Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 15

 

"తప్పుడు పనులు చేసి దేవుడి ముందుకి ఏ ధైర్యం తో వెళ్తారో" తరచుగా అనుకుంటాడు కార్తీక్. 

"అన్నా, రమ్మన్నారంట. కొత్త కాంట్రాక్టులు ఏమైనా ఉన్నాయా?" అడిగాడు సుధాకర్.

గొంతు సవరించుకుని అన్నాడు కార్తీక్.
"ఇదివరకు ఇచ్చిన కాంట్రాక్ట్ ల గురించి మాట్లాడటానికి పిలిచాను."

"అన్నీ అయిపోయాయి కదా" నమ్మకంగా చెప్పాడు సుధాకర్.

నవ్వొచ్చింది కార్తీక్ కి. ఏముంది అక్కడ అయిపోవడానికి. రోడ్లు వేసే ఆలోచనే లేనప్పుడు. కొన్ని చోట రోడ్డు కడిగి, కొన్ని చోట్ల దోశ వేసినట్లుగా పల్చటి రోడ్లు వేసి అయిందనిపించారు.

"మీరు వేసిన రోడ్లు నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవటం వల్ల మేము మాట పడాల్సి వస్తోంది. రాష్ట్రం మొత్తంగా నిరసలు ఎదుర్కొంటున్నామంటే ప్రధాన కారణం రోడ్లే." అతనేమంటాడా అని చూస్తూ క్షణం ఆగాడు.

"మీకు తెలియంది ఏముంది అన్నా." చేతులు నులుముకుంటూ అన్నాడు.

"అసలేం మెటీరియల్ వాడుతున్నావయ్యా? ఆసిడ్ ఏమైనా పోయిస్తున్నావా? అంతకు ముందు వేసిన రోడ్ల మీద మీరు రిపేర్లు చేస్తే అదివరకున్న రోడ్డు కూడా లేచిపోతున్నదంట." చిరాకుగా అన్నాడు కార్తీక్.

అదోలా చూసాడు సుధాకర్. ముసి ముసి నవ్వులు నవ్వుతూ అతని పార్టనర్స్ లో ఒకడు గొప్పగా చెప్పాడు.
"అన్న మెటీరియల్ అంతా చైనా నుంచి తెప్పిస్తాడు సార్. లోకల్ మెటీరియల్లో క్వాలిటీ ఉండదు."

"నేను మిమ్మల్ని పొగడట్లేదు" సీరియస్ గా అన్నాడు కార్తీక్.

"మిమ్మల్ని నమ్మి మీకు కాంట్రాక్టులు ఇస్తే ఇదా మీరు చేసే పని. మీ వల్ల రాష్ట్రం మొత్తంగా నా మీద వ్యతిరేకత ఏర్పడింది. రాబోయే ఎలక్షన్ లో మా పార్టీ ఓడిపోతే ఎవరు బాధ్యులు?" కోపంగా గొంతు పెంచుతూ అన్నాడు.

"నిన్ను ఓడిపోనిస్తామా అన్నా?" రోషంగా అన్నాడు సుధాకర్.

"ఎట్లా గెలిపిస్తావ్?" రెట్టించాడు కార్తీక్.

"డబ్బులు పంచుతామన్నా. రిగ్గింగ్ చేయిస్తాం. మనకు ఓట్ వెయ్యరనుకున్న వాళ్ళను పోలింగ్ బూత్ కి రాకుండా చేస్తాం. ఇట్లా చాలా పద్దతులు ఉన్నాయి కదా అన్నా."

పక్క వాళ్ళతో అన్నాడు.
"ఇవన్నీ అన్నకి తెలీవా? కావాలని మనల్ని పరీక్షిస్తున్నాడు."

అతని పార్టనర్స్ ఇద్దరూ చిలిపిగా నవ్వారు.

వొళ్ళు మండింది కార్తీక్ కి.

"పరీక్ష కాదు. సీరియస్ గానే చెప్తున్నా. మీకిచ్చిన కాంట్రాక్టులు అన్నీ చదివా. అందులో పెనాల్టీ క్లాజ్ ఉంది. దాని ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే, దాని వల్ల ఎవరైనా సాధారణ పౌరులకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగితే, కాంట్రాక్ట్ ప్రస్తుత విలువలో మీరు యాభయ్ శాతం పెనాల్టీ గా కట్టాలి. రుజువులు సృష్టించటానికి  నాకు పెద్ద  టైమ్ పట్టదని నీకు తెలిసే ఉండాలి" గట్టిగా అన్నాడు.

"ఇదేం అన్యాయం అన్నా?" నమ్మలేనట్లుగా మొహం పెట్టి అన్నాడు సుధాకర్.

"అన్యాయం కాదు. ఇదే న్యాయం. నువ్వు కట్టాల్సిన పెనాల్టీ ఎంతంటే..." ఒక తెల్ల కాగితం తీసుకుని రాసి చూపించాడు కార్తీక్.

ఆ సంఖ్య చూసి సుధాకర్ తెల్ల మొహం వేశాడు. అతని పార్టనర్స్ లో ఒకతను గుండె పట్టుకున్నాడు.

ఆఖరి ప్రయత్నంగా అడిగాడు సుధాకర్.

"నిజంగానే అంటున్నావా అన్నా?"

"నీతో నాకు జోకులేంటి? నిజమే. మరో వారం లో మీకు నోటీస్ లు అందుతాయి. రెడీ గా ఉండండి." ఖచ్చితంగా అన్నాడు కార్తీక్.

కోపంతో ఊగిపోతూ లేచాడు సుధాకర్.

"నేనొక్కడినే మింగానా ఆ నిధులన్నీ?నీకు సగం పైన ఇచ్చాను. కావాలంటే నీ పర్సెంటేజ్ కింద ఇచ్చిన డబ్బులు కట్టుకో పెనాల్టీ"

"నువ్వు నాకు వాటా ఇచ్చినట్లు ఏంటి ఆధారం?" రెట్టిస్తూ అన్నాడు కార్తీక్. 

కోపంగా ఉన్నప్పుడే నిజాలు బయటకు వస్తాయన్న సంగతి అతనికి తెలుసు.

"మదాలస పేరు మీదున్న నీ బినామీ ఆస్తుల విషయం, బిట్ కాయిన్స్ రూపాన నువ్వు డిజిటల్ గా దాచిన డబ్బు అంతా బయటకి లాగుతా!" అరవసాగాడు అతను.

విష్ణు వింతగా గమనిస్తున్నాడు. అతనికి ఆశ్చర్యంగా ఉంది ఇదంతా...

సుధాకర్ అరుపులకి సెక్యూరిటీ వాళ్ళు లోనికి తోసుకొచ్చారు. అతన్ని, అతడి తో పాటు వచ్చిన వాళ్ళను భుజాలు పట్టి తోసుకుంటూ బయటికి తీసుకెళ్లారు.

విష్ణు తేరుకుని చూసేసరికి కార్తీక్ ప్రశాంతంగా ఫైల్ తిరగేస్తున్నాడు.

"సార్, మీకేం భయం వెయ్యటం లేదా?" అడిగాడు విష్ణు అతణ్ని.

"భయం ఎందుకు? మనం చేసేది సరైనది అయినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు" అన్నాడు కార్తీక్.

"సార్, మరి...మరి...ఇవన్నీ మీ అమ్మగారు సుధీర్ సార్ కి చెప్పలేదా?" నసుగుతూ అన్నాడు విష్ణు.

కార్తీక్ మొహం చూసి మళ్ళీ తనే అన్నాడు. 

"ఆ టైమ్ కి సుధీర్ సార్ ఇంట్లో ఉండి ఉండకపోవచ్చు".

గట్టిగా నవ్వేశాడు కార్తీక్. 

"నువ్వు భలే వాడివోయ్. చాలా ఇంటరెస్టింగ్ కారక్టర్ వి"
 

 Previous Page Next Page