హాల్లోనే సోఫాల్లో కూర్చున్నారు లోపల్నుంచీ నోరూరించే మషాలా వాసనలు.
అప్పుడు గుర్తుకొచ్చింది.
పొద్దున్నుంచి భోజనం లేదు. అంతకు ముందు రోజు కూడా కేవలము ఫలహారాల మీద గడిపేశాడు.
కొంచెం అన్నం పప్పు వేసుకుని తినాలనిపిస్తోంది. కానీ ఎవరు పెడతారు? ఈ రోజులో 'టీ' కూడా కేవలం తమకు అవసరం ఉన్న వారికే ఇస్తున్నారు.
సిద్దార్దగాడు ఓ ప్లేట్ నిండా బజ్జీలు తీసుకొచ్చి తింటూ ఎదురుగ్గా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. బజ్జీలు చూస్తుంటే ఆకలి మరింత విజ్రుంభించింది.
శిరీష వాళ్ళింట్లో ఆ పెళ్ళి చూపుల టిఫిన్ తినేసినా ఇప్పుడిలా కళ్ళు తిరిగేవి కావు తినకముందే గొడవయి పోయింది.
పింకీ పుస్తకాల బాగ్ లో వున్న కాడ్ బరీస్ తీసుకుని నములుతోంది.
బాగ్ లోనుంచి తనే ఓ పుస్తకం లాగాడు.
అది సైన్స్ టెక్ట్స్.
'చెప్పు పింకీ! న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్."
"ఫర్ ఎవ్విర్ యాక్షన్ దేరీజ్ యాక్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ "
"అది ఫస్ట్ లా కాదు."
"కాపోతే పోనీ! నాకు సైన్స్ లో మంచి మార్క్స్ వస్తాయ్ లే గానీ దీనికి సమాధానం చెప్పు! ఫ్రంట్ లెస్, సైడ్ లెస్, బాక్ లెస్, ఈవెనింగ్ గౌన్ అంటే ఎలా వుంటుంది?" కవ్వింపు ------
"బెల్ట్ లాగుంటుంది "
ఆమె తప్పట్లు కొట్టింది.
"వాటీజ్ కిస్?"
"అప్లికేషన్ ఫర్ బెటర్ పొజిషన్."
మళ్ళీ తప్పట్లు ----
సిద్దార్ధ కోపంగా చూస్తున్నాడు.
"సాలె! క్యోం అయార్ తుమ్?" చటుక్కున లేచి వెళ్ళి క్రికెట్ బాట్ తీసుకొచ్చాడు కొట్టటానికి .
"ఏయ్ సిద్దార్ధా! కొట్టకూడదు సార్ ని!"
"సార్ గాదు! సాలె గాడు !"
"మమ్మీతో చెపుతా!"
'చెప్పుకోవే బ్లడీ బిచ్--"
"మమ్మీ" అంటూ కంప్లెయింట్ చేయడానికి లోపలి కెళ్ళింది పింకీ.
"సాలే బయటకు పోతావా లేదా?"
వాడిని సెట్ రైట్ చేయడానికి ఇదే మంచి అవకాశం.
ఎవ్వరూ లేని సమయంలోనే మళ్ళీ మళ్ళీ తన జోలికి రాకుండా బుద్ది చెప్పాలి.
బాట్ తో లాగి కొట్టాడు వాడు.
రడీగా ఉండటం వల్ల పక్కకు తప్పుకుని ఒక్క తన్ను తన్నాడు వాడిని.
వెళ్లి సోఫాకు కొట్టుకుని కిందపడ్డాడు బిగ్గరగా ఏడుస్తూ. తల పగిలి ఉంటుంది . సోఫాలో ఉన్న వాడి ప్లేట్లో బజ్జీలు రెండు తీసుకుని కాలుతున్నా త్వరత్వరగా నమిలి తినేశాడు. ఇంతకంటే అవకాశం దొరకదు.
వాడి గావుకేకలకు కమలాదేవి పరుగెత్తుకొచ్చింది.
నోట్లో మిగిలిన బజ్జీలను నమలకుండానే మింగేయాల్సి వచ్చింది.
"ఏమిటి? ఏం జరిగింది?" వాడిని ఆత్రుతగా కింద నుంచి లేవ నేత్తుతూ అడుగుతోంది.
"పింకీని బాట్ పెట్టి కొట్టబోతే 'తప్పమ్మా' అన్నాను , అందుకని కోపం వచ్చి బాట్ విసిరికొట్టి అరుస్తున్నాడు.
"అంతా అబద్దం ! ఈ సాలే గాడు నన్ను తన్నాడు."
"అబద్దం మమ్మీ! తన్నలే" పింకీ తనను సపోర్ట్ చేసింది.
"బ్లడీ బిచ్! తన్నలేదా? నువ్ చూశావా?" పింకీని తిట్టాడు వాడు.
కమలాదేవి వాడిని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది.
"నువ్ టీవి చూద్దువు గాని పద!"
"తెరీమాకి నేన్రాను-"
"మా బంగారు తండ్రి కదో౧ నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను."
"పోవే ముండా! నేన్రాను."
"నీకు అయిదు రూపాయలిస్తాను పద."
"నాకు ఇరవై రూపాయలివ్వు."
'సరే పద"
వాడిని తీసుకెళ్ళింది లోపలకు .
పింకీ సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుంది.
"ఇంకేం చెప్తావో చెప్పు?" మోచేతుల కాలి మీద ఆన్చి చుబుకం కింద చేయి పెట్టుకుని అరిందలా అడిగింది.
"సార్ ఎదురుగ్గా అలా కూర్చోవచ్చా? కాలు కింద పెట్టు ."
"డోంటాక్ ట్రాష్ యార్! నీ ఏజ్ ఎంత --- అమ్మమ్మలా మాట్లాడుతున్నావ్ --- నువ్వెప్పుడయినా స్టార్ టి.వి. చూసావా?"
'చూళ్ళేదు."
"అందుకే అలా పరేషానవుతున్నావ్! ఒక్కదినం యమ్ టివి సూబిస్తా నా రూమ్ లో ! వస్తావా?"
"ఒ౧ వస్తా! - ఇంక వెళ్ళిరానా మరి ఇవాల్టికి?" శ్రీహరి రాకముందే బయటపడక పొతే ప్రమాదం !
"అప్పుడేనా? అది సరేగాని శ్రీదేవికి అనిల్ కపూర్ కి ఏమయినా ఎఫయిర్ నడుస్తోందా?"
సురేష్ ప్రతి ప్రశ్నా ఓ పిడుగులా తగులుతోంది.
"ఏమో తెలీదు. ఫోన్ లో అడిగి చెప్తాను --"
ఆమె నవ్వేసింది.
"నీ స్టాండర్ద్ ఇంతెం ఉంటుందని ముందే అనుకున్నాంలే----"
తనను ఫూల్ ను చేసి ఆడుకుంటోంది.
"నీకు గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారా?"
"నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా?" ఆమెను కంగారు పెట్టట్టానికి అడిగాడు.
"ఇద్దరు -"
తనే కంగారు పడాల్సి వచ్చింది.
"ఇద్దరా?"
"అవును! ఒకరు స్కూల్లో! ఒకరు బయట --"
కమలాదేవి 'టీ' తీసుకొచ్చింది.
సిద్దార్ధ కూడా వెనకే వచ్చి నిలబడ్డాడు.
"సాలె! తేరేకో దెభ్ లేతూం --" అంటున్నాడు నెమ్మదిగా.
"టీ' తాగి బయట పడ్డాడు.
టెర్రేస్ మీద బాగా వేడిగా వుంది.
దానికి తోడు ఆకలి! బజ్జీలు ఏ మూలకు పోయాయో తెలీదు. ఆకలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మంచినీళ్ళు పుల్ గా తాగేయటం అలవాటే !
వళ్ళంతా ఎండ వేడికి అలుముకున్న చిరాకు ---
స్నానం చేస్తే బావుంటుంది గానీ శ్రీదేవి దాని కూడా కండిషన్ పెట్టింది. ఉదయం అయిదు గంటలలోపలే తను స్నానం చేయాలి. ఫ్లాట్స్ లో ఆడాళ్ళు సాయింత్రాలు టెర్రేస్ మీద విహరించే అవకాశం ఉంది గనుక ఆ సమయంలో స్నానం చేయటం బాన్!
ఆ వేడిలోనే టాంక్ కింద దూరి పడుకున్నాడు.