Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 14


    "కొంపదీసి ఇప్పుడు ఆవిడ్ని మీ అనుమానంతో చంపుతారా ఏమిటి? నాకు కాస్త జ్యోతిష్యం తెలుసు. అంతే-"

    విశ్వనాథం బలంగా లాఠీతో అనుదీప్ మెడ పక్కగా కొట్టి "అయితే నీ ఫ్యూచర్ ఏమిటో చెప్పరా బాడ్ ఖోవ్-" అని అరిచాడు.

    అనుదీప్ భుజంనుంచి రక్తం స్రవించసాగింది. పళ్ళ బిగువున బాధని అదిమిపెట్టి నవ్వుతూ, "న ఫ్యూచర్ సంగతికేంగానీ మీ ఫ్యూచర్ కావాలంటే చెపుతాను" అన్నాడు.

    "ఏమిటి నా ఫ్యూచర్?"

    "కొద్దిరోజుల్లో మీరు సస్పెండ్ కాబోతున్నారు. ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించబోతున్నారు."

    ఈసారి లాఠీవెళ్ళి విసురుగా అనుదీప్ మొహంమీద తగిలింది.

    "నా భవిష్యత్తు చెప్పినందుకు నీకు ఫీజు ఇవ్వాలిగా. సరిపోయిందా?" అని వెటకారంగా అడిగాడు.

    అనుదీప్ కళ్ళు మూసుకున్నాడు. అతడి పెదవులు నిశ్శబ్దంగా కదిలాయి.

    "ఏంట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు?"

    అనుదీప్ కళ్ళు విప్పాడు. వాటివెనుక బాధలేదు. నిర్మలంగా వున్నాయి అవి. "దేవుడిని ప్రార్థించాను..." అన్నాడు. భగవంతుడా! ఈ మనుషుల్ని స్థానంవల్లా, ధనంవల్లా, అధికారంవల్లా కలిగే 'అహం' నుంచి రక్షించు... అని వేడుకున్నాను."

    "ఏంట్రోయ్. రెండు దెబ్బలుపడేసరికి పొగరు తగ్గి వేదాంతం పెరిగిందా?" అని మరొకటివేసి "ఇంతకీ ఏం చేశావో చెప్తావా లేదా?" అని అడిగాడు.

    "నేనేం చెయ్యలేదు- యస్సైగారూ! ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. ఆ విషయమే ఆమెతో చెప్పాను. ఇప్పటివరకూ తను బహుశా పార్కుల్లో ప్రేమ, ఆఫీసుల్లో ప్రేమ గురించి మాత్రమే చదివి వుంటుంది. నా ప్రేమ యొక్క తీవ్రత తెలుసుకోలేకపోయింది. అదిచూసి భయపడింది అంతే."

    "అంతేనంటావా?"

    "మీరు నమ్మినా నమ్మకపోయినా అంతే-"

    "ఏయ్ టూనాట్ టు ... కొంచెం కారం తీసుకురారా, వచ్చి వీడి ఫాంటు విప్పు. ఏదో తీవ్రతంట. చూద్దాం ఎంత తీవ్రత వుందో." ఒక పోలీసు కారంపొట్లాం తీసుకొచ్చాడు. మరో పోలీసు చొక్కావిప్పాడు. భుజంనుంచి చెయ్యిలేదు, అక్కడవున్న కట్టు చూసి "ఏ దొమ్మీలో నరికార్రా నీ చేతిని?" అని అడిగాడు.

    అనుదీప్ జవాబు చెప్పలేదు.

    "ఎలా పోయింది నీ చెయ్యి? ఆక్సిడెంట్ లో అయినా ఇలా తెగదే. ఆస్పత్రిలో ట్రీట్ చేశారు? ఏ పోలీస్ స్టేషన్ లో రిజిష్టర్ చేశారు?"

    అనుదీప్ మాట్లాడలేదు. అతడి నిశ్శబ్దంతో యస్సైకి మరింత వళ్ళు మండింది.

    "చెప్పవే-" అంటూ లాఠీతో కొట్టిన గాయాలమీద కారంజల్లాడు. భగ్గున మండింది. అనుదీప్ కళ్ళు మూసుకున్నాడు. బాధవల్ల అతడి కంటిలోంచి నీళ్ళు స్రవించసాగాయి. అయితే అది క్షణం సేపే. తరువాత మామూలుగా అయిపోయాడు.

    అతడు అలా నిశ్చలంగా వుండటం విశ్వనాథానికి కూడా ఆశ్చర్యం తోచింది. భుజం దగ్గర వున్న అంత పెద్ద గాయం మీద కారం రాస్తే మరొకళ్ళయితే ఈపాటికి పైకప్పు ఎగిరి పోయేలా కేకలు పెట్టి వుండేవారు.

    "ఏరా బాధగా లేదూ?"

    "లేదు"

    "లేదా?"

    "నా ప్రేమ నిజాయితీతో కూడుకున్నదైతే బాధ వుండకూడదని అనుకున్నాను... పోయింది."

    "ఓహో! అంత గొప్పదా నీ ప్రేమ!"

    "ప్రేమ ఎప్పుడూ గొప్పదే యస్సైగారూ! ఈ లాకప్ హింసలు మానేసి ప్రేమించటం నేర్చుకోండి. అదొక గొప్ప అనుభూతి."

    అప్పటికే రక్తంతో అతని భుజం తడిసిపోయింది. దాని మీద మరింత కారంజల్లి "ఇప్పుడుందా అనుభూతి" అని అడిగాడు.

    "చెప్పానుగా... లేదు."

    "నీ ప్రేమ అంత గొప్పదైతే వెంటనే చెయ్యి మొలవాలని కూడా కోరుకోరా రాస్కేల్."

    "ఏమో... మొలచినా మొలవచ్చు. ప్రేమ సాధించలేనిదంటూ ఏమీలేదు. కావల్సిందల్లా ప్రేమలో దానికి తగ్గ నిజాయితీ వుండటం...

    మరింతకాలం జల్లబోయిన విశ్వనాథం చెయ్యి మధ్యలో ఆగిపోయింది. యస్సైగారు చావబాదుతూవుంటే వినోదం చూద్దామని గుమ్మం దగ్గర నిలబడ్డ ఇద్దరు కానిస్టేబుల్స్ నోళ్ళు ఆశ్చర్యంగా తెరుచుకున్నాయి. అప్పటివరకూ మాటల్తో ప్రతిధ్వనించిన ఆ పోలీస్ స్టేషన్ లో ఒక్కసారి సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం ఆవరించింది. అక్కడున్న వాళ్ళందరికీ తాము చూస్తున్నది కలో, నిజమో అర్థంకాలేదు. టూనాట్ టూకైతే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది.

    భూమిని చీల్చుకుని ఒక చిన్న మొక్క నెమ్మదిగా ప్రాణం పోసుకుంటూ ఎలా పైకి వస్తుందో -అలా అతడి భుజం నుంచి చెయ్యి క్రమక్రమంగా మొలవసాగింది. అనుదీప్ కూడా తన శరీరంలో కలుగుతున్న మార్పుకి ఆశ్చర్యపోతున్నట్టు అతడి ముఖకవళికలు చెపుతున్నాయి. విశ్వనాథం మొహంలో రక్తం ఇంకిపోయింది. పోలీసులు భయభ్రాంతులయ్యారు.

    క్రమంగా అతడి చెయ్యి పూర్తి ఆకారాన్ని సంతరించుకుంది.

    నిశ్చేష్టులై, శిలా ప్రతిమల్లా నిలబడివున్న ఆ పోలీసుల మధ్య నుంచి అతడు తన చొక్కా తీసుకొని మౌనంగా బయటకు నడిచాడు.

                                                                  *    *    *

    ఆమెకి ఆ రాత్రి నిద్రపట్టలేదు. కారణాలు రెండు. మొదటిది కొత్త ప్రదేశం కావటం... రెండోది అనుదీప్ తాలూకు ఆలోచనలు.

    కొన్ని సంఘటనలు- అవి జరిగినప్పుడు ఎంతో ఉద్వేగపెడతాయి. తరువాత వాటి ప్రభావం అంతగా వుండదు. మరికొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏమీ ఉండదు. కానీ తరువాత తరువాత వాటి ఆలోచనలు అసలు మనల్ని వదిలిపోవు.

    ఆ సినిమాహాలు తాలూకు సంఘటన ఆ రాత్రి ఆమెని ఇలాగే కుదిపివేసింది. ధర్మారావుగారింట్లో అందరితో మాట్లాడుతూ వున్నప్పుడు ఏమీలేదు. కానీ ఒంటరిగా పక్కమీద చేరాక ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి. "అవతలి మనిషికోసం ఏదైనా త్యాగం చేయగలగటమే ప్రేమ" అని తను అనుకున్నట్టు కల రావటం ఆ తరువాత అనుదీప్ తన భుజాలు తెగ్గోసుకోవటం.

    ఆమెకి నమ్మశక్యం కావటం లేదు.

    ఇంత జరిగినా...

    అతడంటే ప్రేమ కల్గటంలేదు.

    కలగటం లేదా?

    లేదు.

    నిజంగా?

    నిజంగా!

    భయం వేస్తోంది. అతడిని చూస్తూంటే ఏదో అద్భుతం చూసినట్టు వుంటుందే తప్ప ప్రేమ కలగటంలేదు. అతడి భుజమే కాదు పీక తెగ్గోసుకున్నా ప్రేమ కలగదు. మరి ప్రేమ కలగాలంటే అతడు ఏంచేసి వుండాల్సింది?

    .... ఆలోచిస్తూ ఆమె నిద్రలోకి జారుకుంది.

    ఒక రాత్రివేళ ఎవరో తట్టినట్టు అయి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పింది.

    ఎదురుగా అనుదీప్!

    ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది.

    "నువ్వా" అంది కంపిస్తున్న కంఠంతో.

    "పద వెళ్దాము."

    "ఎక్కడికి?"

    "ఇంట్లో వాచ్ మెన్ తో సహా అందరూ నిద్రపోతున్నారు. మళ్ళీ గంటలో వచ్చేద్దాం."

    "నీకు మతిపోయింది. ఇంతరాత్రి నీతో ఎలా వస్తాననుకున్నావ్?"

 

    "మీ అమ్మాయిలు అనవసరమైన భయాల్తో అద్భుతమైన అనుభవాలు పోగొట్టుకుంటారు. చదువు-తరువాత రాబోయే భర్తకోసం ఎదురుచూపుల విరామం- పెళ్ళి - పిల్లని కని వాళ్ళని పెద్దవాళ్ళని చేసే తాపత్రయం... భావాలు వికసిస్తూంటే కలిగే ఫ్రాగ్రెన్సీని కూడా నిర్భయంగా అనుభవించలేరు."

    "నాకె అద్భుతమైన అనుభవమూ వద్దు మహానుభావా. నన్నిలా బ్రతకనీ..."

    "అదిగో మళ్ళీ! అనుభవం అనగానే అదేదో మొగవాడు స్త్రీ పట్ల చేసే దారుణమైన చర్యగా ఎందుకు భావిస్తావు? నమ్మకం ఎందుకు పెంచుకోవు? మీ ఆడవాళ్ళకి నిజంగా భయం ఉంటుందా? లేక భయం నటిస్తారా? నేను అనుభవం అంటున్నది నీవనుకునే ఉద్దేశ్యంతో కాదు. ఒకసారి బయటకి రా... శీతల పవనాలు చూడు పర్వతాల సందుల్లోంచి ఎలా రివ్వున వీస్తున్నాయో... చీకటిని చూడు ధరణిని ఎలా అభిషేకం చేస్తుందో... మైదానాల్లో గడ్డి ఆకాశాన్ని చూస్తూ చేతులూపుతోంది. నదీ పాయలూ, సెలయేళ్ళూ, కంచెమీద పూలూ, రాబోయే సూర్యుడి కోసం కూనిరాగాలు తీస్తూ పొదల రాట్నాలమీద మంచు బిందువుల్ని వడికే చలిచేతులూ-ఇవన్నీ చూడటానికి నాతోరావూ."

    ఇద్దరూ నడవటం ప్రారంభించారు.

    రాబోయే శ్రావణమాసం తన రాయబారిలా ముందే చల్లటి గాలిని పంపిస్తూంది. తూనీగ ఉల్లిపొర రెక్కలమాదిరి పవనాలు వారి శరీరాల్ని సుతారంగా స్పృశిస్తున్నాయి. అవ్యక్త మనో ప్రవాహాల ఆలింగనంలో గడిచిపోతున్న కాలం గుప్పెట్లో -ప్రేమ దీపాన్ని వెలిగిస్తూంది.

    అతడు నెమ్మదిగా పాడటం ప్రారంభించాడు.

    "మెరాతో జోకభి కదమ్ హై.... ఓ తేరిరాహమె హై... కె తూ కహీ భిరహే తూ మేరీ నిగాహమె హై..."

    "నీకు పాడటం వచ్చా?" ఆమె ఆశ్చర్యంగా అడిగింది.

    అతడు నునుసిగ్గుతో "... కొద్దిగా" అన్నాడు.

    ఆమె మూతి బిగించి, "కొద్దిగా ఏమిటి - చాలా అద్భుతంగా వచ్చు" అంది.

    అతడు నవ్వేడు "... ఈ అద్భుతం అన్న పదం నానించి నీకూ సంక్రమించినట్టుందే..." అని కొంచెంసేపు ఆగి ఆలోచనగా అన్నాడు.

    "-పాట కాదుకానీ దాని అర్థం గొప్పది. నువ్వు నడిచిన బాటలోనే నా అడుగులు, నువ్వెక్కడున్నా సరే నా కళ్ళలోనే వాటిజాడలు... బాగుందికదూ".

    "అద్భుతంగా వుంది -" ఫక్కున నవ్వేసింది.

    "నువ్వు నవ్వితే బావుంటుంది".

    "అవును. ఇలా నవ్వి పద్ధెనిమిది సంవత్సరాలైంది."

    ఇద్దరూ నడుస్తున్నారు. మైదానం -దూరంగా చీకట్లో కొండలు... మధువు తాగినట్టున్న మేఘాలు... నుదుటిమీద జీరాడే ముంగురుల్ని చూసి 'ఈ అర్థరాత్రి తుమ్మెదలెక్కణ్ణుంచి వచ్చాయా' అని విచ్చుకునే పువ్వులు- పగలులోకి చొచ్చుకుపోవటానికి ఆయత్తమవుతోన్న రాత్రి...

    "ఏదైనా పాట పాడు అనుదీప్."

    "ఏం పాడను?"

    అతడు మంద్రస్వరంతో నెమ్మదిగా ఆలాపన ప్రారంభించాడు. "అమృతం తాగిన .. వా..ళ్ళు... దేవతలూ... దేవుళ్ళూ... అది - కన్నబిడ్డలకు పంచేవాళ్ళూ.... అమ్మా నాన్నలూ".

    సన్నగా 'రోధిస్తున్న' ధ్వని వినిపించేసరికి అతడు చప్పున ఆపి 'విద్యాధరీ' అన్నాడు. ఆమె చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. అతడు ఓదార్చే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. ఆమె ఏడ్చికూడా పద్ధెనిమిది సంవత్సరాలై వుంటుంది. నవ్వుని ఆహ్వానించినట్టే ఏడుపునీ ఒక్కోసారి ఆహ్వానించాలి. లేకపోతే వేదన మీద కృత్రిమమైన జీవనవిధానం కరడుగట్టి స్వభావసిద్ధమైన వ్యక్తిత్వాన్నీ, స్వచ్చమైన చిరునవ్వునీ నొక్కి పారేస్తుంది.

 Previous Page Next Page