చేయవలసినది ఇంకెంతో వుంది
తెలుగుజాతి ఏనాటిది? శాతవాహనుల నాదే తెలుగువారి పరిపాలనా దక్షత ఈ దేశం నలుచెరుగులా చెరగని ముద్రలు వేసింది. కాకలు తీరిన కాకతీయుల కరవాలాల ఖనఖణలు తెలుగునాట ప్రతిచోట ప్రతిధ్వనించాయి. తెలుగువారి కీర్తి చంద్రికలు పున్నమితో పరిమళించి గుబాళించాయి. సస్యశ్యామలమై , సౌభాగ్యనిలయమై, సుఖసంతోషాలకు ఆలవాలమై అందిన తెలుగుజాతి యశో ప్రాభవం సరిహద్దులు దాటి, సాగర తీరాల నదిగమించి-- సుదూర ప్రాంతాలకు విస్తరించింది. తెలుగునేలపై పూచి, నవ్యతతో కొంగ్రొత్త రీతులతో పరిడవిల్లిన తెలుగువారి కళావైదుష్యం వెలుగు పందిళ్ళు వేసి దశదిశలా యశఃకాంతులు విరజిమ్మింది. విజయనగర రాజవీధులలో రత్నాల రాసుల బేహారు నడిచిందట ఆనాడు. ఆత్మతృప్తికి , వేదాంత విజ్ఞాన విశేషాలకు లోటు లేకుండా, కలిమికి , బలిమికి కొరత లేకుండా బ్రతికారు అలనాడు మనవారు. సాటివారికి సైదోడన్నారు. సోరదభావం, సర్వమత సహనం చూపారు. పలనాటి బ్రహ్మన్న చాపకూడు తిన్న సమాజం సర్వమానవ సమానత్వానికి సోపానం - కన్నమదాసును కన్నవానిగా దత్తత చేసుకున్న ఆ నాయని ఉదాత్తత ఆనాడే కులమత వ్యవస్థలను అధిగమించి నింగికెగసిన తెలుగునాటి సర్వజ్ఞత.
అంతా గత చరిత్ర, ఆ పవిత్ర చరిత్రకు సంప్రదాయాలకు ఈనాడు మనం వారసులం.
కాని నేటి సమాజాన్ని చూస్తె -- మన ముందు నగ్నంగా కనిపించే దృశ్యాలను పరిశీలిస్తే ఏమిటి మనకు గోచరించే సత్యం?
తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక మాడే కడుపులతో మండే గుండెలతో, అన్నమో రామచంద్ర అని అలమటించే లక్షలాది పేద ప్రజలా?
గిట్టుబాటు ధరలు లభించక, శ్రమకు తగిన ఫలితం దొరక్క, బిడ్డలకు చదువు సంధ్యలు చెప్పించుకోలేక అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ , మారుమూల గ్రామాలలో కనీస ప్రాధమిక సౌకర్యాలకు కూడా నోచుకోని రైతన్నలా--
కండలు కరిగించి, రక్తాన్ని చెమటగా మర్చి నిరంతరం శ్రమిస్తున్నా పొట్ట గడవక, దారి డొంక తెలియక, బ్రతుకు భారం మోస్తూ సుఖమన్నది పగటి కలగా పస్తులే నిత్య సత్యంగా రక్తాశ్రువులతో మురికి కూపాలలో చేయని పాపాలతో , తీరని శాపాలతో మ్రగ్గుతూ చావలేక బ్రతుకుతున్న కార్మిక, శ్రామిక సోదరులా?-
నిస్పృహ , నిరాశ , దారిద్యం, అనారోగ్యం , అజ్ఞానం మొదలైన సాంఘిక దురాచారాలకు బలై రవ్వంత వెలుగు కోసం కొండంత ఆశతో అలమటించే లక్షలాది హరిజన, గిరిజన వెనుకబడిన ప్రజా సందోహమా?
వచ్చిన మన స్వాతంత్ర్యం వీరికి ఏం తెచ్చింది? ఏమిచ్చింది? ఏమి కట్టబెట్టింది? ఏమి ఓరగ బెట్టింది?
ఈ దురదృష్టకర పరిస్థితి ఇక సాగరాదు. ఈ వ్యవస్థ ఇకపై సాగబోదు. దీని పర్యవసానమే అలనాటి నుంచి తెలుగునాట తిష్ట వేసుకొన్న పాలక వ్యవస్థ బాదాబదులు కావడం. ప్రపంచ చరిత్రలోనే అపూర్వంగా , ఆదర్శ ప్రాయంగా నూతన ప్రభుత్వాన్ని ప్రతిష్టించి నవ్యతకు నాంది పలికి మహోజ్వల చరిత్రను సృష్టించారు తెలుగువారు. ఎంతో ఉద్వేగంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో ముందుకు నడచింది యువశక్తి. అనురాగాలే వెల్లువగా, ఆశీర్వచానాలే పూలజల్లుగా, మంగళహారతులతో నివాళులిచ్చింది తెలుగింటి ఆడపడుచుల వాత్సల్యం. పొంగిన ఉత్తుంగ తరంగమై అధికార బాధ్యతలను అప్పగించింది, తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగు ప్రజానీకం, ఎందుకు?
వారి ఆశలను , ఆకాంక్షలను సఫలం చేసి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ ను ఆసేతు హిమాచలానికి ఆదర్శం చేయాలని -
దారీ తెన్నూ తెలియక, జీవిత నిరాశలతో అంధకారంలో అట్టడుగున మగ్గుతున్న బడుగువర్గాలకు క్షేమం జరగాలని -
ఉషః కాంతులే సోకని ఆ బక్క బ్రతుకులలో , బడుగు జీవితాలలో వెలుగు సుంతైనా నింపాలని - వారి తరతరాల కన్నీటి గాధలను ఆదరంతో తుడిచి వెయ్యాలని -
అందుకే ఆ బాధ్యతల తోనే ప్రజలలో ఒకరమై, సామాన్య మానవుల ప్రతినిధులమై గ్రామాభ్యుదయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కిలో బియ్యం రెండు రూపాయలకు పేద ప్రజానీకానికి అందించడానికి ప్రయత్నం చేసినా -
అహర్నిశలూ రెక్కలు ముక్కలు చేసుకోవడమే గాని పొద్దుండగా పిల్లల క్షేమం చూసుకోలేని పేదవారి పిల్లలకు మధ్యాహ్న భోజన పధకాన్ని నిర్వహించడానికి ఉపక్రమించినా -
తలదచుకోడానికి నీడైనా లేని అభాగ్యులకు శాశ్వత గృహ నిర్మాణ పధకాలతో సమాదరించడానికి ప్రయత్నించినా -
ఈ కార్యక్రమంలో ఒక భాగం మాత్రమేనని మనవి చేసృన్నా. చేయవలసింది యింకేంతో వుంది. వారి జీవితాలలో వెలుగు నింపి సమాదరణతో ఆదరించి, మన సమాజంలో , ఈ ప్రజాస్వామ్యయుగంలో - సమభాగస్తులుగా , సమానావకాశాలు అందించి, చేయుత నిచ్చి మనతో బాటు నడిపించిననాడు గాని నిజమైన మానవభ్యుదయం జరుగదని నా విశ్వాసం.
ఈనాటికి కూడా పారిశ్రామిక రంగంలో, వ్యావసాయిక వ్యవస్థలో సంతృప్తికరమైన ప్రగతిని సాధించలేకపోయిన ప్రస్తుత పరిస్థితిని చక్కబరచి రాష్ట్రాభివృద్ధిని, దేశ సమృద్దిని సాధించడం ప్రభుత్వ ధ్యేయం.
ఆర్ధికపరంగా వ్యక్తీ ఆదాయాన్ని పెంపొందించి ప్రతివారికి సంతృప్తి కరమైన జీవనాన్ని ప్రసాదించడం ప్రభుత్వ ఆదర్శం.
మధ్యవున్న దళారీలను , స్వార్ధపరులైన దుష్టశక్తులను అడ్డు తొలగించి వుత్పత్తి దారులకూ వినియోగదారులకూ సూటిగా సమన్వయం సమకూర్చటమే ప్రభుత్వ లక్ష్యం.
అర్హతకు ప్రోత్సాహం లభించక విజ్ఞానం కుంటుపడుతున్న, మేధస్సు కొడిగట్టిపోతున్న ఈ సమాజంలో దుస్సంప్రదాయాలను తుదముట్టించి అర్హతకు తగినంత ప్రోత్సాహం కలిగించడం ప్రభుత్వ నిర్ణయం.
లంచకొండితనం, దళారివిధానం అవినీతి నిర్మూలించి స్వచ్చమైన పరిపాలన ప్రజలకందించడం ప్రభుత్వ విధానం.
ఎంత అవసరమున్నా , ఎన్ని ఇబ్బందులున్నా ఈనాటి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గుర్తించి, సమాజ'పరమైన అవసరాలను అవగాహన చేసుకొని, సమభావంతో , సహకారంతో, సహృదయంతో , సహనంతో , త్యాగంతో ఉద్యోగ సోదరులు ప్రభుత్వంతో సహకరించాలని మరొక్కసారి అర్ధిస్తున్నాను.
"సొంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయ్
............
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్"
అన్న మహాకవి గురజాడ సూక్తిని మననం చేసుకొని, వాక్కులోనే కాదు- ఆచరణలో సయితం ఈ సత్యాన్ని కొంతవరకైనా కనబరచడం మన ధర్మమని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను.
అందరి మేలు గమనించడంలోలే మన మేలు కూడా వుందని నా తాత్సర్యం.
ఆరుకోట్ల ప్రజా సంక్షేమం మాకు ధ్యేయం. అందరి క్షేమాన్ని గుర్తించి వర్తించడమే ప్రతి వొక్కరి కర్తవ్యమని నా పరిపూర్ణ విశ్వాసం.
అనుక్షణం ఆదేశాలను అందించే మహత్తరమైన శక్తిగా, నా మనుగడకు ఊపిరి పోసే జీవగర్రగా నా పురోగమనకు వెలుగు బాటలు తీర్చి దిద్దే నిర్దేశకులుగా , మీవాడిగా , మీ సేవకై సర్వం త్యాగం చేసిన తెలుగు వాడిగా , మీ అజ్నలకు ఎదురు చూస్తుంటాను. వాటిని ఔదలదాల్చడమే నా ప్రధమ కర్తవ్యమని భావిస్తున్నాను. ధర్మ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు ప్రజలే.
ఆకాశవాణి, దూరదర్శన్ ల ద్వారా జులై 15, 19 8 3 న చేసిన విజ్ఞప్తి నుండి.