ఆ ఇంట్లోనూ అవి ఉన్నాయి. వంట మనిషి ప్లేట్ లో కేక్ పళ్ళూ తెచ్చి పెట్టింది. జానీ చెల్లెలు ఆపిల్ జ్యూస్ కలిపి తీసుకొచ్చింది.
జానీ తల్లి మాటలాడటం మొదలుపెట్టింది.
"జానీ గురించి నేను నీకేం చెప్పనవసరం లేదు. నీకే తెలుసు. నువ్వు నమ్మగలవో లేదోగానీ అమ్మాయిలే వీడిని ఇంటిపట్టున ఉండనియ్యరు. సైతానుల్లాగ వీడిని టెంప్ట్ చేస్తారు. ఏం అమ్మాయిలో ఏం లోకమో! ఒక పూట కారు షికారూ. హోటల్లో డిన్నరు చాలు. వీళ్లకి!
వారంరోజులు నేను ఉపవాసం చేసి మేరీ మాతని ప్రార్థిస్తూ కూర్చున్నాను. పైకి అలా కనిపిస్తాడు కానీ వాడిది చాలా మెత్తని మనసు.
కన్నీళ్లతోనా ముందు మోకరించాడు. మేరీమాత ముందు మోకరించి ఇంకెప్పుడూ అమ్మాయిలతో తిరగనని ప్రమాణం చేశాడు. పాపం! రెండురోజులు కాలేజీనుండి తిన్నగా ఇంటికే వచ్చాడు."
"ఇంక అమ్మాయిలు ఫోన్లు చేశారూ. మాకే విసుగొచ్చేసింది. బొత్తిగా సిగ్గూ లజ్జాలేదు. ఒకరిద్దరు మహాతల్లులు నేరుగా ఇంటికే వచ్చేశారు. వాడు మళ్ళీ ఆ ధోరణిలో పడిపోయాడు. నేనేం చెయ్యగలను? వాడిని ఈ కూపంలోంచి రక్షించే దేవతని చూపించమని మేరీమాతను ప్రార్థించాను. కానీ... పోనీలే! రెండుమాటలు చెపుతాను నమ్మితే నమ్ము. వాడు మాట ఇస్తే తప్పడు. నువ్వు పెళ్ళిచేసుకుంటే ఇక ముందు అమ్మాయిలతో తిరగనన్నాడు."
ఆవిడను చూస్తే యశోదకి చాలా జాలి కలిగింది. కొడుకుని ఒక దారిలో పెట్టుకోవాలని ఆవిడ చాలా తాపత్రయపడుతుంది.
"నేను మీ మాటలను నమ్ముతున్నాను..." సిన్సియర్ గా అంది... ఆవిడ మొహం వెలిగింది.
"అయితే....... అయితే......." తడుముకుంటూ ఆగిపోయింది.
"నేను జానీని పెళ్ళి చేసుకోలేను. అందుకు కారణం అతడు అమ్మాయిలతో తిరగడం కాదు. నేను మరొకరిని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను."
ఆవిడ మొహం నల్లబడిపోయింది. క్షణంలో తేరుకుంది.
"మంచిదమ్మా! ప్రభువు నిన్ను చల్లగా చూస్తాడు." అంది ఆ తరువాత ఏం మాట్లాడాలో ఆమెకు తోచలేదు. నవ్వు తెచ్చి పెట్టుకుని ముఖానికి పులుముకుంది.
అప్పుడు వచ్చాడు జానీ. ఎక్కడి నుంచో! ఇంగ్లీష్ పాట వింటూ విజిల్ వేసుకుంటూ వస్తున్న అతడు యశోదను చూసి బొమ్మలా నిలబడిపోయాడు.
"మీరు.... ఇక్కడ....?" అన్నాడు. అతని ఆశ్చర్యం చాలా జెన్యూన్ గా ఉంది. తనరాక విషయం అతడికి ఏమి తెలియదని నమ్మకం కలిగింది.
"మీ అమ్మగారు నన్ను చూస్తానంటే వచ్చాను. మీ సిస్టర్ తో వచ్చాను..."
"ఓ!...." దీర్ఘం తీశాడు జానీ.
"మమ్మీ నాకీ విషయం ముందుగా చెప్పి ఉంటే మీకీ శ్రమ కలగనిచ్చే వాడినికాను."
"ఫర్వాలేదు. ఈమె గారిని కలుసుకుని మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది."
"థాంక్యూ. యశోదా" ఆప్యాయంగా అంది. తన కోరిక తిరస్కరించిందన్నబాధ గానీ, నిష్టూరం గానీ ఆ గొంతులో లేవు.
"నేను వెళ్ళొస్తాను" లేచింది యశోద.
"నేను డ్రాప్ చేస్తాను" అన్నాడు జానీ.
సంకోచించింది యశోద.
"మేడమ్! మీరు ఎప్పుడైతే నన్ను పెళ్ళి చేసుకోనని స్పష్టంగా చెప్పారో అప్పట్నుండీ మీరు నాకు ఒట్టి స్నేహితులు అంతే. మీరు నిశ్చింతగానాకారులో కూర్చోవచ్చు."
నవ్వి అతడి పక్కన కూర్చుంది.... రెండు కళ్ళు తనను తీక్షణంగా చూడటం యశోద గమనించలేదు.
* * *
పార్వతి, దక్షిణామూర్తి, యశోద, వివేక్ నలుగురూ కేన్ ఛెయిర్ లో కూర్చున్నారు. దక్షిణామూర్తి ఇంట్లో ఎవరూ మాట్లాడటంలేదు. పార్వతి, మూర్తి ఆ ఇద్దరి మనసులూ అప్రసన్నంగానే ఉన్నాయి. వివేక్ రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకుంటాననటం ఇద్దరికీ నచ్చలేదు.
యశోద తటస్తంగా కూచుంది. వివేక్ మనసులో ఏముందో ఊహించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె మనసులో ఏవో సందేహాలు దోబూచులాడుతున్నాయి.
కానీ వివేక్ ప్రేమలో ఆమెకి నమ్మకం ఉంది.
"బాబూ! ఒక్కగానొక్క కూతురు! లక్షణంగా పెళ్ళిచేసుకోక...."
నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ప్రారంభించింది పార్వతి.
"అత్తయ్యా! ఎన్నో విషయాల్లో ఆధునికంగా ఉన్నామనుకుంటాం. ఎక్కడో పాతవాసనలు వదలవు. నిజం చెప్పండి! పురోహితుడి మంత్రాలు వినే వాళ్ళు పెళ్ళిలో ఎవరైనా ఉన్నారా? అసలు పురోహితుడైనా వేదోక్తంగా మంత్రాలు చదివి హోమాలు చేస్తున్నాడా? అర్థంపర్థం లేని ఈ తంతుకంటే అందరికీ అర్ధమయ్యే అచ్చ తెలుగులో పరస్పరం వాగ్ధానాలు చేసుకుని చట్టబద్ధంగా రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకోవటం చాలా మేలు కదూ"
"కానీ అచ్చట. ముచ్చట లేకుండా..."
"ముచ్చటలకేం? పెళ్ళి అయిపోయిన తర్వాత గ్రాండ్ గా పార్టీ ఇచ్చుకోండి."
"అందుకు అభ్యంతరం లేదా?"
"ఎంతమాత్రం లేదు.....!"
పార్వతి మనసు స్థిమిత పడింది. రిజిస్టర్డ్ మేరేజ్ అనగానే ఈనాటికి అనేకమందిలో తలెత్తే సందేహాలే పార్వతి మనసులో గందరగోళాన్ని సృష్టించాయి. పార్టీకి ఒప్పుకోవడంతో అనుమానాలు పోయాయి....
దక్షిణామూర్తి కూడా రాజీ పడిపోయాడు. కాబోయే అల్లుడికి మర్యాద చెయ్యడం కోసం స్వీట్స్ కొనడానికి మూర్తి బజారు కెళ్ళాడు. పార్వతి వంటింట్లోకి వెళ్ళింది. సమయం చూసుకుని అడిగింది యశోద.
"ఇప్పుడు చెప్పండి! రిజిస్టర్ మేరేజ్ దేనికీ?"
"చెప్పానుగా! మనకు నమ్మకంలేని...."
"అదంతా అమ్మకి! నాకు చెప్పండి సమాధానం!" నవ్వాడు.
"ఇందుకే నేను నిన్నే పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను!"
"ఇందుకే అంటే?"
"ఏ విషయమైనా అర్థం చేసుకోగలిగే సూక్ష్మ గ్రహిత్వం! ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగే నిబ్బరం."