Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 15

 

    ఎప్పుడు నిద్రపట్టిందో గాని తిరిగి మెలకువ వచ్చేసరికి వెన్నెల పూర్తిగా అలుముకుని ఉంది. టైమెంతయిందో తెలీటం లేదు.
    లేచి రెండు వాటర్ టాంక్ ల మధ్య నుంచి పిట్టగోడ దగ్గరకు నడిచి ప్లాట్ నెంబర్ 501 వేపు చూశాడు.
    మేరీ పుండరీకక్షయ్య నైటీ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర ఖద్దరు వాలాతో విందులో ఉంది.
    ఆ విందు చూడగానే ఆకలి గుర్తుకొచ్చింది.
    టి.వి. లో లెదర్ రిపోర్ట్ అవగానే మనదేశంలోని లెదర్ ఇండస్ట్రీ గురించి రిపోర్ట్ మొదలయింది.
    అంటే పది అయినట్లే -- ఇంకెవరూ టెర్రస్ మీదకు రారు -- కనుక తను దొంగతనంగా స్నానం చేసేయవచ్చు . ఈ విషయం శ్రీదేవికి తెలిసే అవకాశం లేదు ---
    బకెట్ తీసుకెళ్ళి ఓ టాంక్ వెనుక నిలబడి స్నానం చేయటం ప్రారంభించాడు. వెన్నెల్లో అలా చల్లని నీళ్ళతో స్నానం చేస్తుంటే ఏంతో ఆహ్లాదంగా వుంది.
    హటాత్తుగా అడుగుల చప్పుడు.
    "ఎవరది/ స్నానం చేస్తున్నాను వెళ్ళిపొండి" అని అరచే లోపలే కుమిదిని దగ్గరకు రావటం తనను చూసి కెవ్వుమని కేకవేసి మెట్ల వేపు పరుగెత్తటం క్షణాల్లో జరిగిపోయింది.
    సురేష్ గుండెలవిశిపోయినాయ్.
    ఎవరయినా ఆ కేక వింటే ఏమనుకుంటారు ?
    "ఎవరది? ఏం జరిగింది?" మెట్లెక్కుతూ వస్తోన్న శ్రీదేవి గొంతు "
    కొంపమునిగిపోవడానికి సిద్దంగా వుంది.
    తన సీక్రెట్ స్నానం కాస్తా బయటపడిపోతోంది.
    టవల్ చుట్టుకుని రెండడుగులు వేశాడు లేదో శ్రీదేవి హడావుడిగా టార్చ్ లైట్ తో వచ్చి తనవతారం చూసి తనూ కెవ్వుమని అరచి పరుగెత్తబోయింది.
    "శ్రీదేవి మేడమ్! నేనే మేడమ్! సురేష్ ని !"
    అప్పటికి ధైర్యం వచ్చిందామేకి.
    "నువ్వా! ఏమిటీ అవతారం? స్నానం చేస్తున్నావ్ కదూ?" కోపంగా అడిగిందామె.
    'అహహ౧ స్నానం కాదండీ! స్నానం లాంటిది! అంటే బాడీ క్లినింగ్ అన్నమాట. క్లినింగ్ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్! స్పాంజ్ ని తడిపి నీటిని పిండి వంటి మీద రుద్దవలెను --"
    "పిచ్చి మాటలు మాట్లాడకు! నువ్ తెల్లారుజామున అయిదు లోపల స్నానం చేయాలని ఇప్పటికి రెండు సార్లు వార్నింగిచ్చాను."
    "ఆఫ్ కోర్స్! ఇచ్చారండీ ! కానీ ఇది స్నానం కాదు కదండీ! బాడీ క్లినింగ్ అంటారు అంటే స్పాంజ్ ని చన్నీటిలో తడిపి కొంచెముగా పిండి అటు పిమ్మట --"
    శ్రీడివి కోపం కుమిదిని మీదకు మళ్ళింది.
    "అయినా రాత్రి పది దాటాక టెర్రేస్ మీద నీకేం పనుందని వచ్చావ్?" అనుమానంగా అడిగింది.
    ఆ ప్రశ్నతో కుమిదిని గాబరాపడిపోయింది.
    ఇదే అవకాశం - తను స్నానం టాపిక్ ని డైవర్ట్ చేసి కుమిదిని ని చావుదెబ్బ కొట్టటానికి.
    'భలే అడిగారండీ! నేనూ అదే అదుగుదామనుకుంటున్నా పరాయి పురుషుడొకడు టెర్రేస్ మీడున్నాడని తెలిసీ అర్దారాత్రి అక్కడ కెందుకొచ్చినట్లండీ! సర్వెంట్ అన్న తరువాత సర్వెంట్ లాగుండాలి గానీ ఇలాంటి వేషాలేస్తే ఎలా?"
    కుమిదిని కోపంగా చూస్తోంది తనవంక -- ఏమీ మాట్లాడలేక పోతోంది.
    "నీ సంగతి మేరీతో చెప్తానుండు! వయసులో ఉన్న సర్వెంట్ మేయిడ్స్ ని పెట్టుకున్నప్పుడు కొంచెం కనిపెట్టి ఉండాలి!"
    కుమిదిని కిందకు దిగిపోయింది మౌనంగా --
    దిగుతున్నప్పుడు మెట్ల మీద కాంతిని ప్రసరిస్తోన్న జీరో వాట్ బల్బ్ కాంతిలో ఆమె కళ్ళల్లో కన్నీరు తళుక్కుమన్నట్లు అనుమానం -
    'ఇంకోసారిలా పిచ్చిపనులు చేశావంటే ఈ బిల్డింగ్ వెంటనే ఖాళీ చేయిస్తాను! జాగ్రత్త!"
    తనక్కూడా వార్నింగిచ్చి వెళ్ళిపోయింది శ్రీదేవి.
    హమ్మయ్య! గండం గడిచింది . అసలీ గొడవంతా కుమిదిని వల్లే జరిగింది.
    కుమిదిని అలా గావుకేక పెట్టకుండా ఉంటె శ్రీదేవికి తన దొంగ స్నానం సంగతి తెలిసేది కాదు.
    త్వరగా డ్రస్ చేసుకుంటుంటే తన నివాసం పక్కనే కనిపించిందో పాకెట్! వెన్నెల్లో కి తీసుకెళ్ళి చూశాడు.
    లోపల్నుంచీ నోరూరించే మషాలా వాసనలు వస్తున్నాయ్.
    చప్పున పాకెట్ విప్పాడు. లోపల విస్తర్లో బిరియానీ కనిపించింది.
    అంతవరకూ తను అతికష్టం మీద అణచి ఉంచిన ఆకలి ఒక్కసారిగా చెలరేగిపోయింది. ఆత్రుతగా ఆశగా, ఆకలిగా తినేయటం ప్రారంభించాడు.
    చాలా రుచికరంగా వుంది. ఇంత అద్భుతంగా ఎవరు చేసి ఉంటారు?
    కడుపు నిండిపోయింది.
    పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
    హటాత్తుగా అప్పుడు కలిగిందా ఆలోచన.
    ఎవరు తెచ్చారీ పాకెట్? ఎవరు తీసుకొచ్చి ఉంచారక్కడ? ఎవరికి తనంటే అంత అభిమానం వుంది? తనింత ఆకలితో మాడిపోతున్నాడని ఎవరికి తెలుసు?
    సడెన్ గా గుర్తుకొచ్చింది.
    అది తప్పకుండా కుమిదిని పనే అయుంటుంది.
    అదివరక్కూడా తను ఒసారిలాగే నాలుగు రోజులు పస్తులుండి మేట్లేక్కలేక ఎక్కలేక మధ్యలో కళ్ళు తిరిగి కూలబడిపొతే ---- తనకు వెంటనే 'టీ' తెచ్చిచ్చి ఆ రాత్రి ఓ ప్లేట్లో భోజనం తెచ్చిచ్చింది.
    అంత గొప్ప మనసేవరికుంటుంది?
    అప్పుడు అర్ధమయిందంతా!
    తను రెండ్రోజుల్నుంచీ పస్తులున్న విషయం కుమిదినికి తెలిసి ఉంటుంది. అందుకే మేరీ ఇంట్లో ఆమెకు కేటాయించిన భోజనంలో కొంతభాగం తనకోసం రహస్యంగా తీసుకొచ్చింది.
    సురేష్ గిల్టీగా ఫీలయ్యాడు.
    తన మీద అంత అభిమానం ఉన్న కుమిదిని మీద తను స్వార్ధముతో ఓ అభాండం వేశాడు.
    మరి కుమిదినికి తెల్లారితే మొఖం ఎలా చూపించటం?
    ఆ రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు.
    మొదటిసారి ఓ తప్పు చేశాడు.
    తెల్లారుతొండగా నిద్రపట్టింది గానీ ఫోర్ నాట్ త్రీ లోని నాగలక్ష్మి డాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించడంతో ఆ గజ్జెల చప్పుడికి మెలకువ వచ్చేసింది.
    ఆ అమ్మాయికి తెల్లారుజామున టెర్రేస్ మీద డాన్స్ ప్రాక్టీస్ చేయటం అలవాటు దాని వల్ల తన నిద్ర చాలాసార్లు పాడయిపోయింది .
    లేచి కళ్ళు నలుపుకుంటూటాంక్ కింద నుంచి బయటి కొచ్చి కూర్చున్నాడు.
    నాగలక్ష్మి టేప్ రికార్డర్ పెట్టుకుని అద్భుతంగా శరీరాన్ని వంపులు తెప్పుతోంది లయబద్దంగా.
    "గుడ్ మాణింగ్!"
    అదిరిపడి డాన్స్ ఆపేసింది.
    "నువ్వా?"
    "మీ గజ్జెల చప్పుడికి మెలకువ వచ్చేసింది. పడుకునే చూశాను మీరీ యాంగిల్స్ ఇప్పుడు మొదట్లో కంటే చాలా ఇంప్రూవ్ అయాయ్.
    "మొన్న నా డాన్స్ ప్రోగ్రాం కొచ్చిన సినిమా డైరెక్టర్ కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. నెక్ట్స్ పిక్చర్ లో చాన్స్ ఇస్తానన్నాడు ఉత్సాహంగా చెప్పిందామె.

 Previous Page Next Page