పెద్దపార్టీని పడగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయినట్లు అవసరం వచ్చినప్పుడు ఆ ముగ్గురూ ఒకటి. ఎవరి సిద్దాంతం వారిదే. ఎవరి ఆశయం వారిదే అయినా ఎ గొడవలూ లేకుండా కలసి మెలసి ఉంటారు వాళ్ళు.
దానికి తగిన కారణం ఉంది.
కోదండరామయ్యగారిది అన్ని వసతులు ఉన్న పోరుపొచ్చెం లేని యిల్లు.
పంకజానికి, మనోరమకి మంచి స్నేహం అయింది.
కోదండరామయ్య, వెంకుమాంబ పీనాసివాళ్ళు. అంతకు తప్పించి వాళ్ళ వల్ల యిబ్బంది లేదు. వయసుకి పెద్దవాళ్ళు అయినా సరదా మాటలతో వాళ్ళ కీచులాటలతో అద్దెకుండేవాళ్ళతో మంచి కాలక్షేపంగా వుంటున్నారు.
ఇంటి వాళ్ళవల్ల మనోరమకి, పంకజానికి ఎ యిబ్బంది లేదు. ఇంటివాళ్ళు ప్రస్తుతం వున్నది యిద్దరు.
పంకజం కూర చేస్తే "రుచి చూడండి పిన్నిగారూ!" అని యిస్తుంది.
ఏదయినా స్వీట్ హాట్ చేస్తే "బాబాయిగారికోసంతెచ్చాను. బాబాయిగారూ తిని రుచి ఎలా వుందో చెప్పాలి" అంటూ అందిస్తుంది మనోరమ.
"ఇలాంటివి నాకు గిట్టవు ఎందుకమ్మాయీ యివన్నీ! మేమా పెద్దవాళ్ళం. పనిగట్టుకుని పిండి వంటలంటూ చేసుకోము. మీ కంటూ మేము ఏమీ పెట్టకుండా యిలా తీసుకు తినాలంటే మాకెంత బాధగా వుంటుందో వద్దంటే బాధ పడతారు" అంటూ మహాబాధ పడిపోతూ తీసుకుంటారు కోదండరామయ్యగాని, వెంకుమాంబ గాని.
"వేషాలకి, కబుర్లకి తక్కువేమీ లేదు. తేరగా వస్తే గుండ్రాయి కూడా తిని హరించుకుంటుంది పిన్నిగారు. ఇనుప చువ్వలని చేగోడీల్లా నమలగలడు బాబాయిగారు" అని చాటుగా చెప్పుకుని మనోరమ, పంకజం నవ్వుకుంటారు. యిదో రకం లంచం అని వాళ్ళకి బాగా తెలుసు.
"ప్రతివాళ్ళకీ రేపటి రోజంటూ ఒకటి గుర్తుండాలి బగోణీలో జానెడులోతు నూనెపోసి ఈ వేపుడు కూరలేమిటి? నెయ్యి, పంచదార తగలెట్టి ఈ స్వీట్స్ ఏమిటి! ఇలా తింటుంటే కొండలయినా తరిగిపోతాయి. అయినా మనకెందుకులే" చాటుగా యిలా చెవులు కొరుక్కుని వాళ్ళు ఖర్చు పెడుతున్నందుకు వీళ్ళు తెగ బాధపడిపోతూ, కమ్మగా చేసింది సుమా అని తింటూకాలం గడుపుతున్నారు కోదండరామయ్య, వెంకుమాంబ.
మనుషులు మంచివాళ్ళు ఓ పక్క పెట్టుపోతలు, మరో పక్క కలసి మేలసిపోయే గుణం దాంతో వాళ్ళమధ్య చనువు ఏర్పడింది. ఆ చనువు వల్లనే మనోరమ, పంకజం ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు.