"ఈ రోజుల్లో ఎందుకూ పనికిరాని కాకమ్మ కథలు ఎక్కువయిపోతున్నాయి. వాస్తవ సమస్యల జోలికి ఎవరూ పోవటం లేదు" అన్నాడు అభ్యుదయ రచయిత.
"అవును!" చిరునవ్వుతో ఒప్పుకుంది సౌందర్య.
ఆ రచయితకు ఎక్కడలేని బలమూ వచ్చింది.
"మన చుట్టూ ఎందరో అభాగ్యుల జీవితాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఆక్రోశాలు వినవస్తున్నాయి. ఇవన్నీ వదిలి కమ్మని కలలలోకి ఎగిరి కూచోవటం క్షంతవ్యమే నంటారా?"
"ఎంతమాత్రం కాదు...."
"మన దేశంలో దారిద్ర్యం ఏనాటికి నిర్మూలించబడుతుందో కాని..."
"ఛ! అదేం కోరిక!"
"అదేమిటండీ?"
"అవును దారిద్ర్యం పోతే- దరిద్రులు పోతే!...ఇంకేముందీ? వాళ్ళుంటే....వాళ్ళ మీద కథలు వ్రాసి పేరు తెచ్చుకోవడం- వాళ్ళ గాథలు వెండి తెరకెక్కించి డబ్బు చేసుకోవచ్చు. వాళ్ళను "బద్మాష్!" అని అదలించి అథార్టీ చెయ్యవచ్చు. వాళ్ళే లేకపోతే మన మేమయిపోతాం? అలాంటి పాపిష్టి ఆలోచనలు రానీయకండి...."
ఆ అభ్యుదయ రచయిత ముఖం పాలిపోయింది.
అతను తన కారు డ్రయివర్ ను అలా అదిలించింది అప్పుడే మరిచిపోయాడు. ఎవరయినా గుర్తు పెట్టుకుంటారని కూడా అనుకోలేదు. అది మామూలే! కానీ... మాట్లాడకుండా ముఖం తిప్పుకున్నాడు.
కామేశ్వరీ దేవి పండితుని ఉపన్యాసాన్ని తెగ మెచ్చుకుంటోంది.
"మీరు చెప్పిన ఆ శ్లోకాలు...అబ్బ! ఎంత బాగున్నాయండీ! భామహుడు. ముమ్మటుడు.... కావ్యయశశే.."
"అబ్బ! ఏం విద్వత్తు? ఏం సౌందర్యా! నువ్వు విన్నావా?"
"వీరి ఉపన్యాసం వినకుండా ఉంటానా?"
"బావుంది కదూ!"
"గొప్పగా ఉంది. ప్రాచీనాలంకారికుల అభిప్రాయాలన్నీ చెప్పారు. వాళ్ళ శ్లోకాలన్నీ తడుముకోకుండా అప్పచెప్పాడు. అన్ని చదవటం..అంత గుర్తు పెట్టుకోవడం..ఎంత కష్టం"
ఆ పండితుని ముఖం వెలిగిపోసాగింది.
"మీరు సొంతంగా చెప్పింది ఏం లేదనుకోండి. అయితేనేం? మన పెద్దల కంటే గొప్పవాళ్ళమా మనం! వాళ్ళు ఆలోచించిన దాని కంటే భిన్నంగా ఆలోచించగలమా? ఒక వేళ ఆలోచించగలిగినా అది సహించరాని నేరం! మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలను మించి ఉంటాయా? అసంభవం! ఉండటానికి వీల్లేదు. ఎవడయినా ఏదయినా చెప్పటానికి సాహసిస్తే వాడి గొంతు నొక్కుతాం! వెర్రి వెధవ అంటాం! పెద్దల మాటలు! తరతరాలుగా అవే వినాలి. అవే నేర్చుకోవాలి. అలాగే ఆలోచించాలి."
ఆ పండితుడు వెలవెలబోతూ చూసి కోపంగా ముఖం చిట్లించుకున్నాడు.
మిసెస్ కామేశ్వరీ దేవి చప్పట్లు కొట్టి "చాలా బాగా చెప్పావు" అంది.
ఆయన ఎర్రగా చూశాడు.
సౌందర్య చిరునవ్వుతో "కామేశ్వరీదేవి గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు" అంది.
అంత కోపంలోనూ ఆయన నవ్వేశారు. కామేశ్వరీదేవి కూడా నవ్వింది.
ఆ తరువాత చర్చలు శైలి మీదకు మళ్ళాయి.
"ఎంచక్కా మాట్లాడుకుంటున్నట్టు సందర్భంగా రాసెయ్యాలి!" అంటున్నారు కొందరు.
"ప్రాచీన గ్రంథాలన్నీ చదవకుండా పలుకుబడి ఎలా పట్టుబడుతుందండీ? వాక్య నిర్మాణక్రమమైనా తెలియకుండా వ్రాయడానికి పూనుకుంటే ఎలా?" అంటున్నారు మరికొందరు...
"శైలి" ఎలా ఉండాలనే విషయం మీద రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వినీ వినీ సౌందర్య అంది "రచయిత తాను చెప్పదలచుకున్నది తన గుండెల్లోంచి తన సొంత గొంతుతో చెబుతున్నప్పుడు ఆ శైలి వర్ణ క్రమద్వేషాలను, వ్యాకరణదోషాలనూ, మరో లక్ష దోషాలను దిగమ్రింగేసి వెల్లువలా పొంగే పాఠకుడి హృదయంలో ప్రవేశిస్తుంది. ఆ రచనలో కొన్ని కోట్ల లోపాలున్నా, ప్రతి అక్షరంలోనూ రచయిత సజీవంగా మనకు కనిపిస్తాడు. అలాంటిది ఎలాగూ అపురూపం కనుక కనీసం భాషా భేషణమైనా ఉండద్దా?"
అవును ప్రబంధాలు చదవాలి! బాల వ్యాకరణం భట్టీ పట్టాలి!
"అందుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగా గ్రాహ్యంబులు"
"ఆర్య వ్యవహారంబుల దుష్టంబులు గ్రాహ్యంబులు!"
"భలే సూత్రాలు! ఇలాంటివి నోరెరుగని పసివాళ్ళతో భట్టీయం వేయించడం సమాజ భద్రతకెంతయినా అవసరం!"
పకపక నవ్వింది సౌందర్య...
9
రోగి శరీరమంతా నీలంగా మారి కొయ్యబారిపోతోంది. ఊపిరాడక కొట్టుకుంటున్నాడు. నడివయసులో ఉన్న ఆ రోగి తండ్రి మనసు ఆడక విలవిలలాడుతున్నాడు.
"వీల్లేదు! ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేదు" ఖండితంగా చెప్పాడు వామనమూర్తి.
"బాబూ! ఒక్కడే కొడుకు. వాడే మా కంటి వెలుగు. మా ఆశలన్నీ వాడిమీదే. ఎలాగయినా.
వాడిని కాపాడండి బాబూ! మీ మేలు జన్మజన్మలకూ మరిచిపోను" ప్రాధేయ పడుతున్నాడు నడివయసులో ఉన్న వ్యక్తి....విక్రం సాధారణంగా దేనిలోనూ కల్పించుకోడు- కానీ ఆనాడు ఆ వ్యక్తి అభ్యర్ధన అతని మనసును కదిలించింది.
రోగిని పరీక్షగా చూశాడు.
"వామన్! ఇది డిఫ్తీరియా. వెంటనే ఆపరేషన్ చేస్తే బ్రతకవచ్చు."
వామనమూర్తి మండిపడ్డాడు.
"నీకు మతి లేదా! రోగి ఏ స్థితిలో ఉన్నాడో చూడు. ఎంత రిస్క్!"
"రిస్క్ తీసుకుందాం! ఇంకా ప్రాణాలు పోలేదు కదా!"
"కానీ ఆ పోయే ప్రాణాలు మన చేతుల్లో పోతే మనకెంత అప్రతిష్ట?"
"అప్రతిష్ట వస్తుందేమోనని ఒక ప్రాణాన్ని కాపాడగలిగే అవకాశం వదులుకుంటామా? ఒకవేళ కాపాడితే ఎంత ప్రతిష్ట!"