"ఇంతకీ ఎం జరిగింది?" వాయుపుత్ర అడిగాడు. యశ్వంత్ జరిగింది చెప్పాడు. అంతా చెప్పి "వాయుపుత్రా! మనం ఆ వాహనాన్ని మనతోపాటు భూమికి తీసుకువెళ్ళాలి" అన్నాడు.
"దానికి మనవాళ్ళు వప్పుకుంటారో లేదో-"
వాయుపుత్రకి ఆ అనుమానం ఎందుకు వచ్చిందో యశ్వంత్ కి తెలుసు. ఇతర గ్రహాలనుంచి గానీ, చివరికి చంద్రుడిమీద గానీ కాలిడివచ్చిన ఆస్ట్రోనాట్స్ ని వెంటనే జనంలోకి పంపరు. రాకెట్ లోంచి వైద్యశాలకి తీసుకువెళ్ళి, పరిశోధన చేసి క్షుణ్ణంగా పరీక్షించి మరీ వదులుతారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ నుంచి ఇది జరుగుతూనే వుంది. ఉపగ్రహాల మీదగానీ, గ్రహాల మీదగానీ మనిషికి తెలియని "వైరస్" ఏదైనా వుండి, అక్కడికివెళ్ళిన ఆస్ట్రోనాట్స్ తో పాటు అవి భూమి మీదకు వస్తే, ఇప్పుడున్న కాన్సర్ , ఎయిడ్స్ కి తోడు మరికొన్ని అంతపట్టని వ్యాధులు వస్తాయేమో అని భూలోకవాసుల భయం. చాలా వరకూ ఆ ప్రమాదం వుంది కూడా. అటువంటి పరిస్థితుల్లో, సుదూర తీరాల్నుంచి వచ్చిన "పళ్ళేన్ని" శాస్త్రజ్ఞులు భూమ్మీదకు దింపటాన్ని అసలు వప్పుకోరు. అందులోనూ ఆ పళ్ళెంలో అంతకు ముందు వరకూ కొన్ని ప్రాణులున్నాయి. అవేమిటో తెలీదు. వాటికున్న అంటురోగాలు ఏమిటో తెలీదు. వాటి తాలూకూ యాంటి- బయోటిక్స్ తెలీదు. భూమ్మీద వున్న ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ల మిశ్రమంతో ఆ వైరస్ విపరీతంగా వృద్ధి పొందే లక్షణం కల్గివున్నవైతే, మానవజాతి సమస్తం సర్వనాశనమైపోతుంది.
"మరేం చేద్దాం" అడిగాడు యశ్వంత్.
"మీరు దీన్ని ఎందుకు మనతోపాటు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు?"
"ఈ వాహనపు అంతర్భాగం చాలా గమ్మత్తుగా వుంది. ముఖ్యంగా Source of Energy నాకు అర్థం కావటంలేదు. దీనికి ఇంత శక్తి ఎలా వచ్చిందో తెలుసుకుంటే మనకి భవిష్యత్తులో పెట్రోలు, కిరసనాయిలు, ఎలక్ట్రిసిటీ- వాటి అవసరం వుండదు."
వీళ్ళీ విధంగా మాట్లాడుకుంటూ వుండగా భూమినుంచి సంకేతం వచ్చింది. ఏం జరుగుతూంది అక్కడ అన్న ప్రశ్నతో!! తను స్పృహ తప్పటం, వాయుపుత్ర రావటం, మినహా, మిగతా విషయాలన్నీ వివరించాడు యశ్వంత్. అంతా చెప్పి "మేము మాతోపాటు ఆ ప్లయింగ్ సాసర్ ని కూడా భూమ్మీదకు తీసుకువద్దా మనుకుంటున్నాం" అని పూర్తిచేశాడు.
దీనితో భూమివైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు. "మా నిర్ణయం కోసం కొంచెం సేపు ఆగండి" అన్న సూచనతో రేడియో ఆగిపోయింది. ఈ విషయమై భూమిమీద సంచలనం ప్రారంభమై వుంటుందని వాళ్ళు గ్రహించారు.
ఈ లోపులో వాయుపుత్ర యశ్వంత్ తో "ఆ ప్లయింగ్ సాసర్ లో ప్రాణులు ఏమీలేవని మీరు నమ్ముతున్నారా" అని అడిగాడు. "అవును, అది ప్లానెటరీ ప్రొబే" అన్నాడు యశ్వంత్ క్లుప్తంగా.
(ప్రాణులు లేకుండా పంపిన.....లేక ప్రాణులు ఖాళీచేసి వదిలేసిన నౌకల్ని ప్లానెటరీ ప్రోబ్స్ అంటారు. వీటిలో రెండు రకాలు. సెకనుకి ఏడుమైళ్ళ కన్నా ఎక్కువ వేగంతో వెళ్ళేవి మొదటిరకం. అంతకన్నా తక్కువ వేగంతో వెళ్ళేవి రెండోరకం. ఈ మొదటిరకం అంతరిక్ష నౌకలు. భూమియొక్క అయస్కాంతక్షేత్రాన్నిదాటి, సూర్యుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటాయి. శూన్యంలో ఇవి ఎక్కడ వున్నాయో పట్టుకోవటం కష్టం. ఏ గ్రహం తగిలితే ఆ గ్రహం తాలూకు ఆకర్షణశక్తికి లోబడి ప్రయాణం చేస్తూ వుంటాయి. రెండోరకం నౌకలు తక్కువ వేగంతో ప్రయోగింపబడినవి. ఇవి తిరిగి భూమ్మీదకే వచ్చేస్తూ వుంటాయి. మారినర్స్ మొదటిరకం. స్కైలాబ్స్ రెండోరకం.)
"అంటే ఆ గ్రహాంతరవాసులు తమ అవసరం తీరేక ఈ నౌకని శూన్యం అనే చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోయారంటారా?"
"అవును. లేకపోతే ఎక్కడో సూర్యుడి దగ్గర వుండవలసిన ఈ ప్లయింగ్ సాసర్ ఇక్కడ ఇటువైపు ఎందుకొస్తుంది?" యశ్వంత్ ప్రశ్నించాడు.
"ఆ గ్రహాంతరవాసులే తీసుకుని వచ్చి వుండొచ్చుగా"
"వాళ్ళకి ఆ అవసరం లేదు. వాళ్ళు రాదల్చుకుంటే మామూలుగానే వస్తారు. మనం ఇప్పుడు ఎంతవేగంతో ప్రయాణం చేస్తున్నాం?"
"సెకనుకి పదిమైళ్ళు. గంటకి ముప్పై ఆరువేల మైళ్ళు...."
"అదే వేగంతో ఆ అంతరిక్ష నౌకకూడా వెళ్తోంది. అంటే భూమి ఆకర్షణలోకి వెళ్ళటం దానికి ఇష్టం లేదన్నమాట. దాని దారినఅది శూన్యంలోకి వెళ్ళిపోతూ వుంది. ఈ నౌకలో ఎవరూ లేరని దాన్ని బట్టే తెలియటం లేదూ?"
వాయుపుత్ర రేడియో కనెక్షన్ తీసేశాడు.
యశ్వంత్ అదిరిపడి "అదేమిటి?" అన్నాడు.
"భూమినుండి కనెక్షన్ తాత్కాలికంగా తీసేసేను" అన్నాడు వాయుపుత్ర. ".......వాళ్ళ అంతర్జాతీయ చర్చ జరిపి, ఈ నౌక రావాలా వద్దా అని నిర్ణయించి, మనకు ఆ నిర్ణయం తెలిపే లోపులో ఈ నౌక కాస్తా మన పరిధి దాటిపోతుంది. అందుకే మనం మనతోపాటు దాన్ని తీసుకువెళ్తున్నాం. ఆ విషయం, భూమి ఆకర్షణ పరిధిలోకి వెళ్ళాక, అప్పుడే రేడియో బాగయినట్లుగా నటించి, వాళ్ళకి చెపుదాం-"
"మైగాడ్ .....ఇంత అడ్వెంచరు....."
యశ్వంత్ మాటలు పూర్తికాకుండానే వాయుపుత్ర నవ్వి "ఆ అడ్వెంచర్ లేకపోతే మనం ఇలాంటప్పుడు కలిసి మాట్లాడుకుంటూ వుండేవాళ్ళం కాదు" అన్నాడు.
ఇద్దరూ చకచకా రెండు వాహనాలకీ సంధానం ఏర్పాటు చేశారు. రెండు వాహనాలూ ఒకే వేగంతో వెళుతున్నాయి కాబట్టి ఏ కష్టము రాలేదు. రెండూ భారరహిత స్థితిలో వున్నాయి కాబట్టి దిశ మార్పులో కూడా కష్టం తోచలేదు.
మరొక రెండు గంటల తరువాత-
మొట్టమొదటిసారిగా-
పరాయిలోక వాసులు ఉపయోగించిన ఒక అంతరిక్షనౌక- భూమి ఆకర్షణ శక్తిలోకి ప్రవేశించి, భూమివైపు దిగటం ప్రారంభించింది. ఆ నౌక తనతోపాటు ప్రళయాన్నే తీసుకువస్తుందో, ప్రమోదాన్నే ఇస్తుందో మానవజాతికి- కాలమే నిర్షయించాలి.
* * *
వాయుపుత్ర అప్పుడే బాగయినట్టు రేడియో ఆన్ చేసి- తాము ఆ అంతరిక్షనౌకని తీసుకువస్తున్నట్టు-దానికి తగిన జాగ్రత్తలు తీసుకొమ్మన్నట్టు భూమికి వర్తమానం పంపాడు. భూమి అయస్కాంత పరిధిలోకి వచ్చాక శాస్త్రజ్ఞులు దాన్ని ఆహ్వానించడం తప్ప ఇంకెవ్వరూ ఏమీ చేయలేరని అతడికి తెలుసు.
యశ్వంత్ కి గిల్టీగా వుంది. అతడికి ఇలాటి అడ్వెంచర్స్ ఇష్టం వుండవు. అంతరిక్షానికి సంబంధించిన శాస్త్రంలో ఇలాటి అడ్వెంచర్ ఒకోసారి మొత్తం మానవజాతినే ప్రమాదంలో పడేస్తాయి. మరో రెండు గంటల తరువాత వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తూ వచ్చిన వాహనం, ప్లయింగ్ సాసర్ తో పాటూ వచ్చి సముద్రంలో ఆగింది. ఎన్నోవేల కెమెరాలు ఆ దృశ్యాన్ని తమలో బంధించాయి. గ్రహాంతరాల్నుంచి వచ్చిన ఆ గాలి పళ్ళేన్ని చూడటం కోసం జనం నేల ఈనినట్టు మూగారు.
ఒక నౌకద్వారా ఆ గాలిపళ్ళెం ఒడ్డుకు చేర్చబడింది. రకరకాల రక్షణ కవచాలతో శాస్త్రజ్ఞులు దానిలో ప్రవేశించారు. యశ్వంత్ మీద ఆ వాహనం తాలూకు ప్రభావం ఏమైనా వుందేమో తెలుసుకోవటం కోసం అతడిని పరిశోధనాలయంలోకి పంపారు. తను కూడా ఆ వాహనంలోకి వెళ్ళానన్న విషయాన్ని వాయుపుత్ర ఎవరికీ చెప్పలేదు.
మరుసటిరోజు ప్రపంచంలోని అన్ని పత్రికల్లోనూ ఈ ప్లయింగ్ సాసర్ వార్తలు, ఫోటోలు వచ్చాయి. రకరకాల ఉహాగానాలు చెలరేగాయి. 'మయాస్' దీన్ని కావాలనే భూమ్మీదకు వదిలారని కొన్ని పత్రికలు వ్రాస్తే, మరి కొన్ని పత్రికలు దీన్ని యశ్వంత్ వాయుపుత్ర సాహసానికి సంకేతంగా అభివర్ణించాయి. ఆ తరువాత పద్దెనిమిది గంటలకు - ప్రపంచాన్ని దిగ్భ్రమలో ముంచేసే వార్తా-ఈ ప్లయింగ్ సాసర్ ద్వారా బయటపడింది.
8
"ఆ ఎగిరే గాలిపటం ఒక విధమైన మిశ్రధాతువుల్తో తయారు చేయబడింది. ఇనుము, అల్యూమినియం కొద్దిగా వున్నాయి. మనకు తెలియని లోహాలు మరొక రెండు వున్నాయి. అవేమిటో కనుక్కోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అన్నాడు నివేదికను సమర్పిస్తూ ఒక నిపుణుడు.
ఆ విషయం మీద తనకంత ఆసక్తి లేనట్టుగా యశ్వంత్ తలూపుతూ "శక్తి ఎక్కడనుంచి వస్తూందో(Source of Energy) చెప్పండి. ముఖ్యంగా, నేను 'బల్బ్' అనుకుని పట్టుకోబోయిన వస్తువు గురించి....."
"దాన్ని గురించే చెప్పబోతున్నాను. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం..... అది బల్బ్ కాదు. డానికి వైర్లు కానీ, స్విచ్ లు కానీ ఏమీలేవు."
"అవును. అది ఒక రకమైన క్వాట్జ్"
క్వాట్జ్??" ప్రశ్నించాడు ఆశ్చర్యంగా.
"అవును కానీ మన భూమిమీద దొరికే క్వాట్జ్ లాటిది కాదు లక్ష గడియారాల్ని పది లక్షల సంవత్సరాలపాటు నడిపించగల శక్తివంతమైన క్వాట్జ్. దాని బరువు ఎంతో మీరు ఊహించగలరా యశ్వంత్!"
"ఎంత?"
"పదిహేను వందల కిలోలు."
యశ్వంత్ అతడివైపు విస్మయంగా చూశాడు. పదిహేను వందల..... కి....లో...లు. చిన్న గోళీకాయ ఆకారంలో కనిపించే ఆ వస్తువు బరువు అంత వుందంటే అది నిశ్చయంగా న్యూట్రాన్ స్టార్ కి సంబంధించినదై వుంటుంది. అసలు న్యూట్రాన్ స్టార్ వుందో లేదో మన భూలోకవాసులకి తెలీదు. అటువంటిది- ఆ పరలోకవాసులు దాన్ని కూడా తమ ఎనర్జీ సోర్స్ గా మార్చుకోగలిగారు. వారి సాంకేతిక అభివృద్దిని అది సూచిస్తుంది.
నిపుణుడు, తాను కనుక్కున్న విషయాన్ని చెప్పటం కొనసాగిస్తూ అన్నాడు- "ఆ గ్రహాంతరవాసులు వదిలేసి వెళ్ళిపోయిన నౌకలో మరొక ప్లేట్ దొరికింది యశ్వంత్! దానిమీద సూర్యుడూ, నవగ్రహాలు తిరిగే దారుల యొక్క మ్యాపు కూడా వుంది. భూమిచుట్టూ ఒక గీత గీయబడి వుంది. అలాగే కుజుడి చుట్టూకూడా. బహుశా ఈ రెండు గ్రహాలమీద జీవకోటి వున్నట్టు వారి అంచనా అనుకుంటాను."
యశ్వంత్ తలూపాడు.
"అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే..... ఆ వాహనపు ఒక గదిలోనున్న డస్ట్ బిన్లలో మన "రాయ్" తాలూకు బట్టలు దొరికాయి."
యశ్వంత్ అదిరిపడ్డాడు.
"అవును యశ్వంత్! స్పేస్ సూట్ నెంబర్ కూడా పరిశీలించి చూశాం. అవి రాయ్ ధరించిన దుస్తులే."
యశ్వంత్ వినటంలేదు. ఆలోచిస్తున్నాడు. తమ నౌకనుంచి విడివడి చంద్రుడిమీద పడబోతూవుంటే వాయుపుత్ర వచ్చి ఏ విధంగా రక్షించాడో, ఆ విధంగానే "రాయ్ ని" ఆ గ్రహాంతరవాసులు వలవేసి పట్టుకుని తమతో తీసుకుపోయారా?
లేక అతడిని చంపేసేరా?
యశ్వంత్ వెన్ను జలదరించింది.
అంతలో బెల్ మ్రోగింది. తమ తమ రంగాల్లో గొప్పవారైన మేధావులందరూ తమ తమ నివేదికలు పట్టుకుని మెయిన్ హల్ లోకి ప్రవేశించారు.
అందరూ కలిసి, ఒక నిర్ణయం తీసుకోవాలి.
ఆ నిర్ణయం మీద భూలోకవాసుల ప్రాణాలు ఆధారపడి వుంటుంది.