Previous Page Next Page 
తపస్వి పేజి 16


    "ఇంత కష్టపడి ఆపరేషన్ చేశారు. పూర్తిగా కోలుకునేవరకూ ఉండలేరా?"
    "ఇంక  ఎవరు చెయ్యవలసింది మాత్రం ఏముందీ? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నా డ్యూటీ కాదు."
    "మీ రీసెర్చ్ ముఖ్యమా?"
    "అన్నింటి కంటే నాకు రీసెర్చే ముఖ్యం..."
    తనతో మాట్లాడింది ఎవరో కూడా పరిశీలనగా గమనించకుండా వెళ్ళిపోయాడు విక్రం.
    ఆ మరునాడు విక్రం హాస్పిటల్ కు వస్తూనే తన పేషెంట్ దగ్గరకు వెళ్ళాడు.
    అతనికి ప్రాణం లేదు.
    ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యవలసిన ట్రికియాస్టమీ ట్యూబ్ పూడుకుపోయి ఉంది.
    స్థంభించిపోయాడు విక్రం. అశ్రద్ధ...కేవలం అశ్రద్ధ...ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన మేథనూ, తన పరిశ్రమనూ వ్యర్ధం చేసింది- కోపంగా డాక్టర్ గోపాల్ దగ్గరకు వచ్చాడు. ఒక నర్స్ తో కులాసాగా పేకాడుతున్న డాక్టర్ గోపాల్ విక్రంణు చూడగానే ముక్కలు క్రింద పారేసి "హమ్మయ్య! మీరు వచ్చారా? ఇంక నేను వెళ్ళచ్చు!" అంటూ లేచాడు.
    విక్రం కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయి. డాక్టర్ గోపాల్ చొక్కా పట్టుకుని పేషెంట్ దగ్గరకు లాక్కొచ్చాడు.
    "చూడండి! ఇదంతా మీ అశ్రద్ధకు ఫలితం! కేవలం మీ అశ్రద్ధ"
    కోపం...తిరస్కారం...ఆవేదన...అన్నీ పలుకుతున్నాయి విక్రం కంఠంలో...
    ప్రాణం పోయిన ఆ రోగిని చూడగానే డాక్టర్ గోపాల్ క్షణకాలం కొయ్యబారి పోయాడు...
    "అయామ్ సారీ డాక్టర్. నేను ఇలా..." ఏదో అనబోతుండగానే తీవ్రంగా అడ్డుకొన్నాడు డాక్టర్ విక్రం.
    "డాక్టర్! మీ ప్రవర్తన క్షంతవ్యం కాదు- నేను ఇప్పుడే రిపోర్టు చేస్తాను."
    అంత వరకూ తడబడి భయపడుతున్న డాక్టర్ గోపాల్ ఈ మాటలతో నిటారుగా నించున్నాడు.
    "నామీద రిపోర్టు చేస్తారా? నేనెవరినో తెలుసా?"
    "తెలుసు! తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించుకోలేని ఒక డాక్టరు మీరు..."
    "అంతే కాదు. శ్రీ శశాంక గారి కాండిడేట్ ని..."
    "అయితే..."
    "మీకింకా ఏం తెలిసినట్లు లేదే!"
    "తెలుసుకోవాలని కూడా లేదు."
    నర్సు వచ్చింది. తలవంచుకుని పేషెంటు తండ్రి వచ్చాడని చెప్పింది.
    విక్రం కదలలేకపోయాడు. ఎన్నడూ లేని నీరసమేదో ఆవహించినట్లయింది. ఈడ్చుకుంటూ బయటకు వచ్చాడు.
    ఆ వ్యక్తి ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. చేతిలో ఒక బుట్టలో రకరకాల పళ్ళు ఉన్నాయి.
    "డాక్టర్ బాబూ! మీరు నాకు చేసినదానికి నేనేం చేసినా రుణం తీర్చుకోలేను. డాక్టరు గారూ! ఈ పళ్ళు తీసుకోండి! నా సంతృప్తి కోసం.....కాదనకండి.....నా బాబును నాకిచ్చిన మీకు ఈ పళ్ళయినా ఇయ్యగలిగాననే సంతృప్తి దక్కనీయండి... బీదవాడ్ని...ఇంతకంటే ఇచ్చుకోలేను, నా మనసారా దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మీకు శుభం కలగాలని..."
    విక్రం గొంతు పెగలటం లేదు. మాట రావటం లేదు. ఆ వ్యక్తి విక్రం ముఖం చూసి "డాక్టర్ గారూ!" అన్నాడు భయంగా...
    "నిన్న బ్రతికించగలిగాను కాని..."
    విక్రం మాట్లాడలేకపోతున్నాడు.
    ఆ వ్యక్తి ఘొల్లుమన్నాడు. అయోమయంగా చూస్తూ నించున్న విక్రంణు ఎవరో చెయ్యి పట్టుకుని లోపలకు నడిపించుకుని వచ్చారు.
    "విక్రం! డాక్టరు గోపాల్ మీద రిపోర్టు చెయ్యకు. నీ స్నేహితుడిగా చెపుతున్నాను. అది నీకు మంచిది కాదు..." అన్నాడు వామన్.
    "రిపోర్టు చేసి తీరవలసిందే! నేను ఊరుకోను!"
    "మనం డాక్టర్లం! ఒకరి లోపాలను మరొకరం సర్దుకోవాలి కాని, ఇలా బయట పెట్టుకోవచ్చా?"
    "నాన్సెన్స్! చేతులారా ఇలా ప్రాణాలు పోగొడుతుంటే చూస్తూ ఊరుకోవటమా వృత్తి
    ధర్మం!"
    "డాక్టర్ గోపాల్ కు శశాంకగారి అండదండలున్నాయి. అతనితో వైరం నీకే మంచిది కాదు..."
    "ఏది ఎలా జరిగినా నేను చెయ్యదలచుకున్నది చెయ్యకమానను!"
    విక్రం డాక్టర్ గోపాల్ పైన రిపోర్టు చేశాడు. గోపాల్ శశాంక గారిని ఆశ్రయించాడు. క్షణాలలో విషయమంతా అటు నుంచి గిర్రున ఇటు తిరిగింది.
    డాక్టర్ విక్రం మామూలు చాకుతో ఆపరేషన్ చెయ్యటం వలననే ప్రాణాలు పోయినట్లు అందరూ రుజువు చేశారు.
    డాక్టర్లందరూ డాక్టర్ విక్రంకు తన వృత్తికంటే రీసెర్చ్ మీదనే ఆసక్తి ఎక్కువయిందనీ, ఆ కారణంగా డ్యూటీ అప్పుడప్పుడు నిర్లక్ష్యం చెయ్యటం జరుగుతూ ఉంటుందని చెప్పారు.
    రోగి తండ్రి తను తన కొడుకు దగ్గర ఉండమని ఎంత బ్రతిమాలుకున్నా డాక్టరు గారు "నాకు రీసెర్చ్ ఉంది" అని వెళ్ళిపోయారు అని సాక్ష్యం చెప్పాడు.
    "నాకు అన్నింటికంటే రీసెర్చ్ ముఖ్యం" అని సౌందర్యతో చెపుతుండగ నర్సులు విన్నారు. తమతో ఏనాడూ నవ్వుతూ మాట్లాడని...ఏ విధంగానూ తమకు ఉపయోగపడని విక్రం మీద నర్సులకు సానుభూతి లేదు.
    తాము విన్నదానికి చిలవలు పలవలు చేర్చి చెప్పారు. డాక్టర్ విక్రం దోషిగా నిరూపించడానికి పెద్ద శ్రమ అక్కర్లేకపోయింది.
    ఆ హాస్పిటల్ లో ఉద్యోగం నుండి డాక్టర్ విక్రం తొలగించబడ్డాడు.
    
                                                          10
    
    పట్టరాని సంతోషంతో తనను ఆహ్వానిస్తున్న విక్రంణు చూసి డాక్టర్ కిరణ్ కుమార్ కొన్ని క్షణాలు అయోమయంలో పడిపోయాడు. విక్రం ఉద్యోగంలో నుండి తొలగించబడిన వార్త డాక్టర్ కిరణ్ కుమార్ కు తెలిసింది. ప్రచారం లోకి వచ్చిన కథ విన్నారు. ఏం జరిగిందో ఊహించుకోగలిగారు. వెంటనే విక్రం దగ్గరకు వచ్చారు. విక్రం ముఖం చూస్తూ తాను అల్లుకుంటూ వచ్చిన సానుభూతి వాక్యాలు ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు ఆయనకు...

 Previous Page Next Page