చేస్తున్నాను."
    "అంతవరకు వస్తే నేను హాస్పిటల్ వదిలి ఎవరయినా ప్రయివేట్ డాక్టర్ సహాయంతో ట్రై చేస్తాను."
    "ఇది ఒక ఎక్స్పెరిమెంట్!"
    "అందుకే వదులుకోను"
    "నీ ఇష్టం విక్రం. నేను ఏదయినా వదులుకోగలను. కానీ స్నేహం మాత్రం వదులుకోలేను."
    ఆ పేషెంటును లోపలకు తీసుకువెళ్ళమని నర్స్ తో చెప్పాడు విక్రం.
    ఆ నడివయసు వ్యక్తి విక్రం పాదాలు పట్టుకోబోయాడు. విక్రమ మెరుపులా వెనక్కు తగ్గి "నాకు నమస్కారం చెయ్యకు. నీకోసం నేనేం చెయ్యటం లేదు. నా కోసం నేను చేసుకుంటున్నాను" అని లోపలకు వెళ్ళిపోయాడు.
    బిత్తరపోయి నించున్న ఆ వ్యక్తి భుజం తట్టి "భయపడకు! మేమంతా ఉన్నాంగా. ఏం ప్రమాదం రానియ్యను." అన్నాడు అలవాటుగా వామన్.
    ఆ వ్యక్తి వామన్ మాటలు ఇంకా మరిచిపోలేదు. అంచేత వామన్ ను ఆశ్చర్యంగా చూస్తూ "మీరా డాక్టర్ గారు!" అన్నాడు.
    వామన్ ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయాడు.
    రోగి పరిస్థితి దారుణంగా తయారయింది. ఆపరేషన్ కు కావలసిన సరంజామా సిద్దం చేసే వ్యవధానం కూడా లేదు. ఏదో ఒకటి వెంటనే చేసెయ్యాలి.
    విక్రం తెగించి మామూలు చాకుతో కంఠం దగ్గర ఆపరేషన్ చేసేశాడు.
    ఊపిరాడక కొట్టుకుంటున్న రోగిలో ఊపిరి క్రమబద్దం కాసాగింది. నర్స్ లంతా ఆరాధనతో, ఆశ్చర్యంతో చూశారు.
    ఆపరేషన్ పూర్తయింది. కంఠం దగ్గర "ట్రకియాస్టమీ ట్యూబ్" ఫిక్స్ చేసి ఈజీ చైర్ లో వాలిపోయాడు విక్రమ్.
    ఎప్పటిలా సౌందర్య వచ్చింది. విక్రమ్ నుదుటిపైన ఎన్నడూ చూడని స్వేద జలాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ కళ్ళలో ఆరాటాన్ని చూసి అదేదో కాంప్లికేటెడ్ కేస్ అయిఉంటుందని ఊహించుకుంది. అతడంత అలసటతో సొమ్మసిల్లి పోవటం సౌందర్య ఎప్పుడూ చూడలేదు. మొదటిసారిగా అతడి ముఖాన్ని చూసింది. సాధారణమైన రూపురేఖలే! అంత అలసటలోనూ అతడి ముఖంలో ఏదో ఆనందం ప్రతిఫలిస్తోంది. ఆ ఆనందం వలన అతడి ముఖంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ కనిపిస్తోంది.
    విక్రమ్ ఒక్కసారి సౌందర్యను చూశాడు.
    సాధారణంగా సౌందర్యను ఎవరు చూసినా ఒక్కసారి ఎందుకో ఉలిక్కిపడి మరొకసారి మళ్ళీ చూసి చూపులు తిప్పుకోవాలనుకుంటూనే తిప్పుకోలేక మరోసారి చూడటం పరిపాటి...
    నలుగుర్నీ చూసినట్లుగానే సౌందర్యను చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు విక్రమ్.
    మూసి ఉన్న ఆ కళ్ళనూ, ఏదో సంతృప్తి తాండవించే ఆ ముఖాన్ని చూస్తూ కదలలేక అక్కడే నిల్చుండిపోయింది సౌందర్య.
    "డాక్టర్..." అంటూ వచ్చింది నర్స్.
    విక్రమ్ కళ్ళు తెరిచాడు.
    "ఆ పేషెంట్ తండ్రి అక్కడే కూర్చున్నాడు. ఎంత మంది చెప్పినా వెళ్ళటం లేదు. డాక్టర్ వామన్ గారు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పినా నమ్మటం లేదు.  మిమ్మల్ని వచ్చి అతణ్ణి పంపించమంటున్నారు డాక్టర్ వామన్ గారు..."
    ఆపరేషన్ అయిన తరువాత పేషెంట్ల బంధువులతో మాట్లాడటం విక్రమ్ కెప్పుడూ అలవాటు లేదు. అందుకే ఈసారీ అతని దగ్గరకు వెళ్ళలేదు. ఆ తండ్రి దీనమైన ముఖం గుర్తుకొచ్చి అతని దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యక్తి నీళ్ళు కారుతున్న కళ్ళతో రెండు చేతులు జోడించాడు. నోటితో అడగలేని ప్రశ్నలెన్నో ఆ కన్నీళ్ళలో...జోడించిన ఆ చేతులలో ధ్వనించాయి.
    విక్రమ్ చటుక్కున దగ్గరగా వచ్చి ఆ జోడించిన చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు.
    "ఫరవాలేదు. భయంలేదు. మీ అబ్బాయి బ్రతికాడు" పట్టరాని ఆనందంతో చంటిపిల్లాడిలా విక్రమ్ చేతులు ఊపేశాడు ఆ వ్యక్తి.
    "నిజంగానా డాక్టర్ గారూ! నా బాబు బ్రతికాడా? ఎంత చల్లని వార్త! నన్నొకసారి చూడనిస్తారా?"
    "ఇప్పుడు చూడటానికి వీల్లేదు. ఇంకా స్పృహ రాలేదు. రేపు రండి. అప్పటికి బహుశ మీతో మాట్లాడగలడేమో!"
    "నా బాబునాతో మళ్ళీ హాయిగా మాట్లాడుతాడా? మీరు నిజమే చెపుతున్నారుగా డాక్టర్ బాబూ!"
    "నిజం చెపుతున్నాను. మీ అబ్బాయికి ప్రమాదం దాటిపోయింది. హాయిగా బ్రతుకుతాడు. రేపు రండి."
    "అలాగే డాక్టర్ బాబూ! మీరు....మీరు రేపటి వరకు మా బాబు దగ్గరే ఉంటారుగా?"
    "ఉండను! ఇప్పుడు డాక్టర్ గోపాల్ డ్యూటీ...."
    "డాక్టర్ గారూ! మీరు...మీరే"
    "మరేం ఫరవాలేదు. అంధరమూ డాక్టర్లమే! పైగా నాకు రీసెర్చ్ వర్క్ ఉంది"
    అంతకంటే ఎక్కువ మాట్లాడటానికి ఆ నడివయసు వ్యక్తికి సాహసం కలగలేదు. ఒక్కసారి దీనంగా చూసి వెళ్ళిపోయాడు.
    ఆ చూపు ఎందుకో గుచ్చుకున్నట్లయింది విక్రంకు.
    ఎవరయినా అంత దీనంగా చూస్తే విక్రమ భరించలేడు.
    "మీరు రీసెర్చ్ చేస్తున్నారా?" అడిగింది సౌందర్య.
    "అవును!"
    తనను ఎవరు ప్రశ్నించారో, ఎందుకు ప్రశ్నించారో కూడా గమనించకుండా సమాధానం చెప్పాడు విక్రం.

 Previous Page Next Page