యాక్షన్ కధ
పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు.
అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
"నిర్మాతా! నా కధ వినకుండా ఉండాలని రెండు చెవుల్లో దూది పెట్టుకోచ్చావ్ గానీ అలాంటి టెక్నిక్ లెన్ని ఉపయోగించినా ఏం ప్రయోజనం లేదు. నువ్వేం చేసినా గాని నాకిష్టమయిన చెత్త వాగుడంతా వినిపించడం ఎలాగో నాకు తెలుసు. ఎందుకంటే నేను కొంతకాలం రేడియో స్టేషన్ లో పని చేశాన్లె! అక్కడే అబ్బిందీ ఈ విద్య. అయినా నీ మీద జాలితోనే నువ్వు మోస్తున్న బరువు తెలీకుండా ఉండేందుకే ఈ కధలు చెప్పటం! శ్రోతలు దోరక్కకాదు. ఇక కధ విను!
"అనగనగా కోనసీమలో చినసామి అనే లక్షాధికారి వుండేవాడు. అతగాడికి సినిమా ఫీల్దంటే తెగ మోజు. మోజుంటే చాలు మొనగాడయే అవకాశం సినిమా లోకంలోనే లభిస్తుందని అతని మిత్రుడొకడు అనుభవ పూర్వకంగా చెప్పేసరికి వెంటనే మద్రాస్ చేరుకొని ఓ టీనగర్ హోటల్లో దిగి ముందస్తుగా సినీ జర్నలిస్టు లతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాడు. టీ పార్టీ , మందు పార్టీ అయిపోయాక అందులో చాలామందిని నెలసరి జీతాలకు కొనిపారేశాడు. ఆ తరువాత కేవలం మద్రాస్ నగరంలోనే కనిపించే కొన్ని గొప్ప సినిమా పత్రికలను కూడా అద్దెకు మాట్లాడుకుని పబ్లిసిటీ ప్రారంభం చేశాడు.
"కోనసీమ చినసామి దర్శకత్వంలో అద్భుతమైన తెలుగు చిత్రం! కనీవినీ ఎరుగని సెట్టింగులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే నృత్యాలు, ఒళ్ళు జలదరించే కత్తి యుద్దాలు, గుండెలు ఝల్లు మనే ముద్దులు వగైరా " అని పత్రికల్లో వచ్చేసినాయ్ పతాక శీర్షికలతో, జనమందరూ హటాత్తుగా డైరక్టరయినా ఈ కోనసీమ చినసామీ ఎవర్రా అని తెగ ఆలోచించారు గానీ అదేం కొత్త కాదు కాబట్టి మనకెందుకులే అని సరిపెట్టుకున్నారు.
మాములుగానే పిక్చర్ షూటింగు ప్రారంభమయింది. ఇంకా చాలా మాములుగా సగం సినిమా అయాక చినసామి దగ్గర డబ్బు అయిపొయింది.
"డబ్బవగానే ఏం చేయాలి?" అంటూ వెంటనే అనుభవజ్ఞుడైన తన మిత్రుడికి ట్రంక్ కాల్ బుక్ చేసి అడిగాడతను.
అపుడు రెండు పద్దతులు అవలంభించవచ్చు. ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ కాళ్ళు పట్టుకుని సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడం ఒక పద్దతి. ఎవ్వరికీ తెలీకుండా మళ్ళీ కోనసీమకు వెళ్ళిపోయి కొబ్బరి తోటలు చూసుకుంటూ అజ్ఞాత వాసం చేయడం మరో పద్దతి" అని సలహా ఇచ్చాడు అతని మిత్రుడు.
తనలాంటి మహాదర్శకుడు కమ్ నిర్మాత వెళ్ళి అప్ ట్రల్ ఓ డిస్ట్రిబ్యూటర్ కాళ్ళు పట్టుకోడమేమిటా అని కోపమొచ్చింది గానీ ఈ ఒక్కసారీ అలా చేసి సినిమా రిలీజ్జేస్తే దాని మీద ఎలాగూ కోట్ల కొద్దీ లాభం వస్తుంది , ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లె తన కాళ్ళు పట్టుకుంటారని అలోచించి వెంటనే విజయవాడ చేరుకొని రిక్షాలో ఓ దిస్త్రిబ్యూషన్ ఆఫీస్ కి చేరుకున్నాడు. ఆ ఆఫీసు ముందు మైలు పొడుగునా క్యూ ఉంది. అందరిని తప్పించుకుని ముందు కెళ్ళి ఫ్యూన్ తో "నేను అర్జంటుగా డిస్ట్రిబ్యూటర్ కాళ్ళ మీద పడాలి. అవతల నా సినిమా సగంలో ఆగిపోయింది " అన్నాడు.
ప్యూన్ అయిదు నిమిషాలు నవ్వాడు.
"ఈ క్యూలో ఉన్నవాళ్ళందరూ ఎవరనుకున్నారు? మీకంటే గొప్పవాళ్ళే. సినిమా పూర్తి అయి కూడా కేవలం రిలీజ్ చేయమని కాళ్ళ మీద పడడానికి వచ్చారు. వెళ్ళవయ్యా పెద్ద మొనగాడివి వచ్చావ్. వెళ్ళి ఆ క్యూలో ఆఖర్న నిలబడు" అన్నాడు నవ్వాపి సీరియస్ గా.
చినసామి తల్లబోయి, బిక్క మొగం వేసుకుని క్యూలో చివర నిలబాడ్డాడు. ఆర్నెల్లు గడిచినా "క్యూ" కదలకపోయేసరికి ఇక నిలబడే శక్తి లేక తన అనుభవజ్ఞుడయిన మిత్రుడు చెప్పిన రెండో పద్దతి ప్రకారం కోనసీమ చేరుకొని తన కొబ్బరి తోటల్లో అజ్ఞాత వాసం చేయసాగాడు. ఎంత అజ్ఞాతవాసం చేసినా అప్పుడప్పుడూ వెన్నెల్లో గతం గుర్తుకొస్తుంది కదా ఎవరికయినా! చినసామికి కూడా వెన్నెల రోజుల్లో సగంలో ఆగిపోయిన తన సినిమా గుర్తుకొచ్చి ఏడుపోచ్చేది. వెంటనే తను పిక్చరైజ్ చేసిన సీక్వెన్స్ లో లాగా కొబ్బరి చెట్ల మధ్య తిరుగుతూ "ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఓ కోయిల సినిమా తీసింది. సగమే తీసింది" అని ఏడుస్తూ పాడేవాడు. ఆ పాట అతని తోటమాలి కూతురు తన పాకలో కూర్చుని వింది. ఆ పిల్లకు సినిమాలంటే మహాపిచ్చి. ఏనాటికయినా ఒక్కసారి హీరోయిన్ గా నటించి ఆ తరువాతే తనువు చాలించాలని లోపాయికారీగా నిర్ణయించుకుంది.