"ఏం ముద్రలో పాడో! మనదేమో అనుకుని పొద్దున్నే శుభ్రంగా తోమాను కదే!"
ప్రతిమ అదిరిపడి "తోమావా?" అంది.
"ఆహా..... విమ్ పౌడరేసి మరీ తోమాను."
"నాయనమ్మా..... దేశంకోసం ప్రాణాలర్పించే సీక్రెట్ ఏజెంట్ కి, నాయనమ్మగా వుండే అర్హత నీకు లేదు నాయనమ్మా" ఉక్రోషంగా అంది. అసలే ఎర్రనైన ఆ అమ్మాయి మొహం కోపంతో మరింత ఎర్రబడింది.
"ఇప్పుడేమైందే? ఆ వేలిముద్రల్లేకపొతే, నావి వుంటాయిగా, మీ ఫైల్లో పెట్టుకోవడానికి అవి చాల్లే."
"ఇంటర్ పోల్ అంటే నీకంత వేళాకోళంగా వుందా నాయనమ్మా?"
"అనవే అను..... మీ తాతగారే బ్రతికుంటే....."
"నువ్వీరోజు చేసిన పనికి చితకబాది వుండేవారు. హు....." అంటూ అక్కడినుంచి ముందు గదిలోకి వచ్చింది. చీఫ్ అక్కడ ఎదురు చూస్తున్నాడు.
"సారీ సర్..... రేపు వాళ్ళ కుటుంబసభ్యుల ఫోటోలు కూడా సంపాదిస్తాను" అంది క్షమాపణ చెప్పుకుంటున్నట్టు.
ఆయన లేచాడు.
ప్రతిమ కాస్త తటపటాయించింది. సర్పభూషణరావు ఇటీవల తరచు నారాయణ్ పేట్ వెళ్తూ వుండడం సంగతి ఆయనకి చెపుదామా అనుకుంది. ఆ మరుసటి రోజే ఆ విషయం దర్యాప్తు జరపడంకోసం ఆమె కూఆడ ఆ వూరు వెళ్ళాలనుకుంది. అది కూడా చెపుదామనుకుని నాలుక చివరివరకు వచ్చి ఆగిపోయింది.
-'బగ్'-
సీక్రెట్ ఏజెంట్స్ ఇళ్ళల్లో శత్రువులు 'బగ్స్' ఏర్పాటుచేసి రహస్యాల్ని వింటూ వుంటారన్న సంగతి ఆమెకి గుర్తుకొచ్చింది. అందులోనూ తనిప్పుడు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న కేసు పరిశోధిస్తున్న ఏజెంటాయె!
ప్రయాణం సంగతి తనలోనే దాచుకుంది.
ఆ మరుసటిరోజే ఆమె నారాయణ్ పేట్ బయల్దేరింది.
అదే కొంప ముంచింది.
బస్ ఫెయిలై ప్రతిమ ఆ వూరు చేరుకునేసరికి రాత్రి పదిన్నర అయింది. అప్పటికే దాదాపు ఆ వూరంతా నిద్రపోయింది. అంత చిన్న వూరు అది.
ఆమె మేకప్ లో పెద్ద మార్పులేదు. ఉద్యోగంలో చేరి ఎక్కువ కాలం కాలేదు కాబట్టి తననెవరూ గుర్తుపట్టరన్న ధీమా ఆమెకుంది. కొన్ని నెలల క్రితం చీఫ్ ఆమెని సర్పభూషణరావు గురించి వివరాలు సేకరించమని చెప్పినప్పుడు ఆమె పొంగిపోయింది. అంత జూనియర్ కి ఆ కేసు రావడం అదృష్టంగా భావించింది. అప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఆ పని చేస్తూ వచ్చింది. హడావుడి, తొందరగా ఒక నిర్ణయానికి రావడం, ప్రతిదాన్నీ అనుమానించడం లాంటి దుర్గుణాలు తప్ప, ఆమె పనిలో వంక పెట్టడానికి లేదు. చాలా ఏకాగ్రతతో చేస్తుంది.
ఒక కుటుంబ నియంత్రణ ఆఫీసర్ లా కొప్పు వేసుకుని, ఫుల్ వాయిల్ చీర కట్టుకుని చేతిలో గొడుగు పట్టుకుని ఆమె బస్ దిగింది.
బస్ స్టాండ్ పక్కనే వున్న కిళ్ళీ కొట్టులో అడిగింది "ప్రెసిడెంట్ గారి ల్లెక్కడ?"
అంత రాత్రిపూట వచ్చిన ఆ అమ్మాయిని చూస్తూ "రెడ్డినాయుడా?" అని తిరుగు ప్రశ్న వేశాడు.
"అవును."
"గట్ట సీదా పొతే, కుడేపు చడావుంటది. ఆ పక్కిల్లే."
ప్రతిమ నడక సాగించింది. కిళ్లీ కొట్టు బల్లమీద కూర్చున్న ఇద్దరు యువకులు లేచి ఆమెని అనుసరించారు. రోడ్డంతా చీకటి. ఇళ్ళు దూరంగా విసిరేసినట్టున్నాయి. ఒకడు ఆమె వెనగ్గా వచ్చి చెవిలో ఏదో గుసగుసలాడాడు. తెలంగాణా యాస అర్థంకాలేదు. ఆమె నడక వేగం హెచ్చించింది. వెనుక వాళ్ళూ వేగం పెంచారు. ఆమె భయపడడం వాళ్ళకి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఒకడు నడుము మీద చెయ్యి వేశాడు. ఆమె విదిలిస్తే నవ్వాడు. ఆమె అరవకపోవడంతో ఇంకొంచెం పైకి వెళ్ళాడు.
ఆమె ఆలోచిస్తున్నది వేరు. అనవసరంగా గొడవ అవడం ఆమె కిష్టంలేదు.
ఆ అలుసు తీసుకుని వెనుక వాడు ఆమె కడుపు మీదనుంచి ఈసారి చెయ్యి కిందికి జార్చాడు. ఆమె కుచ్చిళ్ళ లోంచి చెయ్యి క్రిందికి వెళ్ళింది. ఆమె అరిస్తే నోరు ముద్దామని మరొకడు రెడీగా వున్నాడు. ఆమె అరవలేదు. కాలు గాలిలోకి లేపింది.
చీర కట్టుకోవడం వల్ల కాస్త కష్టమైంది కాని, లేకపోతే ఆ కిక్ కి అతడు మూడు నెలలు మంచం మీదనుంచి లేచేవాడు కాదు. ట్రైనింగ్ మొదట్లో నేర్పుతారు అలాంటి కిక్. ఆమె కాల్తో ఇచ్చిన పంచ్ కి అతడు వెళ్ళి రోడ్డు పక్కన వున్న కాలువలో పడ్డాడు. అతనితో పాటు వున్న రెండోవాడికి ఏమీ అర్థంకాలేదు. ఉన్నట్టుండి స్నేహితుడు ఎలా మాయమయ్యాడో అర్థంకాక చీకట్లోకి కళ్ళు చిట్లించి చూస్తూ "ఏమైనాది?" అని అడిగాడు.
"ఏం గాలె..... నువ్వు గిట్టోకసారి సూడు" అంది. వాడు సువిశాలంగా నవ్వుతూ ఆమెని చూశాడు. వాడి దవడ పేలిపోయింది.
హార్డ్ కోర్ టెర్రరిస్టుల నుంచి విషయాలు రాబట్టడానికి కొట్టే దెబ్బ అది. వాడి నోరు కింది భాగం కదిలిపోయింది. బహుశా ఇక జీవితంలో ఎన్నటికీ వాడి పై పళ్ళూ, కింద పళ్ళూ కలుసుకునే అవకాశం వుండకపోవచ్చు.
క్షణంలో ఆమె మాములుగా అయిపోయింది.
చేతి సంచిలో వున్న. 38ని చేత్తో తడిమి చూసుకుని, మెట్లెక్కి, ప్రెసిడెంట్ తలుపు తట్టింది.
* * *
"వారి....... నువ్వు గిట్ట సెయ్యపడతావుంటే అచ్చం స్వర్గంలో వున్నట్టున్నది రా........." తనమ్యత్వంలో అన్నాడు ప్రెసిడెంట్ రెడ్డినాయుడు.
యాదగిరి యజమాని వళ్ళు పడుతున్నాడు. దూరంగా హరికెన్ లాంతరు మినుక్కు మినుక్కు మంటూంది. యజమాని మాటలకు వాడు రవ్వంత సిగ్గుతో "సాల్దియ్ దొరా...... ఊరికే బనాయించకు....." అన్నాడు.
"బనాయించినాన్ర? నేనేమన్న? నువ్వు గిట్టవళ్ళు నొక్కుతుంటే ఈ దునియాలో ఇంకేమవసరం లేదన్న. అంతేగాద?"
యాదగిరి కళ్ళు అరమోడ్పులు చేసి "అవ్........ నిన్న రాత్రి పెండ్లం కూడా అట్టనే అన్నది" అన్నాడు ఆనందంగా.
ప్రెసిడెంట్ అదిరిపడి పక్కమీద లేచి కూర్చుని "నాపెండ్లం ఒళ్ళు పట్టినావురా?" అని అరిచాడు ఉన్నట్టుండి యజమాని అలా అదిరిపడి ఎందుకు లేచి కూర్చున్నాడో అర్థంకాలేదు యాదగిరికి. విశాలమైన నవ్వుతో "అవ్ పట్టిన గద" అంటూ అదొక గొప్ప అఛీవ్ మెంట్ లా జవాబిచ్చాడు.
"నీ యమ్మ..... గెంత పని చేసినవ రా?"
"నీ యమ్మ..... గెంత పని చేసినవ్ రా?"
"నీ తల్లి.... దొరసాని ఏం చెప్తే అది చెయ్యమని నువ్వు గాదు చెప్పింది?" చిరాగ్గా అడిగాడు.
"నే చెప్పినాన్ర?" రెట్టించాడు.