Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 13


    ఆమె వయసు ఇరవైనాలుగు సంవత్సారాలు. గ్రాడ్యుయేషన్ పూర్తవగానే ఈ ఉద్యోగంలోకి వచ్చింది. తెలివైనదే కాని, హడావుడి ఎక్కువ. నిత్యశంకితురాలు. అనుక్షణం ప్రమాదాల్లోకి చొచ్చుకు పోవడమంటే ఇష్టం. దురదృష్టవశాత్తు అలాంటి ప్రమాదాలు ఎక్కువ రావు. ఆమె తయారు చేసుకుంటే తప్ప.

 

    కొన్ని నెలల క్రితం సర్పభూషణరావు కేసు డిపార్ట్ మెంట్ ఆమెని టేకప్ చేయమన్నప్పుడు ఆమె పొంగిపోయింది. ఆ క్షణం నుంచి మృత్యువు తనని వెంటాడుతూ వుందనుకుంది. తన జాగ్రత్తలో తనుంది.

 

    ప్రతిమకి ఒక నాయనమ్మ తప్ప ఎవరూ లేదు. సదరు నాయనమ్మ మొగుడు డిప్టీ తాసిల్దారుగా చేస్తూ చచ్చిపోయాడు. ఆవిడకి అదొక అబ్సెషన్. ఆ రోజుల్లో ఆయన లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అయిదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వుండేదని ఆవిడ నమ్మకం. వాళ్ళిద్దరి సంభాషణా కెనేడీ, కృశ్చేవ్ లెవెల్లో జరుగుతుంది.

 

    "నువ్వు ఏ కాశీయో, రామేశ్వరమో వెళ్ళకూడదా నాయనమ్మా?"

 

    "ఎందుకే?"

 

    "సీక్రెట్ ఏజెంట్స్ కి నా అనేవాళ్ళు ఎవరూ వుండకూడదు. నువ్వు పొతే నేను ఒంటరిగా అపాయాల్లోకి దూకవచ్చు."

 

    "అయ్యో..... అయ్యో యివెక్కడి అప్రాచ్యపు మాటలే? నువ్వు పోయేముందు నన్ను పొమ్మంటావా?"

 

    "ఛా.....ఛా..... అదికాదు నాయనమ్మా. దేశంకోసం చావడానికి సిద్ధపడ్డవాళ్ళకు బంధాలుండకూడదు. అందుకే నిన్ను కాశీ వెళ్ళమంటున్నాను."

 

    "అంటావే..... అంటావ్. మీ తాతగారు డిప్టీ తాసిల్దారుగా చేసేరోజుల్లో నీలాంటి ఏజెంట్లు మా ఇంటినిండా వుండేవారు. వంటపని నుంచి కూరలు తేవడందాకా అన్నిపన్లూ వాళ్ళే చేసేవారు."

 

    "మైగాడ్..... మా పరువు తీస్తున్నావ్ నాయనమ్మా. వాళ్ళు ఏజెంట్లు కాదు. సర్వెంట్లు."

 

    "ఏవింట్లో..... శుభ్రంగా పెళ్ళి చేసుకోకుండా ఈ ఫైళ్ళు, పిస్తోళ్ళు ఏమిటే?"

 

    ఇలా సాగుతుంది వారి సంభాషణ.

 

    ప్రతిమ అందమంతా ఆమె మెడ దగ్గర వుంది. రెండు నేషనల్ హైవేస్ రెండు పక్కలకి జారిపోయినట్టు ఆమె మెడనుంచి రెండువైపులకీ నునుపుదనం జారుతుంది. మధ్యలో సరే సరి. ఆమె సీక్రెట్ ఏజెంట్ గా కన్నా, అందాల పోటీల్లో బాగా రాణిస్తుంది. ఆమె అలా స్టూల్ మీద  కూర్చుని షవర్ కింద స్నానం చేస్తుంటే బంగారు విగ్రహం పాలలో జలకమాడుతున్నట్టు వుంది. అలా నియా ఆమెకి పనిలో శ్రద్ధలేదని కాదు. ఇచ్చిన పని పూర్తి చేసేవరకు నిద్రపోదు. కాని బిగించిన ఆ పెదవుల వెనుక పట్టుదల కన్నా అల్లరి, హడావుడీ, బోళాతనమూ ఎక్కువ కనిపిస్తాయి.

 

    సర్పభూషణరావు గురించి ఆలోచిస్తూ ఆమె స్నానం చేస్తూంది. ఆమె సంపాదించిన వివరాల ప్రకారం గత రెండు నెలల్లో ఎస్బీఆర్ ఆరుసార్లు నారాయణ్ పేట్ వెళ్ళాడు.

 

    ఎందుకు?

 

    అదే ఆలోచిస్తూంటే ఆమె సునిశితమైన చెవులకు తన ప్లాట్ ముందు గది తలుపు తెరుచుకోవడం వినిపించింది. ఆమె  మూడో అంతస్తులో వుంటుంది. ఆమె  తాళం సందుల్లోంచి చూసింది. బెడ్ రూం అవతల మెయిన్ హాల్లో రెండు కాళ్ళు నెమ్మదిగా వస్తూ కనిపించాయి.

 

    "బామ్మా........" అంది రహస్యంగా.

 

    జవాబు లేదు.

 

    "బామ్మా......" అంది మరోసారి.

 

    సన్నటి మూలుగు వినిపించింది.

 

    ఆమె షవర్ ఆపుచేసింది. ఆ నిశ్శబ్దం మరింత భయంకరంగా వుంది. ఆమె చెవులు రిక్కించి విన్నది. బైట గదిలో ఎవరో కుర్చీలాగిన చప్పుడు. తరువాత  మళ్ళీ  నిశ్శబ్దం.

 

    ఆ తరువాత రెండో వ్యక్తి అడుగుల శబ్దం.

 

    బల్లమీద ఏదో పెడుతున్న చప్పుడు ట్రే కదిపిన శబ్దం.

 

    ప్రతిమ నెమ్మదిగా లేచి వంటికి టవల్ చుట్టుకుంది. బాత్ టబ్ అంచుమీద వున్న పిస్టల్ తీసుకుని శబ్దం కాకుండా తలుపు తీసి ఒక్క ఉదుటున ముందుకు దూకి, రెండు చేతుల్తోనూ పిస్టల్ గురిచూడబోయి, అంతలో వంటికి చుట్టుకున్న టవల్ జారిపడబోగా ఒకచేత్తో దాన్ని ఆపుచేసి, బిగ్గరగా 'హ్యాండ్స్ ప్' అని అరిచింది.

 

    ఆ అరుపుకి గది గోడలు ప్రతిధ్వనించాయి.

 

    కుర్చీలో కూర్చున్న వృద్ధుడు కాఫీ మీద ఒలకబోసుకుని అదాటున లేచాడు. ఆయన సి.బి.ఐ. చీఫ్ భగీరథరావు.   

 

    "ఓ మీరా సార్.... సారీ.... శారీ..... శారీ...." అంటూ చీరెకోసం పక్కగదిలోకి గెంతింది. అదృష్టవశాత్తు ఆయన వెనక్కి తిరిగి చూసేలోపు ఆమె పక్క గదిలోకి వెళ్ళిపొగలిగింది. అదే సమయానికి ముసలావిడ వస్తూంది.

 

    "ఏమిటే కోతిలాగా ఆ గెంతులు?" అని అడిగింది ట్రే పట్టుకెళ్తూ.

 

    తనకి వినపడిన శబ్దాల తాలూకు అర్థాలు తెలిసినయ్ ఆమెకి. బామ్మ ఆయన కోసం కుర్చీలాగి, ట్రేతో కాఫీ ఇచ్చింది.

 

    "నీకు బుద్ధిలేదు నాయనమ్మా! పిలిస్తే బయటినుంచి పలకొద్దూ! ఎవరో విదేశీ గూఢచారి వచ్చాడనుకున్నాను. అదృష్టం బావుంది. లేకపోతే ఆ ముసలాయన తల పేలిపోయేదే" అంటూ బట్టలు  వేసుకుని బయటకు వచ్చింది. క్షణంలో స్వరం మార్చేసి నమ్రతగా- "గుడ్ మార్నింగ్ సార్....." అంది అవసరమైన దానికన్నా ఎక్కువ వినయంతో.

 

    "మిస్  ప్రతిమా..... సర్పభూషణరావు మీద  ఫైలు తయారు చేయమన్నాను. చేశావా?"

 

    చేశాను సార్. ఇంకా కొద్దిగా మిగిలింది" అంటూ గోడ గడియారం దగ్గరికి వెళ్ళి దాంట్లోంచి తాళం  తీసి బీరువా తెరిచింది. లోపలనుంచి ఫైలు తెచ్చి ఆయనకీ ఇచ్చింది. ఆయన ఈ   ప్రోసెస్ అంతా ఒక భేతాళ మాంత్రికుడ్ని పల్లెటూరివాడు చూసినట్టు విస్తుబోయి చూశాడు.

 

    "ఇంకా ఎన్నాళ్ళల్లో పూర్తవుతుంది?"

 

    "ఒకటి రెండు రోజుల్లో సర్."

 

    "గుడ్! పొతే నీకో సలహా అమ్మాయ్! ఇయాన్ ప్లెమింగ్ జేమ్స్ బాండ్ నవల్లు ఎక్కువ చదవకు"

 

    ఆయన సలహా ఆమెకు అర్థం కాలేదు.

 

    లోపలికి వెళ్ళి ఒకగ్లాసు చేతి రుమాలుతో తీసుకువచ్చి అందిస్తూ- "నిన్న రాత్రి ఆయనిచ్చిన పార్టీ కెళ్ళాను. అతి కష్టంమీద ఆయన వేలి ముద్రలు సంపాదించాను సార్. ఇదిగో ఆయన తాగిన విస్కీ గ్లాసు" అంది.

 

    తలుపు వెనకనుంచి నాయనమ్మ ప్రతిమని పిలిచింది.

 

    "అదేమిటే! బంగారంలాంటి గాజు గ్లాసు ఆయనకిచ్చేస్తున్నావ్?"

 

    "దానిమీద ఒక దేశద్రోహి వేలిముద్రలున్నాయి నాయనమ్మా."

 Previous Page Next Page