Previous Page Next Page 
తపస్వి పేజి 13


    తన అభిప్రాయాన్ని స్పష్టాస్పష్టంగా వ్యక్తపరచి ఇంక వెళ్ళవచ్చునన్నట్లు సూచించాడు శశాంక.
    వామనమూర్తి వెళ్ళగానే సౌందర్య అభిప్రాయం ఊహించసాగాడు.
    సౌందర్య నిజంగా ఆ వామనమూర్తిని ప్రేమించిందా?
    ఇతనికి అన్నీ ఉన్నాయని సామాన్యంగా అందరూ అనుకోగలరు కానీ సౌందర్య కూడా...
    ఒకసారి సౌందర్య దగ్గర వామనమూర్తి గురించి ప్రస్తావించాడు.
    "వామనమూర్తి చాలా మంచివాడు కదమ్మా! అందంగా ఉంటాడు. ఈ మధ్య బాగా పైకి వస్తున్నాడు. తెలివైనవాడు!"
    "అవును తెలివయినవాడు! నిజంగా తెలివైనవాడు!"
    పకపక నవ్వింది సౌందర్య...
    ఆ నవ్వు విన్న శశాంకకు ఒక విషయం స్పష్టంగా అర్ధమయింది.
    సౌందర్య ఎవరినీ పొరబాటుగా అంచనా వెయ్యదు. వామనమూర్తినీ వెయ్యలేదు.
    మరి, అంత శ్రద్దగా హాస్పిటల్ కు ఎందుకు వెళ్తున్నట్లు?
    
                                    8
    
    మిసెస్ కామేశ్వరీదేవి సంఘ సేవకురాలు మాత్రమే కాదు, సాహిత్యోపాసకురాలు కూడా! అప్పుడప్పుడు ఆవిడ ప్రసిద్ద రచయితలను తన ఇంట్లో సమావేశపరుస్తూ ఉంటుంది...
    ఈ రోజుల్లో రచయిత్రులు ఎక్కువగా వ్రాస్తున్నారే కాని బాగా వ్రాయటం లేదనే ఒక అభిప్రాయంతో ఆవిడ ఏకీభవిస్తుంది, ఆ కారణంగా రచయిత్రులెవరినీ ఆహ్వానించదు. తన ఉన్నతాభిరుచిని నిరూపించుకోవటానికి ప్రాచీన సాహిత్యంలో పండితులను ఆహ్వానిస్తుంది. తన అభ్యుదయభావాలు చాటుకోవడానికి ఆధునిక రచయితులను ఆహ్వానిస్తుంది.
    తన ఇంట్లో ఏ సమావేశం జరిగినా ఆవిడ సౌందర్యను ఆహ్వానించకుండా ఉండదు. ఆనాడు సౌందర్య వచ్చేసరికి మిసెస్ కామేశ్వరీ దేవి భగవద్గీతలో శ్లోకాలు కంఠతా పడుతుంది...
    "ఎందుకంత శ్రమ!" నవ్వుతూ అంది సౌందర్య.
    "ఇలాంటివి నేర్చుకుంటే నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు వాడటానికి బాగుంటాయి!"
    ఏదో ఉపదేశం ఇస్తున్నట్లు రహస్యంగా అంది.
    సౌందర్య నవ్వింది, సౌందర్య నవ్వినప్పుడు అందరిలాగే కామేశ్వరీ దేవి కూడా ముడుచుకుపోతుంది. కానీ తను ముడుచుకుపోయినట్లు కూడా తెలియనంత త్వరలో కోలుకుంటుంది.
    "ఇన్ని శ్లోకాలు కంఠతా పట్టడం కష్టం కదూ!"
    "నెమ్మదిగా అంటున్నాడా? ఒకటొస్తే ఇంకొకటి మరచిపోతున్నాను."
    "ఇంత అవస్థ లేకుండా  నేనో ఉపాయం చెప్పనా?"
    "చెప్పు!"
    "మాట్లాడేటప్పుడు శ్లోకాలు చదవకుండా ఫలాని అధ్యాయంలో ఫలాని శ్లోకమని అనేస్తే సరి!"
    "బాగానే ఉంది. కానీ ఆ శ్లోకమేదో గుర్తుండద్దూ!"
    "ఏం గుర్తుండక్కర్లేదు. భగవద్గీత బృహద్గ్రంథం. అందులో ఏ శ్లోకమైనా ఏ సందర్భానికైనా సరిపోతుంది. సరిపెట్టొచ్చు. అయినా మీకా సందేహం దేనికి? మిమ్మల్ని ఎవరయినా అడిగితే కదా! ఎవరి మటుకు వాళ్ళే తలలూపేస్తారు!"
    కామేశ్వరీ దేవికి ఈ ఉపాయం చాలా నచ్చింది.
    అతిథులొక్కొక్కరే రాసాగారు. కామేశ్వరీ దేవి ఒక్కొక్కరిని హుందాగా ఆహ్వానిస్తూ సౌందర్యకు పరిచయం చెయ్యసాగింది.
    బయట గట్టిగా మాటలు వినిపిస్తే సౌందర్య బయటకు నడిచింది.
    "బద్మాష్! వొళ్ళు తెలీటంలా! కొత్త కారు- తలుపు అంత గట్టిగా వేస్తావా? నీ చర్మం వలిచేస్తా, చూస్తుండు! ఛ! ఛ! కారు డోర్ దగ్గర కొద్దిగా గీసుకుపోయింది. నీ రక్తం కళ్ళజూడకపోతే ..."
    ఆగిపోయాడు అతను-సౌందర్య పెదవుల మీద చిరునవ్వు అతడిని ఆపింది.
    "చూడండి! వెధవల కెంత పొగరో!" సంజాయిషీ ఇస్తున్నట్లు అన్నాడు.
    "అవునండీ! ఈ రోజుల్లో పనివాళ్ళు బొత్తిగా మన మాట వినటంలేదు..."
    తీయని నవ్వుతో మధురంగా అంది సౌందర్య.
    ఆయన తేరుకున్నాడు. సాహితీ చర్చలు జోరుగా సాగుతున్నాయి. కామేశ్వరీ దేవి మొదట బెరుగ్గా "భగవద్గీత రెండో అధ్యాయంలో నాలుగో శ్లోకంలో చెప్పినట్లు..." అంది.
    ఎదుటి వ్యక్తి ఒక్క క్షణం అయోమయంగా కామేశ్వరీదేవి ముఖంలోకి చూసి "అవునవును" అనేశాడు తడుముకోకుండా. కామేశ్వరీదేవికి ధైర్యం వచ్చింది. మూడో అధ్యాయం లోంచి- అయిదో అధ్యాయం లోనుంచి- ఏడో అధ్యాయంలోంచి - ధారాళంగా ఉదహరించసాగింది.
    చర్చలు రామాయణ భారతాల మీదకు మళ్ళాయి.
    రకరకాల వ్యాఖ్యానాలు.....
    "మీ అభిప్రాయం ఏమిటి?" అన్నారు ఎవరో సౌందర్యను.
    "ఏం చెప్పగలను?"
    "అదేమిటి? రామాయణమే తెలీదా?"
    "పేరు విన్నాను. అనుశృతం వచ్చే కథ విన్నాను. కానీ వాల్మీకి గ్రంథం చదవలేదు. ఆయా దేశ కాలాలను బట్టి ఆ గ్రంథం అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. అంత మాత్రం చేత చర్చలలో పాల్గొనరాదనే నిషేధం లేదనుకోండి!"
    ఒకరిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చర్చలు జోరుగా సాగుతున్నాయి.
    "పోనీ, నీ అభిప్రాయం చెప్పు సౌందర్యా!"
    కామేశ్వరీ దేవి అడిగింది.
    "నాకంటూ ఒక అభిప్రాయం లేదు కామేశ్వరీ దేవి గారూ! మీ అభిప్రాయం గట్టిగా వినిపిస్తే అదే నా అభిప్రాయం. నాకు ఓడిపోవడం ఇష్టం లేదు."
    ఆ జోక్ కి ముందు కామేశ్వరీ దేవి పకపకా నవ్వింది. సభ్యత కోసం మరికొందరు నవ్వారు. ఏం చెయ్యాలో తోచక మిగిలినవాళ్ళు నవ్వేశారు.

 Previous Page Next Page