Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 13

 

"ఇప్పుడు నా కండిషన్...ఒక్క నెల మాత్రమే నేనిక్కడ ఉంటాను. అంత కంటే ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండే సమస్య లేదు. ఈ లోగా సుధీర్ తిరిగొస్తే అతనొచ్చిన వెంటనే వెళ్ళిపోతాను. ఈ లోగా అతన్ని మీరు తెచ్చుకుంటే మీకే మంచిది." ఖచ్చితంగా చెప్పాడు కార్తీక్.

"నువ్వు వచ్చినందుకు థాంక్యూ కార్తీక్.  నెల చాలు. అంత కంటే ఎక్కువ నిన్ను ఇబ్బంది పెట్టను." అంది బృంద

"విష్ణూ, నువ్వు వినకూడనంత రహస్యాలు మాట్లాడటం లేదు మేము. ఇంకాస్త ముందుకు వంగావంటే విరిగి కింద పడతావ్ జాగ్రత్త!." పక్కకి తిరిగి విష్ణు వైపు చూసి నవ్వుతూ అన్నాడు కార్తీక్.

"హి హి" బలవంతంగా నవ్వాడు విష్ణు.

ఇతని కంటే సుధీర్ బెటరేమో అనిపించింది విష్ణుకి. 

సుధీర్ కోపం వస్తే అరుస్తాడు. అతని అరుపుల వల్ల చుట్టూ ఉన్నవాళ్ళకి తన మీద సానుభూతి అన్నా కలుగుతుంది. ఇతను తనని ఎక్స్ పోజ్ చేసి అల్లరి చేసేట్లున్నాడు.

***

తమ ఇంట్లో ఒక గదిని కార్తీక్ ఉండటానికి ఏర్పాటు చేసింది బృంద.

మర్నాడు పొద్దున బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు కార్తీక్ తో అంది బృంద. 

"ఈ అవకాశాన్ని వాడుకుందామా?"

కనుబొమ్మలు ముడి వేసి అర్థం కానట్లు బృంద కేసి చూశాడు కార్తీక్.

"ప్రజలకి ఏదో చెయ్యాలనే ఆలోచన తో మా తాతగారు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంతో మార్పు ఉందనుకో. అయినా మన వైపు నుంచి ప్రస్తుతం నీకున్న పదవి ద్వారా ఏదైనా చేస్తే బాగుండునేమో అనిపిస్తోంది నాకు." అన్నది.

కొంచెం ఆగి మళ్లీ అన్నది.

"మొదట్లో సుధీర్ కూడా అలాగే ఆలోచించేవాడు. లేదా కనీసం అలా అలోచిస్తున్నట్లుగా నన్ను నమ్మించన్నా ఉంటాడు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పరిస్థితులు, చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల త్వరగా పొల్యుట్ అయిపోతారనుకుంట."

"కనీసం ఇప్పటికి అయినా సుధీర్ చేసిన తప్పులు సరిదిద్దే అవకాశం మనకొచ్చింది. ఈ ఛాన్స్ ని మనం వదులుకోకూడదు." అంది ఆఖరుగా.

నవ్వాడు కార్తీక్.

"నువ్వు కూడా అందరు ఆడవాళ్ళ లాగే మీ ఆయన తప్పుల్ని వేరే వాళ్ళ ఖాతా లో వేస్తున్నావన్న మాట. అయినా నేనుండేది నెల మాత్రమే అని గుర్తు పెట్టుకో. పైగా నేను తనలా నటిస్తున్నానని అర్థం అవగానే సుధీర్ వెనక్కి రావొచ్చు. అది ఒక్క వారంలో అవ్వొచ్చు. లేదా ఒక రోజులో  కావొచ్చు."

మళ్ళీ తనే అన్నాడు.

"ఈ లోగా మనకి చేతనైనంత చేద్దాం. ఎక్కడ మొదలెడదాం?"

బృంద మొహం వెలిగిపోయింది. 

***

సుధీర్ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ విష్ణు ద్వారా తప్పించుకున్నాడు కార్తీక్.

ఒక్కొక్కటి చదువుతుంటే అతనికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఒకటా, రెండా? ఇన్ని అరాచకాలా? ఒక మనిషి రాజకీయాల్లో ఉండాలంటే ఇంత దిగజారాలా?

అందులో సుధీర్ వే కాకుండా, అతని పార్టీ నుంచి గెలిచిన అనేకమందికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

ప్రభుత్వానికి చెందిన ప్రతి స్కీం లో స్కాం. అంతా ఒక కూటమి గా ఏర్పడి సంక్షేమ పథకాలు ఏవీ ప్రజల వరకూ పూర్తిగా వెళ్లకుండా మధ్యలో సగం స్వాహా చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన ప్రతి కంపెనీ నుంచి వాళ్ళు చేసిన వసూళ్లు, కాంట్రాక్టర్ ల నుంచి ముట్టజెప్పబడ్డ సొమ్ము వివరాలున్నాయి. 

ఇవి ఒక ఎత్తయితే వాళ్ల ఘనకార్యాలు మరో ఎత్తు. వాళ్ళు చంపించిన వాళ్ల వివరాలు, చావడానికి ప్రేరేపించేలా సంఘటనలు సృష్టించటం సవివరంగా రాసి ఉన్నాయి. ఇక ఆడవాళ్ళ మీద, తమ కంటే తక్కువ స్థాయి లో ఉన్న వాళ్ల మీద వాళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించిన చిట్టా కట్టలు కట్టలు గా ఉంది.

"ఇవేమన్నా సర్టిఫికేట్లు అనుకుంటున్నారా? ఫైల్ చేసి పెట్టుకున్నారు. ఈ పనులు చేసినందుకు సిగ్గుతో తల దించుకోవాలి. ఈ ఫైల్ ఎవరికన్నా దొరికితే ఏమవుతుందో తెలుసా?" విష్ణు ని అడిగాడు కార్తీక్.

"మనం చేసిన ఫైల్ కాదండీ. వాల్మీకి అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. వాడు తయారు చేసి పెట్టుకున్న ఫైల్ ఇది. కొట్టుకొచ్చేశాం." ఆనందంతో కళ్ళు మెరుస్తుండగా చెప్పాడు విష్ణు.

"సిగ్గు లేదా ఆ మాట చెప్పటానికి? మీకు పవర్ ఉన్నది ఇటువంటి దొంగ పనులు చేయటానికా?" కోపం ఆగట్లేదు కార్తీక్ కి.

"అంతా తొండి. మేము చేసి పెట్టుకున్నామని మొదట తిట్టాడు. ఇప్పుడు వేరే వాళ్ళు చేసిందన్నా తిడుతున్నాడు. ఇతని కంటే ఇతని అన్నే నయం" మనసులో అనుకున్నాడు విష్ణు.

పైకి మాత్రం వినయంగా తల దించుకుని నిలబడ్డాడు కాసేపు. తర్వాత చెప్పటం మొదలెట్టాడు.

"రాజకీయాల్లో ఇవన్నీ తప్పవు సార్. వాల్మీకి అనవసరంగా ఇంత కష్టపడ్డాడు కానీ ప్రజలకి కూడా చూచాయగా అన్నీ తెలిసే ఉంటాయి. అయినా మాకేమీ కాలేదు కదా, మా వరకూ రాదులే అన్న అభిప్రాయం తో ఓట్లు వేస్తుంటారు."

కుతూహలంగా వింటున్నాడు కార్తీక్.

"అంతా సజావుగా జరుగుతున్నదనుకుంటుండగా సడెన్ గా ఏదో విషయం వల్ల జనాల్లో ఎక్కడో ఏవగింపు మొదలవుతుంది.  అప్పటి నుంచీ ఆ పార్టీకి పతనం ప్రారంభమవుతుంది. ప్రజలు మీరు అనుకుంటున్నంత అమాయకులు కాదు సార్. వాళ్ళు రాజకీయ నాయకులతో తోలుబొమ్మలాట ఆడతారు"

"ఎటువంటి విషయాల వల్ల వ్యతిరేకత మొదలవుతుందంటావ్?" అడిగాడు కార్తీక్.
 

 Previous Page Next Page