Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 14


    "కొత్తగా వున్నావు."

 

    "కరెక్ట్. ఆ కొత్త ఏమిటో కనిపెట్టు?"

 

    అర్థంకాలేదు. ఆలోచిస్తున్నాడు. "హలో! మిస్టర్ ట్యూబ్ లైట్! టేక్ యువర్ టైం" అంటూ హేండ్ బ్యాగ్ తెరచి చిన్న పుస్తకంలాంటిది బయటకు తీసింది.

 

    "ఏమిటిది?"

 

    "మీల్స్ టికెట్ బుక్. కానీ ప్లేటుమీల్స్ కాదు, ఫుల్ మీల్స్. నెలరోజుల వరకూ ప్రాబ్లంలేదు."

 

    "ఎక్కడిది?"

 

    "కొన్నాను."

 

    "డబ్బెక్కడిది?"

 

    అర్థంలేని ప్రశ్న. ఆమె ధనికురాలయి వుండవచ్చును కానీ ఆమె ధనికురాలని మనస్సంగీకరించటంలేదు.

 

    ఆమె జవాబు చెప్పలేదు.

 

    ముఖంలోకి చూశాడు. అక్కడ కొంత అర్ధమయింది. ట్యూబ్ లైట్ ఇప్పుడు వెలిగింది. కానీ మనస్సు బావురుమంది.

 

    "ముక్కుపుడక అమ్మేశావు గదూ?"

 

    తల వంచుకుంది.

 

    "అలా వద్దు. నా కళ్ళలోకి చూడు. అమ్మేశావు కదూ?"

 

    ఆమె అమాయకంగా తల వూపింది.

 

    "ఎందుకు? ఎందుకిలా చేశావు?" అతను బాధగా, కోపంగా, కసిగా, పసిగా అరిచాడు.

 

    "ఎందుకంటే......." ఆమె పెదవులమీదకు నవ్వు తెచ్చుకోబోతోంది.

 

    "ఒద్దు. తేలిగ్గా, హాస్యంగా తీసిపారెయ్యటానికి ప్రయత్నించవద్దు. చెప్పు ఇళా ఎందుకు చేశావు? నీకూ, నాకూ సంబంధమేమిటి?" అతనికి చాలా ఆవేశంగా వుంది.

 

    "నీకూ, నాకూ సంబంధం లేకపోవచ్చు. కానీ నీ బీదరికానికీ, నా బీదరికానికి సంబంధముంది."

 

    అతను నిరుత్తరుడయాడు. ఆమె ముఖంలోకి, కళ్ళలోకి చూస్తూ నిశ్చేష్టుడై వుండిపోయాడు.

 

    అతని కళ్ళలో నీళ్ళు తిరగబోతున్నాయి. నిగ్రహించుకుంటున్నాడు.

 

    "ఒద్దు."

 

    "ఏమిటి?" అతని పెదవులు కదిలాయి.

 

    "మొగవాళ్లు కంటనీరు పెట్టకూడదు" ఆమె నవ్వటానికి ప్రయత్నించింది.

 

    "శైలూ! నేనింతవరకూ రెండే రెండు సందర్భాలలో ఏడ్చాను. మొదటిది... అమ్మకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినప్పుడు.....రెండవది......"

 

    "చెప్పు, ఆగావేం?"

 

    "ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు."

 

    ఈసారి కళ్లలో నీళ్ళు తిరగటం ఆమె వంతయింది. "నువ్వు సంతోషిస్తావనుకున్నాను."

 

    "ఈ బాధలో రవ్వంత సంతోషం వుంది శైలూ! కానీ ఆ రవ్వంత సంతోషానికీ కొండంత విలువ వుంది."

 

    తర్వాత ఇద్దరూ ఆ సంఘటన వెనకవున్న దుఃఖాన్ని మరచిపోవటానికే ప్రయత్నించారు.

 

    చీకటి పడుతోంది.

 

    "ఫణీ! రేపట్నుంచీ నేనిలా నీ గదికి రావటానికి వీలుండదు."

 

    "ఏం?"

 

    "మా మేనత్త అని చెప్పానే, ఛండశాసనురాలు. గీసిన గీటు దాటడానికి వీల్లేదు."

 

    "మరి అక్కడ దేనికి ఉంటున్నావు?"

 

    "తప్పదు కాబట్టి."

 

    "అంటే?"

 

    "తర్వాత చెబుతాను. ఇప్పుడు గుర్తుచేసుకోవటం ఇష్టంలేదు."

 

    ఆమె వెళ్ళటానికి ఉద్యుక్తురాలయింది. అతను ఆమెతో బయటకు వచ్చి వీధి చివరివరకూ దిగబెట్టాడు. రిక్షా పిలిచింది.

 

    ఆమె కనుమరుగయ్యేవరకూ అక్కడే నిలబడి, బరువెక్కిన గుండెతో అతను వెనక్కి తిరిగి వచ్చాడు.

 

                                         *    *    *

 

    శైలజ తన మేనత్త చూస్తోందన్న భయంతో సందు మొదట్లోనే రిక్షా దిగి వడివడిగా నడుస్తూ ఇంటికి వచ్చింది.

 

    మేనత్త సుభద్రమ్మ గుమ్మంలోనే నిలబడి వుంది ఎదురు చూస్తున్నట్టు. ఆమె గుండె గబగబ కొట్టుకుంది.

 

    "ఇంత ఆలస్యమయిందేం?"

 

    "కాలేజీలో మీటింగ్ వుంది" తడబడే గొంతుతో జవాబిచ్చింది.

 

    "నిన్నా అలాగే అన్నావు" సుభద్రమ్మ గొంతులో కాఠిన్యం వెన్నుమీద చరిచి నట్లయింది.

 

    "అలా పెట్టారు" ఆమెను తప్పించుకుని వెళ్ళటానికి ఆరాటపడుతూ లోపలకు నడవబోయింది.

 

    "ఏదీ! ఇటు తిరుగు."

 

    శైలజ గతుక్కుమంది. ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లుగా తెల్లబోతూ ఆమెవంక తిరిగి నిలబడింది.

 

    సుభద్రమ్మ ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది "ముక్కుపుడక ఏదీ?"

 

    "శీల ఒదులయినట్లుంది, జారిపోయింది."

 

    "ఎందుకంత అజాగ్రత్తగా వున్నావు?"

 

    ఆమె జవాబు చెప్పలేదు.

 

    "మాట్లాడవేం?"

 

    శైలజ నిరుత్తరురాలై అలాగే నిలబడివుంది.

 

    మేనత్త ఆమె దగ్గరకువచ్చింది. "అడిగిందానికి జవాబుచెప్పవు? ఎమ్.ఎస్.సి. చదువుతున్నానని పొగరా?" అంటూ చాచిపెట్టి ఒక్క చెంపకాయ కొట్టింది.

 

    శైలజ కళ్ళముందు చీకట్లు క్రమ్మినట్లయినాయి. ఇహ అక్కడ నిల్చోలేక తన గదిలోకి పరుగెత్తి మంచంమీద వాలిపోయి వెక్కివెక్కి ఏడ్చేసింది.

 

                                      *    *    *

 

    ఫణికి భోజనం సమస్య తాత్కాలికంగా తీరింది. మిగతావాటికి పరిష్కారం దొరకటంలేదు. అలాగే ఆలోచిస్తూ రోజులు గడుపుతున్నాడు.    

 

    అతనిప్పుడు భోజనంచేస్తున్న హోటలు పెద్దదే కాని, అతను ఒకపూటే తింటున్నాడు. ఇలాగనక ఆదాచేస్తే మరికొన్ని రోజులు గడుస్తాయి కదా!

 

    ప్రొప్రయిటరు అతన్ని ఓ కంట కనిపెడుతూనే వున్నాడు. ఒకరోజు అతను భోజనం చేస్తోంటే ప్రక్కకివచ్చి కూర్చున్నాడు.

 

    "సార్! మీరేం చదువుతున్నారు?"

 

    "ఎమ్.ఎస్.సి."

 

    "ఓ స్వీటు తీసుకోండి సార్! ఈవేళ గులాబ్ జామ్ స్పెషల్ చేయించాను." గులాబ్ జాం అనగానే ఫణికి నోరూరింది. అయినా బింకంగా "అబ్బే! వద్దండీ, నాకు స్వీట్స్ ఇష్టంలేదు" అన్నాడు.  

 

    ఎక్స్ ట్రా ఏమీ పే చెయ్యక్కరలేదు సార్! ఇవాళ మా అమ్మాయి పుట్టిన రోజు. అందుకని చేయించాను....ఒరేయ్! రెండు గులాబ్ జాంలు పట్రా!"

 

    ఫణికి సంతోషంగానూ వుంది, ఇరకాటంగానూ వుంది.

 

    "సార్! మీరు ఒక్కపూటే ఎందుకు భోజనం చేస్తారు?"

 

    ఫణి తెల్లబోయినట్లయాడు. ఏం జవాబుచెప్పాలో తెలియలేదు.

 

    కాసేపాగి ప్రొప్రయిటర్ అన్నాడు "సార్! మీరేం అనుకోపోతే ఒక్క విషయం చెబుతాను"

 

    ఫణి "చెప్పండి" అన్నట్టు చూశాడు.

 

    "మా అమ్మాయికి సాయంత్రంపూట ఒక్క గంటసేపు మీరు ట్యూషన్ చెప్పాలి. అది లెక్కల్లో మొద్దు. ఇంగ్లీషు బాగా రాదు. దానికి వచ్చిందల్లా ఒకటే, సినిమా డైలాగ్స్. దాన్ని మీరు ఒక దారిలో పెట్టాలి. ఫీజు ఎంతయినా సరే ఇస్తాను. నెలకి వందరూపాయలిస్తాను. ఏమంటారు?"

 

    ఫణి ప్రొప్రయిటఋ ముఖంలోకి చూశాడు. అతడిలో భగవంతుడు కనిపించాడు. ఇది ఎదురుచూడని, ఊహించని అవకాశం.

 

    "సరే" అన్నాడు సంతోషంగా.

 

                                                                    *    *    *

 

    అమ్మాయి అంటే ఎంత పెద్దదో అనుకున్నాడు. కాని పన్నెండేళ్ళుంటాయి. పరికిణీలు వేస్తుంది. బొద్దుగా, ఏపుగా వుంటుంది. పేరు నాగరాజకుమారి.

 Previous Page Next Page