"డాడీ" అంది ఇంద్రసేన గొంతు చీరుకుంటూ ఆమె మనసు మండుకుపోతుంది.
గణేశ్ రావు గారు ఒక్క క్షణంపాటలా ఉండిపోయారు. కూతుర్ని అలా అనటం ఆయనకు నచ్చలేదు.
తనకి గారాలకూతురు అమ్మాయిని ఎవరయినా ఏమైనంటే తను సహించలేడు.
ఇప్పుడమ్మాయి అంటున్నది ఎవరోకాదు కోడలు ఆమెను ఏమనలేరు.
కోడలువేపు క్షణంసేపు చూసి కూతురికి ఏం సమాధానం చెప్పలేనట్టు అక్కడనుండి మెల్లగా అవతలకు వెళ్ళిపోయారు.
సుభద్రమ్మ భర్త అలా వెళ్ళిపోవటం చూసి తనక్కడ వుండటం మంచిది కాదని అక్కడనుండి మెల్లగా ఆవిడకూడా వెళ్ళిపోయింది.
తను అనుకున్న విషయంలో కోడలు తప్పకుండా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది ఆవిడకు.
తల్లీ తండ్రి తమకి ఏం పట్టనట్టు మౌనంగా అక్కడనుండి వెళ్ళిపోవటంతో దెబ్బతిన్నట్టయింది. ఇందు అంబిక ఆమె వేపు చూసి అదో రకంగా నవ్వింది. చూశావా నా మాట అంటే ఎలా వెళ్ళిపోయారో అన్నట్టు ఉంది ఆ నవ్వులో అర్దం.
ఇంద్రసేనకి ఒళ్ళు మండిపోయింది. పెళ్ళయి సంవత్సరం కూడా పూర్తవలేదు.
అప్పుడే అంత అధికారం చెలాయిస్తుందా? తను ఎవరనుకుంటుంది.
అత్తగారిని మావగారిని మాట మాట్లాడకుండా చేస్తుందా!
ఎంత పొగరు! ఇంద్రసేన పళ్ళు పటపట లాడించింది.
"నీ పెత్తనమేమిటి! తలుపులు నేను తెరుస్తా"నంటూ విసురుగా అడుగుముందుకు వేసింది.
అంతే అంబిక అడుగుముందుకు వేసి ఆడపడుచు చేతిని చప్పున పట్టుకుంది.
"ఏమిటి నీ మొండితనం! నేను యెందుకు ఈ పని చేశానో నీకర్ధం కాలేదా? నీ అన్నయ్యమీద నీకంత ప్రేమవుంటే నా భర్తమీద నాకెంత ప్రేమ ఉండాలి? ముందు నువ్వు ఇక్కడనుండి వెళ్ళు అవతలకి" అంటూ కోపంగా అరిచింది.
అంతకన్నా గట్టిగా గొంతు చించుకొని మరీ అరవాలనుకుంది ఇంద్రసేన.
"ఇందూ!" తండ్ర కంఠస్వరం శాంత గంభీరంగా వినిపించింది.
తలతిప్పి అటు చూసింది ఇంద్రసేన.
గణేశ్ రావు గారు హాలులో గుమ్మంవద్ద నిలబడి కూతురివైపే చూస్తూ అన్నారు.
"వదిన చెప్పినట్టు చెయ్యి నువ్వు నీ గదిలోకి వెళ్ళు."
ఆయన మెల్లగానే చెప్పినా ఆజ్ఞాపించినట్టే వుంది. ఆ ఆజ్ఞకు తిరుగులేదన్నట్టు చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయారు.
ఇంద్రసేన ఒక్క క్షణములా ఉండిపోయి అక్కడనుండి గబగబ వెళ్ళిపోయింది. అవమానంతో తనమాట చెల్లలేదన్న ఉక్రోషంతో కళ్ళ నీళ్ళు సుడులు తిరగసాగాయి.
గణేశ్ రావు గారు అంబికను హాలులోకి కబురు చేసి అడిగాడు.
"అక్కడ గొడవ జరుగుతుంది, సాయంత్రం ఐదు గంటలలోగా వెళ్ళాలి నువ్వా అబ్బాయిని వెళ్ళనివ్వటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి?"
అంబిక మావగారి మాటలు వింటూనే ధీమాగా నవ్వింది, మెల్లిగా చెప్పింది.
"నేను వెళ్ళి వర్కర్స్ కి నాకు తోచినట్టు నేను చెప్పివస్తాను. మీరు ఆలోచించి మనసు పాడుచేసుకోకండి."
"నువ్వు వెళతావా! వాళ్ళసలే మంచివారు కారు" ఆయన కంగారు పడ్డారు.
"మంచివాళ్ళు కారు అంటే!" అంటూ నవ్వింది.
"వాళ్ళూ మనుష్యులేకదా మావయ్యగారూ! కడుపుమండిపోయివాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. వాళ్ళకి నీడను ఇచ్చేవాళ్ళు మనమైనప్పుడు మనల్ని కాక ఇంకెవరడుగుతారు!"
గణేశ్ రావు గారలా ఉండిపోయారు. కోడలికి ఏం సమాధానం చెప్పలేదు.
"మీరు ఉండండి నేను వెళతా" నంటూ చెప్పి బయలుదేరి వెళ్ళే ముందు అత్తగారికి చెప్పి వెళ్లింది.
"ఆయన గది తలుపులు మాత్రం తీయకండి, భోజనం చెయ్యకపోయినా పర్వాలేదు. మంచినీళ్ళు కావలసివస్తే కిటికీలోనుండి ఇవ్వండి. సాయంత్రం పడుకొని నిద్రలేచాక ఎనిమిది గంటలకు తీయండి అప్పటికి చల్లబడతారు. తిక్క వదిలిపోతుంది"
సుభద్రమ్మ తల ఊపింది కొడుక్కి భోజనం పెట్టకుండా తల్లి మనసు ఒప్పదు. కొద్దిగా బాధపడినట్టయింది. ఐనా కోడలు చెప్పినట్టు చెయ్యాలి తప్పదు. అనుకుని తల ఊపిందలాగే అన్నట్టు.
అంబిక వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి రాలేదు. ఫోన్ కూడా చెయ్యలేదు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ భోజనం చెయ్యలేదు. అక్కడ గొడవ ఎలా వుందో అని ఒకవేపు బెంగ కోడలు యింకా యింటికి రాలేదు అని బెంగ మేనేజరుకి ఫోన్ చేసినా రింగవుతుందేగాని అక్కడ ఎవరు రిసీవర్ ఎత్తటంలేదు.
గణేశ్ రావు గార్కి వెళ్ళాలంటే మనసు గుబగుబలాడుతుంది.
జయరాం గదిలో అరిచరిచి పడుకుని నిద్రపోయాడు. సుభద్రమ్మ ఏడుగంటలవుతుండగా వెళ్ళి తలుపులు తీసింది.
జయరాం కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి.
"మీ కోడలు తలుపులు తెరవ్వద్దు అందా?" కోపంగా అడిగాడు.
"అది కాదు బాబూ...." అంటూ శాంతంగా కొడుక్కి నచ్చజెప్పబోయింది.
"మీ తప్పు యేంలేదు నాకు తెలుసు అంబిక ఎక్కడ" పళ్ళు పటపట కొరికాడు.
అతనిలో ఆగ్రహావేశాలు చల్లారలేదు. అతని భయంకర రౌద్రస్వరూపంలో మార్పు రాలేదు.
కళ్ళల్లో ఎర్రగీరలు అలుముకున్నాయి. కళ్ళు కళ్లుతోపాటు ముఖం కూడా ఎర్రబడి పోయింది.
సుభద్రమ్మ కొడుకువైపు చూస్తూనే భయపడింది.
"హాస్పిటల్ కి వెళ్ళింది ఇంకా రాలేదు. వస్తుంది" అంది మెల్లగా.
"రానీ నరికి పోగులు పెట్టేస్తాను నన్ను గదిలో పెట్టి బంధిస్తుందా! నాకు నీతులు బోధిస్తుందా! ఈ జయరామ్ అంటే ఎవరు అనుకుంటుంది. నరులకి నరరూప రాక్షసులకి జడిసిపోయే పిరికివాడిని కాదు నేను అనుకున్నది సాధించటం కోసం పచ్చినెత్తురు త్రాగి అయినా విజయం సాధిస్తాను."
"జయా!" అంది తల్లి కంగారుపడుతూ,
గణేశ్ రావు గారు అక్కడికి వచ్చారు,
కొడుక్కి నచ్చచెప్పడానికి.
జయరామ్ ఎవరిమాటా వినే స్థితిలో లేడు. అంబిక ఎప్పుడు వస్తుందా, ఆమెను పీకనులిమి చంపేద్దామన్నంత కోపం అతనిలో చెలరేగిపోసాగింది.