Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 13

    "ఎరుపు ఎరుపు ఎంతో చక్కని ఎరుపు. ఎర్ర ఎర్రని ఎరుపు" అంటూ చిన్నరాగం తీసి "పెట్టె చాలా బాగుంది. ముఖ్యంగా ఆ ఎర్రని రంగు దానిమీద ఎర్రగులాబీల డిజైను" అంది మనోరమ.

    రైలులో వుండగానే ఆ పెట్టె గురించి ఇరుగు పొరుగుకి ఏం చెప్పాలో ముందే ఆలోచించుకుని రెడీగా వున్నారు వెంకుమాంబ, కోదండరామయ్య.

    "మీ ఆడవాళ్ళు ఉన్నారు చూశావ్!" అన్నాడు కోదండరామయ్య.

    "మీరలా పదే పదే వెక్కిరింతలు, వేళాకోళాలు చేశారంటే నాకు మండిపోతుంది. ఈ పెట్టెని యిలాగే ఎవరికో ఒకరికి దానధర్మాలు చేస్తాను." వెంకుమాంబ రుసరుసలాడింది.

    "విషయమేమిటి పిన్నిగారూ!" అంది పంకజం.

    "నీకు తెలిసిందే కదమ్మాయ్! నేను దేనికీ ముచ్చటపడను. అది కావాలి యిది కావాలి కొనండి అని వేదించాను. ఖర్మకాలి ఈ పెట్టె నా కళ్ళబడ్డది. సరీగ యిలాంటి పెట్టె నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారింట్లో వుండేది. అప్పటినుంచీ యిలాంటి పెట్టె మీద మోజు వుండేది. ట్రంకుపెట్టెలు అమ్మే కొట్లో ఈ పెట్టె నాకళ్ళ పడింది. నోరు తెరిచి కొనండి అన్నాను. ఏ కళనున్నారో వెంటనే కొన్నారు. కొన్నవారు వూరుకోవచ్చా, దోవ పొడుగూత ఒకటే సాధింపు" వివరించింది వెంకుమాంబ.

    "నీ కర్ధమైంది అంతే. పెట్టె కొన్నందుకు కాదు నా బాధ. రైలులో నా స్నేహితుడు కలసి ఈ వూళ్ళో వున్న తన భార్య పుట్టింటి వాళ్ళకి సామాను ఇవ్వమని బండెడు సామాను నా కంటగట్టాడు. పెట్టంటూ వుండేసరికి అన్ని దానిలో కుక్కటం అయింది. పెట్టె కొన్నది వాడి సామానులు మోయటానికి లాగుంది. పోనీ కూలీలకోసం డబ్బు యిచ్చాడా-అదేమీ కాదు. మూట నీది. బరువు నాది అన్నట్లు తయారయింది. స్టేషనులో కూలీలతో పోట్లాట అయింది. అందుకే నోరుమూసుకుని రిక్షావాడికి డబ్బులుయిచ్చాను" కోదండరామయ్య తలుపు తాళం తీసి సూట్ కేసు లోపల పెట్టి వస్తూ కథ వినిపించాడు.

    ఆయన చెప్పిన కథలో ఎక్కడో ఫాల్ట్ వున్నట్లు అనిపించింది మనోరమకి, పంకజంకి. అయినా వాళ్ళు ఈ కథని నమినట్లు ముఖం పెట్టారు.

    కోదండరామయ్య, వెంకుమాంబ చెరోవైపు పట్టుకుని ఎర్ర పెట్టెని యింట్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయబోతుండగా ఓ పక్క మనోరమ మరోపక్క పంకజం పెట్టెకున్న రింగులని పట్టుకుని పైకి ఎత్తారు.

    "బాబోయ్, చచ్చే బరువు వుంది" అంది పంకజం.

    "దీని లోపల ఉంది సామాను కాదు యినుప దిమ్మెలు" నవ్వుతూ అంది మనోరమ.

    "ఇనప దిమ్మెలు కాదు. సిమెంటు అచ్చులు" తనూ నవ్వుతూ అని పెట్టె అడుగున ఓ చెయ్యి వేశాడు కోదండరామయ్య.

    అతి కష్టంమీద పెట్టెని యింట్లోకి చేర్చారు.

    "ఒకసారి చూస్తే మరచి పోలేనంత అందంగా వుంది ఈ పెట్టె" అంది పంకజం.

    "వి.ఐ.పి.లు సఫారీలు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత వీటి ముఖం చూసే వాళ్ళు కరువయ్యారు," మనోరమ అంది.

    కాళ్ళూ చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి తాము వూరికి వెళ్ళిం తర్వాత కొడుకులు, కూతుళ్ళు రాసిన ఉత్తరాలు కిటికీలోంచి లోపలికి పోస్ట్ మేన్ పడేసినవి చదువుకొంటూ కోదండరామయ్య వెంకుమాంబ వీళ్ళతో మాట్లాడలేదు.

    ఈ లోపల

    అక్కడే కూర్చున్న మనోరమ, పంకజం పెట్టెలు వాటి పూర్వోత్తరాలను గురించి మాట్లాడుకున్నారు.

    ఆ తర్వాత-

    "యాత్ర విశేషాలు ఏమిటి బాబాయిగారూ!" మనోరమ అడిగింది.

    "మీరు లేకపోతే ఇల్లు చిన్నబోయింది" అంది పంకజం.

    ఆ యింట్లో బాబాయిగారి పార్టీ మనోరమ.

    పిన్నిగారి పార్టీ పంకజం.  

 Previous Page Next Page