Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 14


    ఎందుచేతనో మధుబాబు రచనలంటే ఆయనకీ గురి ఉన్నట్లుంది. అతను తెచ్చిన పుస్తకం విప్పి చూస్తూండగానే ముఖం వికసించింది. "ఇది మేము ప్రచురిస్తామండీ" అన్నాడు పదినిముషాలు పరిశీలించాక తలయెత్తి.

    మధుబాబు దిగ్భ్రాంతుడై "ఇంకా పూర్తికాలేదండి" అన్నాడు.

    "ఫర్వాలేదు. మీరు పూర్తి చేస్తూండండి. ఈలోగా మేము ఎడ్వర్ టైజ్ చేస్తూ వుంటాము. రేపటిలోగా నవల టైటిల్ కూడా ఆలోచించి వుంచండి."

    మధుబాబు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయినా అతని మనసింకా, ఆ ప్రముఖ వారపత్రిక నడిపిస్తూన్న పోటీమీద కొంచెం వుంది.

    "అసలు యిది నేను పోటీకని మొదలుపెట్టానండి" అన్నాడు కొంచెం జంకుతూ.

    కాని సంపాదకుడు మాంచి ఉత్సాహంమీద వున్నాడు. "అబ్బే! మీరింకా అలా అనకండి. ఇది మేమే ప్రచురించాలి. పోటీలో యిచ్చే బహుమతికన్నా యెక్కువే యిస్తాం సరేనా?" అన్నాడు బలవంతం చేస్తూ.

    మధుబాబు తల వూపాడు.

    తాను మరునాడు మళ్లీ వస్తాననీ, యీ స్క్రిప్టు తీసుకువెళ్ళి ఇవాళంతా చదువుతానని, మరునాటికి నవలపేరు ఆలోచించి వుంచమనీ చెప్పి ఆయన వెళ్లిపోయాడు.

    మధుబాబుకి క్రమంగా ఉద్రేకం చల్లారి సంకోచం పట్టుకుంది. ఒకవేళ ఆ సంపాదకుడు తొందరపాటుతో తనమీద అంత నమ్మకం వుంచాడేమో, తాను తాగుతాడో? తూగడో?

    సాయంత్రం ఈ సంగతి ఉమాపతికి చెప్పాడు.

    ఉమాపతి వ్యవహారందగ్గర నిక్కచ్చిగా వుండే మనిషి.

    "డబ్బు ఎంత ఇస్తాడో ఖచ్చితంగా తేల్చుకున్నారా? అది ముఖ్యం. మొహమాటపడబోకండి" అన్నాడు.

    మధుబాబుకు ఈ సలహా నచ్చలేదు. మనిషికి మనిషికీ మధ్య మృదువుపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు వుండాలిగాని వ్యవహారపక్షంగా వుండకూడదని అతని ఉద్దేశం. మౌనంగా వూరుకున్నాడు.

    మరుసటివారం ఆ హైదరాబాద్ వీక్లీలో రాబోతున్న మధుబాబు నవలని గురించి పెద్దఎత్తున ప్రకటన పడింది. తెలుగు సారస్వతంలో విశిష్ట స్థానాన్ని పొందగల నవల అని భరోసా యిస్తున్నారు సంపాదకులు.

    అతనికి సిగ్గువేసింది. తనని వీళ్లు యెక్కడికో ఈడ్చుకుపోతున్నారు. అసలు యీ నవల్లో తాను అనుకుని చేసిన గట్టి ప్రయత్నంమేమీ లేదు. అంత గొప్పతనం ఏమీలేదని కూడా నమ్మకం. ఈ విషయం వెల్లడి అయాక పత్రికాధిపతులూ, పాఠకులుకూడా తనని తిట్టుకుంటారు.

    అతనికి భయం వెయ్యసాగింది.

    అతనికలం ఇప్పుడు వణుకుతోంది. అట్లానే మరి పదిహేనురోజులు శ్రద్ధగా కూర్చుని నవల పూర్తి అయిందనిపించి పోస్టుచేసేసి "హమ్మయ్య" అని నిట్టూర్చాడు.

    కొద్దిరోజుల్లో అసలు సంపాదకుడి దగ్గర్నుంచి అతనికో లేఖ వచ్చింది. సీరియల్ మరో రెండుమూడు వారాల్లో ఆరంభించనున్నారట. తమకి యెంతో నచ్చిందని, అభినందిస్తూ ఉజ్వలమైన భవిష్యత్ కాంక్షిస్తూ రాశాడు.

    "అంతా పిచ్చివాళ్ళే" అనుకున్నాడు మధుబాబు నిట్టూర్చి.


                                             14

    సెలవులు గడిచి మళ్లీ విశాఖపట్నం వచ్చేశాడు. మళ్లీ యీ శాసనాలు, నిబంధనలూ, నిర్బంధ జీవితం.

    కాని వారం వారం అతనికి గొప్ప ఊరట కలుగుతోంది సీరియల్ గా వస్తోన్న నవలని చదువుకుంటూ వుండటంవల్ల. మొదటివారం అతని ఫోటోతో బాటూ అతన్నిగురించి పొగుడ్తూ కొంత రాశారు. అలాంటి రచయిత తెలుగులో వున్నందుకు గర్వించాలి అని ఆల్టిమేటమ్. అతడు లజ్జితుడైనాడు.

    మొదటివారం ప్రచురితమైన రెండు అధ్యాయాలూ చదువుకోగానే అతనికి చప్పగా వున్నట్లనిపించింది. తాను అనుకున్న వాతావరణం. బలీయమైన సృష్టి కనబడలేదు. నిరాశ, విరక్తి కలిగాయి. కాని ఒకరోజు ఆగి మళ్ళీ చదువుకోగానే బాగున్నట్లే అనిపించింది. కొత్త సొబగులు గోచరించసాగాయి.

    ఇది మొదటి ప్రయత్నం. ఎలావుందో యెవరినైనా అడుగుదామని మహఉబలాటపడ్డాడు. కాని నోరువిడిచి యెవరినడిగినా ఏమైనా అనుకునిపోతారెమో. బాగా లేదంటే? ఊరుకున్నాడు.

    కాని ఒక్క మెడికల్ కాలేజీ విద్యార్థులేకాదు. యూనివర్శిటీ లో మిగతా విద్యార్థులు కూడా ఆ సీరియల్ ని ఆసక్తితో చదవసాగారు. మధుబాబు అక్కడి స్టూడెంటేనని అందరికీ తెలిసిపోయింది. అతని ఫోటోకూడా ప్రచురించబట్టి యితనే అని తేలిగ్గా గుర్తుపట్టసాగారుకూడా.

    నాలుగయిదు వారాలు గడిచేసరికి అతనినవల బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ పత్రిక అమ్మకంకూడా విపరీతంగా పెరిగింది. అతని నవల పండితులూ, పామరులూ చదవసాగారు. కొంతమంది విద్యార్థులు ప్రత్యక్షంగా వచ్చి అభినందించసాగారు.

    ఈలోగా విజయవాడనుంచి ఓ పబ్లిషర్ అతనికథలు ఓ సంపుటంగా  వేస్తానని ఉత్తరం రాశారు. అతని కథలు కటింగ్స్ అన్నీ పదిలంగా అతని దగ్గరే వున్నాయి. వాటిని పంపించేసి ఈ విషయం ఉమాపతికి తెలియబరిచాడు. ఉమాపతి జవాబురాస్తూ టరమ్స్ ఖచ్చితంగా మాట్లాడుకొమ్మని సలహా ఇచ్చాడు.

    మొదట ఇన్నివారాలు ప్రచురితమవుతుందని అనుకోలేదు మధుబాబు తన నవలగురించి. మూడునెలలు గడిచేసరికి దాదాపు సగం పూర్తయింది. అతనికి ఆశ్చర్యమనిపించింది. ఇంతపెద్ద నవల, ఇన్ని సమస్యలతో, ఇన్నిపాత్రలతో, అంతః స్వల్పవ్యవధిలో తాను ఎలా వ్రాయగలిగాడు? అతనికి నమ్మబుద్ది కావటంలేదు.


                                *    *    *

    మొత్తం ఆరునెలలు గడిచేసరికి అతని నవల ప్రచురణ పూర్తయింది. ఏదో  పోగొట్టుకున్నట్లు దిగులు కలిగింది అతనికి. వెల్తిగా వుంది.

    ఈ వెల్తిని తీరుస్తూ అతనికి లేఖలు శరపరంపరలుగా రాసాగినై. అతనికి విచిత్రంగా వుంది. తెలుగుదేశంలో రచయితలకు ఇలా ఉత్తరాలు రాసే  వాళ్ళునారని అతనిప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాడు. తన నవల అంతగా కదిపిందా ప్రజలని? తనలో ఏముంది? తనకసలు ఏం తెలుసునని?

    అతనికి రాసినవాళ్ళలో విద్యార్థులూ, విద్యార్థినులూ, డాక్టర్లూ, ప్లీడర్లూ, వివిధ మనస్తత్వం గలవాళ్ళూ అందరూ వున్నారు. ఒక్కొక్కరూ ఒక్కొక్కకోణంలో రాసేవారు. ఇవన్నీ ఇవతల వుంచి మూడునాలుగు ఉత్తరాలు అతన్ని కదిపి వేశాయి.

    ".....నా జీవితం గురించే రాశారనుకుంటున్నాను. అనురాధ పాత్రనాదే. ఎంత పరిశీలన మీది? చదువుతున్నంతసేపూ ఏడుస్తూన్నే వున్నాను- అభాగిని" అని ఒక ఉత్తరం."

    "ఆటా యిటా అన్నా సందిగ్ధంలో సతమతమావుతూన్న నాకు మీ నవల చక్కని పర్యవసానం చూపించింది. అన్నయ్యా, అవును. మీరు నాకు అన్నయ్యే! లేకపోతే ఇంత మంచి సలహా యెందుకు యిస్తారు?- అపరిచిత."

    ఇట్లా వున్నాయి ఉత్తరాలు.

    తను ఇంట్లో కూర్చుని రాసినవి ఒక్కొక్కరి జీవితానికి యింత సన్నిహితంగా సంభవిస్తున్నదా? ఇది తన అదృష్టమా? ఏమిటీ వైపరీత్యం?

    అతని కన్నులలో నిలిచాయి.


                                             15


    అతని కథలు సంపుటి అచ్చయి వచ్చింది. పబ్లిషర్ పైకానికి బదులు వంద కాపీలు పంపించాడు. మధుబాబుకు ఎగ్రిమెంటులాంటిది ఏమీ లేకపోవటం వలన మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. అయినా మొదటసారిగా పుస్తకం వెలువడిన మోజులో వుండబట్టి అంత పట్టించుకోనూ లేదు. తన ముఖ్య స్నేహితులందరికీ పుస్తకాలు పోస్టులో పంపించేశాడు. ఇంకా మెడికల్ కాలేజీలోని స్నేహితులందరికీ పంచి పెట్టేశాడు. కొన్ని పుస్తకాలు గదిలో వుంటే పరిచయస్థులు వచ్చినప్పుడు చూసి పట్టుకుపోయారు. మొత్తంమీద కాసిని రోజుల్లో అన్నీ పూర్తయినాయి.

    పత్రికల్లో సమీక్షలుమెచ్చుకుంటూనే వచ్చాయి. కాని లోకంలో ఓ రకం మనుషులుంటారు. అందరూ అవునన్నదాన్ని కాదనటం వాళ్ళకో సరదా. లేకపోతే మరి ప్రత్యేకత ఏమిటి? అలాగే ఓ విమర్శక మహాశయుడున్నాడు. ఆయన సాహిత్యంలో వివిధశాఖలూ తాకిచూసి, ఎందులోనూ ఉచ్చస్థితికి రాలేక, చివరకు విమర్శలు రాయటం ప్రారంభించాడు. అదృష్టం బాగుండి విమర్శకుడిగా పేరువచ్చింది. ఇంకేం? మానవుడికి నిరంకుశత్వం హెచ్చింది. ఐనదాన్ని కానిదాన్ని గురించీ చిత్తంవచ్చినట్లు రాయటం మొదలుపెట్టాడు. ఎవ్వరికీ కనిపించని ఆకర్షణ ఆయనకు కనబడుతుంది. అందరూ అభినందించిన దాంట్లో ఆయనకన్నీ తప్పుల కుప్పలూ మధుబాబు  కథల సంపుటిని గురించి ఓ పత్రికలో రాస్తూ "ఇందులో మెచ్చుకోవాల్సిన సమాధానం ఏమీలేదు. బొత్తిగా అనుభవశూన్యంగా వున్నాయి అని రాశాడు. మధుబాబుకు ఒళ్ళుమండింది. కాని ఏమిచేస్తాడు? దిగమ్రింగి వూరుకున్నాడు.

    అతనికి చిన్నవయసులో పేరు ప్రఖ్యాతులు వస్తూండటం, చక్కగా రాయగలగటం అతని తప్పుకాదు.  కాని వయసులో చిన్న కావటం "అనుభవం లేదు" అని విమర్శించటానికి అదనుదొరికింది అసూయపరులకు.

    ప్రజలంతా వేనోళ్ళ బాగుందని కొనియాడిన అతని నవలని గురించి రాస్తూ "అస్పష్టంగా వుంది. మసక మసగ్గా వుంది. మొత్తంమీద ఓ  మాదిరిగా వుంది" అంటాడా విమర్శకుడు.

    అతని ఆగడం అంతటితో సమసిపోలేదు. అతని కర్మంకాలి అదేరోజులలో రేడియోలో "నేటి తెలుగు సాహిత్యరీతులు" అని ఓ ప్రసంగం వచ్చింది. ఆ  ప్రసంగం చదివినాయన వయసులోనూ, అనుభవంలోనూ,  విజ్ఞానంలోనూ చాలా పెద్దవాడు. ఆయన మధుబాబు కథలనీ, నవలనీ ఉదహరిస్తూ ఈ  యువకుడు సరికొత్త పోకడలతో కలాన్ని కదిలిస్తున్నాడు అని మెచ్చుకున్నాడు. దాన్నిగురించి ఓ వ్యాసం రాసిపారేస్తూ విమర్శకుడు "ఫలానా ఆయన్ని గురించి ప్రసంగంలో ఉదహరించలేదు. ఫలానా యీయన్ని గురించి ఉదహరించలేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్లు? కాని మొన్నవచ్చిన మధుబాబుని గురించిమాత్రం అనవసరంగా పేర్కొన్నారు" అని వెళ్లబోసుకున్నాడు.

    ఇదీ విమర్శకుడి వ్యాసాల విలువ.

 Previous Page Next Page