"లేవను! మిమ్మల్ని యిప్పుడు అక్కడికి వెళ్ళనివ్వను" అంది అంబిక పట్టుపట్టింది అంటే ఆ పట్టు విడవదు.
"నామీద నీ పెత్తనం ఏమిటి!" అంటూ ఆమె చెయ్యిపట్టి పక్కకు లాగేయబోయాడు.
అంతే! ఆమెకు కోపం ముంచుకు వచ్చేసింది. భర్తచేతిని విసురుగా నెట్టేసింది.
జయరాంకి కోపం ముంచుకు వచ్చేసింది.
ఆపుకోలేని కోపంతో అతని చెయ్యి పైకిలేచింది. అంతే అంబిక చెంప ఛెళ్ళుమంది.
ఒక్కక్షణం నివ్వెరపోయినట్టయి అలా వుండిపోయి మరుక్షణంలో తేరుకుని భర్త చేతిని చటుక్కున అందుకని బలమంతా కూడదీసుకుని శక్తి కొద్దీ అతన్ని సోఫావేపుకి నెట్టేసింది.
అతనలా ఊహించుకోలేదేమో ఆమె తోసిన తోపుకి వెళ్ళి సోఫాలో కూలబడిపోయినట్టుగా కూర్చుండిపోయాడు.
మరుక్షణం తేరుకుని ఒళ్ళు తెలియని కోపంతో ఒక్క ఉదుటన లేచాడు.
ఈలోగా అంబిక మెరుపులా బయటకు పరుగెత్తి గది తలుపులు దగ్గరకు లాగేసి బయట గడియవేసింది.
తలుపుతీస్తావా! తియ్యవా! అంటూ భార్యపైన గట్టిగా కేకలువేస్తూ కాలితో తలుపుపై గట్టిగా యిల్లదరిపోయేంత శబ్దం వచ్చేటట్టు తన్నటం మొదలుపెట్టాడు.
అంబిక ఏ మాత్రం తొణక్కుండ ఒక్కమాట కూడా మాట్లాడకుండా చేతులు కట్టుకుని నిలబడింది.
ఈ గొడవకి గణేష్ రావుగారు సుభద్రమ్మ ఇంద్రసేన ఏమిటి? ఏమిటి? అంటూ ఆ గది దగ్గరకు వచ్చేశారు.
* * *
వాళ్ళు అలా అడుగుతుంటే యేమాత్రం తొణక్కుండా చెప్పింది వాళ్ళకి.
"మీ అబ్బాయికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ, పిల్లలని కనిపెంచగానే సరికాదు వాళ్ళని క్రమశిక్షణతో తీర్చి దిద్దటం ముఖ్యం. మీరు ఆయనకి అతి గారాబం చేసి ఆ మాట మర్చిపోయారు. ఇప్పుడు ఆయన మొండిగా తయారయ్యారు. క్రమశిక్షణలో తీర్చిదిద్దాలన్న మాట మీరు మర్చిపోయినా భార్యగా ఆయన్ని మంచి మార్గంలో పెట్టి తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకు వుంది. అందుకే ఇప్పుడు నేను ఆయనకంటే మొండిగా తయారయ్యాను, వర్కర్స్ కి ఎదురు నిలిచి నిలబడటం అంత సులభం కాదు. వాళ్ళు కష్టజీవులు డిగ్రీలతో వాళ్ళు డబ్బులు సంపాదించటం లేదు. చెమటోడ్చి కష్టపడి రక్తాన్ని ధారబోస్తున్నారు. మనం మంచిగా వుంటే ఆ శ్రమజీవులు ప్రాణం ఇస్తారు. మనం వారిపట్ల కఠినంగా ప్రవర్తిస్తే యేమాత్రం వెనకాడకుండా మన ప్రాణాన్ని తీస్తారు వాళ్ళు. ఈ లోకానికి సంఘానికి చట్టానికి ఎవ్వరికి జడవరు. వాళ్ళకి కావలసింది హోదా పరువు మర్యాదా కాదు. వాళ్ళకి కావలసింది పట్టెడు అన్నం. ఆ పట్టెడు అన్నం కోసం గంజి నీళ్ళకోసం వాళ్ళు పోరాడుతారు. కాలుతున్న కడుపులమీద మండుతున్న గుండెలమీద కొట్టడం మన పెద్దింటివాళ్ళ లక్షణంకాదు" అంది ఆవేశంగా.
అంబిక అన్యాయాల్ని సహించలేదు. కళ్ళతో చూస్తూ ఊరుకోలేదు. ఆమె తత్వమే అంత.
భర్తచేసే కొన్ని మావగారుచేసే కొన్ని పనులు ఆమెకు అసలు నచ్చటంలేదు.
వాళ్ళందర్ని పూర్తిగా మార్చేయాలని ఆమె పట్టుదల. కోడలి ఆవేశం చూస్తూనే గణేష్ రావు, సుభద్రమ్మ ముఖముఖాలు చూసుకున్నారు.
గణేష్ రావుగారికి ఒళ్ళు అంతా చెమట పట్టేసినట్టు అయిపోయింది.
ఇంత ఖచ్చితంగా ఇంత దర్జాగా చెప్తుంది. అంటే అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, తెలివయిన అమ్మాయి అని అనుకోక తప్పదు.
ఇలాంటి అమ్మాయి కోడలిగా యింటికి వచ్చింది అంటే ముందు ముందుకి మంచి అవుతుందా! లేక!
ఆయన గాబరాగా చూస్తూ ఆలోచనల్లో పడిపోయారు.
ఆయనలా సుభద్రమ్మ గాబరా పడిపోలేదు.
శాంతంగా ఒక్కక్షణం ఆలోచించి తలతిప్పి కోడలివైపు చూసింది.
ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆలోచన గొప్ప మనసు ఇచ్చాడు ఆ భగవంతుడు ఈ అమ్మాయికి. అంబికను చూడగానే తను అనుకుంది ఆమె తన కోడలు కావాలని.
ఆమె ఈ ఇంటికి కోడలిగా వస్తే యిల్లు యింటితోపాటు మనుష్యులు కూడా మారిపోతారని.
తను అనుకున్నట్లుగానే ఆమె ఈ యింటికి రాగానే ఆ విషయాన్నే అమల్లో పెడుతుంది ముందుగా.
ఇంతకంటే ఆనందం తనకి ఏముంటుంది!
సుభద్రమ్మ కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. పెదవులమీద చిరునవ్వు మెరిసింది.
ఇంద్రసేన మాత్రం ఆమెవైపు కోపంగా చూసింది అన్నయ్యమీద అధికారం చెలాయించేటంత గొప్పదా ఈవిడ అన్నట్టు.
జయరామ్ గదిలో ఉండి పెద్ద పెద్ద కేకలు వేస్తు తలుపు గట్టిగా తన్నుతూ గదిలో సామానులు చిందరవందరగా చేసెయ్యసాగాడు భార్యమీద కోపంతో, ఉక్రోషంతో.
అంబిక అతని ఎదుటపడితే చంపేసి రక్తం కళ్లచూసేవాడు. అంత కోపంలో ఉన్నాడు.
సుభద్రమ్మ తనని కానట్టు మౌనంగా ఉండిపోయింది.
గణేష్ రావు గారు ఎటూ చెప్పలేకపోతున్నారు. తనకంటె వయసులో బాగా చిన్నది అంబిక. ఏమైనా అంటే తనని ఏమని ఎదురిస్తుందో తనకేం బుద్ధులు చెప్పడానికి ప్రయత్నిస్తుందో అందుకే ఆయనలా ఉండిపోయారు.
ఇంద్రసేన కల్పించుకుంటూ అంది.
"ముందు తలుపులు తియ్యి అన్నయ్యకు ఇంకా కోపం తెప్పించకు"
"తలుపులు తెరిచి ఏం చెయ్యమంటావు?" అడిగింది ఆడపడుచు వైపు కోపంగా చూస్తూ.
"అందుకని అన్నయ్యను గదిలో పెట్టి బంధించి ఉంచుతావా!" ఇంద్రసేన రెచ్చిపోతూ అడిగింది.
"మీ అన్నయ్యా!" అంటూ వెటకారంగా నొక్కి మరీ అడిగింది.
ఇంద్రసేన ఆమెను మింగేసినట్లు చూసింది?
"మగవాడికి పెళ్ళికానంతవరకు తల్లి, చెల్లెలు. పెళ్ళయ్యాక..." అంటూ ఆడపడుచు ముఖంలోకి సూటిగా చూసింది క్షణంసేపు.
"పెళ్ళయ్యాక మొదటిస్థానం భార్యదౌతుంది" గర్వంగా ఏమాత్రం తొణక్కుండా చెప్పింది.
"ఐతే తల్లీ చెల్లెళ్ళు యేంకారన్నమాట" అంది ఇంద్రసేన రెచ్చిపోతూ.
"ఐతే నీ పెళ్ళయ్యాక కూడ నీ భర్తకి నీవు యేమీ కావన్నమాట. అతని తల్లి చెల్లిలికే మొదటిస్థానం ఉంటుందన్న మాట అవునా!" దర్జాగా తల పైకి నిర్లక్ష్యంగా చూస్తూ అడిగింది.
ఆ మాటలకి ఇంద్రసేన కంగు తిన్నట్లయింది. రెప్పవాల్చకుండా అలా చూస్తూ వుండిపోయింది.
"ఏమలా ఉండిపోయావు? ఇప్పుడర్ధమయిందా! ఇల్లాలి స్థానం ఏమిటో! మాట్లాడకుండా అలా కూర్చో చిన్నపిల్లవి అన్ని విషయాల్లో తల దూర్చకు. పెళ్ళయ్యాక ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోవలసిన పిల్లవు ఈ ఇంటి విషయాల్లో తలదూర్చ"కంటూ ఖచ్చితంగా చెప్పేసింది.