"ఇప్పటి వరకూ అంటే నేను గమనించిన వరకూ ఏదో ఒక చిన్న విషయంలోనే ప్రతికూలత మొదలవడం చూసాను. నేననుకోవటం ఎక్కడో ఎవరికో ఏదో విషయంలో కడుపు మండుతుంది. వాడు జనాల్ని తనకి తెలీకుండానే ప్రభావితం చేయటం మొదలెడతాడు. కొత్త లీడర్ గా ఎదుగుతాడు."
కొంచెం సేపు ఆగి సిగ్గు పడుతూ అన్నాడు విష్ణు.
"అయినా నాకేం తెలుస్తుంది సార్. నేనేమన్నా ప్రశాంత్ కిషోర్ నా?"
ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉండి, తను త్వరగా పరిష్కరించగలిగిన అంశం పైన దృష్టి పెట్టదల్చుకున్నాడు కార్తీక్. తాము దాని మీద దృష్టి పెట్టామని, పని చేస్తున్నామన్న విషయం కూడా ప్రజలకి త్వరగా చేరేలా చర్యలు తీసుకోవాలి అని కూడా అనుకున్నాడు.
తీరికగా కూర్చుని మరింత లోతుగా ఆ స్కామ్ ల మీద అధ్యయనం చేయటం మొదలెట్టాడు కార్తీక్.
***
తన షెల్ఫ్ అంతా వెతుకుతున్నాడు వాల్మీకి. అది మూడో సారి అతను వెతకటం.
"ఎక్కడ పెట్టాను?" కాసేపు ఆలోచించాడు.
ఒకవేళ ఎవరైనా కొట్టేసారా?
"అమ్మా" పిలిచాడు.
"ముఖ్యమైన కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు కనపడట్లేదు. ఎవరైనా తీశారా?" అడిగాడు.
"ఎవరు తీస్తార్రా? ఇంట్లో ఉండేది మనిద్దరమే. నేను ఇంట్లోనే ఉన్నాగా. ఎవరూ రాలేదు."
"ఏం డాక్యుమెంట్స్?"ఆసక్తి గా అడిగింది.
"మన అధికార పార్టీ వాళ్లు ఈ మూడేళ్లలో చేసిన స్కాం ల గురించినవిలే!" వెదకడం ఆపకుండానే అన్నాడు.
"చక్కగా ఐఐఎం లో చదివావు. నీతో పాటు చదివిన వాళ్లంతా మంచి పే ప్యాకేజ్ లతో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. ఎందుకొచ్చిన జర్నలిజం రా నీకు? ఈ పరిశోధనల వల్ల నీకు వచ్చేదేముంది? వాళ్ళ అవినీతి బయట పెడితే ఊరుకుంటారా? అసలే పవర్ లో ఉన్నారు. నిన్నేమైనా చేస్తార్రా!" భయంగా అందామె.
"అందరూ అలా అనుకుంటే ప్రజలు ఏమైపోతారమ్మా? మన తర్వాత తరాల కోసమైనా ప్రశ్నించే వాళ్ళు, నిలదీసే వాళ్ళు ఉండాలి. లేకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది." అన్నాడు.
"ఎవరికీ లేనిది మధ్యలో నీకెందుకురా?" ఖండిస్తూ అందామె.
"ఎందుకేమిటమ్మా, నాకు సామాజిక బాధ్యత, సమాజం పైన ప్రేమ, అక్కర ఉంది. నాకు కుటుంబ భాధ్యతలు లేవు. రేపు నాకేమైనా అయితే నిన్ను చూసుకోవటానికి అక్క ఉంది కదా." చెప్తున్నాడు వాల్మీకి.
"నీ మాటలు నాకు అర్ధం కావు కానీ షెల్ఫ్ అంతా చిందరవందర చేయకు. మొన్నే పనమ్మాయితో అంతా సర్దించా!"
"పనమ్మాయి ఏంటి. ఆమె కి వనజ అన్న పేరు ఉంది కదా. పేరుతో చెప్పు." అంటుండగా తల కొట్టుకుంటూ వెళ్లిపోయింది అతని తల్లి అక్కడ నుంచి.
"వీడిదో చాదస్తం!".తనలో తను అనుకుంది.
సడెన్గా బల్బ్ వెలిగింది అతనిలో.
వనజని బెదిరించో, ఆశ చూపో ఎవరో కొట్టేయించి ఉంటారు. అంటే తానెంత జాగ్రత్త గా ఉన్నా తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్న సంగతి బయట తెలిసిందన్న మాట.
నవ్వుకున్నాడు అతను.
లోపల బట్టల మధ్య పెన్ డ్రైవ్ ఉందని తెలిసి ఉండదు. ఒక్క చోటే పెడతాడనుకున్నారేమో. కుట్రలు, కుతంత్రాలు చేసే వాళ్లంతా కూడా బోల్తా పడేది వేరే వాళ్ళని తక్కువ అంచనా వేయటం వల్లనే!
అయితే తనే వాళ్ళని తక్కువ అంచనా వేశానని కాసేపట్లోనే అతనికి అర్థమయింది. వాళ్ళు పెన్ డ్రైవ్ నీ వదలలేదు. అందులో ఉన్న డేటా మొత్తం చెరిపేసి రీఫామాట్ చేసి దానికి యధాస్థానంలో ఉంచేసి వెళ్లి పోయారు.
ఉసూరుమన్నాడు వాల్మీకి.
***
మర్నాడు కార్తీక్ కి సుధాకర్ & కో తో మీటింగ్ ఏర్పాటు చేశాడు విష్ణు.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులు అన్నీ గవర్నమెంట్ వాళ్ళకే ఇచ్చింది.
తన కేబిన్ లో కూర్చున్నాడు కార్తీక్.
సుధాకర్, అతని పార్టనర్స్ ముగ్గురూ సీఎం పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. సాధారణంగా అయితే సీఎం బిజీ గా ఉన్నారని చెప్పి వాళ్ళను ఒక గంటన్నా వెయిట్ చేయించే వాడు విష్ణు. మారిన పరిస్థితుల్లో టైమ్ కి పంపకపోతే కార్తీక్ తిడతాడేమో అని అనుమానంగా ఉంది అతనికి.
బుర్ర గోక్కుంటూ ఆలోచించాడు విష్ణు. ఎందుకైనా మంచిదని ఇచ్చిన సమయానికి ఒక అయిదు నిమిషాల తర్వాత వాళ్ళను లోపలికి తీసుకెళ్ళాడు.
"నమస్తే అన్నా!" సీఎం ని చూడగానే నోరారా నవ్వుతూ అన్నాడు సుధాకర్.
"సర్, సుధాకర్ అంటే ఈయనే. వీళ్ళు అతని కంపెనీ లో పార్టనర్లు." పరిచయం చేసి వినయంగా సీఎం పక్కన నిలబడ్డాడు విష్ణు.
పలకరింపుగా నవ్వబోయి ఆపుకుని "కూర్చోండి" అన్నాడు కార్తీక్. నవ్వితే తను సుధీర్ కాదని అర్థమవుతుందని అతనికి తెలుసు. ఇద్దరి మధ్యా చిరునవ్వు లో కొంత తేడా ఉంటుంది.
కార్తీక్ వి ప్రశాంతమైన ముఖకవళికలు అయితే సుధీర్ ది గంభీరమైన మొహం.
పరిశీలనగా చూసాడు సుధాకర్ వైపు. ఆరడుగుల ఎత్తు, నల్లటి రంగు, బుంగ మీసాలు, నుదుట పెద్ద బొట్టు, పళ్ళు నల్లగా కనపడుతున్నాయి. గుట్కా తింటాడేమో. అక్కడక్కడా కొన్ని పళ్ళు ఊడిపోయి కనపడుతున్నాయి.
ఇటువంటి వాళ్ళకి మరీ భక్తి ఎక్కువ.