"ఓహోహ్! ఇలా పొగిడితే ఉబ్బిపోయి అసలు విషయం మర్చిపోతాననుకున్నారేమో చెప్పండి? రిజిస్టర్డ్ మేరేజ్ కావాలని ఎందుకన్నారూ?"
"నీకేమైనా అభ్యంతరమా?"
"అభ్యంతరం లేదు. కారణం తెలుసుకోవాలని. మీ ఇంట్లో అంతా సాంప్రదాయాభిమాలు కదా!"
"అందుకనే..."
"అర్ధమయ్యేలా చెప్పండి! ప్లీజ్! మీరేం చెప్పినా నేను అర్థం చేసుకోగలను! సహకరించగలను."
"మా నాన్నగారు మన పెళ్ళికి వప్పుకోకపోవచ్చని నా అనుమానం."
"తీరా ఆయన కట్నం కావాలనుకుంటున్నారా?"
"కట్నం మీద ఆశ కాదు. మా ఇంటికి ఆయన ఒక నియంత. అందరంటేనూ ఆయనకి అభిమానం ఉంది. కానీ ఆ అభిమానం కూడా నియంత చూపే అభిమానం లాంటిది. ఆయన జ్యోతిష్యాలు చూపించి జాతకాలు గుణించి ఉత్తమ ఇల్లాలూ మహాసాధ్వీ అయిన అమ్మాయినే ఎంపిక చెయ్యాలనుకుంటున్నారు. అదీగాక ఆయన దృష్టిలో సాధ్విత్వమంతా సినిమాటిక్ గా ఉండాలి! అంటే వంటినిండా పైట కప్పుకోవడం. తలదించుకుని వగైరా........ వగైరా........"
నవ్వు ఆపుకుంది యశోద.
"ఏం! నేను మహాసాధ్వినీ ఉత్తమఇల్లాలినీ కాదని మీ అనుమానమా?"
"అయినా కాకపోయినా నాకు అనవసరం. నాకు కావలసింది నన్ను ప్రేమించే అమ్మాయి."
పైకే నవ్వేసింది యశోద.
"ఉత్తమ ఇల్లాలిలో మహాసాధ్విలో ప్రేమ ఉండదా?"
"ప్రేమ ఉండకపోయినా ఉత్తమ ఇల్లాలు మహాసాధ్వి కావచ్చు. నోరుమూసుకు పడి ఉండటం ద్వారా ప్రేమకన్నా, ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ, ఇంటినీ తన భర్తనీ చక్కదిద్దుకోవాలని ప్రయత్నిస్తే సంఘం ఆమెని మహాసాధ్వి అని అనకపోవచ్చును. కానీ నేను కోరేది ప్రేమతోపాటు సమయానుకూలంగా ప్రాక్టికల్ గా ఆలోచించే భార్య...."
"ఇదే విషయం మీ నాన్నగారితో స్పష్టంగా చెప్పొచ్చు."
"ఆయనని కన్విన్స్ చేసి, అది సాధ్యం కాకపోతే. ఎదిరించి మీరు కోరిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు. అంతేగానీ దొంగచాటుగా....."
"నువ్వు చెప్పిన రెండూ అసంభవాలే! బ్రహ్మ కూడా మా నాన్నగారిని ఏ విషయంలోనూ కన్విన్స్ చేయలేడు. ఇక ఆయనని ఎదిరించటం పూర్తిగా అసంభవం. ఎందుకంటే ఆయన మనతో ఏ విషయంలోనూ వాదించరు! అంతా తన ఇష్టమే జరిగేలా చూసుకుంటారు. నా మాట విను నాది పెంకితనమని అనుకోకు! రిజిస్టర్డ్ మేరేజ్ అయిపోగానే మనం మా నాన్నగారికి చెప్పేద్దాం. సినిమాల్లో లాగ "నా ఇంట్లో నుంచి ఫో!" అంటే "థాంక్స్" చెప్పేసి వచ్చేద్దాం! ఏం?"
యశోద మాట్లాడలేదు. మనసులో అపస్వరాలు ఆగటం లేదు. కానీ ఈ కారణంగా వివేక్ ని దూరం చేసుకోడానికి సిద్ధంగా లేదు యశోద.
5
యశోద దగ్గర స్నేహితులంతా వచ్చారు. పెళ్ళికి! కొందరు స్నేహితులు. యశోదని ఆధునికంగా అలంకరించడానికి తయారయ్యారు. యశోద వద్దంది.
పార్వతి కొనిచ్చిన కొత్తపట్టుచీర కట్టుకుని మామూలుగానే తయారయింది. వివేక్ ప్రతీ ఫంక్షన్ కీ సూట్ లో వస్తాడు. పెళ్ళికి అలాగే సూట్ లో వచ్చాడు.
ఆ రోజు కారులో వచ్చాడు రిజిస్టార్ ఆఫీసుకి. కారులో తన పక్కన యశోదని కూచోపెట్టుకుని. వెనుక సీట్లో పార్వతీ, దక్షిణామూర్తిలని కూర్చోమని తనే డ్రైవ్ చేశాడు.
"మీ అమ్మగారేరీ?" అడిగింది యశోద.
"వొస్తుంది! నాన్నగారి కారులో! డ్రైవర్ ఉన్నాడు."
"అంటే ఇదెవరి కారు?"
"నాకారు."
"నీకు ప్రత్యేకంగా కారుందా? మరి ఎప్పుడూ మోటార్ సైకిల్ మీదే కనిపిస్తారే?"
"నా పాకెట్ మనీ పెట్రోల్ కి ఖర్చయిపోతుందని!"
"పిసినారితనమా?"
"అవును! ఇప్పటినుంచీ. రాబోయే సంతానం కోసం నెలకి వందరూపాయలు బాంక్ లో వేస్తుంటాను."
"నిజంగా? భలే ఐడియల్ ఫాదర్!"
"మా నాన్నగారిలా కాకుండా నిజంగా ఐడియల్ ఫాదర్ కావాలన్నదే నా ఆశ"
ఉలికిపడింది..... అతనికి సంతానమంటే ఎందుకో ఆశ. అర్థమయింది. సైకాలజీ స్టూడెంట్ కావటం వల్ల "లవ్ హేట్!" అనుబంధం తండ్రితో వివేక్ కి.
రిజిస్ట్రార్ ఆఫీసుకి వివేక్ స్నేహితులు. యశోద స్నేహితులూ, యశోద తరుపున బంధువులూ చాలామంది వచ్చారు. జానీ కూడా వచ్చాడు. ఆశ్చర్యపోయింది యశోద! అతడినసలు పిలవలేదు.
జానీ యశోదా, వివేక్ లకీ కంగ్రాట్స్ చెప్పాడు.
గంధపుచెక్కతో చేసిన రాధాకృష్ణుల విగ్రహాన్ని బహుమానంగా ఇచ్చాడు.
"వివేక్ వచ్చి నన్ను స్వయంగా ఆహ్వనించడు పెళ్ళికి!. అందుకే వంట్లో బాగోకపోయినా వచ్చాను" అన్నాడు జానీ. తెల్లబోయింది యశోద. వివేక్ నవ్వులో గర్వ రేఖ. అర్థమయింది యశోదకి!
జానీని ఆహ్వానించడంలో వివేక్ లో ఉన్నది ఔదార్యం కాదు..... అహం!. "నీకు దక్కని యశోద నా భార్య అవుతోంది" అని గర్వంగా చెప్పుకోవటం.
జానీ ఇది అర్థం చేసుకోలేదు. పాత పగలు మర్చిపోయి స్నేహంగా పిలిచాడనుకుని వచ్చాడు. యశోద స్నేహితులలో కొందరు జానీ పైన ఓర చూపులు విసిరారు.
జానీ చెల్లెలు క్రిస్టియన్ స్టైల్ లో యశోద బుగ్గలపైన ముద్దు పెట్టుకుంది. "ఇంకా ఏమిటి ఆలశ్యం?" చెప్పిన టైం దాటిపోవటంతో అసహనంగా అడిగాడు రిజిస్ట్రార్.
"మా అమ్మ వొస్తుంది" చెప్పాడు వివేక్"
మరో అరగంటలో వస్తుంది. ఈసారి స్నేహితులే అసహనం చూపించారు.
"ఎంతసేపని వెయిట్ చెయ్యటం? ఆవిడ వచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఈపాటికి వచ్చేవారే! రావటం కుదరలేదేమో? మనం కానిచ్చేద్దాం."
వివేక్ కూచున్న చోటి నుంచి కదలలేదు.
"మా అమ్మ వొస్తుంది" అన్నాడు మళ్ళీ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నంత నమ్మకంగా.