ఆ విధి నా భార్య అయిన తరళ రూపంలో రావటం అన్నిటికన్నా దురదృష్టకరం.
* * *
ఇంటి కొస్తూన్నంతసేపూ నా ఆలోచన్లు నా కొడుకుచుట్టూనే తిరుగుతూ వున్నాయి. వాడికి ఇరవై రెండేళ్ళు వుంటాయి - ఈపాటికి. ప్రబంధ్ లా వుండి వుంటాడా...
లేదు. ప్రమద్వర పెంపకంలో ఇంకా దృఢంగా- ఇంకా తెలివితేటల్తో- ఇంకా పెద్ద పొజిషన్ లో...
ఏ పడవ గెల్చింది? ప్రబంధా? గోపీచందా?
గోదావరి ఒడ్డున తరళా, ప్రమద్వారా వెన్నెల్లో నిలబడి నీళ్ళలోకి పడవలు వదిలేవారు. నేను జడ్జిని ఎప్పుడూ తరళనే గెలిపించేవాడిని. తరళ పెంకితనం మా ఇద్దరికీ తెలుసు. ఓడిపోతే సహించేది కాదు. కార్తీకపౌర్ణమి రోజు వెన్నెల్లో గోదావరిలో ఇద్దరూ దీపాలు వదిలిన రోజు చూపుడు వేలు గోటితో ప్రమద్వర వదిలే దీపపు ఆకుకి రంధ్రం చేసి, ఏమీ ఎరగనట్టు వూరుకుంది. నాకు బాగా జ్ఞాపకం నాలుగు గజాలు వెళ్ళగానే ప్రమద్వర వదిలిన దీపం మునిగిపోయింది. తరళ చిన్నపిల్లలా చప్పట్లు కొట్టి, "నేనే గెల్చాను. నేనే గెల్చను" అంటూ అరవసాగింది. కార్తీకపౌర్ణమి రోజు ఎవరి దీపం ఎక్కువ దూరం వెళ్తే వారి అదృష్టం అంత బావుంటుందట, నాకు తరళ మీద కోపం రాలేదు. అసహ్యం వేసింది. ప్రమద్వర మాత్రం నవ్వుతూ చూసింది. 'ఒసే తరళా! నా జాతకం కన్నా నీది బావుంటుంది అని చెప్పటానికి ఈ వెన్నెల్లో గోదారీ, వదిలే దీపాలూ కావాలా? అదెలాగూ బాగానే వుంటుంది' అంది. ఆ తరువాత కలుసుకున్నప్పుడు చెప్పాను. "ఆ రాక్షసి దీపం క్రింద ఆకుకి రంధ్రం చేసింది ప్రమదా" అని ఆమె నవ్వి "నాకు తెలుసు. నేనూ చూశాను" అంది క్లుప్తంగా, ఆ నవ్వు భూదేవిని గుర్తుకు తెచ్చింది. అవతలివాళ్ళ పిచ్చితనాన్ని తమ సహనంతో చిరునవ్వుగా మార్చుకోగల వాళ్ళకే వస్తుంది ఆ పోలిక.
తరళ నిజంగా జీవితంలో కూడా అలాగే సాధించుకుంది తనకి కావల్సింది!
తన దీపాన్ని తీసుకుని ప్రమద్వర వెళ్ళిపోయింది.
కనీసం ఈ పోటీలోనైనా ప్రమద్వర గెలుస్తుంది అనుకున్నాడు. ప్రబంధ్ కన్నా గోపీచంద్, నేను గర్వించే కొడుగ్గా నాకు కనపడతాడనుకున్నాను. కానీ ఇదేమిటి? నా ప్రమద్వర జీవితం ఇలా అర్దాంతరంగా ముగిసిపోయిందా? గోపీచంద్ ని వృద్దిలోకి తీసుకురాలేక పోయిందా! హీనాతిహీనమైన స్థితిలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందా?
ఆలోచన్లతో ఇంటికొచ్చేసరికి తరళ ఇంట్లో లేదు.
ఎక్కడికి వెళ్ళిందో ఎవరూ చెప్పలేకపోయారు. కారు తీసుకుని వెళ్ళిందని వాచ్ మన్ చెప్పాడు. అప్పుడు గుర్తొచ్చింది. మా వెనుక కారు సంగతి. తనే నేమో అన్న అనుమానం కలిగింది.
అయిపోయింది మా సంసారం అగ్నిపర్వతంలా బ్రద్దలవబోతూంది అని తెలిసిపోయింది కానీ నా భార్య అతి తెలివిగా సంభాషణ ప్రారంభించింది.
"ఇందిర కూతురు శ్రీదేవి కూడా వచ్చింది" అంది.
"ఎక్కణ్ణుంచి?" అని అడిగాను.
"విజయనగరం నుంచి" అంది. ఆ వెటకారానికి లాగిపెట్టి కొడదామనుకున్నాను. అలా కొట్టటమే జరగాల్సి వస్తే ఈ పాటికి ఆమె చెంప లక్షసార్లు మ్రోగి వుండేది. మా శోభనం జరిగిన మొదటిరోజే! నా చుట్టూ పన్నిన వల, నేను మోసపోయిన విధానం- వీటికి నేనే కాకుండా ఇంకెవరైనా అయితే, అక్కడికక్కడే దాని ప్రాణాలు తీసి వుండేవారు. (క్షమించండి ఆవేశంలో భార్యని 'దాన్ని' అని సంబోధిస్తున్నాను.)
"నువ్వూ బంజారాకి వచ్చావా?" అన్నాను ఏమీ తెలియనట్టు మళ్ళీ వెటకారంగానే "భాగ్యేశ్వరి మరో అరగంటలో మనదేశం వస్తోంది" అంది. నిజంగా తనకి మతిపోయిందనే అనుకున్నాను. శ్రీదేవి అంటుంది. ఇందిర అంటుంది. కొంచెం సేపు విజయనగరం అంటుంది. ఇప్పుడెవరో భాగ్యేశ్వరి....అంటుంది. కొంచెం సేపు విజయనగరం అంటుంది. ఇప్పుడెవరో భాగ్యేశ్వరి...
"ఆవిడెవరు?" అన్నాను.
అప్పుడు బయటపడింది గోపీచంద్ పేరు....ఏ పేరైతే ఇరవై సంవత్సరాలకు పైగా నా హృదయంలో గుండెకన్నా ఎక్కువసార్లు కొట్టుకుందో- ఆ పేరు!
సరిగ్గా అయిదు నిమిషాల తరువాత మా కారు వేగంగా ఎయిర్ పోర్టు వైపు వెళ్తూంది. నేనేమీ మాట్లాడలేదు. తరళ లాటి మూర్ఖురాలు ఏం చెప్పినా వినదు. అందులోనూ ఇంత పత్తేదారు పనిచేసి ఏదో సాధించిన దాన్లా నన్ను సాధించే మూడ్ లో వున్నప్పుడు చెప్పటం కూడా అనవసరం!
-ఎయిర్ పోర్ట్ లో విమానం ఏమీలేదు.
నాకు తల తిరిగిపోతూంది. తరళ మీద కోపం ముంచుకొస్తూంది. నిజంగా గోపీ తనని కలిశాడా!
"మీ పెద్దకొడుకు స్మార్ట్ గా వున్నాడు. అచ్చు మీ పోలికలే...మరి మీ గుణాలు వచ్చినయ్యో లేదో తెలీదు. అచ్చు మీ పోలికే ... పేరు గో...పీ...చం....ద్.."
కలిసే వుంటాడు. లేకపోతే పేరుతో సహా ఇంత కరెక్టుగా ఎలా చెపుతుంది?
ఇద్దరం బంజారాకి వచ్చాం.
గోపీ అక్కడే దిగాడని తరళ చెప్పింది.
ఎంక్వయిరీచేస్తే ఆ పేరుమీద ఎవరూ లేరన్నారు. అప్పుడే తెలిసిన మరొక వార్త ఏమిటంటే 'దేవిక' కూడా గది ఖాళీ చేసిందని!
ఏమై వుంటుంది! ఎవరన్నా బ్రోతల్ వాళ్ళు బలవంతంగా బెదిరించి తిరిగి తీసుకు వెళ్ళిపోయి వుంటారా?
లేకపోతే నా భార్యని చూసి ఆ చిన్న పిల్ల భయపడి, తిరిగి అంధకారంలోకి వెళ్ళిపోయిందా? బయట దానికోసమే ఎదురు చూస్తున్న బ్రోతల్ వాళ్ళు ఎగరేసుకుపోయి వుంటారా?
లోపల్నుంచి దుఃఖం నన్ను తన్నుకు వస్తోంది. చివరి ఆధారం కూడా పోయింది, నా భార్య మూర్ఖత్వంవల్ల....నా భార్య అజ్ఞానం వల్ల...
ఇన్నేళ్ళ జీవితంలో నన్ను అర్ధం చేసుకున్నదైతే, కనీసం ఒక్క ప్రశ్న వేయొచ్చుగా...ఓహో అలా అయితే 'తరళ' ఎందుకు అవుతుంది. ప్రమద్వరా! నన్ను క్షమించు నీ కూతుర్ని నేను రక్షించలేకపోయాను. నా శాయశక్తులా దేవిక ఎక్కడుందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను.
గోపీచంద్ చెప్పిన కథ
మనిషి జీవితంలో అద్భుతమైన సంఘటనలకి నాంది కూడా అతి సాధారణంగా ప్రారంభం అవుతుంది. ఆ రోజు అలాటి సంఘటన జరిగి నా జీవితంలో గమ్యాన్ని మార్చేస్తుందని నేను వూహించలేదు.
మరుసటిరోజు ఎవరికో ఇవ్వవలసి వస్తుందని ముఫ్ఫై వేల రూపాయలు ఆఫీసునుంచి తీసుకొచ్చాను. అమ్మకిచ్చి పొద్దున్న తీసుకుంటాను, వుంచమని చెప్పాను.