"చెప్పలేదా..... నీ తల్లి...... చెయ్యకుంటే ఉద్దోగం పోద్దని అన్లేద నువ్వు?" అంతకన్నా గట్టిగా వాడు డబాయించేసరికి, మరేమీ అనలేక నీళ్ళు కారిపోతూ అడిగాడు రెడ్డినాయుడు. "ఇంకేం జేసినవ్ రా?"
"నాకు సిగ్గయిద్ది....."
"సంపుత. చెపుతావాలేదా?"
"ఇంకేం జేస్త? వళ్ళు పట్టిన. తలకు తేల్ రాసిన. ఆ తరువాత స్నానం జేస్తనంటె......" వాడి మాటలు, పూర్తి కాలేదు.
రెడ్డినాయుడు మంచంమీదే ఎగిరిపడి "స్నానం కూడా జేయించి నావురా దొంగ నాకొడకా..... బాడ్ ఖవ్" అని తిట్లు లంకించుకున్నాడు.
"గట్ట పరేషానయి తిడ్తవేంది దొరా.... నేనే మన్ననిప్పుడు? దొరసాని తానం జేస్తనంటే నీళ్ళు పెట్టిన. అంతే గద...."
రెడ్డినాయుడు తేలిగ్గా వూపిరి పీల్చుకుని "గంతేనా....." అన్నాడు పక్కమీదకు తిరిగి జేరబడుతూ.
"గంతేమల్ల.... ఆ తరువాత బొక్కలోనుండి చూసిన అంతే" తాపీగా మిగతాది పూర్తిచేశాడు.
ఆరిపోయిందనుకున్న బాంబు పేలినట్లు అదిరిపడి లేచి, మళ్ళీ కూర్చున్నాడు. "చూసినావురా- నా పెండ్లం తానం చేస్తంటే చూసినావ్ రా?"
"నీళ్ళు చల్ల గున్నయ్యొ, ఎచ్చగున్నయ్యొ చెయ్యిపెట్టి చూడొద్దా"
రెడ్డినాయుడు ఏదో అనబోతుంటే బయట తలుపు చప్పుడైంది.
యాదగిరి వెళ్ళి తలుపు తీసి, ఎదురుగా అమ్మాయి వుండడంతో అడుగు వెనక్కి వేశాడు.
ప్రతిమ తన జీవితంలో ఎన్నాడూ అంత షాక్ అవలేదు. తను చూస్తున్నది కలో నిజమో కూడా తెలియడం లేదామెకు. అలాగే శిలాప్రతిమలా నిలబడిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూంది. మెదడులో సముద్రపు హోరు.
ఎదురుగా నిలబడ్డవాడు ముమ్మూర్తులా ఏజెంట్ నేత్రలా వున్నాడు. తలకట్టు తీసేసి, దుస్తులు మార్చి, షేవ్ చేస్తే అచ్చు నేత్రలా వుంటాడు. మనుష్యులను పోలిన మనుషులుంటారని తెలుసు కాని మరీ ఇంత పోలిక లుంటాయనుకోలేదు.
"ఎవరు గావాలె దొరసానీ.........." అని అడుగుతున్నాడు యాదగిరి. ఆమెకి సరిగ్గా వినబడలేదు. ఆమె ఇంకా దిగ్భ్రమ నుంచి తేరుకోలేదు. అస్పష్టంగా "ఏజెంట్ నేత్ర" అంది.
"దొరా..... ఎవరో జంత నేత్రంట. వొచ్చింది" అన్నాడు యాదగిరి లోపలకు చూస్తూ.
అప్పటికే అమ్మాయి కంఠం విన్న రెడ్డినాయుడు పంచె సర్దుకుంటూ బయటకి వచ్చాడు. ప్రతిమను ఆహ్వానిస్తూ "ఎమ్డీవో చెప్పిండు నీ గురించేనా? రా లోపలికి. ఫ్యామ్లీ ప్లానింగ్ ఆఫీసరంటే ఎవరో పెద్దావిడ అనుకున్న. నీలాంటి సిన్నపిల్ల అనుకోలేదు" అన్నాడు.
"నేనెక్కడుండాలో ఆ యిల్లు చెప్తే....." ప్రతిమ మాటలు పూర్తి కాలేదు. "ఇంత యిల్లుంచుకుని ఏడుండేది ఏటి? మా యింట్లోనే వుండు" అన్నాడు రెడ్డినాయుడు.
"ఔ..... దొరసాని కూడా నేదు" పక్కనుంచి అందించాడు యాదగిరి ప్రతిమ రెడీగా కాలు గాలిలోకి విదిలించి చూసుకుంది ఎందుకైనా మంచిదని.
"నోర్మూసుకుని అమ్మగారికి గది సూయించు. పాపం బస్ లో వచ్చింది ఏన్నీళ్ళు పెట్టు."
"అవసరం లేదు" అంది పైకి. నిజానికి ఆమెకి స్నానం చేస్తే తప్ప ప్రాణం వచ్చేట్టు లేదు.
"నేదంటె ఎట్ట దొరసాని? సేద్దుగాని రా" అన్నాడు యాదగిరి. వాడికి 'ల' అనే అక్షరం పలకదని ఆమె తన సీక్రెట్ ఏజెన్సీ పరిజ్ఞానంతో తెలుసుకున్నందుకు తనని తనే అభినందించుకుంది.
ఆమెని లోపలికి తీసుకువెళ్తూన్న యాదగిరి, ఏదో అనుమానం వచ్చినవాడిలా ఆగి, "సిన్నమ్మ ఒళ్ళు కూడా నొక్కమంటావ దొరా?" అని అడిగాడు నమ్రతగా.
వింటూన్న ప్రతిమ అదిరిపడింది.
"నీ యమ్మ...... కొత్తగొచ్చిన అతిథిని అదరగొడ్తవురా?"
"నీ తల్లి యిప్పుడేమన్న? రా దొరసాని...... యిల్లు చూపిస్త" అంటూ లోపలికి తీసుకెళ్ళాడు యాదగిరి.
* * *
పడుకుందన్నమాటే గాని ఆ రాత్రి ప్రతిమకి నిద్ర పట్టలేదు.
ఏజెంట్ నేత్రతో ఆమెకు పరిచయం లేదు. దూరంనుంచి ఒకటి రెండుసార్లు చూసిందంతే. కాని డిపార్ట్ మెంట్ లో అతని గురించి అందరూ చెప్పుకోవడం విన్నది.
నేత్ర మరణం డిపార్ట్ మెంట్ కి ఎంత లోటో ఆమెకి తెలుసు.
అటువంటి నేత్రలాంటి మనిషిని తను కనిపెట్టింది. కొలంబస్ కనుక్కున్నట్టు కనుక్కుంది. ఆ థ్రిల్ వలన ఆమెకి ఆ రాత్రి మరి నిద్ర పట్టలేదు.
ఆ మరుసటి రోజు ప్రొద్దున్నే స్నానం చేసి, ఆమె పోస్ట్ ఆఫీస్ కి బయల్దేరదామనుకుంది. విడిగా గోడ బాత్ రూం లేదు. పెరట్లో తడికల్తో కట్టిందే బాత్ రూం. ఆమె బట్టలు విప్పి తడికెమీదవేసి, పీటమీద కూర్చుంది. ఎదురుగా బాల్చీలో నీళ్ళున్నాయి. ఆమె వేలు పెట్టి చూసింది. ఎక్కువ వేడిగా వున్నాయి. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. మళ్ళీ బట్టలు కట్టుకుని బయటకు వెళ్ళాలికదా అని ఆమె ఆలోచిస్తుండగా "ఏం కావాలి దొరసానీ........ సన్నీళ్ళా?" అని వినిపించి ఆమె ఉలిక్కిపడి చుట్టూ చూసింది. పైన తాటిచెట్టుమీద యాదగిరి కనబడ్డాడు. కెవ్వున కేకవేసి చీర లాక్కుంది. ఆమె మొహం కందిపోయింది.
వాడు దిగొచ్చి నీళ్ళు బయట పెట్టాడు. చాలా సేపటివరకు మనసు కుదుటపడలేదు. సిగ్గుతో చితికిపోయింది.
పది అవుతుండగా ఆమె పోస్టాఫీస్ నుంచి సిటీకి ట్రంకాల్ చేసింది.
అట్నుంచి చీఫ్ ఫోన్ ఎత్తగానే, "ఆకాశంలో మేకలు, నీళ్ళల్లో పక్షులు" అంది రహస్యంగా.
"ఎవరు? ప్రతిమా?"
"అవును సార్. నేనే!"
"ఏదైనా అపాయంలో వున్నప్పుడే ఆ కోడ్ ఉపయోగించాలి. ఎక్కణ్ణించి నువ్వు?"
"నారాయణ పేటనుంచి."
"చీఫ్ కంఠం కీచుగా అరిచింది "నారాయణ పేట నుంచా? అక్కడికెందు కెళ్ళావ్ నువ్వు?"
"మీతో చెప్పడానికి వీల్లేకపోయింది సార్. సర్పభూషణరావు తాలూకు వివరాలు సంపాదించడం కోసం ఇక్కడికి రావలసి వచ్చింది."
చీఫ్ ఏదో అనబోయి వూరుకుని- "దట్సాల్ రైట్! ఏమిటి విశేషాలు?" అని ప్రశ్నించాడు.
"ప్రపంచంలో ఎనిమిదో వింతని చూశాను సార్. అచ్చు గుద్దినట్టు ఏజెంట్ నేత్రలాంటి మనిషోకడు ఈ వూళ్ళో వున్నాడు. నేనున్న ఇంట్లోనే వున్నాడు" ఆతృత, ఆవేశం, ఉద్వేగం మిళితమైన కంఠంతో అంది.