"ఇక పోదాం పద!" అంటూ లేచి నుంచున్నాను. "నీ తరహా చూస్తుంటే ఇవాళ ఇంటికి వచ్చేట్లులేవు..."
చేయి అందించింది సీత. అందుకొని ఆమెని పైకి లేవదీయబోయాను. కాని హఠాత్తుగా ఆమె నన్ను ముందుకి లాగటంతో ఆమె మీదకి తూలిపడ్డాను.
నా మెడచుట్టూ చేతులేసి నా పెదాలమీద ముద్దు పెట్టుకొంది సీత.
నాకు అయోమయంగా వుంది. ఇది ప్రథమ స్త్రీ స్పర్శ. అదీ అందమయిన సీతది. నా శరీరం స్వాధీనం తప్పుతోంది. కానీ నా మనసు నాకు వ్యతిరేకంగా వుంది. సీతని ఈ విధంగా నేనెప్పుడూ ఊహించలేదు. సీత అందమయిన ఓ ఆడపిల్లగా ఎప్పుడయినా అనిపించినా, మా ఇద్దరినీ ఈ విధంగా ఊహించుకోవడానికి వీలుకాని స్నేహం, బంధుత్వం ఆ ఆలోచనని అక్కడే అంతం చేసినయి.
చీకటి పూర్తిగా వ్యాపించింది. ఇద్దరం బస్టాండ్ వేపు నడక సాగించాము.
"మనిద్దరం పెళ్లాడితే ఎలా వుంటుందీ?" సీత అడిగింది.
పెళ్ళనేసరికి నా గుండెలు కొంచెం వేగంగా కొట్టుకొన్నాయి. ఇది జరగటం కష్టం. నా తల్లిదండ్రుల్నీ, ఆమె తల్లిదండ్రుల్నీ, ఎదిరించేంత ధైర్యం నాకు లేదు. నేను చాలా సాధారణమయిన మనిషినీ. సీత అన్నట్లు పిరికి రాస్కెల్ ని కూడానేమో. నన్ను పెంచిన పెద్దాళ్లంటే భయం. వాళ్ళు గీచిన పరిధిలోనే గడపటం నాకిష్టం. వాళ్ల నెదిరించేంత తెలివితేటలు కూడా నాకు లేవు. అవి భగవంతుడు నాకివ్వలేదు. అందుకు భగవంతుడంటే అప్పుడే మొదటిసారిగా నాకు ద్వేషం కలిగింది.
"కాని... సీతా! నువ్వన్నది జరగటం చాలా కష్టం!"
"ఇదే! నీనుంచి ఇలాంటి జవాబే వస్తుందని అనుకొన్నాను. నాకు తెలుసు నువ్వెంత మొనగాడివో! అందుకే నిన్నిక్కడికి లాక్కోచ్చేను... ఓసారి నీ నోటినుంచే విందామనిపించింది. నా సంగతి నీకు బాగా తెలుసు. చిన్నప్పటినుంచీ ఏంచేతో పెద్దాళ్ళు వద్దన్న ప్రతిపనీ చేయాలనిపించేది. ఓసారి అమ్మ అంది నీ గురించి, నువ్వు ఓ ఏడెనిమిదిఏళ్ళు ఎక్కువ వయసుతో ఉంటే నన్ను నీకిచ్చి చేసేవారుట. వెంటనే అనిపించింది నాకు చిన్నాడయితే మాత్రం తప్పేమిటి? భార్యాభర్తల్లో ఆడది చిన్నదయివుండాలి అనే రూల్ ఎవరు తయారుచేశారు? ఆడది పెద్దవుతే ఏం రోగం?" ఆవేశంగా అంది సీత.
నేనేమీ మాట్లాడలేదు.
కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ తనే అంది.
"పోనీ ఈ విషయం ఇంకేమీ ఆలోచించకు. నువ్వు వప్పుకొని ఉంటే అది వేరే సంగతి. ఇక నాన్నగారితో చెప్పేస్తాను. నేను ఎవరి నయినాసరే పెళ్లాట్టానికి రడీ అని. వాళ్ళని తృప్తిపరచటానికయినా పెళ్ళాడేయాలి. ఏం చేయను మరి..."
రోడ్ చేరుకున్న పదినిమిషాల్లో బస్ వచ్చింది. ఇద్దరం ఓ అరగంట తర్వాత ఇళ్ళు చేరుకున్నాం. తరువాత కొన్ని రోజులవరకూ నేను సీతని చూడలేదు. చూడాలనిపించనూ లేదు. ఏదో పిచ్చెక్కినట్లుగా ఉండేది.
రిజల్ట్స్ వచ్చాయ్. సీత సెకండ్ క్లాస్ లో పాసయింది. ఆరోజు అనుకోకుండా సీతని కలిశాను. నేను చిలకలపూడి వెళ్తూంటే ఇంకో ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసివస్తూ కనిపించింది. నన్ను చూసి నవ్వింది.
"కంగ్రాచ్చులేషన్స్"అన్నాను.
"థాంక్యూ! పాండురంగని గుడికివెళ్ళి దేముడికిగూడా థాంక్స్ అందజేసి వస్తున్నాం" అంది.
"మరి మాకు పార్టీ ఎప్పుడు?"
"ఏది నువ్వసలు ఇంటికి రావలటే మానేశావుగా! నాకు పెళ్ళి కుదిరిపోయిందిలే! నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు.
ఆమె స్నేహితురాండ్రిద్దరూ కిలకిల నవ్వేశారు. నాకు చచ్చేంత సిగ్గు వేసింది. వస్తానన్జెప్పి వెళ్ళిపోయిందామె. ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య అభిప్రాయభేదాలు సామాన్యంగా రావు. ఓ వేళవస్తే అది మర్చిపోయేంతవరకూ వాళ్ళు కలుసుకొన్నప్పుడల్లా కలవకుండా ఉంటేనే బాగుండేదనిపిస్తుంది. సీత విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించానేమోనని అనుమానం నన్ను పీడిస్తూండేది. ఆమె నుంచి తప్పించుకు తిరగటానికి ఆ అనుమానమే కారణం అనుకొంటాను. గిల్టీ కాంషస్! ఓ వారం రోజుల తర్వాత అమ్మ చెప్పింది. మరో పదిరోజుల్లో సీత పెళ్ళి ముహూర్తం నిశ్చయించారుట. పెళ్ళికికూడా వెళ్ళానిపించలేదు నాకు. ఆమెని పెళ్ళి కూతురిగా ఓ వ్యక్తి ప్రక్కన చూడాలంటే బాధ అనిపించింది. పెళ్ళి రోజు వరకూ నాలో పెద్ద సంఘర్షణ జరిగింది. వెళ్ళాలా వద్దా ని. చివరకు వెళ్ళడానికే నిశ్చయించుకొన్నాను. పదింటికి ముహూర్తం అనగా ఎనిమిదింటికి వాళ్ళింటికి వెళ్లాను. సరాసరి లోపలికి నడిచి సీత ఉన్న గదిలోకి వెళ్ళాను. సీత ఓ సోఫాలో కూర్చుని ఉంది. చుట్టూ మా బంధువుల అమ్మాయిలు కూర్చుని అల్లరి చేస్తున్నారు. బుగ్గన చుక్క, మెడలో చంద్రహారం, నుదుట పాపిడిబిళ్ళ వీటితో ఓ గంధర్వ కన్యలా మెరిసిపోతోంది సీత. నన్ను చూడగానే ఆమె ప్రక్కన కూర్చున్న ఇద్దరమ్మాయిలు లేచి నుంచున్నారు. ఓ క్షణంపాటు కాటుక పులుముకొన్న సీత కళ్ళు వింత వెలుగుతో మిలమిలలాడినాయ్.
"రా! కూర్చో!" అంది మెల్లిగా.
ఆమె ప్రక్కనే కూర్చున్నాను.
"ఏయ్ సుజీ! మీ అందరూ ఓ రెణ్ణిమిషాలు బయటికి పొండి! ఈ చిన్నాడితో కొంచెం రహస్యాలు మాట్లాడాలి..." అంది సీత. వాళ్ళు నవ్వుకొంటూ బయటకు వెళ్ళిపోయారు. నాకు గాభరా వేసింది. తలుపు గడియవేసి వచ్చి నా దగ్గర కూర్చుంది సీత.
"నిజం చెప్పు! ఆనాడలా ప్రవర్తించానని నా మీద కోపం వచ్చింది కదూ!" నా చేతులు తన చేతుల్లోకి తీసుకొంటూ అందామె. అప్పుడామె కళ్ళనిండా నీరునిండి వుంది. గొంతు కూడా జీరవోయింది.
"చిన్నా! నా సంగతి నీకు పూర్తిగా తెలుసు. నేనెవ్వరికీ భయపడను. ఏ విషయమూ దాయను. నాకు చెప్పుకోదగ్గ స్నేహితురాండ్రెవ్వరూ లేరు. చిన్నప్పట్నుంచీ ప్రాణస్నేహితునిగా భావించింది. నిన్నొక్కడినే! ఏ విషయమూ, ఎంత చిన్నదయినా సరే దాయలేదు. నాకు తెలియకుండానే నిన్ను నా హృదయంలో నిలుపుకొన్నాను. నీ దగ్గరున్న చనువు, అధికారం, ప్రేమ మరెవ్వరిమీద నాకులేవు. నిజం చిన్నా! ఆఖరికి మా అమ్మానాన్నల దగ్గరకూడా! కాని ఆ చిన్న విషయం గురించి నువ్వ నా దగ్గరకు మానేశావ్! నన్ను తప్పించుకు తిరుగుతున్నావ్! నా మనసులోని విషయాలు ఇంక నేనెవరితో చెప్పుకోగలను? ఓ వేళ ఆరోజు నాదే తప్పయితే నన్ను క్షమించు చిన్నా - అంతేకానీ ఇలా నన్ను దూరం చేయకు" ఆమె కళ్లనుండి కన్నీరు జలజలా రాలింది.
"నేను నిన్ను కోరేది ఒక్కటే! నేను బ్రతికున్నంతకాలం నువ్వు నాకు తరచుగా కనబడుతూండాలి. లేకపోతే... నేనే నీ దగ్గర కొచ్చేస్తాను... తెలిసిందా? నే ననుకొన్న వేవీ ఎలాగూ జరగలేదు... కనీసం ఇదయినా జరగనీ... ఏం?" ఆఖరిమాటలంటున్నప్పుడు ఆమెకి దుఃఖం ఆగలేదు. నా హృదయం మీదకి ఒరిగిపోయి వెక్కివెక్కి ఏడ్చేసింది. ఆమెని చూస్తుంటే నాకూ దుఃఖం ఆగలేదు. జీవితంలో ఊహ తెలిసింతర్వాత, అప్పుడు మొదటిసారిగా నేనూ ఏడ్చాను.
"ఏడవకు సీతా! లే! ప్లీజ్!.... ఇంకెప్పుడూ ఇలా చేయను... లే!" రుమాలుతో ఆమె కన్నీళ్ళు తుడిచాను. కొంచెం సర్దుకొందామె.
"నీమీద కోపమేంటి! అలా ఎందుకనుకున్నావ్? నీ కోరిక తీర్చలేకపోయినందుకు నామీద నాకే అసహ్యం వేసి నీక్కనబడలేదు- అంతే!" సీత లేచి నుంచుంది.
నేను వెళ్ళి తలుపు తీసివేశాను.
"రహస్యాలు అయిపోయినయ్యా?" అంటూ సీత చుట్టూ మూగారు అమ్మాయిలు.
"నేను వెళ్తాను సీతా!" అంటూ బయటికి వచ్చేశాను. పెళ్ళి పందిట్లోకి వచ్చేసరికి ఓ అమ్మాయి నావంకో సారి ఎగాదిగా చూసి నవ్వుకొంటూ వెళ్ళిపోయింది. కంగారుపడి నన్ను నేను పరీక్షగా చూసుకొన్నాను. గుండెల దగ్గర నల్లగా కాటుక ముద్రలు పడినయ్. చచ్చేంత సిగ్గు వేసింది. వెంటనే ఇంటికి పరిగెత్తాను.